సుమారు 2 లక్షల మంది ‘ఆహార్ అనుదాన్’ పథకం లబ్ధిదారులైన ప్రత్యేక వెనుకబడిన తెగల మహిళలకు నెలవారీ సహాయం పంపిణీ చేసిన ప్రధాని;
‘స్వామిత్వ’ పథకం లబ్ధిదారులకు 1.75 లక్షల ఆస్తి హక్కు పత్రాలు పంపిణీ;
ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద 550 గ్రామాలకు రూ.55.9 కోట్లు బదిలీ;
రత్లాం.. మేఘ్‌నగర్ రైల్వే స్టేషన్ల నవీకరణకు శంకుస్థాపన చేసిన ప్రధాని; రోడ్డు, రైలు, విద్యుత్.. జల రంగాల్లో పలు ప్రాజెక్టులు
జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో దాదాపు రూ.7500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో కొన్నిటిని జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో గణనీయ సంఖ్యలోగల గిరిజనానికి ప్రయోజనం చేకూరుస్తాయి. అలాగే

మధ్యప్రదేశ్‌లో రోడ్డు, రైలు, విద్యుత్తు, విద్యా రంగాలకు చేయూతసహా నీటి సరఫరా, తాగునీటి సౌకర్యాలను బలోపేతం చేస్తాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా ‘ఆహార్ అనుదాన్ యోజన’ కింద సుమారు 2 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు నెలవారీ వాయిదా మొత్తాన్ని ప్రధాని పంపిణీ చేశారు. ‘స్వామిత్వ’ పథకం కింద లబ్ధిదారులకు వారి భూమిపై హక్కును నిర్ధారించే 1.75 లక్షల హక్కు పత్రాలను (అధికార్ అభిలేఖ్) కూడా అందజేశారు. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద 559 గ్రామాలకు రూ.55.9 కోట్ల నిధులను బదిలీ చేశారు.

 

   అంత్యోదయ సూత్రం నిర్దేశిత ఆదర్శాలకు అనుగుణంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలను చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చాక దశాబ్దాలు గడిచినా కనీస ప్రయోజనాలు పొందలేకపోయిన గిరిజన సమాజానికి ప్రగతి ఫలితాలు దక్కేలా చూడటం ఈ ఆదర్శాల్లో కీలకాంశం. తదనుగుణంగా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి అంకితం చేయడంతోపాటు కొన్నిటికి శంకుస్థాపన చేశారు. ‘ఆహార్ అనుదాన్ యోజన’ కింద సుమారు 2 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కాగా, ఈ పథకం కింద రాష్ట్రంలోని పలు ప్రత్యేక వెనుకబడిన తెగల మహిళలకు పౌష్టికాహారం కోసం నెలకు రూ.1500 వంతున ప్రభుత్వం అందిస్తోంది. ‘స్వామిత్వ’ పథకం కింద ప్రజలకు తమ భూమి యాజమాన్యాన్ని నిర్ధారించే 1.75 లక్షల ఆస్తి హక్కు పత్రాలను  (అధికార అభిలేఖ్) ప్రధానమంత్రి పంపిణీ చేశారు.

   ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన కింద 559 గ్రామాలకు రూ.55.9 కోట్ల నిధులను ప్రధాని బదిలీ చేశారు. ఆయా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, చౌకధర దుకాణాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలకు అదనపు గదులు, అంతర్గత రోడ్లు వంటి వివిధ రకాల నిర్మాణాత్మక కార్యకలాపాల కోసం ఈ నిధులను వినియోగిస్తారు.

   ఝబువాలో ‘సీఎం రైజ్ స్కూల్’కు ప్రధాని శంకుస్థాపన చేశారు. దీంతో పాఠశాల విద్యార్థులకు అత్యాధునిక తరగతి గదులు, ఇ-లైబ్రరీ తదితర ఆధునిక సౌకర్యాలు కల్పించడానికి తగిన సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. మరోవైపు రాష్ట్రంలో గిరిజన సాంద్రత అధికంగాగల జిల్లాల యువత కోసం ‘తాంత్యా మామా భిల్ విశ్వవిద్యాలయం’ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

 

   మధ్యప్రదేశ్‌లో నీటి సరఫరా, తాగునీటి సదుపాయాలను బలోపేతం చేసే పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ధార్-రత్లాం పరిధిలోని వెయ్యికిపైగా గ్రామాలకు తాగునీరందించే ‘తలవాడ ప్రాజెక్ట్’; అమృత్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) కింద రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలోగల 50వేలకుపైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే 14 పట్టణ నీటి సరఫరా పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు. మరోవైపు ఝబువా జిల్లా పరిధిలోని 50 పంచాయతీలలో దాదాపు 11 వేల గృహాలకు కొళాయి నీరందించే ‘నల్ జల్ యోజన’ను ఆయన జాతికి అంకితం చేశారు.

   ఈ కార్యక్రమాల్లో భాగంగా రైల్వే రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు రత్లాం, మేఘ్‌నగర్ రైల్వే స్టేషన్ల నవీకరణకు ఆయన శంకుస్థాపన చేయగా, ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద ఈ స్టేషన్ల సుందరీకరణ, అదనపు సదుపాయాల కల్పన చేపట్టనున్నారు. అలాగే ఇప్పటికే పూర్తయిన ఇండోర్-దేవాస్-ఉజ్జయిని ‘సి’ క్యాబిన్ రైలు మార్గం డబ్లింగ్; యార్డ్ నవీకరణతో ఇటార్సీ-నార్త్/సౌత్ గ్రేడ్ సెపరేటర్; బర్ఖెరా-బుధ్నీ-ఇటార్సీ మార్గాన్ని కలుపుతూ నిర్మించిన మూడోలైన్ ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేశారు. వీటిద్వారా రైల్వే మౌలిక సదుపాయాలు బలోపేతం కావడంతోపాటు ప్రయాణిక-సరకు రవాణా రైళ్ల ప్రయాణ సమయం తగ్గుతుంది.

 

   మధ్యప్రదేశ్‌లో అనేక రహదారి అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ జాబితాలో- జాతీయ రహదారి నం.47 పరిధిలో హర్దా-బెతుల్ (ప్యాకేజీ-I) మధ్య 0.00 నుంచి 30.00 కిలోమీటర్ల (హర్దా-తేమగావ్) మార్గం నాలుగు వరుసలుగా విస్తరణ; జాతీయ రహదారి నం.752డి పరిధిలో ఉజ్జయిని దేవాస్ విభాగం; జాతీయ రహదారి నం.47 పరిధిలో మధ్యప్రదేశ్ సరిహద్దులోని ఇండోర్-గుజరాత్ విభాగం (16 కి.మీ) నాలుగు వరుసలుగా విస్తరణ; ఇదే జాతీయ రహదారి పరిధిలో హర్దా-బెతుల్ (ప్యాకేజీ-III) మధ్య చిచోలి-బెతుల్ విభాగం నాలుగు వరుసలుగా విస్తరణ; జాతీయ రహదారి నం.552జి పరిధిలో ఉజ్జయిని-ఝల్వార్ విభాగం రహదారి ప్రాజెక్టులున్నాయి. ఇవన్నీ రహదారి అనుసంధానాన్ని మెరుగుపరచడంతోపాటు ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇవేకాకుండా వ్యర్థాలు పోగువేసే ప్రదేశాలకు సంబంధించి ‘డంప్‌సైట్ రిమెడియేషన్’, విద్యుత్ సబ్‌స్టేషన్ తదితర అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు.

  ఈ కార్యక్రమాల్లో ప్రధానమంత్రితో వెంట మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సి.పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా తదితరులు పాల్గొన్నారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
LIC outperforms private peers in new premium mop-up in August

Media Coverage

LIC outperforms private peers in new premium mop-up in August
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 సెప్టెంబర్ 2024
September 10, 2024

PM Modi’s Relentless Drive to Ensure India’s Progress Continues Unabated