నిత్యావసరాల నిరంతర లభ్యతకు భరోసాగా స్వల్ప-మధ్య-దీర్ఘకాలిక చర్యలపై సమగ్ర చర్చ
· భవిష్యత్తులో ఎరువుల నిరంతరాయ లభ్యతపై రైతులకు హామీ ఇచ్చేలా ప్రత్యామ్నాయ వనరులపై సమాలోచన
· రసాయన.. ఔషధ.. పెట్రో రసాయన సహా ఇతరత్రా పారిశ్రామిక రంగాల దిగుమతి వనరుల వైవిధ్యీకరణ దిశగా పలు చర్యలపై కూలంకష చర్చ
· భారత వస్తు ఎగుమతులను ప్రోత్సహించేలా సమీప భవిష్యత్తులో కొత్త ఎగుమతి గమ్యాల అన్వేషణపై చర్చ
· పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ విభాగాలన్నీ సంయుక్తంగా చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశం
· ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం కింద మంత్రులు.. కార్యదర్శులతో ఒక బృందం ఏర్పాటు చేసి అంకితభావంతో పనిచేయాలని ఆదేశం
· ఆయా రంగాలవారీ బృందాలు అన్ని వర్గాల భాగస్వాములతో సంప్రదిస్తూ తమ వంతు కృషి చేయాలని ప్రధానమంత్రి సూచన
· నిత్యావసరాల అక్రమ నిల్వ.. బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సరైన రీతిలో సమన్వయం చేసుకోవాలని ఆదేశం

పశ్చిమ ఆసియాలో కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్షతోపాటు ప్రస్తుత, ప్రతిపాదిత ఉపశమన చర్యలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి భద్రత కమిటీ (సీసీఎస్) లోతుగా చర్చించింది.

ప్రపంచవ్యాప్త స్థితిగతులు సహా కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఇప్పటిదాకా చేపట్టిన చర్యలు సహా ప్రణాళికలో పేర్కొన్న ఉపశమన చర్యల గురించి మంత్రిమండలి కార్యదర్శి సమగ్రంగా వివరించారు. వ్యవసాయం, ఎరువులు, ఆహార భద్రత, పెట్రోలియం, విద్యుత్, ‘ఎంఎస్ఎంఈ’లు, ఎగుమతిదారులు, షిప్పింగ్, వాణిజ్యం, ఆర్థికం, సరఫరా వ్యవస్థలు వంటి అన్ని ప్రభావిత రంగాలపై ప్రభావం అంచనాలతోపాటు వాటి ఉపశమనానికి తీసుకున్న చర్యలపై సమావేశం చర్చించింది. అలాగే, దేశంలో స్థూల ఆర్థిక పరిస్థితితోపాటు తదుపరి చేపట్టాల్సిన చర్యలపైనా చర్చ సాగింది.

పశ్చిమ ఆసియాలో సంఘర్షణ కొనసాగుతున్న ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్వల్ప-మధ్య-దీర్ఘకాలికంగా గణనీయ ప్రభావం పడుతున్న నేపథ్యంలో భారత్‌పై ఒత్తిడి అంచనాలకు అనుగుణంగా తక్షణ, దీర్ఘకాలిక ప్రతిస్పందనాత్మక చర్యలపైనా సమావేశం చర్చించింది.

ఆహారం, ఇంధనం-ఇంధన భద్రత సహా సామాన్యుల నిత్యావసరాల లభ్యతపై సమగ్ర అంచనాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. నిత్యావసరాల నిరంతర లభ్యతకు భరోసా ఇస్తూ తీసుకోవాల్సిన స్వల్ప-మధ్య-దీర్ఘకాలిక చర్యలపై లోతుగా చర్చ సాగింది.

రైతులపై ప్రభావం, ఖరీఫ్ సీజన్‌లో వారికి ఎరువుల లభ్యతపై అంచనా వేశారు. ఎరువులను తగినంతగా నిల్వ చేసేందుకు కొన్నేళ్లుగా చేపట్టిన చర్యలవల్ల సకాలంలో వాటి లభ్యత సహా ఆహార భద్రతకు ఢోకా ఉండదని సమావేశం అభిప్రాయపడింది. అలాగే, భవిష్యత్తులోనూ నిరంతరాయ లభ్యత దిశగా ఎరువుల నిల్వకు ప్రత్యామ్నాయ వనరులపైనా చర్చించింది.

దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలన్నిటిలో బొగ్గు నిల్వలు తగినంతగా ఉండటం వల్ల విద్యుత్ కొరత ఏర్పడే అవకాశాలు లేవని సమావేశం అభిప్రాయపడింది.

రసాయన, ఔషధ, పెట్రోరసాయన, ఇతరత్రా పారిశ్రామిక రంగాలకు అవసరమైన దిగుమతి వనరుల వైవిధ్యీకరణ దిశగా చేపట్టాల్సిన పలు చర్యలపై సమావేశం చర్చించింది. అలాగే భారతీయ వస్తు ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా సమీప భవిష్యత్తులో కొత్త ఎగుమతి గమ్యాలను అన్వేషించాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో వివిధ మంత్రిత్వ శాఖలు ప్రతిపాదించిన పలు చర్యలను, సంబంధిత వర్గాలన్నిటితో సంప్రదించిన అనంతరం త్వరలో ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయనున్నారు.

ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం కింద ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులతో ఒక బృందాన్ని, దీంతోపాటు రంగాలవారీ బృందాలను ఏర్పాటు చేయాలని సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని ప్రధానమంత్రి ఆదేశించారు.

పశ్చిమాసియా సంఘర్షణ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల ప్రభావం యావత్ ప్రపంచంపై ఏదో ఒక రూపంలో పడుతున్నదని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ గడ్డు కాలం దుష్ప్రభావాల నుంచి దేశ పౌరుల రక్షణ దిశగా అన్నివిధాలా కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ విభాగాలన్నీ సంయుక్తంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిత్యావసరాల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్ నిరోధం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాలతో సముచిత రీతిలో సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Why Abrogation Of Article 370 Was A Strategic Necessity For India

Media Coverage

Why Abrogation Of Article 370 Was A Strategic Necessity For India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 05 ఆగష్టు 2026
August 05, 2026

Viksit Bharat in Action: Inclusive, Green, and Globally Competitive Under PM Modi