'వికసిత్ భారత్' దార్శనికత ప్రతి రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం ఉమ్మడి సంకల్పం కావాలి: ప్రధాని
భారత్‌లోని 70 కోట్ల మంది యువత దేశానికి సంపద అని పేర్కొన్న ప్రధాని
డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను 'డెవలప్‌మెంట్ డివిడెండ్‌గా' మార్చాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చిన మోదీ
యువత, ఎంఎస్ఎంఈలకు మరిన్ని అవకాశాలను సృష్టించాలని, భారత్‌తో ఎఫ్‌టీఏ కుదుర్చుకున్న దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్రాలకు సూచించిన ప్రధాని
‘ఓడీఓపీ’ పథకాన్ని బలోపేతం చేయాలని, రక్షణ రంగ తయారీలోని అవకాశాలను రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ప్రధాని
కృత్రిమ మేధను ఒక గొప్ప అవకాశంగా పరిగణించాలని, ప్రజలను భవిష్యత్తు అవసరాలకు తగ్గ నైపుణ్యాలతో తీర్చిదిద్దాలని చెప్పిన ప్రధాని
మాదకద్రవ్యాల వ్యసనం, సైబర్ మోసాలు వంటి పెరుగుతున్న సామాజిక సవాళ్లను ఎదుర్కొనేందుకు సమన్వయ ప్రయత్నాలు అవసరమన్న ప్రధాని
‘ఎల్‌నినో’ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై దృష్టి సారించిన ప్రధాని.. నీటిని సంరక్షించాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రాలకు విన్నపం
ప్రధానిగా 12 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నందుకు గాను మోదీకి అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు
ప్రపంచ భౌగోళిక-రాజకీయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, భారతదేశ దృఢత్వాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసికట్టుగా పనిచేయనున్నట్లు తెలిపిన రాష్ట్రాలు
సమావేశానికి హాజరైన 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు.. మొదటిసారి దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ ఏడాది సమావేశాన్ని ‘వికసిత్ భారత్- 2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఈ సమావేశానికి 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులుగా ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు హాజరయ్యారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ప్రపంచంలోని అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అనిశ్చితి, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో భారత వృద్ధి ప్రస్థానం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వావలంబన దిశగా దేశ సంకల్పాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న అత్యుత్తమ విధానాలను స్వీకరించి అమలు చేయటానికి చాలా ప్రాముఖ్యత ఉందని ఆయన చెప్పారు. 

సహకార సమాఖ్య స్ఫూర్తికి ఉన్న ప్రాముఖ్యతను చెప్పిన ప్రధాని.. 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దార్శనికత కేవలం కేంద్రానిది మాత్రమే కాకుండా ప్రతి రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం ఉమ్మడి సంకల్పంగా మారాలని ఆయన అన్నారు. 

భారతదేశ జనాభా గురించి మాట్లాడిన ప్రధానమంత్రి.. దేశంలో 25 ఏళ్లలోపు వయస్సు గల వారు దాదాపు 70 కోట్ల మంది ఉన్నారని, ఈ యువత దేశానికి అతిపెద్ద సంపద అని అభివర్ణించారు. దీనిని ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’గా పేర్కొన్న ఆయన యువతను భవిష్యత్తు అవకాశాలు, సవాళ్లకు సిద్ధం చేసేలా విద్య, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య పెంపుదల వంటి కార్యక్రమాల ద్వారా ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను ‘డెవలప్‌మెంట్ డివిడెండ్’గా మార్చడంపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

ఇటీవలి కాలంలో పలు దేశాలతో భారతదేశం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను ప్రస్తావించిన ప్రధాని  యువత- ఎంఎస్ఎంఈలకు మరిన్ని అవకాశాలను సృష్టించాలని, ఈ ఒప్పందాల ద్వారా లభించే ప్రయోజనాలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకునేలా భాగస్వాములను సిద్ధం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. ఆయా ఒప్పంద భాగస్వామ్య దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలని ఆయన రాష్ట్రాలను కోరారు.

మహిళల నేతృత్వంలోని అభివృద్ధి గురించి చెబుతూ.. ‘లఖ్‌పతీ దీదీ’ల సంఖ్యను 3 కోట్ల నుంచి 6 కోట్లకు పెంచేలా కృషి చేయాలని రాష్ట్రాలకు ప్రధానమంత్రి విన్నవించారు. ‘నారీ శక్తి’కి  సురక్షితమైన, భద్రతతో కూడిన వాతావరణం ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

‘ఒక జిల్లా - ఒక ఉత్పత్తి’ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దీని కేంద్రంగా ఎగుమతి ఆధారిత వ్యూహాలను అభివృద్ధి చేయాలని రాష్ట్రాలను ప్రధానమంత్రి కోరారు. రక్షణ రంగ తయారీ విభాగంలో భారత్‌ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంటోందని ఇదొక అభివృద్ధి చెందుతున్న రంగమని ఆయన అన్నారు. ఈ రంగ వృద్ధి ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా తగిన విధానాలను రూపొందించుకోవాలని ఆయన రాష్ట్రాలకు తెలియజేశారు.

మాదకద్రవ్యాల వ్యసనం, సైబర్ మోసాలు వంటి పెరుగుతున్న సామాజిక సవాళ్లను నివారణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు, సమర్థవంతమైన పాలన ద్వారా ఎదుర్కొనేందుకు సమన్వయ ప్రయత్నాలు అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. 

‘ఎల్‌నినో’ ప్రభావంతో ఉత్పన్నమయ్యే సమస్యలపై కూడా ప్రధాని దృష్టి సారించారు. నీటి సంరక్షణ, సహజ- సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని ఆయన రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు 11 లక్షల టన్నుల సేంద్రీయ ఎరువులను కొనుగోలు చేయడం.. సుస్థిర వ్యవసాయంపై వారికి పెరుగుతున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా ఆకాంక్షిత జిల్లాల ప్రమాణాల ఆధారంగా జిల్లా స్థాయిలో సాధించిన పురోగతిని అంచనా వేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. ఇదే తరహాలో వ్యవసాయ రంగంలో సానుకూల ఫలితాలను సాధించడం కోసం దేశవ్యాప్తంగా 100 జిల్లాలను గుర్తించాలని ఆయన సూచించారు. ఈ ఆకాంక్షిత విధానం ద్వారా అద్భుతమైన మార్పును సాధించేందుకు రాష్ట్రాలు ముందుండి నాయకత్వం వహించాలని ఆయన కోరారు.

‘వికసిత్ భారత్ - 2047’ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థ అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా 100 రోజుల, పంచవర్ష లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

పెట్టుబడులను ఆకర్షించడంలో సుపరిపాలన, పారదర్శకత, మౌలిక సదుపాయాలకు ఉన్న ప్రాముఖ్యతను చెప్పిన ప్రధాని.. రాష్ట్రాలు బ్రాండింగ్, సులభతర వాణిజ్యం, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ వంటి రంగాల్లో లభిస్తున్న సరికొత్త అవకాశాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. కృత్రిమ మేధను ఒక అద్భుతమైన అవకాశంగా పరిగణించాలని ఆయన చెప్పారు. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలతో ప్రజలను సన్నద్ధం చేయడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు.

ప్రధానిగా 12 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు అభినందనలు తెలిపారు. ప్రపంచ భౌగోళిక-రాజకీయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ఇంధన అవసరాల పరంగా భారతదేశ దృఢత్వాన్ని బలోపేతం చేసేందుకు, దేశ ఆర్థికవృద్ధి ప్రస్థానాన్ని నిరంతరాయంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసికట్టుగా ఉంటామని వారు సంఘీభావం ప్రకటించారు.

ఈ చర్చలు ఎంతో నిర్మాణాత్మకంగా సాగాయని.. ఇవి రాష్ట్రాల ఆకాంక్షలను, ఆశలను, అనుభవాలను, అత్యుత్తమ విధానాలను, సవాళ్లను తెలియజేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నందుకు ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లందరికీ ప్రధాని తన కృతజ్ఞతలు తెలియజేశారు. పరస్పర సహకారం, ఆవిష్కరణలు, అభివృద్ధి పట్ల ఉమ్మడి నిబద్ధత ద్వారా మనమందరం కలిసికట్టుగా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధన దిశగా భారతదేశ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయగలమనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indias wind turbine exports jumped 50% in FY26, further growth expected: IWTMA CEO

Media Coverage

Indias wind turbine exports jumped 50% in FY26, further growth expected: IWTMA CEO
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 సెప్టెంబర్ 2026
September 09, 2026

Viksit Bharat Express: How PM Modi’s Reforms Are Supercharging India’s Economy and Infrastructure