అస్సాం పోలీసులు రూపొందించిన ‘అస్సాం కాప్‌’ మొబైల్‌ యాప్‌కు శ్రీకారం;
“గువహటి హైకోర్టుకు తనదైన వారసత్వం.. గుర్తింపు ఉన్నాయి”;
“ఈ 21వ శతాబ్దంలో భారతీయుల అపరిమిత ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రజాస్వామ్య మూలస్తంభంగా న్యాయవ్యవస్థది బలమైన.. సున్నితమైన పాత్ర;
“మేం కొన్నివేల కాలంచెల్లిన చట్టాలను రద్దుచేశాం.. నిబంధనలను తగ్గించాం”;
“ప్రభుత్వం లేదా న్యాయవ్యవస్థ… ఏదైనా ప్రతి సంస్థ పాత్రతోపాటు దాని రాజ్యాంగ బాధ్యత సాధారణ పౌరుల జీవన సౌలభ్యంతో అనుసంధానితం”;
“దేశ న్యాయప్రదాన వ్యవస్థ ఆధునికీకరణలో సాంకేతికత పరిధి విస్తృతం”;
“సామాన్య పౌరులకు కృత్రిమ మేధస్సు ద్వారా న్యాయ సౌలభ్యం మెరుగుదలలో మనం మరింతగా కృషిచేయాలి”

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అస్సాంలోని గువహటి హైకోర్టు 75వ వార్షికోత్సవం (ప్లాటినం జూబిలీ) నేపథ్యంలో నగరంలోని శ్రీమంత శంక‌ర్‌దేవ్ క‌ళాక్షేత్ర‌లో నిర్వహించిన వేడుకలలో ప్ర‌సంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అస్సాం పోలీసులు రూపొందించిన ‘అస్సాం కాప్’ మొబైల్ అనువర్తనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ అనువర్తనంతో నేరాలు-నేర నెట్‌వర్క్‌ అనుసరణ వ్యవస్థ (సిసిటిఎన్‌ఎస్‌), జాతీయ రిజిస్టర్ ‘వాహన్‌’ల సమాచార నిధి నుంచి నిందితుల, వాహనాల శోధన ప్రక్రియ సులభమవుతుంది.

 

    కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- గువహ‌టి హైకోర్టు ప్లాటిన‌మ్ జూబ్లీ ఉత్స‌వాల‌లో పాలుపంచుకునే అవ‌కాశం లభించడంపై హర్షం వ్య‌క్తం చేశారు. దేశం స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్ల వేడుకలు నిర్వహించుకుంటున్న తరుణంలో గువహటి హైకోర్టు ఏర్పడి 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషమని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవ పరిరక్షణతోపాటు సరికొత్త లక్ష్యాల సాధన కోసం బాధ్యత, జవాబుదారీతనంతో కూడిన మార్పులపై తదుపరి కార్యాచరణకు ఉపక్రమించాల్సిన తరుణం ఇదేనని ప్రధాని సూచించారు.

 

   రుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ రాష్ట్రాలు కూడా గువహటి హైకోర్టు న్యాయప్రదాన పరిధిలో ఉన్నాయని గుర్తుచేస్తూ- “గువహటి హైకోర్టుకు తనదైన వారసత్వం, గుర్తింపు ఉన్నాయి” అని ప్రధాని వ్యాఖ్యానించారు. కాగా, 2013 వరకూ ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాలు ఈ హైకోర్టు పరిధిలోనే ఉండేవని ఆయన తెలిపారు. ఆ మేరకు మొత్తం ఈశాన్య రాష్ట్రాల ఘన చరిత్ర, ప్రజాస్వామ్య వారసత్వం కూడా దీనితో ముడిపడి ఉన్నాయని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుత విశిష్ట సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలుసహా అస్సాం రాష్ట్రంతోపాటు న్యాయ సమాజానికి ఆయన అభినందనలు తెలిపారు. బాబాసాహెబ్ జయంతి నేపథ్యంలో ఇవాళ్టి ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ- డాక్టర్ అంబేడ్కర్‌కు ప్రధాని నివాళి అర్పించారు. సమానత్వం, ఐక్యత అనే రాజ్యాంగ విలువలే ఆధునిక భారతానికి మూలస్తంభాలుగా ఆయన అభివర్ణించారు.

 

   భారత ఆకాంక్షాత్మక సమాజం గురించి నిరుటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట బురుజుల నుంచి తన ప్రసంగంలో సమగ్రంగా వివరించడాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ప్రస్తుత 21వ శతాబ్దపు భారత పౌరుల ఆకాంక్షలకు హద్దులు లేవని, వాటిని నెరవేర్చడంలో ప్రజాస్వామ్య మూలస్తంభంగా న్యాయవ్యవస్థ బలమైన, సున్నిత పాత్ర పోషించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బలమైన, శక్తిమంతమైన ఆధునిక న్యాయవ్యవస్థను నిర్మించాలన్ని రాజ్యాంగం కూడా ఆశిన్నట్లు తెలిపారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల సమష్టి బాధ్యతను గుర్తుచేస్తూ- కాలంచెల్లిన చట్టాల రద్దును ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా “మేం కొన్నివేల కాలంచెల్లిన చట్టాలను రద్దుచేయడంతోపాటు నిబంధనలను తగ్గించాం” అని చెప్పారు. ఆ మేరకు 2,000 పురాతన చట్టాలు, 40వేల అసంబద్ధ నిబంధనలు తొలగించినట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా పలు వ్యాపార సంబంధ నిబంధనలను నేరపరిధి నుంచి తప్పించడంతో కోర్టులలో కేసుల సంఖ్య తగ్గిందని గుర్తుచేశారు.

 

   “ప్రభుత్వం లేదా న్యాయవ్యవస్థ… సంస్థ ఏదైనప్పటికీ ప్రతిదానికీ ప్రత్యేక పాత్రతోపాటు దాని రాజ్యాంగ బాధ్యత సాధారణ పౌరుల జీవన సౌలభ్యంతో అనుసంధానితం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. జీవన సౌలభ్య కల్పన లక్ష్య సాధనలో సాంకేతిక పరిజ్ఞానం శక్తిమంతమైన ఉపకరణంగా మారిందని పేర్కొన్నారు. తదనుగుణంగా వీలైన ప్రతి రంగంలోనూ సాంకేతికత సంపూర్ణ వినియోగానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ప్రధాని అన్నారు. ఇందుకు ‘డిబిటి’, ఆధార్, డిజిటల్ ఇండియా కార్యక్రమాలే నిదర్శనమన్నారు. ఆ విధంగా ప్రతి పథకం పేదల హక్కుల పరిరక్షణ మాధ్యమంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. ప్రధానమంత్రి స్వామిత్వ యోజన గురించి ప్రస్తావిస్తూ- ఆస్తి హక్కుల సమస్య పరిష్కారంలో భారతదేశం ఎంతో ముందంజ వేసిందన్నారు. ఈ వివాదాల ఫలితంగా ఒకప్పుడు దేశ న్యాయవ్యవస్థపై పెనుభారం పడిందని ప్రధానమంత్రి చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అస్పష్ట ఆస్తి హక్కుల సమస్యతో సతమతం అవుతున్నాయని ఆయన ఎత్తి చూపారు. అటువంటి పరిస్థితుల నివారణలో భాగంగా దేశంలోని లక్ష గ్రామాల్లో డ్రోన్‌ మ్యాపింగ్‌ చేపట్టామని ఆయన చెప్పారు. తద్వారా లక్షలాది పౌరులకు ఆస్తి హక్కు కార్డులు పంపిణీ పూర్తయిందని, దీనివల్ల ఆస్తి వివాదాలు తగ్గి, పౌరజీవన సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.

   దేశంలో న్యాయప్రదాన వ్య‌వ‌స్థ‌ ఆధునికీరణలో సాంకేతికత‌కు అవకాశం అపరిమితమని ప్ర‌ధానమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇ-కమిటీ పనితీరును ప్రశంసిస్తూ, ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా ఇ-కోర్టు మిషన్ 3వ దశ గురించి వివరించారు. న్యాయవ్యవస్థ సామర్థ్యం పెంపొందించడంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై ప్రపంచ కృషిని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా “సామాన్య పౌరులకు కృత్రిమ మేధస్సు ద్వారా న్యాయ సౌలభ్యం మెరుగుదలలో మనం మరింతగా కృషిచేయాలి” అని ప్రధానమంత్రి సూచించారు. అలాగే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థను ప్రస్తావిస్తూ- ఈశాన్య ప్రాంతంలోని సుసంప‌న్న స్థానిక సంప్రదాయక ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని ఉదాహరించారు. సంప్రదాయ చట్టాలపై హైకోర్టు ఆరు పుస్తకాలను ప్రచురించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాలను న్యాయ విద్యాలయాల్లో బోధించాలని కూడా ఆయన కోరారు.

   దేశం, అందులోని వ్యవస్థలపై పౌరులలో విశ్వాసం పెంచడం ద్వారా  చట్టాలపై సరైన అవగాహన కల్పించడమన్నది న్యాయప్రదాన సౌలభ్యంలో కీలకాంశమని ప్రధానమంత్రి అన్నారు. అన్ని చట్టాలనూ మరింత అందుబాటులోకి తెచ్చేవిధంగా సరళ సంస్కరణలు తెచ్చే కృషి గురించి శ్రీ మోదీ తెలిపారు. “సరళ భాషలో చట్టాల రూపకల్పనకు కృషి చేయాలన్నది మన లక్ష్యం. ఈ విధానంతో మన దేశంలోని న్యాయస్థానాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది” అని ప్రధాని అన్నారు. ప్రతి పౌరుడు తమ మాతృభాషలో ఇంటర్నెట్‌ వాడుకునేందుకు తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటైన ‘భాషిణి’ పోర్టల్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. దీనిద్వారా న్యాయస్థానాలకూ ఉపయోగం ఉంటుందని చెప్పారు.

 

   చిన్నచిన్న నేరాలకు పాల్పడి తమనుతాము రక్షించుకునే వనరులు లేదా డబ్బు లేనందువల్ల ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న వారి విషయంలో ప్రభుత్వం, న్యాయవ్యవస్థ సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. అలాగే జైలు జీవితం తర్వాత చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తయినా కుటుంబాలు ఆదరించని వారి గురించి కూడా ఆలోచించాలని సూచించారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఖైదీలకు ఆర్థిక సహాయంతోపాటు వారి విడుదలకు తోడ్పడటంలో భాగంగా రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేసే ప్రతిపాదనను ఆమోదించినట్లు ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ సందర్భంగా “ధర్మాన్ని రక్షించేవారిని ధర్మం రక్షిస్తుంది” అనే శ్లోకాన్ని ఉదాహరిస్తూ- మన ‘ధర్మం’ ఇదేనని, ఒక వ్యవస్థగా దేశం కోసం శ్రమించడం మన ప్రధాన బాధ్యతని ఉద్బోధించారు. ఈ విశ్వాసమే దేశాన్ని ‘వికసిత భారతం’  లక్ష్యానికి చేరువ చేస్తుందని నొక్కిచెబుతూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

 

   ఈ కార్యక్రమంలో అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ, కేంద్ర న్యాయ-చట్టశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి హృషికేశ్‌ రాయ్, గువహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందీప్ మెహతా తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   గువహటి హైకోర్టును 1948లో ఏర్పాటు చేయగా, అప్పట్లో ఈశాన్య భారతంలోగల ఏడు రాష్ట్రాలు- అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌ 2013 మార్చి వరకూ దీని పరిధిలో ఉండేవి. అటుపైన మణిపూర్, మేఘాలయ, త్రిపుర  రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం అస్సాం, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు గువహటి హైకోర్టు అధికార పరిధిలో ఉన్నాయి. ఈ మేరకు ప్రధాన ధర్మాసనం గువహటిలో ఉండగా- కొహిమా (నాగాలాండ్), ఐజ్వాల్ (మిజోరం), ఇటానగర్ (అరుణాచల్ ప్రదేశ్)లలో మూడు ధర్మాసనాలున్నాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India on track to become $10 trillion economy, set for 3rd largest slot: WEF President Borge Brende

Media Coverage

India on track to become $10 trillion economy, set for 3rd largest slot: WEF President Borge Brende
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 ఫెబ్రవరి 2024
February 23, 2024

Vikas Bhi, Virasat Bhi - Era of Development and Progress under leadership of PM Modi