రూ.20,000 కోట్లకు పైబడిన పిఎం కిసాన్ 17వ వాయిదా సొమ్ము విడుదల
కృషిసఖిలుగా స్వయం సహాయక బృందాలకు చెందిన 30,000 మంది మహిళలకు సర్టిఫికెట్ల మంజూరు
‘‘వరుసగా మూడో సారి నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకోవడం ద్వారా కాశీ ప్రజలు నన్ను ఆశీర్వదించారు’’
‘‘ఎన్నికైన ప్రజాప్రభుత్వం వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి రావడం ప్రజాస్వామ్య దేశాల్లో అత్యంత అరుదైన విషయం’’
‘‘21వ శతాబ్దిలో భారతదేశాన్ని ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక శక్తిగా అవతరింపచేయడంలో మొత్తం వ్యవసాయ రంగం పెద్ద పాత్ర పోషిస్తుంది’’
‘‘పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకంగా మారింది’’
‘‘పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సరైన లబ్ధిదారులను చేరేందుకు టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగపడడం నాకు ఆనందంగా ఉంది’’
‘‘ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన డైనింగ్ టేబుల్ మీద అయినా భారతదేశానికి చెందిన ఒక ఆహార ధాన్యం లేదా ఆహార ఉత్పత్తి ఉండాలన్నది నా కల’’
‘‘తల్లులు, సోదరీమణులు లేకుండా వ్యవసాయ రంగాన్ని ఊహించుకోవడం కూడా కష్టం’’
‘‘బనారస్ డెయిరీ రాకతో పలువురు పాల ఉత్పత్తిదారుల ఆదాయం రూ.5 లక్షల వరకు పెరిగింది’’
‘‘వారసత్వ నగర

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ ను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) కింద 9.26 కోట్ల మంది లబ్ధిదారులకు 17వ వాయిదా సొమ్ము రూ.20,000 కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే 30,000 మంది పైగా స్వయం సహాయక బృందాల సభ్యులకు కృషిసఖి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. టెక్నాలజీ సహాయంతో దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమంతో అనుసంధానం అయ్యారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి ముందు వారణాసి నియోజకవర్గం నుంచి పార్లమెంటరీ ఎన్నికల్లో గెలుపొందిన అనంతం తొలిసారి వచ్చిన సందర్భంగా ప్రజలకు అభివాదం తెలిపారు. వరుసగా మూడో సారి కూడా తనను ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ‘‘గంగా మాత కూడా నన్ను దత్తత తీసుకున్నట్టు కనిపిస్తోంది. నేను కాశీకి స్థానికుడుగా మారాను’’ అని ఆనందంలో పిఎం శ్రీ మోదీ అన్నారు. 

 

ఇటీవల జరిగిన 18వ లోక్ సభ ఎన్నికలు భారత ప్రజాస్వామ్య మూలాలు, విస్తృతి, సామర్థ్యం, సమగ్రతకు నిదర్శనంగా నిలిచాయని, ఆ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఎన్నికల్లో 64 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేశారని గుర్తు చేస్తూ ఇంత భారీ ఎన్నిక ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకు జరగలేదని, ఇంత భారీ సంఖ్యలో పౌరుల భాగస్వామ్యం చూడలేదని వ్యాఖ్యానించారు.  ఇటీవల జి7 శిఖరాగ్రంలో పాల్గొనేందుకు తాను ఇటలీ సందర్శించడాన్ని ప్రస్తావిస్తూ ఆ జి7 దేశాల ఓటర్లతో పోల్చితే మన ఓటర్ల సంఖ్య ఒకటిన్నర రెట్ల కన్నా అధికమని చెప్పారు. అదే విధంగా యూరోపియన్ యూనియన్ దేశాలన్నింటి ఓటర్ల కన్నా రెండున్నర రెట్లు అధికమని తెలిపారు. అంతే కాదు 31 కోట్ల మందికి పైగా మహిళా ఓటర్లు ఈ ఎన్నికలో ఓటు వేశారంటూ ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఇంత భారీ సంఖ్యలో మహిళా ఓటర్లు ఓటింగులో పాల్గొనడం ఇదే ప్రథమమని పిఎం శ్రీ మోదీ అన్నారు. ఆ సంఖ్య అమెరికా జనాభాతో సమానమని కూడా పేర్కొన్నారు. ‘‘ప్రపంచం యావత్తును ఆకర్షించి, ప్రభావితం చేయడమే భారత ప్రజాస్వామ్య శక్తి, సౌందర్యం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని దాన్ని ఎంతో అద్భుతంగా విజయవంతం చేసినందుకు వారణాసి ప్రజలకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.  ‘‘వారణాసి ప్రజలు పార్లమెంటు సభ్యుడిని ఎన్నుకోవడమే కాదు..ఏకంగా ప్రధానమంత్రినే ఎన్నుకున్నారు’’ అంటూ పిఎం శ్రీ మోదీ హర్షాతిరేకం ప్రకటించారు.

ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని మూడో సారి కూడా అధికారంలోకి తెచ్చిన ఈ ఎన్నికల ఫలితం కూడా ‘‘అసాధారణం’’ అని, ప్రపంచ ప్రజాస్వామ్యాల్లోనే అరుదైనదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ‘’60 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఈ తరహా హ్యాట్రిక్ జరిగింది’’ అన్నారు. ‘‘యువత ఆకాంక్షలు భారీగా ఉన్న భారత్ వంటి దేశంలో 10 సంవత్సరాల పరిపాలన అనంతరం సైతం అదే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం అతి పెద్ద విజయం, అతి పెద్ద విశ్వాస ప్రకటన. మీరందరూ ప్రకటించిన ఈ విశ్వాసమే దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు నాకు అతి పెద్ద మూలధనం. ఇది నా శక్తిని మరింత ఇనుమడింపచేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

 

అభివృద్ధి చెందిన భారతదేశానికి రైతులు, నారీశక్తి, యువత, పేదలు నాలుగు మూల స్తంభాలుగా తాను భావిస్తానని అంటూ ఈ విడత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తీసుకున్న తొలి నిర్ణయం రైతులు, పేద కుటుంబాల కోసమేనన్న విషయం ఆయన గుర్తు చేశారు. పిఎం ఆవాస్ యోజన కింద అదనంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల నిర్ణయాలు కోట్లాది మందికి సహాయపడతాయని ప్రధానమంత్రి చెప్పారు. 
ఈ కార్యక్రమానికి హాజరైన రైతులకు ఆయన అభివాదం తెలిపారు. టెక్నాలజీ సహాయంతో ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తానికి అనుసంధానం చేశారు. కోట్లాది మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.20,000 కోట్లు జమ చేసినట్టు ఆయన చెప్పారు. కృషిసఖి కార్యక్రమం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇందులో భాగంగా 3 కోట్ల మంది ‘‘లఖ్ పతి దీదీ’’లను తయారుచేస్తున్నట్టు తెలియచేశారు. దీని వల్ల మహిళల ఆత్మ గౌరవం పెరగడంతో పాటు లబ్ధిదారులకు ఒక చక్కని ఆదాయ వనరు హామీగా లభిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

‘‘పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకంగా మారింది’’ అంటూ దీని కింద కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి రూ.3.25 లక్షల కోట్లు బదిలీ చేశారని, అందులో ఒక్క వారణాసిలోని కుటుంబాలకే రూ.700 కోట్లు బదిలీ అయిందని ప్రధానమంత్రి చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు ఈ ప్రయోజనాన్ని చేర్చడంలో టెక్నాలజీ వినియోగాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర సందర్భంగా కోటి మందికి పైగా రైతులు పిఎం కిసాన్ పథకంలో భాగస్వాములుగా చేరారని ఆయన తెలిపారు. అందరికీ దాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పథకం నియమ, నిబంధనలు సరళం చేసినట్టు ఆయన చెప్పారు. ‘‘లక్ష్యాలు, నమ్మకాలు సరైనవి అయినప్పుడు రైతు సంక్షేమానికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

21వ శతాబ్దిలో భారతదేశం ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడంలో వ్యవసాయ రంగం పాత్ర గురించి పిఎం శ్రీ మోదీ ప్రస్తావిస్తూ పప్పులు, నూనెగింజల ఉత్పత్తిలో స్వావలంబన సాధించాలని, ప్రపంచ దృక్పథంలో పని చేయాలని పిలుపు ఇచ్చారు. దేశం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుగా మారవలసి ఉందని నొక్కి చెప్పారు. స్థానిక ప్రాంతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో ఆదరణ లభిస్తోందంటూ ఒక జిల్లా, ఒక ఉత్పత్తి పథకం, ప్రతీ జిల్లాలోనూ ఎగుమతుల కేంద్రం నెలకొల్పడం ద్వారా ఎగుమతులకు ఉత్తేజం లభిస్తోందని చెప్పారు.  ‘‘ప్రపంచంలోని అన్ని దేశాల్లోని డైనింగ్ టేబుల్స్ పై భారతదేశానికి చెందిన కనీసం  ఒక ఆహార ఉత్పత్తి అయినా ఉండాలి’’ అన్నదే తన కల అని తెలిపారు. జీరో డిఫెక్ట్-జీరో ఎఫెక్ట్ మంత్రం వ్యవసాయానికి కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు. కిసాన్  సమృద్ధి కేంద్రాల ద్వారా చిరుధాన్యాలు, మూలికా ఉత్పత్తులు, ప్రకృతి వ్యవసాయానికి మద్దతు ఇస్తున్నట్టు ఆయన చెప్పారు.

భారీ సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ వ్యవసాయంలో వారి పాత్ర, మద్దతు కీలకమని ప్రధానమంత్రి అన్నారు. వారి వాటాను మరింతగా పెంచేందుకు వ్యవసాయ రంగం పరిధిని విస్తరించాలని సూచించారు. కృషిసఖి కార్యక్రమం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ డ్రోన్ దీదీ కార్యక్రమంతో సమానమైన కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. దేశం ఇప్పటికే ఆశా కార్యకర్తలు, బ్యాంక్ సఖిల శక్తిని చూసిందని, ఆ తరహాలోనే ఇప్పుడు కృషిసఖిల సామర్థ్యాలను కూడా వీక్షిస్తుందని అన్నారు. కృషిసఖిలుగా 30,000 మంది స్వయం సహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. దేశంలోని 11 రాష్ర్టాల్లో అమలు జరుగుతున్న ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న వేలాది ఎస్ హెచ్ జిలనుఅనుసంధానం చేస్తారని తెలిపారు. 3 కోట్ల మంది లఖ్ పతి దీదీలను తయారుచేయడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 

 

కాశీ, పూర్వాంచల్ కు చెందిన రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ప్రధానమంత్రి చెప్పారు. బనస్ డెయిరీ సంకుల్, త్వరగా చెడిపోయే స్వభావం గల ఉత్పత్తుల రవాణా కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ప్యాకేజింగ్ హౌస్ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ‘‘బనస్ డెయిరీ బెనారస్ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు, పశుపెంపకందారుల అదృష్టాన్ని మార్చేసింది.  నేడు ఈ డెయిరీ రోజూ 3 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. కేవలం బెనారస్ కు చెందిన 14 వేలకు పైబడిన పశు పెంపకందారుల కుటుంబాలు ఈ డెయిరీలో నమోదయ్యాయి. రాబోయే ఏడాదిన్నర కాలంలో కాశీకి చెందిన మరో 16 వేల మంది పైగా  పశు పెంపకందారులను కూడా ఈ డెయిరీ నమోదు చేసుకోనుంది. బనస్ డెయిరీ వచ్చిన తర్వాత పలువురు పాల ఉత్పత్తిదారుల ఆదాయం రూ.5 లక్షల వరకు పెరిగింది’’ అని ప్రధానమంత్రి చెప్పారు.
మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన వివరించారు. పిఎం మత్స్య సంపద యోజన, కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. వారణాసిలో చేపల పెంపకంలో కృషి చేస్తున్న వారికి సహాయంగా చందోలిలో రూ.70 కోట్లతో ఆధునిక చేపల మార్కెట్ నిర్మిస్తున్నట్టు ఆయన తెలియచేశారు.

పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వారణాసిలో వెలుగులు ప్రసరించడం పట్ల ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు. ఇప్పటికే 40 వేల మంది స్థానికులు ఈ పథకం కింద నమోదు కాగా 2500 ఇళ్లకు సోలార్ పానెల్స్ ఏర్పాటు చేసుకున్నాయి. మరో 3000 ఇళ్లలో ఆ పని పురోగతిలో ఉంది అని ఆయన తెలియచేశారు. ఇది ద్వంద్వ ప్రయోజనంగా ఉన్నదని, ఒక పక్క విద్యుత్తు బిల్లు జీరో కావడంతో పాటు మరోపక్క లబ్ధిదారులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. వారణాసి, సమీప గ్రామాల కనెక్టివిటీ మరింతగా పెంచడానికి గత పది సంవత్సరాలుగా జరుగుతున్న పనుల గురించి వివరిస్తూ వారణాసిలో దేశంలోనే తొలి నగర రోప్ వే ప్రాజెక్టు తుది దశకు చేరుతున్నదని ఆయన చెప్పారు. ఘాజీపూర్, అజాంగఢ్, జాన్ పూర్ లను అనుసంధానం చేసే రింగ్ రోడ్డు; ఫుల్వారియా, చౌకాఘాట్ ఫ్లై ఓవర్లు; కాశీ, వారణాసి, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నట్టు తెలిపారు. బాబత్ పూర్ ఎయిర్ పోర్ట్ తో విమానయాన విభాగంలో రద్దీ తగ్గుతుందన్నారు. గంగా ఘాట్ల వెంబడి అభివృద్ధి పనులు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కొత్త సదుపాయాల ఏర్పాటు, నగరంలో కుండ్ ల పునర్నిర్మాణం పనులు జరుగుతున్నట్టు ఆయన చెప్పారు. వారణాసిలోని వివిధ ప్రాంతాల్లో కొత్త వ్యవస్థలు నిర్మాణం అవుతున్నాయన్నారు. వారణాసిలో క్రీడా మౌలిక వసతుల కల్పన, నిర్మాణం అవుతున్న కొత్త స్టేడియం యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాయన్నారు.

 

కాశీకి మేథో రాజధానిగా గల ప్రాచుర్యం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. వారసత్వ నగరం ఏ విధంగా పట్టణాభివృద్ధిలో కొత్త చరిత్ర లిఖిస్తుందనేది ప్రపంచం యావత్తుకు కాశీ తెలియచేస్తోందని ఆయన అన్నారు. ‘‘కాశీలో ప్రతీ ప్రాంతంలోనూ వారసత్వం, అభివృద్ధి సమాంతరంగా కనిపిస్తున్నాయి. ఈ అభివృద్ధి కాశీకి మాత్రమే లాభదాయకం కాదు. పూర్వాంచల్ నుంచి కాశీకి పనులు, అవసరాల కోసం వస్తున్న కుటుంబాలన్నీ కూడా ప్రయోజనం పొందుతాయి’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ చెప్పారు. ‘‘బాబా విశ్వనాథ్ ఆశీస్సులతో కాశీ అభివృద్ధి నిరంతరాయంగా సాగుతుంది’’ అంటే శ్రీ మోదీ ప్రసంగం ముగించారు.

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్; కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్; కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ భగీరథ్ చౌదరి, ఉప ముఖ్యమంత్రులు శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య, శ్రీ బ్రజేష్ పాఠక్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పూర్వాపరాలు 
ప్రధానమంత్రిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ పిఎం కిసాన్ నిధి కింద 17వ వాయిదా సొమ్మును విడుదల చేయడానికి అధికారం ఇస్తూ తొలి ఫైల్ పై సంతకం చేయడమే రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వ కట్టుబాటును ప్రతిబింబిస్తుంది. ఈ కట్టుబాటుకు కొనసాగింపుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) లబ్ధిదారులైన 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 17వ వాయిదా కింద ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రూ.20,000 కోట్లు విడుదల చేశారు. ఇప్పటి వరకు పిఎం-కిసాన్ కింద 11 కోట్లకు  పైగా అర్హత గల రైతు కుటుంబాలు రూ.3.04 లక్షల కోట్లకు పైగా సొమ్ము అందుకున్నాయి. 

 

అలాగే 30,000 మంది పైగా స్వయం సహాయక గ్రూప్ ల మహిళలకు కృషిసఖి సర్టిఫికెట్లు మంజూరు చేశారు.  ఈ కృషిసఖి కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ (కెఎస్ సిపి) గ్రామీణ మహిళలను కృషిసఖిలుగా సాధికారం చేసి గ్రామీణ భారతాన్ని పరివర్తింపచేస్తోంది. వారికి కృషిసఖిలుగా శిక్షణ ఇచ్చి పారా ఎక్స్ టెన్షన్ వర్కర్లుగా సర్టిఫికెట్లు మంజూరు చేస్తారు. ‘‘లఖ్ పతి దీదీ’’ కార్యక్రమానికి చెందిన ఇతర లక్ష్యాలతో వారిని ఈ సర్టిఫికేషన్ అనుసంధానం చేస్తుంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Railways supports 23 innovation projects by start ups

Media Coverage

Railways supports 23 innovation projects by start ups
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 జూలై 2024
July 16, 2024

India Realising the Vision of an Aatmanirbhar Bharat with PM Modi's Leadership