భారత్ నుంచి భారతీయుడు బయటికి రావొచ్చు..
కానీ, భారతీయుడి నుంచి భారత్ ను ఎవ్వరూ దూరం చేయలేరు: ప్రధానమంత్రి
సంస్కృతి, వంటకాలు, క్రికెట్.. భారత్- గయానాను
బలంగా కలిపే మూడు విశేషాలు: ప్రధానమంత్రి
గత దశాబ్ద కాలంగా భారత ప్రస్థానం
పరిమాణాత్మకమైనది, వేగవంతమైనది, సుస్థిరమైనది: ప్రధానమంత్రి

గయానాలోని జార్జ్ టౌన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ, ప్రధాని మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షుడు భర్రాత్ జగ్దేవ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రామోతార్ తదితరులు పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడికి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన రాక సందర్భంగా ప్రత్యేక ఆప్యాయతతో ఘనస్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై చూపిన ఆప్యాయతానురాగాలపై అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. “ఆతిథ్య స్ఫూర్తి మన సంస్కృతికి కేంద్ర బిందువు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు, ఆయన మామ్మగారితో కలిసి తాను ఓ మొక్క నాటానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే భావోద్వేగభరితమైన క్షణాలన్నారు.

గయానా అత్యున్నత జాతీయ పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను అందుకోవడాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నట్టు ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గయానా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 140 కోట్ల మంది భారతీయులు, 3 లక్షల మంది భారతీయ సంతతి గయానీ ప్రజలు.. గయానా అభివృద్ధికి వారి సేవల గౌరవార్థం ఈ పురస్కారాన్ని శ్రీ మోదీ వారికి అంకితమిచ్చారు.

ఔత్సాహిక పర్యాటకుడిగా రెండు దశాబ్దాల కిందట గయానాను సందర్శించిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ఎన్నో నదులకు జన్మస్థలమైన ఈ దేశానికి భారత ప్రధానిగా మరోసారి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు వచ్చాయని.. అయితే, గయానా ప్రజల ప్రేమాభిమానాలు మాత్రం అలాగే ఉన్నాయని వ్యాఖ్యానించారు. “భారత్ నుంచి భారతీయుడు బయటికి వచ్చి ఉండొచ్చు.. కానీ, భారతీయుడి నుంచి భారత్ ను ఎవ్వరూ వేరు చేయలేరు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో తన అనుభవం ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసిందన్నారు.

 

అంతకుముందు భారత ఆగమన స్మృతిచిహ్నాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. దాదాపు రెండు శతాబ్ధాల క్రితం నాటి ఇండో-గయానా ప్రజల పూర్వీకుల సుదీర్ఘమైన, దుష్కరమైన ప్రస్థానానికి ఇది జీవం పోసిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలు.. వివిధ సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను తమవెంట తీసుకొచ్చి, క్రమంగా గయానాను తమ నివాసంగా మార్చుకున్నారని శ్రీ మోదీ అన్నారు. ఈ భాషలు, గాథలు, సంప్రదాయాలు నేడు గయానా సంస్కృతిలో సుసంపన్నమైన భాగమయ్యాయని శ్రీ మోదీ అన్నారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం పోరాడుతున్న ఇండో-గయానా ప్రజల స్ఫూర్తిని ఆయన కొనియాడారు. గయానాను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిపేందుకు వారు కృషిచేశారని.. ఫలితంగా మొదట్లో నిమ్నస్థాయిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అగ్రస్థానానికి చేరుకుందని వ్యాఖ్యానించారు. కార్మిక కుటుంబ నేపథ్యం నుంచి శ్రీ చెదీ జగన్ అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారంటూ ఆయన కృషిని శ్రీ మోదీ కొనియాడారు. అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ, ఉపాధ్యక్షుడు భర్రాత్ జగ్దేవ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రామోతర్ ఇండో-గయానా సంతతి ప్రజలకు ప్రతినిధులని ఆయన అన్నారు. తొలినాళ్ల ఇండో-గయానా మేధావుల్లో ఒకరైన జోసెఫ్ రోమన్, తొలినాళ్ల ఇండో-గయానా కవుల్లో ఒకరైన రామ్ జారిదార్ లల్లా, ప్రముఖ కవయిత్రి షానా యార్దాన్ తదితరులు కళలు, విద్య, సంగీతం, వైద్య రంగాలను విశేషంగా ప్రభావితం చేశారని పేర్కొన్నారు.

భారత్-గయానా స్నేహానికి మన సారూప్యతలు బలమైన పునాది వేశాయని.. సంస్కృతి, వంటకాలు, క్రికెట్ అనే మూడు ముఖ్యమైన అంశాలు భారతదేశాన్ని గయానాతో అనుసంధానించాయని శ్రీ మోదీ అన్నారు. 500 ఏళ్ల తర్వాత శ్రీ రామ్ లల్లా అయోధ్యకు తిరిగి వచ్చిన ఈ యేడు దీపావళి ప్రత్యేకమైనదన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి గయానా నుంచి పవిత్ర జలాలు, ఇటుకల్నీ పంపిన విషయం కూడా భారత ప్రజలకు గుర్తుందని ఆయన అన్నారు. మహాసముద్రాల అవతల ఉన్నప్పటికీ భారత్ తో వారి సాంస్కృతిక సంబంధం దృఢంగా ఉందని ప్రశంసించారు. అంతకుముందు ఆర్య సమాజ్ స్మృతిచిహ్నం, సరస్వతి విద్యా నికేతన్ పాఠశాలలను సందర్శించినప్పుడు తనకు ఈ అనుభూతి కలిగిందన్నారు. భారత్, గయానా రెండింటిలో గర్వకారణమైన సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన సంస్కృతి ఉన్నదన్న శ్రీ మోదీ.. ఇవి సాంస్కృతిక నిలయాలుగా ఉండడమే కాక, వాటిని ఘనంగా చాటుతున్నాయని వ్యాఖ్యానించారు. సాంస్కృతిక వైవిధ్యాన్ని రెండు దేశాలూ తమ బలంగా భావిస్తున్నాయన్నారు.

వంటకాలను ప్రస్తావిస్తూ.. భారత సంతతి గయానా ప్రజలకు ప్రత్యేకమైన ఆహార సంప్రదాయం కూడా ఉందన్నారు. భారతీయ, గయానా అంశాలు రెండూ అందులో ఉన్నాయన్నారు.

 

క్రికెట్ పై మమకారం మన దేశాలను బలంగా కలిపి ఉంచిందన్న శ్రీ మోదీ.. ఇది కేవలం ఓ క్రీడ మాత్రమే కాదని, జీవన విధానమని అన్నారు. మన జాతీయ అస్తిత్వంలో బలంగా పాతుకుపోయిందన్నారు. గయానాలోని ప్రుడెన్స్ జాతీయ క్రికెట్ స్టేడియం మన స్నేహానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. కన్హై, కాళీచరణ్, చందర్ పాల్ వంటి పేర్లన్నీ భారత్ లో బాగా తెలిసిన పేర్లే అని చెప్తూ.. క్లయివ్ లాయిడ్, ఆయన జట్టు అనేక తరాలకు ఎంతో ప్రియమైనదన్నారు. గయానాకు చెందిన యువ ఆటగాళ్లకు భారత్ లో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఏడాది మొదట్లో అక్కడ జరిగిన టీ 20 ప్రపంచ కప్ ను భారతీయులంతా ఆస్వాదించారన్నారు.

అంతకుముందు గయానా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి తల్లివంటి దేశం నుంచి వచ్చిన తాను.. కరీబియన్ ప్రాంతంలోని అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్యాల్లో ఒకటైన గయానాతో అలౌకిక అనుబంధాన్ని ఆస్వాధించినట్టు తెలిపారు. వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర, ప్రజాస్వామిక విలువలపై ప్రేమ, వైవిధ్యంపై గౌరవం.. రెండు దేశాలనూ కలిపి ఉంచాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. “మనం ఉమ్మడిగా ఓ భవిష్యత్తును సృష్టించాలనుకుంటున్నాం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వృద్ధి-అభివృద్ధి కాంక్షలు, ఆర్థిక వ్యవస్థ- పర్యావరణంపై నిబద్ధత, న్యాయబద్ధమైన- సమ్మిళితమైన ప్రాపంచిక క్రమంపై తమ విశ్వాసాన్ని స్పష్టంచేశారు.

 

గయానా ప్రజలు భారతదేశ శ్రేయోభిలాషులు అని పేర్కొన్న శ్రీ మోదీ.. ‘‘గత దశాబ్ధ కాలంలో భారతదేశ ప్రస్థానం పరిమాణాత్మకంగా, వేగవంతంగా, సుస్థిరంగా ఉన్నది’’ అని ప్రముఖంగా ప్రస్తావించారు. పదేళ్లలోనే భారత్ పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని.. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. యువత కృషితో అంకుర సంస్థల్లో ప్రపంచంలో మూడో స్థానానికి భారత్ ఎదిగిందని ప్రశంసించారు. ఈ-కామర్స్, కృత్రిమ మేధ, ఆర్థిక సాంకేతికత, వ్యవసాయం, సాంకేతికత వంటి అనేక అంశాల్లో అంతర్జాతీయంగా భారత్ నిలయంగా మారిందని శ్రీ మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు. అంగారక గ్రహం, చంద్రుడిపైకి భారతదేశం చేపట్టిన అంతరిక్ష యాత్రలను ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధాన మంత్రి.. రహదారుల నుంచి అంతర్జాల మార్గాల వరకు, వాయుమార్గాల నుంచి రైల్వేల వరకు అత్యాధునిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. భారతదేశంలో సేవారంగం బలంగా ఉందన్నారు. భారత్ ఇప్పుడు తయారీ రంగంలో కూడా బలపడుతోందని, ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా అవతరించిందని శ్రీ మోదీ అన్నారు.

 

“భారత వృద్ధి స్ఫూర్తిదాయకం మాత్రమే కాదు.. సమ్మిళితమైనది కూడా” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశంలోని డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు పేదలను సాధికారులను చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం 50 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచి, వీటిని డిజిటల్ గుర్తింపు, మొబైల్ లతో అనుసంధానించింది. దీనిద్వారా ప్రజలు నేరుగా తమ ఖాతాల్లోకే సాయాన్ని పొందడానికి అవకాశం కలిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా పథకమని, దీని వల్ల 50 కోట్లకు పైగా ప్రజలు లబ్ధి పొందారని శ్రీ మోదీ అన్నారు. ప్రభుత్వం 3 కోట్లకు పైగా గృహాలను కూడా నిర్మించిందన్నారు. “దశాబ్ద కాలంలోనే 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం” అని శ్రీ మోదీ తెలిపారు. పేదల్లోనూ ఈ కార్యక్రమాలు మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చాయని, క్షేత్రస్థాయిలో లక్షలాది మంది మహిళలు వ్యవస్థాపకులుగా ఎదిగారని ఆయన అన్నారు. ఇది అనేక ఉద్యోగాలను, అవకాశాలను కల్పించిందన్నారు.

 

ఈ గణనీయమైన వృద్ధితోపాటు సుస్థిరతపై కూడా భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని శ్రీ మోదీ స్పష్టంచేశారు. దశాబ్ద  కాలంలోనే భారత సౌర ఇంధన సామర్థ్యం 30 రెట్లు పెరిగిందని తెలిపారు. పెట్రోలులో 20 శాతం ఇథనాల్ మిశ్రణంతో రవాణా రంగాన్ని పర్యావరణ హిత దిశగా మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలలో భారత్ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సాధికారతపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ.. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమితోపాటు ఇతర కార్యక్రమాల్లో భారత్ కీలక పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కు కూడా భారత్ గణనీయమైన తోడ్పాటు అందించిందన్న ప్రధానమంత్రి.. జాగ్వార్ లు పెద్దసంఖ్యలో ఉన్న గయానా కూడా దీని ద్వారా ప్రయోజనం పొందుతుందన్నారు.

గతేడాది భారత్ నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివస్ కు అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని శ్రీ మోదీ గుర్తుచేశారు. ప్రధానమంత్రి మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షుడు భరత్ జగ్దేవ్ లను కూడా భారత్ స్వాగతించిందన్నారు. అనేక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేశామని ఆయన తెలిపారు. ఇంధనం నుంచి వ్యవస్థాపకత వరకు, ఆయుర్వేదం నుంచి వ్యవసాయం వరకు, మౌలిక సదుపాయాల నుంచి ఆవిష్కరణల వరకు, ఆరోగ్య రక్షణ నుంచి మానవ వనరుల వరకు, సమాచారం నుంచి అభివృద్ధి వరకు సహకార పరిధిని విస్తృతపరచుకోవడానికి నేడు ఇరుదేశాలు అంగీకరించాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రాంతీయ విస్తృతిపరంగా ఈ భాగస్వామ్యానికి విశేష ప్రాధాన్యం ఉంది. నిన్న జరిగిన రెండో భారత్-కారికోమ్ శిఖరాగ్ర సదస్సు దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలుగా ఇరుదేశాలూ బహుపాక్షిక సంబంధాల్లో సంస్కరణలను విశ్వసిస్తున్నాయనీ.. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఆయా దేశాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తినీ, సమ్మిళిత అభివృద్ధికి సహకారాన్ని తాము కోరుతున్నట్టు ఆయన తెలిపారు. సుస్థిరమైన అభివృద్ధి, వాతావరణపరంగా న్యాయపరమైన విధానాలకు రెండు దేశాలు ప్రాధాన్యమిస్తాయనీ.. అంతర్జాతీయ సంక్షోభాలను పరిష్కరించడం కోసం చర్చలు, దౌత్యానికి పిలుపునిస్తూనే ఉన్నాయని శ్రీ మోదీ అన్నారు.

 

భారత సంతతి వ్యక్తులను రాష్ట్రదూతలుగా శ్రీ మోదీ అభివర్ణించారు. భారతీయ సంస్కృతి, విలువలకు వారు ప్రతినిధులన్నారు. గయానా మాతృభూమిగా, భరతమాత పూర్వీకుల భూమిగా ఉన్న భారత సంతతి గయానా పౌరులు రెట్టింపు భాగ్యశీలురని ఆయన అన్నారు. భారతదేశం నేడు అవకాశాలకు నిలయంగా ఉందనీ, రెండు దేశాలనూ అనుసంధానం చేయడంలో ప్రతి ఒక్కరు గణనీయమైన పాత్ర పోషించగలరని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.

 

భారత్ కో జానియే క్విజ్‌లో పాల్గొనవలసిందిగా అక్కడి భారత సంతతి వ్యక్తులను ప్రధానమంత్రి కోరారు. భారతదేశాన్నీ, దాని విలువలను, సంస్కృతిని, వైవిధ్యాన్ని అవగతం చేసుకోవడానికి ఈ క్విజ్ మంచి అవకాశమని ఆయన అన్నారు. ఇందులో పాల్గొనేలా స్నేహితులను కూడా ఆహ్వానించాలని ప్రజలను ప్రధానమంత్రి కోరారు.  

వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్ లో జరిగే మహా కుంభమేళాలో కుటుంబాలు, మిత్రులతో కలిసి పాల్గొనాలని అక్కడి భారత సంతతి వ్యక్తులను శ్రీ మోదీ ఆహ్వానించారు. అయోధ్యలో రామ మందిరాన్ని కూడా వారు సందర్శించాలని కోరారు.

జనవరిలో భువనేశ్వర్ లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్ లో పాల్గొనాలని, పూరీలోని మహాప్రభు జగన్నాథుడి ఆశీర్వాదాలు స్వీకరించాలని వారిని ఆహ్వానిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.  

 

Click here to read full text speech

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s shipbuilding rise opens doors for global collaboration, says Fincantieri CEO

Media Coverage

India’s shipbuilding rise opens doors for global collaboration, says Fincantieri CEO
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister engages in an insightful conversation with Lex Fridman
March 15, 2025

The Prime Minister, Shri Narendra Modi recently had an engaging and thought-provoking conversation with renowned podcaster and AI researcher Lex Fridman. The discussion, lasting three hours, covered diverse topics, including Prime Minister Modi’s childhood, his formative years spent in the Himalayas, and his journey in public life. This much-anticipated three-hour podcast with renowned AI researcher and podcaster Lex Fridman is set to be released tomorrow, March 16, 2025. Lex Fridman described the conversation as “one of the most powerful conversations” of his life.

Responding to the X post of Lex Fridman about the upcoming podcast, Shri Modi wrote on X;

“It was indeed a fascinating conversation with @lexfridman, covering diverse topics including reminiscing about my childhood, the years in the Himalayas and the journey in public life.

Do tune in and be a part of this dialogue!”