ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టిస్తాయి.. ఈ రంగం అభివృద్ధి, బలోపేతానికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని
సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, సమ్మిళిత వృద్ధిపై గత పదేళ్లలో భారత్ స్థిరమైన నిబద్ధతను కనబరిచింది: ప్రధాని
స్థిరమైన, కచ్చితమైన సంస్కరణల దిశగా చేసిన మార్పులే మన పరిశ్రమల్లో సరికొత్త విశ్వాసాన్ని నింపాయి: ప్రధాని
నేడు ప్రపంచంలో ప్రతీ దేశం భారత్ తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది: ప్రధాని
ఈ భాగస్వామ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మన తయారీ రంగం ముందుకు రావాలి: ప్రధాని
స్వావలంబన భారత్ లక్ష్యం దిశగా పురోగమించి, సంస్కరణలను మరింత వేగవంతం చేశాం: ప్రధాని
మనం తీసుకున్న చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం తగ్గింది.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి అది దోహదపడింది: ప్రధాని
భారత తయారీ ప్రస్థానంలో పరిశోధన - అభివృద్ధి కీలక పాత్ర పోషించింది.. దీనిలో పురోగతి సాధించి వేగవంతం చేయాలి: ప్రధాని
పరిశోధన - అభివృద్ధి ద్వారా సృజనాత్మక ఉత్పత్తులపై దృష్టి పెట్టగలం... అలాగే ఉత్పత్తుల విలువను పెంచగలం: ప్రధాని
ఈ బడ్జెట్ లో తయారీ, ఎగుమతులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

బడ్జెట్ అనంతర వెబినార్లనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వృద్ధి చోదకాలుగా ఎంఎస్ఎంఈలు, తయారీ, ఎగుమతులు, అణు ఇంధన కార్యక్రమాలు, నియంత్రణ, పెట్టుబడి, సులభతర వాణిజ్య సంస్కరణలు అన్న అంశాలపై వెబినార్లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారీ, ఎగుమతులపై బడ్జెట్ అనంతర వెబినార్లకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ అని చెప్తూ, అంచనాలను మించి విస్తరించడం ఇందులోని ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. అనేక రంగాల్లో నిపుణులు ఊహించిన దానికి మించి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ బడ్జెట్ లో తయారీ, ఎగుమతులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

దశాబ్దానికి పైగా దేశంలో స్థిరమైన విధానాలను ప్రభుత్వం అమలు చేసిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. గత పదేళ్లలో సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి పట్ల భారత్ నిబద్ధత కనబరిచిందని వివరించారు. కచ్చితమైన స్థిరత్వం, సంస్కరణలే పరిశ్రమలో సరికొత్త విశ్వాసాన్ని నింపాయని ఆయన స్పష్టం చేశారు. ఈ స్థిరత్వం మున్ముందు ఇలానే కొనసాగుతుందని తయారీ, ఎగుమతుల్లో భాగస్వాములందరికీ ఆయన హామీ ఇచ్చారు. సాహసోపేతమైన చర్యల ద్వారా దేశంలో తయారీ, ఎగుమతుల్లో కొత్త మార్గాలను ఆవిష్కరించాలని భాగస్వాములను ప్రోత్సహించారు. ప్రపంచంలో ప్రతీ దేశం భారత్ తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ భాగస్వామ్యాన్ని తయారీ రంగం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

 

“ఏ దేశ అభివృద్ధికైనా స్థిరమైన విధానం, మెరుగైన వ్యాపార పరిస్థితులు కీలకమైనవి” అని ప్రధానమంత్రి అన్నారు. కొన్నేళ్ల కిందటే ప్రభుత్వం జన విశ్వాస్ చట్టాన్ని ప్రవేశపెట్టి, నిబంధనలను తగ్గించేలా చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో 40,000కు పైగా అనుమతులను తొలగించామని, ఇది సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియను కొనసాగించాలని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. ప్రభుత్వం సరళీకృత ఆదాయపు పన్ను నిబంధనలను ప్రవేశపెట్టిందని, జన విశ్వాస్ 2.0 బిల్లుపై పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆర్థికేతర రంగంలో నిబంధనలను ఆధునికంగా, సౌలభ్యం కలిగించేవిగా, ప్రజా హితమైనవిగా, విశ్వాస ఆధారితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. వాటిని సమీక్షించడం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపారు. ఈ ప్రక్రియలో పరిశ్రమలది కీలకపాత్ర అని స్పష్టం చేశారు. పరిష్కారానికి ఎక్కువ సమయం అవసరమయ్యే సమస్యలను గుర్తించాలని, ప్రక్రియలను సులభతరం చేసే మార్గాలను సూచించాలని, అలాగే వేగంగా మెరుగైన ఫలితాలను సాధించడం కోసం ఏ అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చో మార్గనిర్దేశం చేయాలని భాగస్వాములను ఆయన కోరారు.

“ప్రపంచం ప్రస్తుతం రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. యావత్ ప్రపంచం భారత్ ను వృద్ధికి కేంద్రంగా చూస్తోంది” అని శ్రీ మోదీ అన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు కూడా భారత్ అంతర్జాతీయంగా వేగవంతమైన వృద్ధిని నమోదు చేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆత్మనిర్భర భారత్ లక్ష్యం దిశగా పురోగమనం, సంస్కరణలను వేగవంతం చేయడం ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావాన్ని తగ్గించాయని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచేలా దోహదం చేశాయని ఆయన తెలిపారు. “ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ వృద్ధి చోదకంగా ఉంది. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో ప్రతికూలతలను అధిగమించి నిలిచింది” అని ఆయన అన్నారు. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనీ.. అత్యుత్తమ ఉత్పత్తులను అందించే, నమ్మకంగా సరఫరా చేసే విశ్వసనీయమైన భాగస్వాములు ప్రపంచానికి అవసరమని శ్రీ మోదీ చెప్పారు. ఈ అవసరాన్ని తీర్చగల సామర్థ్యం భారత్ కు ఉన్నదని, దేశానికి ఇదొక మంచి అవకాశమని స్పష్టం చేశారు. ఈ పరిణామాలకు ప్రేక్షక మాత్రులుగా ఉండిపోకుండా, చురుగ్గా అవకాశాలను అందిపుచ్చుకుని కీలకపాత్ర పోషించాలని సంబంధిత పరిశ్రమలను ఆయన కోరారు. దేశంలో స్నేహపూర్వక విధానాలతోపాటు పరిశ్రమతో భుజం భుజం కలిపి ప్రభుత్వం చేస్తున్నందున.. గతంతో పోలిస్తే ఇదిప్పుడు సులభతరమైందన్నారు. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో, సవాళ్లను స్వీకరించి ముందుకు సాగడంలో దృఢసంకల్పం, కృతనిశ్చయం ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతీ పరిశ్రమ సమష్టిగా ముందడుగు వేస్తే గణనీయమైన పురోగతి సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు.  

ప్రస్తుతం పీఎల్ఐ పథకం ద్వారా 14 రంగాలు లబ్ధి పొందుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ పథకం కింద 750 యూనిట్లకు ఆమోదం లభించిందని, ఫలితంగా రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. తద్వారా రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన ఉత్పత్తి, రూ. 5 లక్షల కోట్లకు పైగా ఎగుమతులు జరిగాయని తెలిపారు. ఇది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు లభిస్తే నూతన రంగాల్లో ఎలా దూసుకువెళ్లగలరో వివరించేందుకు ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. తయారీ, ఎగుమతులను ప్రోత్సహించేందుకు రెండు పథకాలను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నామని శ్రీ మోదీ ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానాలను మెరుగుపరచడం, నాణ్యమైన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించడంతో పాటు ఖర్చులను తగ్గించుకొనేందుకు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న కొత్త ఉత్పత్తులను గుర్తించి, వాటిని భారత్‌లో తయారుచేయాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు.

 

‘‘భారతీయ తయారీ రంగం సాగిస్తున్న ప్రయాణంలో పరిశోధన, అభివృద్ధి కీలకపాత్ర పోషించాయి. దీనిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. పరిశోధన, అభివృద్ధి ద్వారా వినూత్నమైన ఉత్పత్తులతో పాటు, ఇప్పటికే ఉన్న ఉత్పత్తులకు విలువను జోడించడంపై దృష్టి సారించాలని అన్నారు. దేశీయ బొమ్మలు, పాదరక్షలు, తోలు పరిశ్రమ సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. సంప్రదాయ కళలను ఆధునిక సాంకేతికతలతో మేళవించడం ద్వారా అద్భుత విజయాన్ని సాధించవచ్చని తెలిపారు. ఈ రంగాల్లో భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా మారగలదని, ఇది ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధికి దారితీస్తుందని తెలిపారు. ఈ వృద్ధి కార్మికశక్తి ఆధారిత రంగాల్లో లక్షల్లో ఉద్యోగ అవకాశాలను తీసుకొస్తుందని, ఔత్సాహిక పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. సంప్రదాయ కళాకారులకు పీఎం విశ్వకర్మ యోజన అన్ని విధాల సహాయసహకారాలు అందజేస్తుందని వివరించారు. సరికొత్త అవకాశాలతో ఈ హస్త కళాకారులను చేరుకొనే దిశగా ఈ రంగాల్లో దాగున్న సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ప్రధాని కోరారు.

‘‘భారతీయ తయారీ రంగానికి, పారిశ్రామిక వృద్ధికి ఎంఎస్ఎంఈ రంగం వెన్నెముక లాంటిది’’ అని ప్రధానమంత్రి అన్నారు. పద్నాలుగేళ్ల తర్వాత ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని మార్చాలనే కీలకమైన నిర్ణయాన్ని ప్రభుత్వం 2020లో తీసుకుందని అన్నారు. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈలు వృద్ధి చెందితే ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలు కోల్పోతామనే భయాన్ని తొలగించిందని అన్నారు. దేశంలోని ఎంఎస్ఎంఈల సంఖ్య 6 కోట్లకు పెరిగిందన్న ప్రధానమంత్రి, అవి కోట్లలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని తెలియజేశారు. నిరంతరం పురోభివృద్ధి సాధిస్తామనే విశ్వాసాన్ని కల్పించే దిశగా ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని మరింత విస్తరించామని తెలిపారు. తద్వారా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య రుణాలు పొందడం. పదేళ్ల కిందట దాదాపుగా రూ.12 లక్షల కోట్ల విలువైన రుణాలను ఎంఎస్ఎంఈలకు అందిస్తే ఇప్పుడది రూ. 30 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ఈ బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ హామీతో ఇచ్చే రుణ లభ్యతను రూ. 20 కోట్లకు రెట్టింపు చేశారు. అదనంగా, పెట్టుబడి అవసరాల నిమిత్తం రూ. 5 లక్షల విలువైన కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులను అందచేస్తున్నామని ప్రధాని తెలిపారు.

ప్రభుత్వం రుణాల ప్రక్రియను సరళీకృతం చేసిందని, ఎలాంటి హామీ అవసరం లేకుండా రుణం పొందేలా కొత్త తరహా పథకాన్ని ప్రభుత్వం పరిచయం చేసిందని శ్రీ మోదీ తెలిపారు. ఈ తరహా విధానాన్ని గతంలో ఎన్నడూ ఊహించలేదని అన్నారు. గత పదేళ్లుగా ముద్ర లాంటి పథకాలు ఎలాంటి హామీ అవసరం లేకుండా రుణాలు అందిస్తూ, చిన్న పరిశ్రమలకు మద్దతు అందిస్తున్నాయని తెలిపారు. రుణాలకు సంబంధించిన సమస్యలను ట్రేడ్స్ పోర్టల్ పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు సకాలంలో తక్కువ వడ్డీకే రుణాలను అందించేందుకు నూతన పద్ధతులను అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారు. తొలిసారి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 5 లక్షల మందికి రెండు కోట్ల రుణాలు ఇస్తామని ఆయన ప్రకటించారు. మొదటిసారిగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న వారికి రుణ సాయంతో పాటు మార్గనిర్దేశం కూడా అవసరమని, దానికోసం మెంటార్షిప్ కార్యక్రమాన్ని రూపొందించాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.

 

పెట్టుబడులను ప్రోత్సహించడంలో రాష్ట్రాల పాత్ర కీలకమన్న శ్రీ మోదీ.. సులభతర వ్యాపార విధానాలను ఎంతగా ప్రోత్సహిస్తే అంతగా పెట్టుబడిదారులు ఆకర్షితులవుతారని అన్నారు. ఇది ఆయా రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్‌ను ఎవరు సద్వినియోగం చేసుకొంటుందో చూడడానికి రాష్ట్రాల మధ్య పోటీని ప్రోత్సహించారు. ప్రగతిశీల విధానాలను అనుసరిస్తున్న రాష్ట్రాలే తమ భూభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలను ఆకర్షిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రస్తావించిన అంశాలను అందరూ పరిగణనలోకి తీసుకోవాలని, ఆచరణాత్మక పరిష్కారాలను గుర్తించడమే ఈ వెబినార్ లక్ష్యమని ఆయన చెప్పారు. విధానాలు, పథకాలు, మార్గదర్శకాలు రూపొందించడంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి అందించే సహకారం ప్రాధాన్యతను ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్ అనంతర అమలు వ్యూహాలను రూపొందించడంలో ఇది తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి సూచనలు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తూ ప్రసంగాన్ని ముగించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

భారత పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన వ్యూహాలపై చర్చించేందుకు అవసరమైన వేదికను ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక దిగ్గజాలు, వాణిజ్య నిపుణులకు ఈ వెబినార్లు కల్పిస్తాయి. విధానాల అమలు, పెట్టుబడుల సేకరణ, సాంకేతిక వినియోగం, బడ్జెట్ అంశాల అమలుపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. బడ్జెట్లో ప్రకటించిన వాటిని సమర్థంగా అమలు చేసేందుకు ప్రైవేటు రంగంలోని నిపుణుల, పారిశ్రామిక ప్రతినిధులు, సంబంధిత అంశాల్లో నిపుణులను ఈ వెబినార్లు ఒక్కచోట చేరుస్తాయి.

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
55.49 crore UPI users onboarded by June 2026

Media Coverage

55.49 crore UPI users onboarded by June 2026
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom
July 21, 2026

Prime Minister Shri Narendra Modi today extended congratulations to Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom.

Shri Modi noted that India and the UK are bound by shared democratic values and enjoy wide-ranging cooperation across trade, investment, technology, defence, and people-to-people relations. With CETA entering into force this month, the Prime Minister pointed out that the bilateral partnership is poised to grow even stronger.

The Prime Minister stated that he looks forward to working closely with him to further deepen the India-UK Comprehensive Strategic Partnership and advance their shared Vision 2035.

In a post on X, the Prime Minister shared:

"Warmest congratulations to Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom.

India and the UK are bound by shared democratic values and enjoy wide-ranging cooperation across trade, investment, technology, defence and people-to-people relations. With CETA entering into force this month, our bilateral partnership is poised to grow even stronger.

I look forward to working closely with you to further deepen the India-UK Comprehensive Strategic Partnership and advance our shared Vision 2035.

@andyburnham"