జోర్డాన్ రాజు అబ్దుల్లా IIగారితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమావేశమయ్యారు. అల్ హూస్సేనియా ప్యాలెస్‌కు చేరుకున్న మోదీకి అబ్దుల్లా II రాజుగారు లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.
నాయకులిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై, ప్రతినిధి బృంద స్థాయిలో చర్చలు నిర్వహించారు. గత సమావేశాలు, సంభాషణలను గుర్తుచేసుకున్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న హృదయపూర్వక, చారిత్రక అనుబంధాన్ని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతుండటం చరిత్రాత్మకమని నేతలు పేర్కొన్నారు. భారత్-జోర్డాన్ మధ్య సంబంధాల బలోపేతానికి రాజుగారు చేస్తున్న కృషిని, అంకితభావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి బలంగా మద్దతిస్తామని తెలిపిన రాజుగారు...అన్ని రూపాల్లో ఉండే ఉగ్రవాదాన్ని ఖండించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, తీవ్రవాద భావజాలాన్ని ఎదుర్కోవటంలో, ఈ దుష్టశక్తులకు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటానికి సహకరించటంలో రాజుగారి నాయకత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు. వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక శక్తి, ఎరువులు, వ్యవసాయం, ఆవిష్కరణ, ఐటీ, డిజిటల్ సాంకేతికత, ప్రధాన ఖనిజాలు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, ఫార్మా, విద్యా, సామర్థ్యం, పర్యాటకం, వారసత్వం, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలపరచటంపై ఇరు దేశాల నేతలు చర్చించారు. జోర్డాన్ దేశానికి భారత్ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం వచ్చే అయిదేళ్లలో 5 అమెరికన్ బిలియన్ డాలర్లకు చేరేలా లక్ష్యం పెట్టుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. భారత్ లోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)తో జోర్డాన్ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను అనుసంధానించాలని ఆయన సూచించారు. జోర్డాన్... భారతదేశానికి ఎరువుల్ని ఎగుమతి చేస్తోంది. భారత్‌లో పెరుగుతున్న ఫాస్ఫాటిక్ ఎరువుల డిమాండ్‌కు తగ్గట్టుగా జోర్డాన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇరు దేశాల్లోని ఎరువుల కంపెనీలు సంప్రదింపులు నిర్వహిస్తున్నాయి.
ప్రాంతీయ పరిణామాలు, ఇతర ప్రపంచ సమస్యలపై నేతలిద్దరూ అభిప్రాయాలను పంచుకున్నారు. శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. శాశ్వత శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు.
ఈ పర్యటన సందర్భంగా సంస్కృతి, పునరుత్పాదక శక్తి, నీటి నిర్వహణ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెట్రా, ఎల్లోరా మధ్య రెండు అవగాహనా ఒప్పందాలను ఇరుపక్షాలు ఖరారు చేశాయి. భారత్-జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, స్నేహాన్ని ఈ ఒప్పందాలు మరింత ప్రోత్సహిస్తాయి. ఈ చర్చల అనంతరం రాజు అబ్దుల్లా II గారు ప్రధానమంత్రి గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా రాజుగారిని ప్రధానమంత్రి ఆహ్వానించగా, ఆయన అంగీకరించారు.


