“రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఆమె ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను”
“పహాడ్‌పూర్ త్వరలోనే సౌరశక్తి గ్రామంగా రూపొందుతుంది.. ఇంటింటా వెలుగులు నిండటం సహా సౌర విద్యుదుత్పాదన ప్రారంభమవుతుంది”
“తూర్పు భారత ప్రాంత పురోగమనంతో దేశ సమగ్రాభివృద్ధి సాధనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం”
“గిరిజనుల అభ్యున్నతి లక్ష్యంగా యువతకు విద్య.. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం”
“గిరిజన బాలలకు మెరుగైన విద్యా సదుపాయాల దిశగా దేశంలో సుమారు 500 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశాం”: ప్రధానమంత్రి

   రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒడిషాలోని మయూర్‌భంజ్ జిల్లాలోగల పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవిత్ర ‘సంథాలీ’, ‘హో’ గిరిజన తెగల పవిత్ర వృక్షదేవతారాధ్య (జహేరా) ప్రాంతాలలో ప్రార్థనలు చేశారు. అలాగే, అక్కడి నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పహాడ్‌పూర్ పాఠశాలను సందర్శించారు. ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో “వికాస్ రా ధార-ఒడిషా సారా” (ఒడిషా రాష్ట్రమంతటా అభివృద్ధి స్రవంతి) ఇతివృత్తంగా మయూర్‌భంజ్ జిల్లాలోని రాయ్‌రంగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ మోదీ ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను  ప్రారంభించడంతోపాటు కొన్నిటికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ముగిసిన ‘రాజా’ వేడుకతోపాటు త్వరలో నిర్వహించనున్న మయూర్‌భంజ్‌ ప్రసిద్ధ బారిపద రథయాత్ర సహా పూరీ జగన్నాథ పవిత్ర రథయాత్ర ఏర్పాట్లతో రాష్ట్రంలో ఉత్సవ వాతావరణంలో మునిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలుపుతూ- “ద్వంద్వ చోదక ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి పయనాన్ని వేగిరపరుస్తోంది. సంక్షేమ పథకాలు, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాల సౌలభ్యంతో సామాన్యుల జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి” అని శ్రీ మోదీ అన్నారు.

సంతాలీ భాష కోసం ‘ఓల్ చికి’ లిపిని సృష్టించిన పండిట్ రఘునాథ్ ముర్ము, డాక్టర్ దమయంతి బెస్రా, శ్రీ చరణ్ హెంబ్రామ్ వంటి రాష్ట్ర ప్రముఖులకు ప్రధానమంత్రి నివాళి అర్పించారు. భారత రాజ్యాంగాన్ని సంతాలీ భాషలోకి అనువదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆ భాష, సంస్కృతులకు ప్రోత్సాహం, పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వ కృషిని ఆయన ప్రస్తావించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మయూర్‌భంజ్ గడ్డమీది నుంచి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఆమె ఎదిగిన తీరు ఒడిషాతోపాటు దేశానికీ ఎంతో గర్వకారణమని శ్రీ మోదీ అభివర్ణించారు. ప్రజాసేవలో ఆమె అంకితభావం, వినమ్రత, దేశ ప్రగతిపై ఆమె కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. రాష్ట్రపతితో కలసి పహాడ్‌పూర్‌ సందర్శించడాన్ని ప్రస్తావిస్తూ- ఆమె మార్గదర్శకత్వంలో ఏర్పాటైన విద్యా సంస్థలలోని విద్యార్థులతో ముచ్చటించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. “రాష్ట్రపతి ముర్ము స్ఫూర్తిదాయక ఉనికి ఇక్కడి బాలల్లో... ముఖ్యంగా గిరిజన, అట్టడుగు, వెనుకబడిన వర్గాలవారిలో ఆత్మవిశ్వాసం నింపుతూ, ఉన్నత లక్ష్యాల వైపు వారిని ప్రోత్సహిస్తోంది” అని శ్రీ మోదీ చెప్పారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఓ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు పహాడ్‌పూర్ గ్రామాన్ని త్వరలోనే సౌరశక్తి గ్రామంగా రూపొందిస్తామని, తద్వారా ఇంటింటా వెలుగులు నిండటం సహా సౌర విద్యుదుత్పాదన కూడా ప్రారంభం కాగలదని చెప్పారు. ఒడిషాలోని కోణార్క్ సూర్య దేవాలయం స్ఫూర్తితో దేశానికే ఆదర్శ సౌరశక్తి గ్రామంగా పహాడ్‌పూర్ ఎదుగుతుందని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నాయకత్వంలోని ఒడిషా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ- రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వేగంగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. “దేశ సమగ్రాభివృద్ధి కోసం తూర్పు భారతం అభివృద్ధి” కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మేరకు “పూర్వోదయ” విధానం కింద తూర్పుతీర రాష్ట్రాల అపార సామర్థ్యాన్ని సద్వినియోగం చేస్తుకుంటున్నామని పేర్కొన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, ఆర్థిక కారిడార్లు, ఓడరేవులు, ఇంధన రంగం, సెమీకండక్టర్లు, కాలుష్య రహిత ఇంధనం, ఆధునిక పరిశ్రమలలో భారీ పెట్టుబడులు తదితరాలతో ఈ సామర్థ్యాల సంపూర్ణ వినియోగానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేస్తున్నాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు “సుమారు ₹47,000 కోట్ల విలువైన పరిణామాత్మక ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రజలకు రవాణా అనుసంధానం, ప్రజా సేవలు, ఆర్థిక అవకాశాలు, జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగవుతాయి. తూర్పు భారతంలో వృద్ధి, సౌభాగ్యానికి ఒడిషా ముఖద్వారంగా ఎదుగుతోంది. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తుంది” అని శ్రీ మోదీ అన్నారు.

ఒడిషాలోని అపార వనరులను దేశాభివృద్ధి, సౌభాగ్యం వైపు అవకాశాలుగా ప్రభుత్వం మలుస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ పెట్టుబడులను ఆకర్షించడం సహా పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహం లక్ష్యంగా చేపట్టిన ‘ఉత్కర్ష్ ఒడిషా’ వంటి కార్యక్రమాల గురించి ఆయన ప్రస్తావించారు. “ఈ కార్యక్రమం కింద ఇప్పటికే రాష్ట్రానికి దాదాపు ₹20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే ₹3.5 లక్షల కోట్లకు పైగా విలువైన అనేక భారీ ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై దృష్టి సారిస్తూ పరిశ్రమలకు అనువైన వాతావరణ సృష్టికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

విద్యుత్తు రంగంలో ₹6,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నామని, ‘సమృద్ధ సిటీ’  పథకం కింద పట్టణాభివృద్ధిని వేగిరపరుస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో గణనీయ ఫలితాలివ్వగలవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వ సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ- పాలనను నేరుగా ప్రజల ముంగిటకు చేరుస్తూ సమస్యల పరిష్కారం కోసం వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేసే దురవస్థ లేకుండా చేస్తున్నామని శ్రీ మోదీ అన్నారు. ఫలితంగా రాష్ట్రంలో యువత, మహిళలు, రైతులు, సామాన్యుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కీలక సంక్షేమ కార్యక్రమాలను శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు వరి కొనుగోలులో క్వింటాల్‌కు ₹3,100 వంతున రైతుకు గిట్టుబాటు ధర ఇస్తున్నామని చెప్పారు. అలాగే, ‘సుభద్ర యోజన’ కింద కోటి మందికి పైగా మహిళలకు ఆర్థిక సహాయం, ఆరోగ్య సంరక్షణ సదుపాయం విస్తరణ కింద ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా మాధో సింగ్ హాత్ ఖర్చా యోజన ద్వారా గిరిజన విద్యార్థులకు మద్దతు, భక్తుల మనోభావాల మేరకు శ్రీ జగన్నాథ ఆలయం నాలుగు ద్వారాలను తిరిగి తెరవడం వంటి చర్యలు కూడా చేపట్టామన్నారు. ఈ ప్రాంతమంతటా ఇటీవల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన ప్రశంసించారు. “పరిశుభ్రతతో సాదర స్వాగతం” పేరిట చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలిచ్చిందని ఆయన పేర్కొన్నారు.

గిరిజన సంక్షేమంపై మాట్లాడుతూ- గిరిజన ప్రాంతాలతో తనకుగల సుదీర్ఘ అనుబంధాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. గిరిజన తెగల సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏళ్ల తరబడి చేసిన కృషిని ఆయన కొనియాడారు. “గిరిజన ప్రాంతాలు చారిత్రకంగా ప్రాథమిక సేవలు, కనీస సదుపాయాలకు నోచుకోలేదు. అందుకే, గిరిజనం పురోగమనానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. గిరిజన గ్రామాల్లో జీవన స్థితిగతుల మెరుగుకు ‘ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్’ కింద ఆరోగ్యం, విద్య, రహదారులు, గృహనిర్మాణ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి” అని శ్రీ మోదీ వివరించారు.

రాష్ట్రపతి ముర్ముతో చర్చల ఫలితంగానే ‘పీఎం జన్మాన్ మిషన్’ రూపుదిద్దుకున్నదని గుర్తుచేశారు. ఇది ప్రత్యేకించి గిరిజనులలోని బలహీన వర్గాల (పీవీటీజీల) అభ్యున్నతి లక్ష్యంగా అమలవుతున్నదని చెప్పారు. తద్వారా అత్యంత అట్టడుగునగల గిరిజనులకూ ప్రభుత్వ సేవలు ఇంటి ముంగిటకే చేరుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

గిరిజన యువతకు విద్య, ఉపాధి అవకాశాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ- దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 500 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటయ్యాయని చెప్పారు. మరో 750 దాకా పాఠశాలల నిర్మాణానికి ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్థాయులలో 1.5 కోట్ల మందికి పైగా గిరిజన విద్యార్థులు రూ.వందల కోట్ల విలువైన ఉపకార వేతనం అందుకుంటున్నారని తెలిపారు. మయూర్‌భంజ్ జిల్లాలో అదనంగా మరొక జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు శ్రీ మోదీ ప్రకటించారు.

గిరిజనం ఆరోగ్య సంరక్షణ సవాళ్లపై ప్రసంగిస్తూ- మారుమూల ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్న ‘సికిల్ సెల్ అనీమియా’ వంటి వ్యాధుల నిర్మూలకు చేపట్టిన చర్యలను వివరించారు. “ఈ వ్యాధి నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 4 కోట్లకుపైగా ఆరోగ్య కార్డులు జారీచేసింది. ఉచిత చికిత్స పొందడం కోసం లక్షలాది గిరిజన లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేసింది. జల్ జీవన్ మిషన్ కింద గిరిజన ప్రాంతాలు సహా దేశవ్యాప్తంగా ఇంటింటికీ సురక్షిత తాగునీరు సరఫరా చేస్తోంది” అని శ్రీ మోదీ విశదీకరించారు.

భవిష్యత్తు కార్యక్రమాల్లో భాగంగా రెండు కీలక ఘట్టాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు ఒడిషా ఆవిర్భవించి, 2036 నాటికి వందేళ్లు పూర్తవుతాయని, 2047లో స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు మొదలవుతాయని గుర్తుచేశారు. “ఒడిషా, భారత్‌ ఆకాంక్షలు వేర్వేరు కాదు... బలమైన ఒడిషా, శక్తిమంతమైన భారత్‌కు అవి దోహదం చేస్తాయి” అని ఆయన వివరించారు. జ్ఞానం, యోగా సంప్రదాయాలతో ప్రగాఢంగా ముడిపడిన నేలగా ఒడిషాను అభివర్ణిస్తూ- ఈ నేపథ్యంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనుండటాన్ని శ్రీ మోదీ గుర్తు చేశారు. దేశం నలుమూలల నుంచి, ప్రపంచమంతటా గల భారత పౌరులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతేగాక యోగాను ఒక జీవన విధానంగా అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

చివరగా- ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంపై ప్రధానమంత్రి శ్రీ మోదీ రాష్ట్ర ప్రజలకు అభినంనందనలు తెలిపారు. ఈ కర్మభూమిని సందర్శించి, మయూర్‌భంజ్ ప్రజలతో మమేకమయ్యే అవకాశం కల్పించిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు మరోసారి ధన్యవాదాలు చెబుతూ తన ప్రసంగం ముగించారు. 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'PM Modi Is One Of Our Greatest Friends': Netanyahu Says Israel Is 'Investing Heavily' In India Ties

Media Coverage

'PM Modi Is One Of Our Greatest Friends': Netanyahu Says Israel Is 'Investing Heavily' In India Ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 04 ఆగష్టు 2026
August 04, 2026

From Auto PLI to Ramsar Sites: How India is Winning on Every Front Under PM Modi