ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలోని అగ్రగామి అధికారులు అయినటువంటి కార్యదర్శులందరితోను ఈ రోజు స్నేహపూర్వకమైన రీతిలో భేటీ అయ్యారు.
పూర్వ శతాబ్దాల నాటి పరిపాలక యంత్రాంగాల స్థాయి నుండి ఎదగాలంటూ వారికి ఆయన స్పష్టంచేశారు. మానవాళిలో ఆరింట ఒకటో వంతు మంది జీవితాలలో పరివర్తనను తీసుకురాగలిగిన అవకాశం కార్యదర్శులకు లభించిందని ఆయన గుర్తుచేశారు. 2022 కల్లా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతుందని, అప్పటికి సాధించవలసినటువంటి నిర్దిష్ట లక్ష్యాలను గుర్తించాలని వారికి ఆయన సూచించారు.
తమ తమ మంత్రిత్వ శాఖలు అంటూ గిరి గీసుకు కూర్చోకుండా ఆ పరిధి నుండి వెలుపలకు వచ్చి దేశ పురోభివృద్ధి కోసం కృషి చేయండని కార్యదర్శులకు ప్రధాన మంత్రి ఉద్బోధించారు. అందరికీ ఆర్థిక సేవలను అందజేసేందుకు ఉద్దేశించిన జన్ ధన్ యోజన, సార్వత్రిక టీకా మందు అందజేతను లక్షించిన మిషన్ ఇంద్రధనుష్ వంటి కార్యక్రమాలను ఉదాహరణలుగా ప్రస్తావిస్తూ, గత మూడు సంవత్సరాలలో సాధించిన అత్యుత్తమ ఫలితాలలో కొన్ని ఫలితాలు యావత్తు ప్రభుత్వ వ్యవస్థ ఒక్కతాటి మీద నిలబడి జట్టు లాగా పని చేసినందువల్ల దక్కాయని ప్రధాన మంత్రి చెప్పారు. ఫలితాలను రాబట్టడమే ప్రధానం అనే విషయాన్ని సంస్థలకు నూరిపోయాలని ఆయన అన్నారు.
స్వచ్ఛత ఉద్యమం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దీనికి అతి విస్తృతమైన స్థాయిలో మద్దతు ప్రజల నుండి లభించిందని, ఇదే పరిపాలన స్థాయిలోనూ మార్పునకు చోదక శక్తి వలె మారిందన్నారు.
జులై 1వ తేదీ నుండి అమలులోకి రానున్న ‘వస్తువులు, సేవల పన్ను’ (జిఎస్ టి ) దేశ చరిత్రలో ఒక అసాధారణమైన మలుపును తీసుకువస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ మార్పును దృష్టిలో పెట్టుకొని- సంస్కరణానుకూలమైనటువంటి తరహాలో సాగుతూ- ప్రస్తుత వ్యవస్థ నుండి జిఎస్ టీ వైపునకు పయనం సాఫీగా సాగేటట్లు చూడవలసిందిగా కార్యదర్శులను ఆయన కోరారు.
ప్రపంచం ఇవాళ భారతదేశాన్ని భిన్నంగా చూడటం మొదలుపెట్టిందంటూ, ఈ విశిష్టమైన అవకాశాన్ని జారవిడుచుకోకూడదని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రపంచ అంచనాలను అందుకొనేందుకుగాను తగిన యంత్రాంగాలను మనం నిర్మిద్దాం అని ఆయన కార్యదర్శులతో అన్నారు.
భారతదేశంలో అత్యంత వెనుకబడిన 100 జిల్లాలను ప్రగతి పథంలోకి తీసుకువచ్చేందుకు ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని కూడా ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ఈ జిల్లాల కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని వేరు వేరు పరామితుల సహాయంతో ఖచ్చితంగా స్వల్ప కాలావధులలో సాధించాలని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింగ్, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీమతి సుష్మ స్వరాజ్ మరియు శ్రీ నితిన్ గడ్ కరి లు కూడా కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించారు.
అంతక్రితం, ప్రభుత్వ పాలనకు సంబంధించిన వివిధ రంగాలపై కార్యదర్శులు సైతం కొన్ని సూచనలు చేశారు.