* 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామం పనిచేయాలి: పీఎం
* అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కనీసం ఒక ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రాలను కోరిన ప్రధాని
* పెట్టుబడులను ఆకర్షించడానికి ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఛార్టర్’ రూపొందించాలని నీతిఆయోగ్‌‌ను ఆదేశించిన పీఎం
* అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్‌పై ఆసక్తితో ఉన్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని సూచన
* నీటి వనరులను సమర్థంగా వినియోగించుకొనేందుకు రాష్ట్ర స్థాయిలో వాటర్ గ్రిడ్ రూపొందించుకోవాలన్న పీఎం
* సుస్థిర పట్టణాభివృద్ధి కోసం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మెరుగైన పట్టణ ప్రణాళిక రూపొందించాలని పిలుపునిచ్చిన ప్రధాని
* నూతనంగా ఆవిర్భవిస్తున్న రంగాల్లో ఉపాధి పొందగలిగేలా యువతకు నైపుణ్య శిక్షణ అందిచాల్సిన ఆవశ్యకతను వివరించిన పీఎం
* భారత దేశ నారీ శక్తి సామర్థ్యం గురించి వివరించిన ప్రధాని
* సమావేశానికి హజరైన 24 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ ఒక నిమిషం మౌనం పాటించిన అనంతరం ఈ సమావేశం ప్రారంభమైంది.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలకమండలి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి 24 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 7 కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ఈ ఏడాది ఈ సమావేశ ఇతివృత్తం ‘వికసిత భారత్ @2047 కోసం వికసిత రాజ్యం’. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ ఒక నిమిషం మౌనం పాటించిన అనంతరం ఈ సమావేశం ప్రారంభమైంది.

వికసిత్ భారత్‌గా దేశం మారడం.. ప్రతి భారతీయ పౌరుని ఆకాంక్ష అని ప్రధాని అన్నారు. అది ఏ పార్టీకి సంబంధించిన ఎజెండా కాదని, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ర్టాలన్నీ కలసి పనిచేస్తే.. అద్భుతమైన ప్రగతి సాధించవచ్చని తెలిపారు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా అంకితభావంతో పనిచేయాలని, అప్పుడే 2047 కంటే ముందే వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించగలమన్నారు.

 

ప్రపంచంలోనే ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటని, దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని తెలిపారు. ఈ అభివృద్ధి వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలు తయారీ రంగంలో తమ సామర్థ్యాలను వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. తయారీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.

అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నారని ప్రధాని గమనించారు. ఈ అవకాశాన్ని అన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని, పెట్టుబడులను సులభరతం చేయాలన్నారు. యూఏఈ, యూకే, ఆస్ట్రేలియాలతో ఇటీవలే కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల గురించి వివరిస్తూ.. వీటిని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.

నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని వివరిస్తూ.. విద్య, నైపుణ్యాలకు జాతీయ విద్యా విధానం ప్రాధాన్యమిస్తుందని ప్రధాని తెలిపారు. ఏఐ, సెమీ కండక్టర్, 3డీ ప్రింటింగ్ లాంటి ఆధునిక సాంకేతికతలకు తగిన విధంగా నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్రాలు ప్రణాళికలు రూపొందించాలన్నారు. మన జనాభాయే మన దేశాన్ని ప్రపంచ నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మారుస్తుందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసం రూ.60,000 కోట్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ప్రధాని తెలిపారు. నైపుణ్యాలను పెంపొందించేందుకు అత్యాధునిక శిక్షణా మౌలిక వసతులు, గ్రామీణ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడంపై రాష్ట్రాలు దృష్టి సారించాలని తెలిపారు.

 

సైబర్ భద్రత ఒక సవాలుగా, అవకాశంగా పీఎం వర్ణించారు. హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ కూడా విస్తృత అవకాశాలను కలిగి ఉన్న గొప్ప సామర్థ్యం ఉన్న రంగాలుగా పేర్కొన్నారు.

ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ గుర్తింపు పొందేలా జీ 20 సదస్సు సహకరించిందని ప్రధాని అన్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అంచనాలకు తగిన విధంగా కనీసం ఒక పర్యాటక ప్రదేశాన్నైనా రాష్ట్రాలు అభివృద్ధి చేయాలని కోరారు. ఆ విధంగా దేశ వ్యాప్తంగా 25 నుంచి 30 వరకు పర్యాటక ప్రదేశాలు రూపొందించవచ్చని పేర్కొన్నారు.

భారత్ వేగంగా పట్టణీకరణ చెందుతుండడాన్ని ప్రధాని గుర్తించారు. సుస్థిరత, వృద్ధికి ఇంజిన్లుగా నగరాలను తయారు చేయాలని రాష్ట్రాలను కోరారు. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై దృష్టి సారించాలన్నారు. ఈ పెట్టుబడుల కోసం రూ. 1 లక్ష కోట్లతో ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

భారతీయ నారీశక్తికి ఉన్న అపార సామర్థ్యాన్ని గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళలు అభివృద్ధి మార్గంలో ప్రయాణించేలా చట్టాలను మార్చాలని అభ్యర్థించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు పని సౌలభ్యం ఉండేలా సంస్కరణలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

నీటి ఎద్దడిని, వరదలను ఎదుర్కోవడానికి నదులను అనుసంధానించాలని రాష్ట్రాలను ప్రధాని ప్రోత్సహించారు. ఇటీవలే కోశి-మోచీ నదుల అనుసంధానాన్ని ప్రారంభించిన బీహార్‌ను ఆయన అభినందించారు. అలాగే సమష్టి కృషి ద్వారా విజయం సాధించిన ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమాన్ని ప్రశంసించారు.

 

వ్యవసాయంలో ‘ప్రయోగ శాల నుంచి సాగుభూమికి’ అనే అంశంపై దృష్టి సారించాలని పీఎం అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న సంకల్ప్ అభియాన్ కార్యక్రమం గురించి ఆయన మాట్లాడారు. దీనిలో భాగంగా సుమారుగా 2,500 మంది శాస్త్రవేత్తలు గ్రామాలు, గ్రామీణ కేంద్రాలకు వెళ్లి పంటల వైవిధ్యం, రసాయన రహిత సాగు గురించి వివరిస్తారు. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఆరోగ్య సేవలను అందించడంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి వివరించారు. ఆక్సిజన్ ప్లాంట్లను పరీక్షించాలని, ఏదైనా కొవిడ్ సంబంధిత సవాళ్లు ఎదురైతే.. వాటిని అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రాలు టెలి మెడిసిన్ సేవలను విస్తరించాలని, తద్వారా జిల్లా ఆసుపత్రుల నుంచే వైద్యులు అవసరమైన వారికి సేవలు అందించగలుగుతారన్నారు. ఈ-సంజీవని, టెలి కన్సల్టేషన్ సేవలను అందుబాటులో ఉంచాలన్నారు.

‘ఆపరేషన్ సిందూర్’ను ఒక్కసారి చేపట్టిన చర్యగా చూడరాదని, దీర్ఘకాలిక విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి అన్నారు. పౌర సన్నద్ధత దిశగా మన విధానాన్ని ఆధునికీకరించుకోవాలని తెలిపారు. ఇటీవల చేపట్టిన మాక్ డ్రిల్స్ పౌర రక్షణపై మన దృష్టిని తిరిగి కేంద్రీకరించేలా చేశాయని, పౌర రక్షణ సన్నద్ధతను రాష్ట్రాలు సంస్థాగతీకరించాలన్నారు.

ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసిన ఆపరేషన్ సిందూర్ కచ్చితత్వాన్ని, లక్షిత దాడులను ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రశంసించారు. ప్రధానమంత్రి నాయకత్వాన్ని, భద్రతా బలగాల పరాక్రమాన్ని ముక్తకంఠంతో అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ దిశగా చేపట్టిన ప్రయత్నాలను కూడా మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమం భద్రతా బలగాలను బలోపేతం చేసి వారి ఆత్వవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించింది.

 

వికసిత్ భారత్ @ 2047 కోసం వికసిత్ రాజ్యం అనే లక్ష్యానికి ముఖ్యమంత్రులు/లెఫ్టినెంట్ గవర్నర్లు తమ సూచనలు అందించారు. అలాగే తమ రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యల గురించి వివరించారు. వ్యవసాయం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక రంగం, తాగునీరు, ప్రక్రియలను క్రమబద్దీకరించడం, పాలన, డిజిటలైజేషన్, మహిళా సాధికారత, సైబర్ భద్రత తదితర అంశాల్లో తమ సూచనలు, తాము అనుసరిస్తున్న విధానాల గురించి వివరించారు. స్టేట్ విజన్ 2047 దిశగా తాము సాధించిన విజయాలను వివిధ రాష్ట్రాలు పంచుకున్నాయి.

ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందించిన సూచనలను అధ్యయనం చేయాలని నీతి ఆయోగ్‌‌ను ప్రధానమంత్రి కోరారు. నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం దాని పదేళ్ల ప్రయాణంలో మైలు రాయి అని అన్నారు. ఇది 2047 లక్ష్యాన్ని నిర్వచించి, వివరిస్తుందని తెలిపారు. పాలక మండలి సమావేశాలు దేశ నిర్మాణంలో దోహదపడుతున్నాయని, ఉమ్మడి కార్యాచరణ, ఆశయాలకు వేదికగా మారిందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొని తమ ఆలోచనలు, అనుభవాలు పంచుకున్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. సహకార సమాఖ్య విధానం ద్వారా వికసిత్ భారత్ @2047 కోసం వికసిత్ రాజ్యం అనే లక్ష్యాన్ని నెరవేర్చే మార్గంలో భారత్ ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Year Ender 2025: Major Income Tax And GST Reforms Redefine India's Tax Landscape

Media Coverage

Year Ender 2025: Major Income Tax And GST Reforms Redefine India's Tax Landscape
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 డిసెంబర్ 2025
December 29, 2025

From Culture to Commerce: Appreciation for PM Modi’s Vision for a Globally Competitive India