షేర్ చేయండి
 
Comments

జపాన్ ప్రధాని, శ్రేష్ఠులు శ్రీ శింజో ఆబే తో పాటు భారతదేశం- జపాన్ వార్షిక ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం లో పాల్గొనేందుకు భారతదేశం ప్రధాన మంత్రి, శ్రేష్ఠులు శ్రీ నరేంద్ర మోదీ 2018 అక్టోబర్ 28-29 తేదీల్లో జపాన్ ను సందర్శించారు.  ఈ సందర్భం గా వారు ఉభయ దేశాల మధ్య సంబంధాల పురోగతి కి గల అపూర్వ అవకాశాల ను గుర్తించారు.  ప్రధాన మంత్రి శ్రీ మోదీ, ప్రధాని శ్రీ ఆబే లు గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ దిశ గా అందుకున్న ప్రధాన మైలురాళ్ల పై  సమీక్షించారు.  అనంతరం భారతదేశం- జపాన్ సంబంధాల భవితవ్యానికి సంబంధించి దిగువ పేర్కొన్న ఉమ్మడి దార్శనికత ను ప్రస్ఫుటం చేశారు:
 
1. భారతదేశం- జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఉమ్మడి విలువ ల ప్రాతిపదిక గా బలమైన చరిత్రాత్మక పునాదులు ఉన్నాయి.  రెండు దేశాల ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాల ను ముందుకు తీసుకుపోవడానికి మూలం ఇవే.  దీంతో పాటు రెండు దేశాల ప్రజలకు మెరుగైన భవిష్యత్తు నిర్మాణం దిశ గా శాంతి ని, సౌభాగ్యాన్ని సాధించేందుకు అవి దోహదం చేస్తున్నాయి.  రెండు దేశాల ప్ర‌ధానులు ‘సంవాద్’ పేరిట నిర్వహించిన చర్చా పరంపర లో భాగం గా స్వేచ్ఛ, మానవత్వం, ప్రజాస్వామ్యం, సహనం, అహింస ల సార్వజనీన విలువలను ప్రతిధ్వనింపజేశారు.  భారతదేశం- జ‌పాన్‌ ల మ‌ధ్య విద్య, ఆధ్యాత్మిక, విజ్ఞాన‌ సంబంధిత ఆదాన‌ ప్ర‌దానాల సుదీర్ఘ చరిత్ర లో ఉభయ దేశాలూ ఈ విలువ‌ల‌ను పంచుకొంటూ వ‌చ్చాయి.  భారతదేశం- జపాన్ ద్వైపాక్షిక సంబంధాల‌కు ఇవి ఆధార‌భూతం మాత్ర‌మే కాక ఇండో- పసిఫిక్ ప్రాంతం తో పాటు మొత్తం ప్ర‌పంచ ప్ర‌యోజ‌నాల దిశ‌ గా స‌మ‌ష్టి కృషి కి సంబంధించిన సూత్రాల‌ కు ప్రాతిప‌దిక‌ గా ఉన్న‌ది ఈ విలువ‌లే.
 
2.      ఈ ఉమ్మ‌డి దార్శ‌నిక‌త సాకారానికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌ పై త‌మ దృష్టికోణాన్ని దేశాధినేత‌లు ఇరువురూ ప‌ర‌స్ప‌రం పంచుకున్నారు.  సార్వ‌జ‌నీన, నిబంధ‌నాధారిత‌ ప్ర‌పంచ క్ర‌మం కోసం భార‌తదేశం- జ‌పాన్ క‌ల‌సిక‌ట్టుగా కృషి చేయవలసిన ఆవ‌శ్య‌క‌త‌ ను అంగీక‌రించారు.  చ‌ట్ట‌ప‌ర‌మైన పాల‌న‌, నిరంత‌ర వాణిజ్య‌, ప్ర‌జా, సాంకేతిక‌, వినూత్న యోచ‌న‌ ల‌ ప్ర‌వాహానికి భ‌రోసా ను ఇవ్వ‌గ‌ల‌ స‌మాచార‌, అనుసంధానత‌ ల‌ను మెరుగుప‌ర‌చ‌డం ద్వారా ఉమ్మ‌డి సౌభాగ్య సాధన కోసం ఈ ప్ర‌పంచ‌ క్ర‌మం న‌మ్మ‌కాన్ని, విశ్వాసాన్ని ప్రోది చేయాల‌ని ఆకాంక్షించారు.
 
3.      భార‌త‌దేశం- జ‌పాన్ మైత్రి గొప్ప వాస్త‌వ‌, ప్ర‌యోజనాత్మ‌క‌త‌ ల‌తో ఒక చ‌క్క‌ని భాగ‌స్వామ్యం గా ప‌రివ‌ర్త‌న చెందింద‌ని, భార‌తదేశం అనుస‌రిస్తున్న తూర్పు కార్యాచ‌ర‌ణ విధానానికి పునాదిరాయి ఇదేన‌ని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు.  ప్రాంతీయ స‌మ‌తౌల్య సాధ‌న లో భార‌త‌దేశం- జ‌పాన్ స్నేహ‌బంధానికి గ‌ల కీల‌క ప్రాముఖ్యాన్ని ప్ర‌ధాని శ్రీ ఆబే వివ‌రించారు.  ఇండో- ప‌సిఫిక్ ప్రాంత శాంతి, సుస్థిర‌త‌, సౌభాగ్యాల కోసం ‘‘భార‌త‌దేశం- జపాన్ సంబంధాల‌లో కొత్త శ‌కాన్ని’’ స‌హ‌కార విస్తృతి దిశ‌ గా ముందుకు తీసుకుపోవడం పై దృఢ‌ నిశ్చ‌యాన్ని ప్ర‌క‌టించారు.  ఉమ్మ‌డి దార్శనిక‌త ప్రాతిప‌దిక‌ గా స్వేచ్ఛాపూర్వ‌క‌, సార్వ‌త్రిక ఇండో- ప‌సిఫిక్ ప్రాంతం ఆవిష్క‌ర‌ణ‌ కు సంయుక్తం గా కృషి చేయ‌డం పై త‌మ తిరుగులేని క‌ట్టుబాటు ను ఇద్ద‌రు ప్ర‌ధానులూ పున‌రుద్ఘాటించారు.  ఇండో- ప‌సిఫిక్ భావ‌న‌ లో ఆసియాన్ ఐక్య‌త‌, కేంద్రత్వాలే కీల‌క‌మ‌ని, ఇవి స‌మ్మిశ్రితం మాత్ర‌మే కాకుండా సార్వ‌త్రిక‌మ‌ని దేశాధినేత‌లు ఇరువురూ స్ప‌ష్టం చేశారు.  అమెరికా స‌హా ఇత‌ర భాగ‌స్వామ్య దేశాల‌ తో సుదృఢ స‌హ‌కార విస్త‌ర‌ణ కు వారు సంయుక్తం గా సానుకూల‌త ను ప్ర‌క‌టించారు.  ఆయా దేశాల సార్వ‌భౌమ‌త్వాన్ని, ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌ ను గౌర‌వించే నిబంధ‌నాధారిత క్ర‌మం ఇండో- ప‌సిఫిక్ ప్రాంతంపై ఉభయ నాయ‌కుల దార్శ‌నిక‌త కు ప్రాతిప‌దిక‌ గా ఉంది.  అంతేకాకుండా నౌకాయాన‌, ఆకాశ‌యాన స్వేచ్ఛ‌, చ‌ట్ట‌బ‌ద్ధ‌- నిరంత‌ర వాణిజ్య కార్య‌క‌లాపాలకు అది భ‌రోసా ను ఇచ్చేలా ఉండాలి.  అలాగే స‌ముద్ర చ‌ట్టాల‌పై ఐక్య‌ రాజ్య‌ స‌మితి తీర్మానం (యుఎన్ సిఎల్ఒఎస్) స‌హా ప్ర‌పంచ‌ వ్యాప్త గుర్తింపు ను పొందిన అంత‌ర్జాతీయ చ‌ట్ట సూత్రాల‌ కు అనుగుణం గా ఎటువంటి బ‌ల‌ప్ర‌యోగానికి, బెదిరింపు నకు తావు ఉండని రీతి లో వివాదాల‌కు శాంతియుత‌ ప‌రిష్కారాన్ని ఇద్దరు నాయ‌కుల దార్శ‌నిక‌త ఆకాంక్షిస్తోంది.

సౌభాగ్యం కోసం భాగ‌స్వామ్యం
 
4.     ఉమ్మ‌డి సౌభాగ్యం దిశ‌ గా సామ‌ర్థ్య నిర్మాణం స‌హా నాణ్య‌మైన మౌలిక వ‌స‌తులు, ఇతర ప్రాజెక్టుల‌ ద్వారా అనుసంధానం అభివృద్ధి కి స‌హ‌కారం పై ఇద్ద‌రు ప్ర‌ధానులూ స‌మీక్షించి సంతృప్తి ని వ్య‌క్తం చేశారు. ద్వైపాక్షికం గానే కాకుండా ఇత‌ర భాగ‌స్వాముల‌తో క‌ల‌సి రెండు దేశాలూ ఈ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తున్నాయి.  ఈ నేప‌థ్యం లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలు, బాధ్య‌తాయుత రుణ‌ మంజూరు విధానాల ప్రాతిప‌దిక‌ న విస్ప‌ష్ట‌, పార‌ద‌ర్శ‌క‌, నిష్ప‌క్ష‌పాత ప‌ద్ధ‌తి లో స్థానిక ఆర్థిక‌- అభివృద్ధి వ్యూహాలు, ప్రాథ‌మ్యాల‌ కు అనుగుణం గా ఈ స‌మీక్ష సాగింది. ఇండో- ప‌సిఫిక్ ప్రాంతం లో భార‌త‌దేశం, జ‌పాన్‌ ల మ‌ధ్యనే కాక‌ శ్రీ ‌లంక‌, మ‌య‌న్మార్‌, బాంగ్లాదేశ్‌ లు స‌హా ఆఫ్రికా లోని సంయుక్త ప్రాజెక్టుల స‌మాహారంగా ఈ స‌మ‌ష్టి కృషి కొన‌సాగుతోంది.  దీనికి సంబంధించి ‘‘ఆసియా-ఆఫ్రికా ప్రాంతం లో భార‌త‌దేశం- జ‌పాన్ వాణిజ్య స‌హ‌కార వేదిక‌’’ ఏర్పాటు కోసం చ‌ర్చ‌లు నిర్వహించడం పై ప్ర‌ధానులిరువురూ హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.  ఆ ప్రాంతం లో పారిశ్రామిక చ‌ట్రాలు, కారిడార్ల అభివృద్ధి దిశ‌ గా భార‌త‌దేశం- జపాన్ వాణిజ్య సంస్థ‌ల మ‌ధ్య ఆదాన‌ప్ర‌దానాలు మ‌రింత మెరుగుప‌డ‌ట‌మే ఈ వేదిక ఏర్పాటు ల‌క్ష్యం.
 
5.      భారతదేశం- జపాన్ తూర్పు కార్యాచ‌ర‌ణ వేదిక‌ ద్వారా అనుసంధానం పెంపు తో పాటు సుస్థిర అట‌వీ- ప‌ర్యావ‌ర‌ణ నిర్వ‌హ‌ణ‌, విప‌త్తు ముప్పు త‌గ్గింపు, ప్ర‌జ‌ల మ‌ధ్య ఆదాన‌ ప్ర‌దానం మెరుగుదల దిశ‌ గా గుర్తించిన ప్రాజెక్టుల అమ‌లు రూపేణా ఈశాన్య భార‌త ప్రాంత అభివృద్ధి లో క‌నిపిస్తున్న‌ పురోగ‌తి పై ప్ర‌ధానులు ఇద్ద‌రూ హ‌ర్షాన్ని ప్ర‌క‌టించారు. భార‌తదేశం లో ఆధునిక ద్వీపాల అభివృద్ధికి గ‌ల ప్రాముఖ్యాన్ని కూడా వారు గుర్తించారు.
 
6.      భార‌త‌దేశం లో సామాజిక‌, ఆర్థిక అభివృద్ధి కి త‌న‌ వంతు గా గ‌ణ‌నీయ కృషి ని చేస్తున్న జ‌పాన్‌ కు చెందిన ఒడిఎ ను ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ మోదీ ప్ర‌శంసించారు.  సామ‌ర్థ్య నిర్మాణం, కీల‌క నాణ్య‌మైన‌ మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టు ల ద్వారానే కాకుండా సామాజిక‌, పారిశ్రామిక అభివృద్ధి కోసం భార‌తదేశం చేస్తున్న కృషి కి మ‌ద్ద‌తు ను కొన‌సాగించాల‌న్న జ‌పాన్ సంక‌ల్పాన్ని ప్ర‌ధాని శ్రీ ఆబే ప్ర‌క‌టించారు.  ముంబయి- అహమదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం ‘యెన్‌’ రూపేణా రుణానికి ఒప్పందం పై సంత‌కాలు స‌హా ఈ ప్రాజెక్టు ప‌నుల పురోగ‌తి పై ఇరువురు నాయ‌కులూ స‌మీక్షను నిర్వహించి సంతృప్తి ని వ్య‌క్తం చేశారు.  భార‌తదేశం 2022 వ సంవత్సరం లో త‌న 75వ స్వాతంత్య్ర వార్షికోత్స‌వాన్ని నిర్వ‌హించుకోనున్న నేప‌థ్యం లో ఈ రైలు ప్రాజెక్టు కు ఎంతో ప్రాధాన్యం ఉంది.  భార‌తదేశం లోని న‌గ‌రాల ఆధునికీక‌ర‌ణ‌ కు మ‌ద్ద‌తు గా చేప‌డుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు ల‌కు స‌హ‌కారం కొన‌సాగింపు పైనా వారు హ‌ర్షం ప్ర‌క‌టించారు.  ప‌శ్చిమ ప్ర‌త్యేక ర‌వాణా కారిడార్‌, ఢిల్లీ- ముంబయి పారిశ్రామిక కారిడార్ ల వంటి నాణ్య‌మైన మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌ ద్వారా సంధానాన్ని అభివృద్ధిపరచడం లో జ‌పాన్ పాత్ర‌ ను భార‌తదేశం కొనియాడింది.
 
7.      ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం భార‌తదేశం- జ‌పాన్ ఆర్థిక భాగ‌స్వామ్యం వాస్త‌వ సామ‌ర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవ‌డం లో భాగం గా జ‌పాన్ మూల‌ధ‌నాన్ని, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని, భార‌తదేశ జ‌న‌ శ‌క్తి సంప‌ద‌ తో మ‌మేకం చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఇద్ద‌రు ప్ర‌ధానులూ ప్ర‌క‌టించారు.  దీనికి సంబంధించి భార‌తదేశం లో చేప‌ట్టిన ప‌రివ‌ర్త‌నాత్మ‌క కార్య‌క్ర‌మాలైన ‘‘మేక్ ఇన్ ఇండియా’’, ‘‘స్కిల్ ఇండియా’’, ‘‘క్లీన్ ఇండియా మిశన్‌’’ల‌కు వ‌న‌రులు, ఆధునిక ప‌రిజ్ఞానం, జ‌పాన్‌ లోని ప్ర‌భుత్వ‌- ప్రైవేటు పెట్టుబ‌డుల స‌మీక‌ర‌ణ త‌దిత‌రాల భాగ‌స్వామ్యం ద్వారా జ‌పాన్ బ‌ల‌మైన మ‌ద్ద‌తు ను ఇస్తుండ‌డం పై భార‌తదేశం హ‌ర్షాన్ని వ్య‌క్తం చేసింది.  రెండు దేశాల్లోని మేధో సంప‌ద హ‌క్కు ల కార్యాల‌యాల మ‌ధ్య మేధో సంప‌ద హ‌క్కు ల‌కు సంబంధించి స‌న్నిహిత స‌హ‌కారాన్ని నాయకులు ఇరువురూ గుర్తించారు.  ఆ మేర‌కు 2019 ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికం లో కొన్ని గుర్తించిన ఆవిష్క‌ర‌ణ‌ల రంగాల కు సంబంధించి ‘పేటెంట్ ప్రాసిక్యూశన్ హైవే’ కార్య‌క్ర‌మాన్ని ద్వైపాక్షికం గా ప్ర‌యోగాత్మ‌క రీతిలో ప్రారంభించేందుకు అంగీకారానికి వ‌చ్చారు. ‘‘భారత-జ‌పాన్ పెట్టుబ‌డుల ప్రోత్సాహ‌క భాగ‌స్వామ్యం’’లో భాగం గా భార‌తదేశం లో జ‌పాన్ విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడుల విస్త‌ర‌ణ‌ తో పాటు జ‌పాన్ ఇండస్ట్రియల్ టౌన్ శిప్ లు  (జెఐటి), జ‌పాన్‌- భార‌తదేశం పెట్టుబ‌డుల‌కు ప్రోత్సాహ మార్గ ప్ర‌ణాళిక కింద తీసుకున్న ఇత‌ర చ‌ర్య‌ ల పురోగ‌తి పైనా వారు హ‌ర్షాన్ని వ్యక్తం చేశారు. ద్ర‌వ్య‌, ఆర్థిక స‌హ‌కారం పెంపు దృష్టి తో 7500 కోట్ల యుఎస్ డాల‌ర్ల ‘ ద్వైపాక్షిక బ‌దిలీ ఒప్పందం’ (బిఎస్ఎ) ఖ‌రారు పై జ‌పాన్‌, భార‌తదేశ ప్ర‌భుత్వాలు హర్షాన్ని వ్యక్తం చేశాయి.  ఆ మేరకు బ‌హిరంగ వాణిజ్య రుణాల (ఇసిబి) సేక‌ర‌ణ కు సంబంధించి మౌలిక స‌దుపాయాల కోసం స్వీక‌రించే సగటున 5 సంవత్సరాల సగటు పరిప‌క్వ‌ అవధి గ‌ల‌ ఇసిబి ల‌కు త‌ప్ప‌నిస‌రి ముంద‌స్తు పెట్టుబ‌డి అక్కర లేదు. 
 
8.    నైపుణ్యాభివృద్ధి రంగం లో మరింతగా సహకార విస్తృతి కి నాయకులు ఇరువురూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఈ దిశగా జపాన్- భారతదేశ తయారీ సంస్థ ల (జెఐఎమ్ స్ ) సంఖ్య ను, పరిధి ని విస్తృతం చేసేందుకు అంగీకరించారు.  భారతదేశం లోని వివిధ రాష్ట్రాల్లోనూ జపాన్ ప్రాయోజిత కోర్సుల (జెఇసి) విస్తరణ కు సమ్మతించారు. జపాన్ నిర్వహణ లోని ‘‘ఇనవేటివ్ ఏశియా’’ వంటి వినూత్న కార్యక్రమాలు, టెక్నికల్ ఇంటర్న్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ (టిఐటిపి) సహా ఆయా చట్రాలను వినియోగించుకోవడం ద్వారా పరిశ్రమ ల కొత్త అవసరాల కు అనుగుణమైన రీతి లో మానవ వనరుల అభివృద్ధి కి, ఆదాన ప్రదానాలకు సహకారాన్ని మరింత ప్రోత్సహించేందుకు అంగీకరించారు.
 
9.     భార‌త‌దేశం- జ‌పాన్ స‌మ‌గ్ర డిజిట‌ల్ భాగ‌స్వామ్యాని కి శ్రీ‌కారం పై నాయకులు ఇరువురూ హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.  సామాజిక ప్ర‌యోజ‌నాల కోసం ఇంట‌ర్ నెట్ ఆఫ్ థింగ్స్‌, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ ఆవిష్క‌ర‌ణ‌ ల‌ను అభివృద్ధి చేయ‌డం ఈ భాగ‌స్వామ్య ప‌ర‌మోద్దేశం.  అలాగే బెంగ‌ళూరు లోని ‘జ‌పాన్- భార‌తదేశ స్టార్ట‌ప్ కూడ‌లి’తో పాటు హిరోశిమా జిల్లా లోని నాస్ కామ్ ఐటీ కారిడార్‌ ల‌ను వినియోగించుకుంటూ సంయుక్తం గా స‌రికొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాన్వేష‌ణ ను చేప‌ట్ట‌డం మ‌రొక అంశం.  అత్యున్న‌త నైపుణ్య సామ‌ర్థ్యాన్ని ఆక‌ట్టుకోవ‌డం, రెండు దేశాల ప‌రిశ్ర‌మ‌ లు, సంస్థ‌ ల మ‌ధ్య సంయుక్త స‌హ‌కారం నెల‌కొల్ప‌డం కూడా ఇందు లో భాగంగా ఉంటాయి.  తద్వారా సామాజిక ప్రయోజనాల ను ప్రోత్సహించే దిశ గా భారతదేశం లో అమలవుతున్న ‘డిజిటల్ ఇండియా, స్టార్ట్- అప్ ఇండియా, స్మార్ట్ సిటీ’ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, జపాన్ అమలు చేస్తున్న ‘సొసైటీ 5.0’ కార్యక్రమం మధ్య సమన్వయం ఏర్పడుతుంది.  జపాన్ భాగస్వాముల భాగస్వామ్యం తో భారతదేశం లోని స్టార్ట్- అప్ సంస్థల్లో పెట్టుబడుల సమీకరణ ను ప్రోత్సహించాలని, మద్దతివ్వాలని రెండు పక్షాలూ నిర్ణయించాయి. 

10.   రెండు దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుదల సవాళ్ల ను ఎదుర్కొనడం సహా ప్రజల కు అందుబాటు లో ఉండే ఆరోగ్య సంరక్షణ దిశ గా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.  ఆ మేరకు జపాన్ అమలు చేస్తున్న ‘ఆసియా హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇనిషియేటివ్’ (ఎహెచ్ డబ్ల్యు ఐఎన్), భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ వంటి పథకాల జోడింపు యోచన పై నాయకులు ఇరువురూ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి ని అందుబాటులోకి తేవడమే గాక పరస్పర ప్రయోజన లక్షిత ప్రతిస్పందనాత్మక పద్ధతుల ద్వారా ఆరోగ్య సంరక్షణ లో ఉత్తమ విధానాల ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.  అలాగే సంపూర్ణ ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణను ఇవ్వగల యోగాభ్యాసం తో కూడిన ఆయుర్వేద వైద్య విధానం సహా సంప్రదాయ వైద్య రంగం లో సమాచార ఆదాన ప్రదానం తో పాటు సహకారం పెంపొందే దిశ గా కృషి చేసేందుకు అంగీకరించారు.
 
11.   వ్యవసాయం, ఆహార తయారీ, అటవీ రంగాల్లో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వాముల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకుపోవడం లో పురోగతి పై నాయకులు ఇరువురూ హర్షాన్ని ప్రకటించారు.  దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు పంటకు ముందు, పంట చేతికి అందిన తరువాత ఎదురయ్యే నష్టాల ను తగ్గించే వీలు ఉంటుంది.
 
12.   భార‌త‌దేశం- జ‌పాన్ భాగస్వామ్యం లో ప్రజల మధ్య ఆదాన ప్రదానాలకు గల కీలక పాత్ర ను నాయకులు ఇరువురూ పునరుద్ఘాటించారు.  తదనుగుణంగా ‘ఇండో-పసిఫిక్ వేదిక’సహా సాంస్కృతిక, విద్య, పార్లమెంటరీ, విజ్ఞానాత్మక, ట్రాక్ 1.5 సంబంధాలలో వృద్ధి పై సంతృప్తి ని వ్యక్తం చేశారు.  పర్యాటక రంగం లో పూర్తి సామర్థ్యాన్ని ఇంకా అందిపుచ్చుకోలేదన్న వాస్తవాన్ని కూడా వారు గుర్తించారు.  ఈ దిశగా రెండు వైపుల నుండీ పర్యాటక ప్రవాహం పెంచడం పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.  దీనికి తగినట్లుగా వీసా నిబంధనలను, పర్యాటక రంగ ప్రచారాన్ని మరింత సౌలభ్యం చేయాలని నిర్ణయించారు.  ఉన్నత విద్య లో భారతదేశం-జపాన్ భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించాలని ఇద్దరు నాయకులూ అభిప్రాయపడ్డారు.  అంతేకాకుండా మహిళా సాధికారిత, విద్య, యువ-క్రీడా రంగ ఆదాన ప్రదానాలకు గల ప్రాముఖ్యాన్నీ చర్చించారు.  ఇందులో భాగంగా భారతదేశం లో సంయుక్తంగా ప్రారంభించే ‘జాపనీస్ లాంగ్వేజ్ టీచర్స్’ ట్రయినింగ్ సెంటర్ రెండు దేశాల ప్రజల మధ్య వారధి ని నిర్మించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.  మరోవైపు భారతదేశం లోని రాష్ట్రాలు, జ‌పాన్‌ లోని స్థానిక పాలన మండళ్ల మధ్య సంబంధాలు స్థిరంగా విస్తరించవలసిన అవసరాన్ని నాయకులు ఇరువురూ నొక్కిచెప్పారు.

శాంతి కోసం భాగ‌స్వామ్యం
 
13.  భద్రత సహకారంపై 2008 నాటి భారతదేశం- జపాన్ సంయుక్త ప్రకటన మీద సంతకాల తరువాత గడచిన దశాబ్దంలో ఈ దిశగా సాధించిన అద్భుత ప్రగతిని ఉభయ ప్రధానులూ సమీక్షించి సంతృప్తి ని వ్యక్తం చేశారు.  ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని గాఢతరం చేయాలన్న ఆకాంక్ష ను పునరుద్ఘాటిస్తూ- ఇందుకోసం ప్రస్తుత యంత్రాంగాల కు అదనం గా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖల స్థాయి లో ఇద్దరేసి ప్రతినిధుల స్థాయి చర్చ ల విధానం ప్రారంభించాలని నిర్ణయించారు.  రక్షణ మంత్రిత్వ స్థాయి వార్షిక చర్చలు సహా రక్షణ విధాన చర్చలు, జాతీయ భద్రత సలహాదారు స్థాయి చర్చలు, ప్రతి సేవా విభాగం లోని సిబ్బంది స్థాయి చర్చలు కూడా ఇందులో భాగంగా ఉండాలని ఆకాంక్షించారు.  రెండు దేశాల త్రివిధ దళాల స్థాయి లో సంయుక్త విన్యాసాలను నాయకులు ఇరువురూ స్వాగతించారు.  అలాగే రక్షణ కొనుగోళ్లు-పరస్పర సేవా ప్రదాన ఒప్పందం (ఎసిఎస్ఎ)పై చర్చల ప్రారంభానికి సమ్మతించారు.  దీనివల్ల ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారం వ్యూహాత్మక లోతులకు చేరగలవని అభిప్రాయపడ్డారు.
 
14.  సముద్ర భద్రత సహకారం లో గణనీయ ప్రగతి పై నాయకులు ఇరువురూ సంతోషం ప్రకటించారు.  ద్వైపాక్షిక నావికాదళ ముమ్మర కసరత్తులు, మలబార్ విన్యాసాల లోతైన స్థాయి సహా తీర రక్షక దళాల మధ్య చిరకాల శిక్షణ-చర్చల వ్యవస్థ ను ఇందుకు నిదర్శనం గా పేర్కొన్నారు.  సముద్ర రంగ అవగాహన (ఎం డిఎ)పై మెరుగైన ఆదాన ప్రదానాల విస్తరణ ఇండో-పసిఫిక్ ప్రాంతం లో ప్రాంతీయ శాంతి కి, సుస్థిరత కు దోహదపడుతుందని నాయకులు ఇరువురూ గుర్తించారు. తదనుగుణంగా భారత నావికాదళం, జపాన్ సముద్ర స్వీయరక్షణ బలగాల (జెఎంఎస్ డిఎఫ్) మధ్య సహకార అమలు ఒప్పందం కుదరడం పై వారు హర్షాన్ని వ్యక్తం చేశారు.
 
15.  రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం పై భార‌త‌దేశం, జ‌పాన్‌ ల మ‌ధ్య స‌హ‌కారానికి విస్తృత ప‌రిధి, అవ‌కాశాలు ఉన్నాయి.  ఆ మేర‌కు సాంకేతిక సామ‌ర్థ్యం, పారిశ్రామిక మౌలిక వ‌స‌తుల ను ప్ర‌భుత్వ‌-ప్రైవేటు రంగాల సంయుక్త కృషి తో మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌చ్చు.  ఈ దిశ‌గా భార‌త‌దేశం- జ‌పాన్ ర‌క్ష‌ణ‌ రంగ ప‌రిశ్ర‌మ‌లు, సంబంధిత సంస్థ‌ ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర సంబంధాల‌ ను ప్రోత్స‌హిస్తామ‌ని ఇద్ద‌రు నాయ‌కులూ పునరుద్ఘాటించారు.  అలాగే మాన‌వ‌ ర‌హిత క్షేత్ర‌ స్థాయి వాహ‌నం (యుజివి), రోబోటిక్స్‌పై స‌హ‌కారాత్మ‌క ప‌రిశోధ‌న కు శ్రీ‌కారం పై హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.  జ‌పాన్‌ లో రూపొందుతున్న ఉభ‌య‌చ‌ర యుఎస్-2 విమానం అభివృద్ధి పై స‌హ‌కారాత్మ‌క కృషి ని కొన‌సాగించాల‌ని ఉభ‌య‌ ప‌క్షాలూ నిర్ణ‌యించాయి.
 
16.  అంత‌రిక్ష కార్య‌క‌లాపాల్లో దీర్ఘ‌కాలిక స్థిర‌త్వాన్ని ప్రోత్స‌హించడం పై త‌మ వచనబద్థత ను నాయకులు ఇరువురూ పున‌రుద్ఘాటించారు.  ఆ మేర‌కు అంత‌రిక్ష వ్య‌వ‌హారాల్లో ద్వైపాక్షిక స‌హ‌కార విస్త‌ర‌ణ‌ పై వార్షిక అంత‌రిక్ష చ‌ర్చా కార్య‌క్ర‌మం ప్రారంభించేందుకు నిర్ణ‌యించారు.  అలాగే చంద్ర ధ్రువ సంయుక్త అన్వేష‌ణ‌ కు సంబంధించి రెండు దేశాల ప‌రిశోధ‌న సంస్థ‌ ల మ‌ధ్య సాంకేతిక స‌హ‌కారం పై ఇద్ద‌రు నాయ‌కులూ హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.
 
17.  ఉత్త‌ర‌ కొరియా కు సంబంధించి అప‌రిష్కృత స‌మ‌స్య‌ల స‌మ‌గ్ర ప‌రిష్కారం దిశ‌ గా ముంద‌డుగు ప‌డింది.  ఇందులో భాగం గా సింగ‌పూర్‌ లో అమెరికా- ఉత్త‌ర‌ కొరియా శిఖ‌ర సమ్మేళనం జ‌రిగింది.  దీంతో పాటు ఉభ‌య కొరియా ల మ‌ధ్య ఈ ఏడాది జూన్‌ లో మూడు అంత‌ర్గ‌త శిఖ‌రాగ్ర స‌మావేశాలు ఏర్పాట‌య్యాయి.  కొరియా ద్వీప‌క‌ల్పం లో చోటు చేసుకున్న ఈ తాజా ప‌రిణామాల‌ పై నాయకులు ఇరువురూ హ‌ర్షాన్ని ప్ర‌క‌టించారు. ఐక్య‌ రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌త మండ‌లి తీర్మానాల‌ కు అనుగుణం గా సంపూర్ణ‌, త‌నిఖీ చేయ‌ద‌గిన‌, పునరుద్ధ‌ర‌ణ‌ కు వీలు లేని రీతి లో ఉత్త‌ర‌ కొరియా వ‌ద్ద‌ గ‌ల జ‌న‌హ‌న‌న ఆయుధాలు, ఖండాంత‌ర క్షిప‌ణుల విధ్వంసం ప్రాముఖ్యాన్ని వారు నొక్కిచెప్పారు.  అణ్వ‌స్త్ర వ్యాప్తి దిశ‌గా ఉత్త‌ర‌ కొరియా కు గ‌ల‌ సంబంధాల‌ పై ఆందోళ‌న‌ల‌ ప‌రిష్కార ప్రాముఖ్యాన్ని కూడా ప్రస్తావించారు.  ఈ అంశానికి సంబంధించి ఐక్య‌ రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌త మండ‌లి తీర్మానాల సంపూర్ణ అమ‌లు కు త‌మ వచనబద్థత ను పున‌రుద్ఘాటించారు.  మ‌రో వైపు అప‌హ‌ర‌ణ‌ ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ ను స‌త్వ‌రం ప‌రిష్క‌రించాల్సిందిగా ఉత్త‌ర కొరియా ను వారు కోరారు.
 
18.  అణ్వాయుధాల సంపూర్ణ నిర్మూల‌న‌ కు త‌మ వచనబద్ధత ను నాయకులు ఇరువురూ పున‌రుద్ఘాటించారు. అణ్వ‌స్త్ర వ్యాప్తి, అణు ఉగ్ర‌వాదం స‌వాళ్ల ప‌రిష్కారం లో అంత‌ర్జాతీయ స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసే బాధ్య‌త నిర్వ‌ర్తించేందుకు దృఢ సంక‌ల్పాన్ని ప్ర‌క‌టించారు.  స‌మ‌గ్ర అణుప‌రీక్షల నిషేధ ఒప్పందం (సిటిబిటి) కూట‌మి లో స‌త్వ‌ర భాగ‌స్వామ్య ప్రాముఖ్యాన్ని ప్ర‌ధాని శ్రీ ఆబే నొక్కిచెప్పారు.  షాన‌న్ తీర్మానానికి అనుగుణంగా ‘అణు విచ్ఛిత్తి ప‌దార్థాల నిషేధ ఒప్పందం’ (ఎఫ్ఎం సిటి) అమ‌లు పై అంత‌ర్జాతీయం గా స‌మ‌ర్థ త‌నిఖీ కి సంబంధించి విచ‌క్ష‌ణ‌ కు తావు లేని, బ‌హుపాక్షిక చ‌ర్చ‌ల‌ను త్వ‌ర‌గా ప్రారంభించి, ముగించాల‌ని నాయకులు ఇరువురూ పిలుపునిచ్చారు.  మూడు అంత‌ర్జాతీయ ఎగుమ‌తి నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌ ల‌లో భార‌తదేశం పూర్తి స‌భ్య‌త్వం పొందిన నేప‌థ్యం లో ప్ర‌పంచ అణ్వ‌స్త్ర వ్యాప్తి నిరోధం దిశ‌ గా కృషి ని బ‌లోపేతం చేయ‌డం ల‌క్ష్యంగా అణు స‌ర‌ఫ‌రా కూట‌మి (ఎన్ఎస్ జి)లో భార‌తదేశం స‌భ్య‌త్వం కోసం క‌ల‌సిక‌ట్టుగా ముందుకు సాగుతామ‌ని నాయకులు ఇరువురూ ప్ర‌తిన‌బూనారు.
 
19.  విశ్వ‌వ్యాప్త‌మ‌వుతున్న ఉగ్ర‌వాదం, నానాటికీ పెరుగుతున్న ఈ ముప్పు ను ప్ర‌ధానులు ఇరువురూ తీవ్ర ప‌ద‌జాలం తో ఖండించారు.  ఉగ్ర‌వాద స్వ‌ర్గ‌ధామాలతో పాటు మౌలిక వ‌స‌తుల‌ నిర్మూల‌న‌, ఇంకా ఉగ్ర‌వాద స‌మాచార సంబంధాల, ఆర్థిక తోడ్పాటు మార్గాల‌ విచ్ఛిన్నం, ఉగ్ర‌వాద‌ సీమాంత‌ర సంచార నిరోధం దిశ‌ గా ప్ర‌పంచ‌ దేశాల‌న్నీ స‌మ‌ష్టిగా కృషి చేయాల‌ని వారు పిలుపునిచ్చారు.  త‌మ భూభాగం నుండి పొరుగు దేశాల‌ పై ఉగ్ర‌దాడుల‌కు ఏ రూపంలోనూ అవ‌కాశం లేకుండా సంక‌ల్పం పూనాల్సిన అవ‌స‌రాన్ని ప్రస్తావించారు.  ఉగ్ర‌వాదం, హింసాత్మ‌క తీవ్ర‌వాదాల‌ పై పోరు లో భాగం గా స‌మాచారం అంద‌జేత‌, నిఘా ప‌రంగా బ‌ల‌మైన అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యం ఏర్ప‌డాల్సిన అవ‌స‌రాన్ని నొక్కిచెప్పారు.  ముంబయి లో 2008 నవంబ‌రులో, ప‌ఠాన్‌కోట్‌ లో 2016 జ‌న‌వ‌రి లో ఉగ్ర‌వాదుల దాడుల‌కు సూత్ర‌ధారుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని వారు పాకిస్థాన్ ప్ర‌భుత్వాని కి సూచించారు.  అల్‌-ఖైదా, ఐఎస్‌, జైషే మొహ‌మ్మ‌ద్‌, ల‌ష్క‌రే తాయిబా ఉగ్ర‌వాద సంస్థ‌లు, వాటి అనుబంధ మూక‌ ల‌పై పోరాటం లో స‌హ‌కారాన్ని మ‌రింత విస్తృతం చేసుకోవాల‌ని వారు నిర్ణ‌యించారు.
 
20.  ఐక్య‌ రాజ్య స‌మితిలో స‌త్వ‌ర‌, అర్థ‌వంత‌మైన సంస్క‌ర‌ణ‌లు తేవాల‌ని, ప్ర‌త్యేకించి ఐరాస భ‌ద్ర‌త మండ‌లి (యుఎన్ఎస్ సి) స‌మ‌గ్ర సంస్క‌ర‌ణ అవ‌స‌ర‌మ‌ని భార‌తదేశం- జ‌పాన్ స్ప‌ష్టం చేశాయి.  త‌ద్వారా 21వ శ‌తాబ్ద‌పు స‌మ‌కాలీన వాస్త‌వాల‌ను ప‌రిగ‌ణ‌న‌ లోకి తీసుకుంటూ వాటికి స‌హేతుక‌, స‌మ‌ర్థ ప్రాతినిధ్యం వ‌హించేలా రూపొందించ‌డం సాధ్య‌మ‌ని పేర్కొన్నాయి.  ఈ దిశ‌గా రాబోయే ఐక్య‌ రాజ్య‌ స‌మితి 73వ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం లో అంత‌ర‌ ప్ర‌భుత్వ చ‌ర్చ‌ల సంద‌ర్భం గా లిఖిత‌పూర్వ‌క సంభాష‌ణ‌ల‌ను ప్రారంభించ‌డంస‌హా ఈ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌న్న దృఢ నిశ్చ‌యాన్ని ప్ర‌క‌టించాయి.  దీనికి సంబంధించి సంస్క‌ర‌ణాభిలాష‌ గ‌ల దేశాల మ‌ధ్య అంత‌ర్జాతీయ స‌హ‌కారం ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పాయి.  ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌త మండ‌లి విస్త‌రణ సంద‌ర్భం గా అందులో శాశ్వ‌త స‌భ్య‌త్వానికి భార‌తదేశం, జపాన్‌ల‌కు స‌హేతుక అభ్య‌ర్థులు కాగ‌ల అర్హ‌త‌ల‌న్నీ ఉన్నాయ‌ని పేర్కొన్నాయి.  త‌ద‌నుగుణంగా ఈ విష‌యంలో ప‌ర‌స్ప‌ర అభ్య‌ర్థిత్వానికి ఉమ్మ‌డి గుర్తింపు ప్రాతిప‌దిక‌ న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించుకుంటామ‌ని వివ‌రించాయి.

అంతర్జాతీయ కార్యాచరణ కోసం భాగ‌స్వామ్యం

 
21.  సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల సాధన దిశ‌ గా స‌హ‌కారానికి పెరుగుతున్న ప్రాముఖ్యాన్ని ఇరువురు ప్ర‌ధానులూ నొక్కిచెప్పారు.  ఆ మేర‌కు కాలుష్య నియంత్ర‌ణ‌, సుస్థిర జీవ‌ వైవిధ్య నిర్వ‌హ‌ణ‌, ర‌సాయ‌న‌- ఇత‌ర వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ మార్పు, వ్య‌ర్థ‌ జ‌ల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర రంగాల్లో ప‌ర్యావ‌ర‌ణ‌ప‌ర‌మైన భాగ‌స్వామ్యం బ‌లోపేతానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు.  ఇందుకోసం రెండు దేశాల్లోని సంబంధిత సంస్థ‌ల మ‌ధ్య‌ గ‌ల స‌హ‌కార చ‌ట్రాన్ని వినియోగించుకుంటామ‌ని తెలిపారు.  వాతావ‌ర‌ణ మార్పుపై ఐక్య‌ రాజ్య‌ స‌మితి తీర్మాన చ‌ట్రం ప‌రిధిలో పారిస్ ఒప్పందానికి అనుగుణం గా జలవాయు పరివర్తన స‌వాలు ను ఎదుర్కొనేందుకు స‌మ‌ష్టి అంత‌ర్జాతీయ కార్యాచర‌ణ అవ‌సరాన్ని నొక్కిచెబుతూ- దీనికి సంబంధించి త‌మ ఉమ్మ‌డి నాయ‌క‌త్వ పాత్ర‌ ను పోషించాల‌ని నిర్ణ‌యించారు.  పారిస్ ఒప్పందం అమ‌లు కోసం కార్యాచ‌ర‌ణ ను ఖ‌రారు చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని, ఈ దిశ‌ గా సంయుక్త మూల్యాంక‌న యంత్రాంగం ఏర్పాటు పై సంప్ర‌దింపుల‌ను మ‌రింత వేగ‌వంతం చేస్తామ‌ని పున‌రుద్ఘాటించారు.
 
22.  అణు, పున‌రుత్పాద‌క మార్గాలు స‌హా స్థిర‌మైన‌, ప‌రిశుభ్ర ఇంధ‌నాల ఆవిష్క‌ర‌ణ‌ లో స‌హ‌కారా బ‌లోపేతానికి ఇద్ద‌రు నాయ‌కులూ వారి వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.  ఇందులో భాగం గా హైడ్రోజ‌న్ ఆధారిత ఇంధ‌నం, ప‌రిశుభ్ర బొగ్గు సాంకేతిక‌త‌, పెట్రో-స‌హ‌జవాయు ప్రాజెక్టులు, ద్ర‌వీకృత స‌హ‌జ‌వాయు స‌ర‌ఫ‌రా శృంఖలాల వినియోగం త‌దిత‌రాల‌పై అవ‌కాశాల‌ను అన్వేషిస్తామ‌న్నారు.  దీనికి అనుగుణంగా ‘‘జపాన్‌-భార‌తదేశం శక్తి ప‌రివ‌ర్త‌న స‌హ‌కార ప్ర‌ణాళిక‌’’పై హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.  ఇంధ‌న సామ‌ర్థ్యం పెంపు, పొదుపు, నిల్వ‌తోపాటు ఉభ‌య‌తార‌క‌, విద్యుత్తు వాహ‌నాల త‌యారీ స‌హా ప‌ర్యావ‌ర‌ణ హిత ప్ర‌యాణ‌ స‌దుపాయాల రూప‌క‌ల్ప‌న‌ కు భార‌తదేశం-జ‌పాన్ సంయుక్త కృషి ని మ‌రింత ముందుకు తీసుకుపోతామ‌ని ప్ర‌క‌టించారు.  పౌర ప్రయోజనాలకు అణు స‌హ‌కారం పై భార‌త‌దేశం- జ‌పాన్ సంప్ర‌దింపుల పురోగ‌తి పై నాయకులు ఇరువురూ హ‌ర్షాన్ని వ్య‌క్తం చేస్తూ ఈ చ‌ర్చ‌ ల‌ను కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. అంత‌ర్జాతీయ సౌర కూట‌మి లో చేరేందుకు జ‌పాన్ నిర్ణ‌యించుకోవ‌డాన్ని భార‌తదేశం హ‌ర్షించింది.  త‌ద్వారా సౌర‌ శ‌క్తి ని స్థిర‌మైన‌, ప‌రిశుభ్ర‌, అందుబాటు ఇంధ‌నంగా వినియోగించ‌డాన్ని ప్రోత్స‌హించే దిశ‌ గా అంత‌ర్జాతీయ కృషి ని బ‌లోపేతం చేయ‌గ‌ల‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది.
 
23.   ద్వైపాక్షికంగా, బ‌హుళ పాక్షికంగా వివిధ వేదిక‌ ల‌లో స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ ద్వారా విప‌త్తుల ముప్పు త‌గ్గింపు దిశ‌ గా స‌హ‌కార పురోగతి పై ఇద్ద‌రు నాయ‌కులూ స‌మీక్షించి సంతృప్తి ని వ్య‌క్తం చేశారు.  ముప్పుల త‌గ్గింపు పై సెండై చ‌ట్రం 2015-30 స‌మ‌ర్థ అమ‌లుకు గ‌ల ప్రాధాన్యాన్ని వారు ప్ర‌స్ఫుటం చేశారు.  ముంద‌స్తు హెచ్చ‌రిక‌ల యంత్రాంగం, జ‌ల వ‌న‌రుల నిర్వ‌హ‌ణ‌, అంత‌రిక్ష ఆధారిత సాంకేతిక ప‌రిజ్ఞాన వినియోగం, విప‌త్తు నిరోధ‌క మౌలిక స‌దుపాయాల వంటి రంగాల్లో ఈ చ‌ట్రాన్ని అమ‌లు చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు.
 
24.  నియ‌మావ‌ళి ఆధారిత బ‌హుపాక్షిక వాణిజ్య వ్య‌వ‌స్థకు గ‌ల‌ కీల‌క పాత్ర‌ ను ఇరువురు నాయ‌కులూ నొక్కిచెప్పారు.  ఆ మేర‌కు ప్ర‌పంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు టిఒ) కొత్త శ‌క్తి తో విధి నిర్వ‌హ‌ణ‌కు దిగేలా అత్య‌వ‌స‌రంగా దాన్ని సంస్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. త‌ద్వారా డబ్ల్యు టిఒ స్వేచ్ఛాయుత‌, నిష్పాక్షిక‌, సార్వ‌త్రిక వాణిజ్య విధులు నిర్వ‌ర్తిస్తూ సుస్థిర వృద్ధిని, ప్ర‌గ‌తిని సాధించ‌గ‌ల‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రక్ష‌ణాత్మ‌క ధోర‌ణి, అనుచిత వాణిజ్య ప‌ద్ధ‌తుల నిరోధానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.  అలాగే వాణిజ్య విచ్ఛిన్న చ‌ర్య‌ల‌ను తొల‌గించాల్సిన అవ‌సరాన్ని నొక్కిచెప్పారు.  అత్యున్న‌త నాణ్య‌త‌, స‌మ‌గ్ర‌-స‌మ‌తూక ప్రాంతీయ స‌మ‌గ్ర ఆర్థిక భాగ‌స్వామ్యం (ఆర్ సిఇపి) కోసం వీలైనంత త్వ‌ర‌గా సంప్ర‌దింపులను ప్రారంభించి ఖ‌రారు చేసేందుకు గ‌ల వ్యూహాత్మ‌క‌ ప్రాముఖ్యాన్ని వారు పున‌రుద్ఘాటించారు. స్వేచ్ఛాయుత‌, నిష్పాక్షిక ఇండో- ప‌సిఫిక్ ప్రాంతం యొక్క పూర్తి ప్ర‌యోజ‌నాల సాధ‌న‌ కు ఇది ఎంతో అవ‌స‌ర‌మ‌ని నొక్కిచెప్పారు.
 
25.  ప్రాంతీయ‌, బ‌హుపాక్షిక వేదిక‌ల‌ లోని వ్య‌వ‌స్థ మ‌ధ్య సంప్ర‌దింపులు, స‌మ‌న్వ‌యం పెంపునకు గ‌ల ప్రాముఖ్యాన్ని ఇరువురు ప్ర‌ధానులూ నొక్కిచెప్పారు.  స‌మ‌కాలీన అవ‌స‌రాలు, స‌వాళ్ల స‌మ‌ర్థ ప‌రిష్కారానికి త‌మంత‌ట‌ తాముగా క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు.  ఈ దిశ‌ గా సుస్థిర వృద్ధి-ప్ర‌గ‌తి, ఆర్థిక స్థిర‌త్వం, ఆహార‌-జ‌ల భ‌ద్ర‌త‌, ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌, విప‌త్తుల ఉప‌శ‌మనం, ఉగ్ర‌వాదంపై పోరు, సైబ‌ర్ సెక్యూరిటీ, స్వచ్ఛ శక్తి, శాస్త్ర-సాంకేతిక అభివృద్ధి త‌దిత‌రాల‌ను ప్రోత్స‌హిస్తామ‌ని తెలిపారు.  ఇటీవ‌లి సంవ‌త్స‌రాల్లో రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు గొప్ప వాస్త‌వ‌, ప్ర‌యోజనాత్మ‌క‌త‌ ను సంత‌రించుకున్నాయ‌ని ప్ర‌ధానులు ఇరువురూ పున‌రుద్ఘాటించారు.  భార‌త‌దేశం, జ‌పాన్ ల ప్ర‌త్యేక వ్యూహాత్మ‌క‌, అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యం నేడు మ‌రింత ప‌రిణ‌తి చెందింద‌ని ప‌ర‌స్ప‌ర న‌మ్మ‌కం, లోతైన విశ్వాసం తో ప్ర‌క‌టించారు.  రెండు దేశాల భ‌విష్య‌త్తు దృష్ట్యా దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంద‌ని, ప్ర‌పంచం లో ఇండో ప‌సిఫిక్ ప్రాంతాన్ని మ‌రింత సుర‌క్షిత‌మైన, శాంతియుత‌మైన, సౌభాగ్యవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్ద‌డం లో తాము సంయుక్తంగా కృషి చేస్తుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. 

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
జమ్మూ కశ్మీర్ లోని నౌషేరాలో దీపావళి సందర్భంగా భారత సాయుధ బలగాల సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

జమ్మూ కశ్మీర్ లోని నౌషేరాలో దీపావళి సందర్భంగా భారత సాయుధ బలగాల సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం
Indian economy shows strong signs of recovery, upswing in 19 of 22 eco indicators

Media Coverage

Indian economy shows strong signs of recovery, upswing in 19 of 22 eco indicators
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 7th December 2021
December 07, 2021
షేర్ చేయండి
 
Comments

India appreciates Modi Govt’s push towards green growth.

People of India show immense trust in the Govt. as the economic reforms bear fruits.