ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) ధారావాహిక కార్యక్రమం లో భాగం గా ఈ రోజు న చేసిన తాజా ప్రసంగం లో, దేశ యువత ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఆవిష్కరణ ల సవాలు లో ఉత్సాహం తో పాల్గొన్నట్లు చెప్పారు. ఇందులో మూడింట రెండు వంతుల ఎంట్రీ లు ద్వితీయ శ్రేణి నగరాల కు, తృతీయ శ్రేణి నగరాల కు చెందిన యువత నుండి వచ్చినవే అని ఆయన అన్నారు. వివిధ కేటగరీ ల లో సుమారు రెండు డజన్ల యాప్‌ల కు పురస్కారాల ను ప్రకటించారని ఆయన చెప్పారు. ఈ యాప్ ల ఉపయోగం పై, ఈ యాప్ ల వాడుక పై అవగాహన ను పెంచుకొని, వాటి తో అనుసంధానం కావలసింది గా శ్రోతల ను ప్రధాన మంత్రి కోరారు.
వీటి లో పలు యాప్ లను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘కుటుకి కిడ్స్ లర్నింగ్ యాప్’ అనేది వాటి లో ఒకటి. ఇది పిల్లల కు పనికి వచ్చే ఒక ఇంటరాక్టివ్ యాప్. మరో యాప్ ‘కూ – కూ కూ’. ఇది మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫార్మ్. ‘చింగారి’ యాప్ ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇది యువత లో మరింత గా ప్రజాదరణ కు పాత్రమవుతున్నది. ‘ఆస్క్ సర్కార్’ యాప్ అనేది ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన వివరాలను అయినా అందజేస్తుంది. అలాగే ‘స్టెప్ సెట్ గో’ అనేది ఒక ఫిట్ నెస్ యాప్.
ఇవాళ ఒక చిన్న స్టార్ట్- అప్ గా ప్రారంభమైన ప్రస్థానం రేపటి రోజు న ఒక పెద్ద కంపెనీ గా మారవచ్చని ప్రధాన మంత్రి అన్నారు. ఇవి ప్రపంచం లో భారతీయ గుర్తింపు గా నిలబడనున్నాయన్నారు. ప్రస్తుతం ప్రపంచం లో పెద్ద కంపెనీలు గా ఉన్నవి ఒకప్పుడు స్టార్టప్‌లే అనే సంగతి ని మరచిపోకూడదు అని ప్రధాన మంత్రి అన్నారు.


