భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో 2026 జూన్ 10ని ఒక చరిత్రాత్మక మైలురాయిగా అభివర్ణిస్తూ కేంద్ర క్యాబినెట్ ఈ రోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నిరంతరాయంగా అత్యధిక కాలంపాటు దేశానికి సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీని ఈ సందర్భంగా కేబినెట్ అభినందించింది. ఎన్నికైన ప్రధానమంత్రిగా వరుసగా 4,399 రోజుల పాటు బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఆయన సరికొత్త రికార్డును నెలకొల్పారు. 1952 నుంచి 1964 వరకు వరుసగా 4,398 రోజుల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న గత రికార్డును ఆయన అధిగమించారు. దేశమే ప్రథమమన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న నాయకుడికి ప్రజలు అందించిన అపూర్వమైన మద్దతుకు ఈ ఘట్టం అద్దం పడుతోందని, భారత ప్రజాస్వామ్య చేతనకు, ప్రజా విశ్వాసానికి, ప్రజా భాగస్వామ్య శక్తికి ఇది ప్రతీక అని ఈ తీర్మానంలో కేబినెట్ పేర్కొన్నది.

ప్రధానమంత్రికి హృదయపూర్వక అభినందనలనూ, శుభాకాంక్షలనూ తెలియజేస్తూ సాగిన ఈ తీర్మానంలో.. ఆయన నాయకత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలోనే, శ్రీ మోదీ ఈ ఘనతను దక్కించుకోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అంతేకాకుండా ప్రభుత్వాధినేతగా వరుసగా 25 ఏళ్ల పాటు సేవలందించిన చరిత్రాత్మక మైలురాయికీ ప్రధానమంత్రి చేరువవుతున్నారని కూడా ఇందులో పేర్కొన్నారు. సున్నితత్వం, సంయమనం, సంకల్పం, నిశ్చయాత్మక ధోరణి వంటి లక్షణాలతో పరిపూర్ణమైన ఆయన నాయకత్వం పట్ల గర్విస్తున్నట్లు ఈ అధికారిక పాఠంలో కేబినెట్ వ్యాఖ్యానించింది. ఆరు దశాబ్దాల తర్వాత ఎన్‌డీఏ ప్రభుత్వానికి దేశం వరుసగా మూడోసారి అధికారాన్ని కట్టబెట్టిందని కేబినెట్ పేర్కొన్నది.

నిరంతర సేవా నిరతికి, దేశ నిర్మాణానికి ప్రధానమంత్రి జీవితం నిదర్శనమని ఈ అధికారిక పాఠం పేర్కొన్నది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ను మంత్రప్రదంగా భావిస్తూ, దానికి కట్టుబడి ఉన్న ‘ప్రధాన సేవకుడిని’ అని 2014లో శ్రీ మోదీ చేసిన ప్రకటనను గుర్తుచేసింది. నిరుపేదల సంక్షేమానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చిందని స్పష్టం చేసింది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కోట్లాది మందికి పక్కా గృహాలు, విద్యుత్, రక్షిత మంచినీరు, నేరుగా నగదు బదిలీ వంటి వసతులను కల్పించిన వివరాలను ఈ పత్రంలో పొందుపరిచారు. అలాగే 80 కోట్లకు పైగా పౌరులకు ఉచిత రేషన్‌ను అందించడంతోపాటు 60 కోట్లకు పైగా నిరుపేదలకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించినట్లు కేబినెట్ పేర్కొన్నది. ఈ చర్యలన్నీ దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా.. 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికాన్ని జయించడానికి దోహదపడ్డాయని ఈ తీర్మానం స్పష్టం చేసింది.

సమాజంలోని కీలక వర్గాల సాధికారతనూ ఈ తీర్మానం ఆవిష్కరించింది. యువశక్తిపై ప్రధానంగా దృష్టి సారించడం వల్ల.. ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ నిలిచిందని, అలాగే మిషన్ చంద్రయాన్ వైజ్ఞానిక శక్తిగా ఎదిగిందని వ్యాఖ్యానించింది. పొగ లేని వంటశాలలు, లాఖ్‌పతీ దీదీ పథకం నుంచి చరిత్రలో నిలిచిపోయేలా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం వరకు... ఈ సమగ్ర విధానాల ద్వారా మహిళా నేతృత్వంలో అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించినట్టు కేబినెట్ వివరించింది. వికసిత్ భారత్‌కు కీలక ఆధారంగా రైతాంగాన్ని పేర్కొంటూ.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పశుపోషకులకూ మత్స్యకారులకూ కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలను ఈ అధికారిక పత్రంలో కేబినెట్ అభినందించింది. ఈ చర్యలన్నింటి వల్లే వ్యవసాయ ఎగుమతులు రూ. 5 లక్షల కోట్ల మార్కును దాటడానికి వీలైందని స్పష్టం చేసింది.

దశాబ్దాలుగా నిలిచిపోయి ఉన్న సంస్కరణల అమలులో కనబరిచిన ‘దేశమే ప్రథమం’ అన్న నిశ్చయాత్మక స్ఫూర్తిని ఈ తీర్మానం ప్రశంసించింది. అధికరణ - 370 రద్దు, జీఎస్‌టీ, ఓఆర్ఓపీల అమలు, సీఏఏ చట్టం, భారతీయ న్యాయ సంహిత, కార్మిక చట్టాల క్రోడీకరణ వంటి చరిత్రాత్మక నిర్ణయాలను అభినందించింది. సర్జికల్, సరిహద్దులను దాటి చేసిన వైమానిక దాడులు, ‘ఆపరేషన్ సిందూర్’, న్యాయబద్ధం కాని సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు వంటి కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చర్యల ద్వారా.. దేశ భద్రతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన తీరును ఈ పత్రం బలంగా ప్రస్తావించింది. వీటితోపాటు నక్సలిజం నిర్మూలనలోనూ సాధించిన ప్రశంసనీయమైన పురోగతిని, ఈశాన్య రాష్ట్రాల్లో శాశ్వత శాంతి ఒప్పందాలను, బంగ్లాదేశ్‌తో సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొనడాన్ని కూడా ఈ తీర్మానం ప్రముఖంగా ప్రస్తావించింది.

‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలు ఇచ్చిన ఊతంతోనే.. రక్షణ రంగం నుంచి కృత్రిమ మేధ వరకు వివిధ రంగాల్లో భారత్ ఉత్పాదక సామర్థ్యాలు ఎంతగానో వృద్ధి చెందాయని ఈ తీర్మానం పేర్కొన్నది. అదే సమయంలో.. అత్యంత విజయవంతంగా నిర్వహించిన జీ-20 అధ్యక్ష పాత్ర, అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ సౌర కూటమి, మిషన్ లైఫ్ వంటి వినూత్న కార్యక్రమాలతో అంతర్జాతీయ వేదికపై భారత్ పాత్ర మరింత బలోపేతమైందని ఈ తీర్మానం వివరించింది. అభివృద్ధినీ, వారసత్వాన్నీ (‘వికాస్’, ‘విరాసత్’) సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం ద్వారా.. నూతన పార్లమెంట్ భవనం, కర్తవ్య పథ్ వంటి నిర్మాణాలు సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకలుగా నిలిచాయని వ్యాఖ్యానించింది. కరోనా విపత్తు వంటి అంతర్జాతీయ సంక్షోభాలనూ విజయవంతంగా అధిగమించడంలో ఈ ప్రజా భాగస్వామ్య స్ఫూర్తే ప్రధాన చోదక శక్తిగా నిలిచిందని ఈ తీర్మానంలో కేబినెట్ స్పష్టం చేసింది.

రాజకీయ స్థిరత్వం, క్రియాశీల పరిపాలన, గత పన్నెండేళ్లలో చేపట్టిన దూరదృష్టితో కూడిన విధానాలు – ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలిపాయని పేర్కొంటూ, కింది తీర్మానాలను అధికారికంగా ఆమోదించడం ద్వారా.. కేంద్ర మంత్రివర్గం కృతజ్ఞతలను తెలపడంతోపాటు భవిష్యత్ సంకల్పాన్ని వెల్లడించింది. –

కేంద్ర కేబినెట్ ఆమోదించిన అధికారిక తీర్మానాలు:

ఈ చరిత్రాత్మక విజయం సాధించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసింది.

పేదల సంక్షేమం, అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన నేతృత్వంలో చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపింది.

గౌరవ ప్రధానమంత్రి నేతృత్వంలో దేశంలోని 25 కోట్లకు పైగా పేద ప్రజలు పేదరికాన్ని జయించడానికి వీలు కల్పించిన ఆయన విధానాలను అభినందించింది.

దేశసేవలో ఆయన చూపిన విశేషమైన అంకితభావం, అవిశ్రాంత కృషికి కృతజ్ఞతలు తెలిపింది.

సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం దిశగా ఆయన కృషిని అభినందించింది.

దేశ భద్రతను బలోపేతం చేయడంలో, దేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో ఆయన నాయకత్వాన్ని ప్రశంసించింది.

‘వికసిత్ భారత్’ నిర్మాణం దిశగా దూరదృష్టితో కూడిన ఆయన సంకల్పానికి, నాయకత్వానికి పూర్తి మద్దతును తెలిపింది.

ప్రధానమంత్రికి ఆయురారోగ్యాలు చేకూరాలని కోరుతూ శుభాకాంక్షలు చెబుతూ.. కేబినెట్ ఆమోదించిన ఈ తీర్మానం ముగిసింది. శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో స్వయంసమృద్ధ, సురక్షిత, సుసంపన్న, వైభవోపేతమైన దేశంగా భారత్ ఎప్పటికప్పుడు నూతన శిఖరాలను అధిరోహిస్తుందనీ.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే దిశగా బలమైన బాటలు వేస్తుందని బలమైన విశ్వాసాన్ని ఈ తీర్మానం వ్యక్తం చేస్తోంది.  

క్యాబినెట్ తీర్మానం (తెలుగులో) చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాబినెట్ తీర్మానం (ఆంగ్లంలో) చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's $13 billion semiconductor mission: Boosting domestic chip manufacturing and design

Media Coverage

India's $13 billion semiconductor mission: Boosting domestic chip manufacturing and design
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 సెప్టెంబర్ 2026
September 08, 2026

Viksit Bharat, Many Engines: Defence, Diplomacy, Growth & Green Power Under PM Modi