రైలు మార్గ సామర్థ్యాన్ని పెంచడం కోసం, భారతీయ రైల్వేల్లో రెండు బహుళ ట్రాకుల ప్రాజెక్టుల అమలుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సీసీఈఏ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ ప్రాజెక్టులలో :
1. రత్లమ్- నాగ్డా మూడో, నాలుగో లైన్లతో పాటు
2. వార్థా- బలార్షా నాలుగో లైను కూడా ఉంది.
ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ. 3,399 కోట్లు. వీటిని 2029-30 లోపు పూర్తి చేయనున్నారు.
బహుళ విధ సంధానానికి దన్నుగా నిలుస్తున్న పీఎమ్- గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లానుతో ఈ ప్రాజెక్టులు తెర మీదకు వచ్చాయి. వీటి వెనుక సమగ్రమైన ప్రణాళిక రచన కీలక పాత్రను పోషించింది. ప్రజల రాకపోకలకు, సరుకుల రవాణాకు, సేవల అందజేతకు అంతరాయం ఎదురవని సంధాన సదుపాయాన్ని ఈ ప్రాజెక్టులు సమకూర్చనున్నాయి.
మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలోని నాలుగు జిల్లాల్లో విస్తరించివుండే ఈ రెండు ప్రాజెక్టులూ భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్కును సుమారు 176 కిలోమీటర్ల మేరకు పెంచనున్నాయి.
ప్రతిపాదిత మల్టి-ట్రాకింగ్ ప్రాజెక్టు దాదాపుగా 784 గ్రామాలకు సంధాన సదుపాయాన్ని పెంపొందింపచేయనుంది. ఈ గ్రామాల్లో సుమారు 19 లక్షల 74 వేల మంది జనాభా నివసిస్తున్నారు.
ఇవి బొగ్గు, సిమెంటు, క్లింకర్, జిప్సమ్, ఫ్లయ్ యాష్, కంటెయినర్లు, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు పెట్రోలియమ్ ఉత్పత్తులు తదితర సరుకుల రవాణాకు అతి ప్రధాన మార్గాలుగా ఉన్నాయి. సామర్థ్యాన్ని పెంచేందుకు సంబంధించిన పనులను చేపట్టడం వల్ల ఒక్కో సంవత్సరంలోనూ అదనంగా 18.40 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) మేరకు సరకు రవాణా సాధ్యపడనుంది. రైల్వేలు పర్యావరణానుకూలమైన, ఇంధనం ఆదాకు దోహదం చేసే రవాణా మాధ్యమం అయిన కారణంగా, వాతావరణ సంబంధిత లక్ష్యాల సాధనలోనూ, దేశ రవాణా ఖర్చులను కనీస స్థాయికి పరిమితం చేయడంలోనూ తోడ్పడుతాయి. చమురు దిగుమతిని (20 కోట్ల లీటర్ల మేరకు) తగ్గిస్తాయి. అలాగే, కర్బన ఉద్గారాలను (CO2 ఎమిషన్స్)ను కూడా కుదిస్తాయి (99 కోట్ల కిలోల మేరకు)... ఇది 4 కోట్ల మొక్కల పెంపకాన్ని చేపట్టడంతో సమానం.
ఈ ప్రాజెక్టులు నిర్మాణ కాలంలో దాదాపు 74 లక్షల పనిదినాలకు సరిపడ ప్రత్యక్ష ఉపాధిని కల్పించగలుగుతాయి.
ఇవి ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరిచి, వస్తు రవాణాకయ్యే వ్యయంతోపాటు చమురు దిగుమతులను తగ్గిస్తాయి. వాతావరణంలోకి కర్బన ఉద్గారాల స్థాయిని కుదించడంలోనూ తోడ్పడుతాయి. రైల్వే కార్యకలాపాలను దీర్ఘకాలం పాటు సమర్థంగా కొనసాగించడంలో మద్దతిస్తాయి. ఈ ప్రాజెక్టులు కీలక రూట్లలో కంటెయినర్లు, బొగ్గు, సిమెంటు, వ్యావసాయక ఉత్పత్తులు, ఇతర వస్తువుల రవాణాలో రైలు మార్గ సామర్థ్యాన్ని పెంపొందింపచేయడం ద్వారా రవాణా దక్షత ను పెంచుతాయి. ఈ మెరుగుదలల వల్ల సరఫరా వ్యవస్థలను వీలైనంత ఎక్కువ స్థాయిలో వినియోగించుకోవడానికి, తద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసుకొనేందుకు మార్గం సుగమం అవుతుంది.
పెరిగే లైన్ కెపాసిటీ రాకపోకలను చెప్పుకోదగ్గ స్థాయిలకు చేరుస్తుంది. దీంతో భారతీయ రైల్వేల నిర్వహణ సామర్థ్యం మెరుగై, రైల్వేల సేవలపై ఆధారపడడంలో విశ్వసనీయత అధికమవుతుంది. ఈ మల్టి-ట్రాకింగ్ ప్రతిపాదనలు కార్యకలాపాలను సువ్యవస్థీకరించి, రద్దీని నివారించడానికి సహకరిస్తాయి. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చెబుతున్న ‘న్యూ ఇండియా’ (‘నవ భారత్’) దృష్టికోణానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తే, అక్కడి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి కల్పన అవకాశాలు ఇనుమడించి, ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలను ‘‘ఆత్మనిర్భర్’’గా (వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా) తీర్చిదిద్దాలన్నదే ‘న్యూ ఇండియా’ దార్శనికత ఉద్దేశం.
Congratulations to the people of Maharashtra and Madhya Pradesh! Two projects have been approved by the Cabinet, which will boost growth, sustainability, lower logistics costs and more. https://t.co/XfRWs7ULVx
— Narendra Modi (@narendramodi) May 28, 2025


