ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్-కబ్రాయ్ యాక్సెస్- కంట్రోల్డ్ నూతన రహదారి నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల కార్యక్రమం ద్వారా రూపుదిద్దుకుంటున్న భోపాల్-కాన్పూర్ ఎకనామిక్ కారిడార్‌లో ఈ రహదారి కీలకం కానుంది. ప్రస్తుతం ఇది 4 లైన్ల యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్‌గా నిర్మితమతున్నప్పటికీ, భవిష్యత్తులో దీనిని 6 లైన్లుగా విస్తరించడానికి వీలుగా దీనికి రూపకల్పన చేశారు. మొత్తం రూ.7,145.14 కోట్ల మూలధన వ్యయంతో వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), బీఓటీ టోల్ పద్ధతిలో అమలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త రహదారి నిర్మాణంతో పాటు ప్రస్తుత ఎన్‌హెచ్-34 లోని కాన్పూర్-కబ్రాయ్ విభాగం నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఎన్‌హెచ్ఏఐ చూసుకుంటుంది.

ఈ ప్రాజెక్టు కాన్పూర్, కబ్రాయ్ నగరాల మధ్య నిరంతర, అధిక వేగంతో కూడిన అనుసంధానాన్ని అందించడమే కాకుండా, మధ్యప్రదేశ్‌లోని సాగర్, భోపాల్, ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. తద్వారా ఉత్తరప్రదేశ్‌లోని పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలను.. మధ్యప్రదేశ్‌లోని ఖనిజ సంపద, ఉత్పాదక, వ్యవసాయ ప్రాంతాలతో అనుసంధానించే ఒక ఆధునిక ఎకనామిక్ కారిడార్‌గా ఈ ప్రాజెక్టు నిలవనుంది.

గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా రూపొందించిన ఈ కారిడార్ వల్ల కాన్పూర్-కబ్రాయ్ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 3.5 గంటల నుంచి కేవలం 1.5 గంటలకు (58 శాతం) తగ్గిపోనుంది. ఇది రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు, వాహనాల నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. ప్రయాణికుల, సరుకు రవాణా వాహనాల రాకపోకలను మరింత వేగవంతం చేస్తుంది. ఈ ప్రాజెక్టు జాతీయ రహదారులు ఎన్‌హెచ్-34, ఎన్‌హెచ్-35లతో పాటు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే, కాన్పూర్ రింగ్ రోడ్డు, రాష్ట్ర రహదారులైన ఎస్‌హెచ్-46, ఎస్‌హెచ్-91, ఎస్‌హెచ్-10బీ, ఎస్‌హెచ్-42లతో వ్యూహాత్మక అనుసంధానాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల ప్రాంతీయ రహదారి వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ముఖ్యంగా కబ్రాయ్ గనుల ప్రాంతానికి అనుసంధానత పెరగడం వల్ల ఖనిజాలు, పారిశ్రామిక వస్తువులు, నిర్మాణ సామగ్రి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఎంతో సులువవుతుంది. ఇది సరుకు సామర్థ్యాన్ని పెంచి, సరఫరా వ్యవస్థ స్థిరత్వానికి, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది.

పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఈ కాన్పూర్-కబ్రాయ్ రహదారి ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఈ కారిడార్ ద్వారా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని 16 ఆర్థిక కేంద్రాలకు రవాణా సౌకర్యం ఎంతగానో మెరుగుపడనుంది. ఇందులో భాగంగా ఉన్నావో, బంథర్, పంఖీ, రానియా, జైన్‌పూర్, రూమా, చాకేరి, సుమేర్‌పూర్, భూరాగఢ్ పారిశ్రామిక ప్రాంతాలతోపాటు ట్రాన్స్ గంగా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్, గ్రోత్ సెంటర్ జైపూర్, కాన్పూర్ నగర్ నోడ్, బెంగాల్ రసాయనాలు, ఔషధాల సంస్థ వంటి కీలక పారిశ్రామిక రంగాలు నేరుగా లబ్ధి పొందనున్నాయి. పారిశ్రామిక రంగంతో పాటు ఈ ప్రాంతంలోని 9 సామాజిక, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా ఈ రహదారి ద్వారా అనుసంధానత మెరుగవనుంది. వాటిలో ఫతేపూర్, మహోబా, కాన్పూర్ జూలాజికల్ పార్క్, బుద్ధ పార్క్, జేకే టెంపుల్-గార్డెన్, రాధాకృష్ణ ఆలయం, సిద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయం, గోపేశ్వర్ మందిర్, మహోబా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. సరుకు రవాణా రంగాన్ని వేగవంతం చేసేందుకు 10 లాజిస్టిక్స్ కేంద్రాలను ఈ కారిడార్ అనుసంధానిస్తుంది. కాన్పూర్, ఘటంపూర్, హమీర్‌పూర్, మహోబా, కబ్రాయ్, భర్వా సుమేర్‌పూర్, బందా రైల్వే స్టేషన్లతో పాటు కాన్పూర్, చకేరి, ఖజురహో విమానాశ్రయాలకు ఈ కారిడార్ ద్వారా అత్యుత్తమ రవాణా సౌకర్యం లభిస్తుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లోని వెనుకబడిన బుందేల్‌ఖండ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి, లాజిస్టిక్స్ పోటీతత్వం, ఆర్థిక వృద్ధి ఊపందుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎం గతిశక్తి లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ కారిడార్ ఎంతగానో దోహదపడనుంది.

 

ఈ భారీ ప్రాజెక్ట్ దేశంలో ఉపాధి కల్పనకు పెద్ద పీట వేయనుంది. నిర్మాణ సమయంలో ప్రతి లైన్, ప్రతి కిలోమీటరుకు సుమారు 11,188 మందికి నేరుగా మరో 13,985 మందికి పరోక్ష పనిదినాల ఉపాధి లభిస్తుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు దాదాపు 1.2 కోట్ల పనిదినాల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని అంచనా. ఆర్థిక, రవాణా పరంగా ఎంతో కీలకమైన ఈ రహదారిపై రాబోయే ఆర్థిక సంవత్సరం 2028 నాటికి ప్రతిరోజూ సగటున ట్రాఫిక్ సుమారు 18,069 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్లు) రాకపోకలు సాగిస్తాయని భావిస్తున్నారు. ఇది ఈ ప్రాంతపు దీర్ఘకాలిక ఆర్థిక, రవాణా రంగానికి ఎంతో మేలు చేస్తుంది. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఆగష్టు 2026
August 17, 2026

India Ascendant: Citizens Hail PM Modi's Vision and India’s Multi-Sectoral Growth