భారత్ సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా మరో సెమీకండక్టర్ యూనిటును ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది.
దేశంలో ఇప్పటికే అయిదు సెమీకండక్టర్ యూనిట్ల నిర్మాణపనులు పురోగమిస్తున్నాయి. ఈ ఆరో యూనిటుతో కలిపి, భారత్ వ్యూహాత్మకంగా కీలకమైన సెమీకండక్టర్ పరిశ్రమను అభివృద్ధిపరిచే దిశగా వేగంగా ముందుకు సాగిపోతోంది.
ఈ రోజు ఆమోదం తెలిపిన యూనిట్ హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్.. ఈ రెండు కంపెనీలు కలిసి ఏర్పాటు చేయనున్న ఓ సంయుక్త సంస్థ (జేవీ). హార్డ్‌వేర్‌ను అభివృద్ధిపరచడంలో, తయారు చేయడంలో సుదీర్ఘ అనుభవం హెచ్‌సీఎల్ సొంతం. ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీగా ఫాక్స్‌కాన్‌కు పేరుంది. ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా యమునా ఎక్స్‌ప్రెస్‌వే పారిశ్రామిక అభివృద్ధి ప్రాధికార సంస్థ (లేదా వైఈఐడీఏ)లో జేవర్ విమానాశ్రయం సమీపంలో ఒక యూనిట్ ను నెలకొల్పనున్నాయి.
ఈ ప్లాంటు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాపులు, ఆటోమొబైల్స్, పీసీలతో పాటు డిస్‌ప్లేకు సంబంధించిన ఇతర ఉపకరణాల కోసం డిస్‌ప్లే డ్రైవర్ చిప్స్‌ను తయారు చేస్తుంది.
ఈ ప్లాంటును ప్రతి నెలా 20,000 వేఫర్స్‌కు రూపురేఖలు కల్పించే విధంగా డిజైన్ చేశారు. దీని డిజైన్ అవుట్‌పుట్ సామర్థ్యం నెలకు మూడు లక్షల అరవై వేల యూనిట్లు ఉంటుంది.
సెమీకండక్టర్ పరిశ్రమ ఇప్పుడు యావత్తు దేశంలో విస్తరిస్తోంది. దేశమంతటా అనేక రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయి డిజైన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు డిజైన్ సంస్థలను ప్రోత్సహించడానికి అదేపనిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
కొత్త ఉత్పత్తులకు తుదిరూపాన్ని ఇచ్చే పనుల్లో 270 విద్యాబోధన సంస్థలతోపాటు 70 అంకుర సంస్థల విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తలమునకలుగా ఉన్నారు. ఈ విద్యా సంస్థలు తీర్చిదిద్దే 20 ఉత్పత్తులను టేప్ అవుట్ (డిజైన్ దశలో అవసరమైన ప్రతి విషయాన్నీ సరి చూసే, గుర్తింపు దశకు చేర్చే ప్రక్రియ) బాధ్యతను ఎస్‌సీఎల్ మొహాలీ చేపట్టి పూర్తి చేసింది.
ఈ రోజు ఆమోదం తెలిపిన కొత్త సెమీకండక్టర్ యూనిటును ఏర్పాటు చేయడానికి ఇంచుమించు రూ.3,700 కోట్లు పెట్టుబడి అవసరమవుతుంది.
భారత్ సెమీకండక్టర్ రంగంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న క్రమంలో, అనుబంధ విస్తారిత వ్యవస్థ భాగస్వామ్య సంస్థలు కూడా ఇండియాలో తమ తమ సదుపాయాలను ఏర్పాటు చేశాయి. అప్లయిడ్ మెటీరియల్స్, ల్యామ్ రిసెర్చ్.. ఇవి రెండూ కూడా అన్నింటి కంటే పెద్ద సామగ్రి తయారీదారు సంస్థలుగా కొలువుదీరాయి. ఈ రెండు సంస్థలు ప్రస్తుతం దేశంలో తమకంటూ ఓ ఉనికిని కలిగి ఉన్నాయి. మెర్క్, లిండే, ఎయిర్ లిక్విడ్, ఐనాక్స్‌లతో పాటు అనేక ఇతర గ్యాస్, రసాయనిక సరఫరాదారు సంస్థలు మన సెమీకండక్టర్ పరిశ్రమలో వృద్ధిని నమోదు చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి.
మన దేశంలో ల్యాప్‌టాపులు, మొబైల్ ఫోన్లు, సర్వర్, వైద్య సంబంధ పరికరాలు, విద్యుత్తు ఎలక్ట్రానిక్స్, రక్షణ సామగ్రితోపాటు ఇతర వినియోగదారు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ వేగంగా వర్ధిల్లుతోంది. దీంతోపాటే సెమీకండక్టర్ల కోసం గిరాకీ కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ కొత్త యూనిటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతున్న ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయంసమృద్ధ భారత్) దృష్టికోణాన్ని మరింతగా ప్రోత్సహించేదే కానుంది.
India's strides in the world of semiconductors continue! Today's Cabinet decision regarding the establishment of a semiconductor unit in Uttar Pradesh will boost growth and innovation. It will create innumerable opportunities for the youth as well. https://t.co/Kl4yms8RGW
— Narendra Modi (@narendramodi) May 14, 2025


