దేశంలో ద్వితీయ వనరుల నుంచి ప్రధాన ఖనిజాలను వేరు చేసే, ఉత్పత్తి చేసే రీసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి రూ.1,500 కోట్ల ప్రోత్సాహక పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్‌సీఎమ్ఎమ్)లో భాగమైన ఈ పథకాన్ని ప్రధాన ఖనిజ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని, సరఫరా వ్యవస్థ సమర్థతను మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించారు. అన్వేషణ, వేలం, గని నిర్వహణ, విదేశీ ఆస్తుల సముపార్జనతో కూడిన ప్రధాన ఖనిజాల వ్యవస్థ భారత పరిశ్రమల కోసం ప్రధాన ఖనిజాలను సరఫరా చేయడానికి సన్నద్ధమవుతోంది. ద్వితీయ వనరుల రీసైక్లింగ్ ద్వారా అనతి కాలంలోనే సుస్థిర సరఫరా వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
ఈ పథకం ఆర్థిక సంవత్సరం 2025-26 నుంచి 2030-31 వరకు అంటే ఆరు సంవత్సరాల కాలపరిమితిని కలిగి ఉంటుంది. ప్రధానంగా ఇ-వ్యర్థాలు, లిథియం అయాన్ బ్యాటరీ (ఎల్ఐబీ) స్క్రాప్, అలాగే ఈ రెండూ కాని ఇతర స్క్రాప్ దీనికోసం అవసరమైన ముడిసామాగ్రి. ఇతర స్క్రాప్... ఉదాహరణ ఉద్గార విష వాయువులను సురక్షిత వాయువులుగా మార్చే ఉత్ప్రేరక కన్వర్టర్లను జీవితకాలం ముగిసిన వాహనాల నుంచి సేకరిస్తారు. పెద్ద, ప్రముఖ రీసైక్లర్లు.. అలాగే చిన్న, కొత్త రీసైక్లర్లు (అంకురసంస్థలు సహా) ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నాయి. పథకం మొత్తం వ్యయంలో మూడింట ఒక వంతు వీరి కోసం కేటాయించారు. కొత్త యూనిట్లలో పెట్టుబడులు, వాటి సామర్థ్య విస్తరణ/ఆధునికీకరణతో పాటు ఇప్పటికే ఉన్న యూనిట్ల వైవిద్యీకరణ కోసం ఈ పథకం వర్తిస్తుంది. బ్లాక్ మాస్ ఉత్పత్తిలో ప్రమేయం గల రీసైక్లింగ్ వ్యవస్థ కోసం మాత్రమే కాకుండా ప్రధాన ఖనిజాల వెలికితీతలో ప్రమేయం గల రీసైక్లింగ్ వ్యవస్థ కోసం కూడా ఈ పథకం ప్రోత్సాహకాలను అందిస్తుంది.
ఈ పథకం కింద అందించే ప్రోత్సాహకాల్లో క్యాపెక్స్ సబ్సిడీ, ఆపెక్స్ సబ్సిడీ భాగంగా ఉంటాయి. మొదటిది.. మూలధన వ్యయం కోసం అందించే రాయితీ అయిన క్యాపెక్స్ సబ్సిడీ. పేర్కొన్న కాలవ్యవధిలోగా ఉత్పత్తిని ప్రారంభించడం కోసం ప్లాంట్, యంత్రాలు, పరికరాలు, అనుబంధ సదుపాయాల కోసం 20 శాతం క్యాపెక్స్ సబ్సిడీని అందించనున్నారు. అయితే ఉత్పత్తి ప్రారంభించే గడువు దాటినప్పుడు జరిగిన జాప్యానికి అనుగుణంగా ఈ రాయితీని తగ్గిస్తారు. రెండోది.. కార్యాచరణ వ్యయం కోసం అందించే రాయితీ అయిన ఆపెక్స్ సబ్సిడీ. ఇది మొదటి సంవత్సరంలో (ఆర్థిక సంవత్సరం 2025-26 కాలంలో) అమ్మకాల్లో పెరుగుదల కోసం అందించే ప్రోత్సాహకం. అంటే రెండో సంవత్సరంలో అర్హత గల ఆపెక్స్ సబ్సిడీలో 40 శాతం అందిస్తారు. అలాగే ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి 2030-31 వరకు నిర్దేశించిన అమ్మకాల పెరుగుదలను సాధించినప్పుడు ఆపెక్స్ సబ్సిడీలో మిగిలిన 60 శాతం అందిస్తారు. ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా ప్రతి సంస్థకు అందించే మొత్తం ప్రోత్సాహకం (క్యాపెక్స్, ఆపెక్స్ రాయితీల మొత్తం) విలువ.. పెద్ద సంస్థల కోసం రూ.50 కోట్లు, చిన్న సంస్థల కోసం రూ.25 కోట్ల పరిమితికి లోబడి ఉంటుంది. దీనిలో ఆపెక్స్ సబ్సిడీ కోసం పెద్ద సంస్థలకు రూ.10 కోట్లు, చిన్న సంస్థలకు రూ.5 కోట్ల పరిమితి ఉంటుంది.
కనీసం 270 కిలో టన్నుల వార్షిక రీసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం.. ఫలితంగా సుమారు 40 కిలో టన్నుల ప్రధాన ఖనిజాల వార్షిక ఉత్పత్తిని సాధించడం ఈ పథకం ప్రోత్సాహకాల ద్వారా పొందే కీలక ఫలితాలుగా అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.8,000 కోట్ల పెట్టుబడులు రాబట్టడంతో పాటు, దాదాపు 70,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఈ పథకం ద్వారా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. పథకం రూపకల్పనకు ముందు ప్రత్యేక సమావేశాలు, సదస్సుల ద్వారా పరిశ్రమ ప్రముఖులు, ఇతర సంబంధిత వ్యక్తులతో పలు ధపాలుగా సంప్రదింపులు నిర్వహించారు.
This decision by the Union Cabinet pertaining to an incentive scheme to promote critical mineral recycling will boost capacities to recycle battery waste and e-waste, promote investment and encourage job creation.https://t.co/6deRyQekLM
— Narendra Modi (@narendramodi) September 3, 2025


