శాస్త్రీయ- పారిశ్రామిక పరిశోధన విభాగం/ శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (డీఎస్ఐఆర్/ సీఎస్ఐఆర్) ‘సామర్థ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి’ పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం కాలానికి, 2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం వ్యయం రూ. 2277.397 కోట్లతో దీనిని చేపట్టారు.
ఈ పథకాన్ని సీఎస్ఐఆర్ అమలు చేస్తుంది. అన్ని పరిశోధన – అభివృద్ధి సంస్థలు, జాతీయ ప్రయోగశాలలు, జాతీయ ప్రాధాన్యమున్న సంస్థలు, ఉన్నత స్థాయి సంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు దీని పరిధిలోకి వస్తాయి. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, జాతీయ పరిశోధన - అభివృద్ధి ప్రయోగశాలలు, విద్యా సంస్థల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలని భావించే యువ, ఉత్సాహవంతులైన పరిశోధకులకు ఇది ఓ విస్తృత వేదికను అందిస్తుంది. ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ల మార్గ నిర్దేశంలో.. విజ్ఞాన శాస్త్రాలు - సాంకేతికత, ఇంజినీరింగ్, వైద్య, గణిత శాస్త్రాల (STEMM)ల అభివృద్ధిని ఈ పథకం ముందుకు తీసుకెళ్తుంది.
జనాభాకు తగిన స్థాయిలో పరిశోధకుల సంఖ్యను పెంచడం ద్వారా.. దేశంలో విజ్ఞాన శాస్త్ర - సాంకేతిక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తుంది. సామర్థ్యాలను పెంపొందించడంతోపాటు విజ్ఞాన శాస్త్ర- సాంకేతిక రంగంలో నిపుణులైన మానవ వనరుల సంఖ్యను విశేషంగా పెంచుతూ ఈ పథకం ప్రాధాన్యాన్ని చాటుకుంది.
గత దశాబ్ద కాలంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన – అభివృద్ధి దిశగా భారత ప్రభుత్వం సమష్టిగా కృషి చేసింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) ర్యాంకింగ్ ప్రకారం.. 2024లో అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీ (జీఐఐ)లో భారత్ 39వ స్థానానికి ఎగబాకింది. భారత ప్రధానమంత్రి దార్శనిక నేతృత్వంలో సమీప భవిష్యత్తులోనే ఈ ర్యాంకు మరింత మెరుగుపడనుంది. పరిశోధన - అభివృద్ధికి ప్రభుత్వ చేయూత ఫలితంగా.. వైజ్ఞానిక పత్రాల ప్రచురణల పరంగా భారత్ ఇప్పుడు మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. అమెరికా ఎన్ఎస్ఎఫ్ ఈ మేరకు స్పష్టం చేసింది. దేశ శాస్త్ర సాంకేతిక విజయాలకు విశేషంగా దోహదపడిన వేలాది మంది పరిశోధకులు, శాస్త్రవేత్తలకు డీఎస్ఐఆర్ పథకం చేయూతనందిస్తోంది.
సమన్వయ, సమగ్ర పథకం అమలు ద్వారా భారత శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనలో 84 ఏళ్లుగా సేవలందిస్తున్న సీఎస్ఐఆర్ ప్రస్థానంలో ఈ ఆమోదం ఓ చారిత్రక ప్రస్థానం. ఇది ప్రస్తుత, భవిష్యత్ తరాల్లో దేశంలో పరిశోధన - అభివృద్ధి రంగంలో పురోగతిని వేగవంతం చేస్తుంది. సీఎస్ఐఆర్ సమగ్ర ‘సామర్థ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి’ పథకంలో నాలుగు ఉప పథకాలున్నాయి: (i) డాక్టొరల్, పోస్ట్ డాక్టొరల్ ఫెలోషిప్‌లు (ii) విశ్వవిద్యాలయేతర పరిశోధన పథకం, గౌరవ శాస్త్రవేత్తల పథకం, భట్నాగర్ ఫెలోషిప్, (iii) అవార్డు పథకం ద్వారా అత్యుత్తమ ప్రతిభకు ప్రోత్సాహం, గుర్తింపు, (iv) ప్రయాణం, సింపోసియా గ్రాంటు పథకం ద్వారా వైజ్ఞానిక భాగస్వామ్యానికి ప్రోత్సాహం.
బలమైన పరిశోధన- అభివృద్ధి ఆధారిత ఆవిష్కరణ వ్యవస్థల నిర్మాణంతోపాటు.. 21వ శతాబ్దంలో అంతర్జాతీయ స్థాయిలో నేతృత్వం వహించేలా భారతీయ వైజ్ఞానిక రంగాన్ని సన్నద్ధం చేయడం చేసే దిశగా ప్రభుత్వ నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనం.
The Union Cabinet's approval for the DSIR Scheme “Capacity Building and Human Resource Development” will add vigour to India's R&D ecosystem, with a focus on a culture of innovation as well as excellence. https://t.co/geOm4AaX5x
— Narendra Modi (@narendramodi) September 24, 2025


