xసెప్టెంబర్ 22 నుంచి అమలులోకి తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు
జీఎస్టీ బచత్ ఉత్సవ్ ప్రారంభానికి గుర్తుగా ఈ తేదీ నిలిచిపోతుంది
కొత్త జీఎస్టీ విధానంతో ప్రతి పౌరుడికీ చేరనున్న ప్రయోజనాలు
జీఎస్టీ సంస్కరణలతో భారత వృద్ధి వేగవంతం
కొత్త సంస్కరణలతో జీఎస్టీలో కేవలం 5 శాతం, 18 శాతం స్లాబ్‌లు
తక్కువ జీఎస్టీతో పౌరుల కలల సాకారం సులభతరం
నిస్వార్థ ప్రజా సేవను ప్రతిబింబిస్తున్న తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు: ప్రధాని
దేశానికి అవసరమైనవీ.. మనం తయారు చేయగలవీ అన్నీ దేశంలోనే తయారు చేయాలి
స్వయం-సమృద్ధితోనే భారత శ్రేయస్సు బలోపేతం
మన దేశంలో తయారైన ఉత్పత్తులే కొనుగోలు చేద్దాం

నా ప్రియమైన దేశవాసులారా... నమస్కారం!

శక్తిని ఆరాధించే పండగ అయిన నవరాత్రి రేపు ప్రారంభమవుతుంది. మీ అందరికీ శుభాకాంక్షలు. నవరాత్రి మొదటి రోజే..  దేశం ఆత్మనిర్భర్ భారత్‌ వైపు మరో ముఖ్యమైన ముందడుగు వేస్తోంది. రేపు అంటే సెప్టెంబర్ 22న నవరాత్రి మొదటి రోజు నాడు సూర్యుడు ఉదయించే మాదిరిగానే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు కూడా అమలులోకి రానున్నాయి. ఒక విధంగా దేశంలో రేపటి నుంచి జీఎస్టీ పొదుపు అనే పండగ ప్రారంభం కానుంది. ఈ జీఎస్టీ పండగ మీ పొదుపులను పెంచుతుంది.. మీరు కావలసిన వస్తువులను మరింత తక్కువ ధరకు కొనుక్కునేలా చూసుకుంటుంది. మన దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు, నవ- మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారవేత్తలు, వ్యవస్థాపకులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ పొదుపు అనే పండగ నుంచి చాలా ప్రయోజనం పొందుతారు. అంటే ఈ పండగ సమయంలో ప్రతి ఒక్కరు తీపి కబురు ఉండటంతో పాటు దేశంలోని ప్రతి కుటుంబం ఆశీర్వాదం పొందుతుందన్న మాట. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో పాటు పొదుపనే ఈ పండగ విషయంలో దేశంలోని కోట్లాది కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంస్కరణలు భారతదేశ వృద్ధిని వేగవంతం చేస్తాయి. వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతాయి.. పెట్టుబడులు పెట్టటాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది.. అభివృద్ధికి సంబంధించిన పోటీలో ప్రతి రాష్ట్రాన్ని సమాన స్థానంలో నిలబెడుతుంది. 

మిత్రులారా,

2017లో జీఎస్టీ సంస్కరణ దిశగా భారత్‌ అడుగులు వేసినప్పుడు.. చరిత్రలో ఒక మార్పునకు, కొత్త చరిత్రను సృష్టించేందుకు పునాది పడింది. దశాబ్దాలుగా మీ అందరితో పాటు మన దేశ ప్రజలు, దేశంలోని వ్యాపారవేత్తలు..వివిధ పన్నులనే చిక్కులో పడి ఉన్నారు. ఆక్ట్రాయ్, ప్రవేశపన్ను, విక్రయ పన్ను, ఎక్సైజ్, వ్యాట్, సేవా పన్ను తదితర డజన్ల కొద్దీ పన్నులు మన దేశంలో ఉండేవి. ఒక నగరం నుంచి మరో నగరానికి వస్తువులను పంపాల్సి వస్తే చాలా చెక్‌ పోస్టులను దాటటంతో పాటు చాలా కాగితాలను నింపాల్సి వచ్చేది.. చాలా అడ్డంకులు ఎదుర్కోవల్సి వచ్చేది.. ప్రతిచోటా వేర్వేరు పన్ను నియమాలు ఉండేవి. 2014లో భారత్‌ నాకు ప్రధానమంత్రి పదవి బాధ్యతలు ఇచ్చిన మొదట్లో ఒక విదేశీ వార్తాపత్రికలో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. అందులో ఒక కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఆ కంపెనీ సొంత వస్తువులను బెంగళూరు నుంచి 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు పంపటం అనేది చాలా కష్టమని భావించేదని తెలిపింది. మొదట వస్తువులను బెంగళూరు నుంచి ఐరోపాకు పంపించి, వాటిని మళ్లీ అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు పంపించేందుకు మొగ్గుచూపినట్లు ఈ కథనం పేర్కొంది. 

 

మిత్రులారా,

అప్పుడు పన్నులు, టోల్‌ల సంక్లిష్టత కారణంగా పరిస్థితి ఇలా ఉండేది. పాత ఉదాహరణను మాత్రమే నేను మీకు చెబుతున్నాను. వివిధ రకాల పన్నులనే చిక్కుముడుల కారణంగా లక్షలాది కంపెనీలు, కోట్లాది దేశప్రజలు ప్రతిరోజూ సమస్యలను ఎదుర్కొనేవారు. ఒక నగరం నుంచి మరొక నగరానికి వస్తు రవాణా చేయటంలో అయ్యే ఖర్చును కూడా పేదలే భరించేవారు.. ఆ మొత్తాన్ని మీలాంటి వినియోగదారుల నుంచి తిరిగి పొందేవారు. 

మిత్రులారా,

ఈ పరిస్థితి నుంచి దేశాన్ని బయట పడేయటం చాలా ముఖ్యమైన విషయం. అందుకే 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు.. ప్రజా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీని మేం ప్రాధాన్యత తీసుకున్నాం. ప్రతి ఒక్క భాగస్వామితో చర్చించాం.. రాష్ట్రాలన్నీ వెలిబుచ్చిన సందేహాలను నివృత్తం చేశాం.. ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికాం. అన్ని రాష్ట్రాలను ఏకతాటికి తీసుకురావటం వలన స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద పన్ను సంస్కరణ సాధ్యమైంది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు చేసిన కృషి ఫలితంగా డజన్ల కొద్దీ పన్నులనే వల నుంచి దేశం విముక్తి పొందింది.. దేశం మొత్తానికి ఒకే విధమైన పన్ను వ్యవస్థ వచ్చింది.. ఒకే దేశం-ఒకే పన్ను కల నెరవేరింది. 

మిత్రులారా,

సంస్కరణలు అనేవి నిరంతరం కొనసాగే ప్రక్రియ. కాలం మారుతున్న కొద్దీ, దేశ అవసరాలు పెరుగుతున్న కొద్దీ తదుపరి తరం సంస్కరణలు కూడా అంతే అవసరం అవుతాయి. అందుకే దేశానికి ఉన్న ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తుకు సంబంధించిన కలలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త జీఎస్టీ సంస్కరణలను తీసుకొచ్చాం. 

కొత్త జీఎస్టీలో ఇప్పుడు ఐదు, పద్దెనిమిది శాతం పన్ను రేట్లు మాత్రమే ఉంటాయి. దీనివల్ల రోజువారీగా ఉపయోగించే చాలా వస్తువుల ధర మరింత అందుబాటులోకి వస్తుంది. ఆహార పదార్థాలు, వివిధ వస్తువులు, మందులు, సబ్బు, బ్రష్‌లు, టూత్‌ పేస్టులు, ఆరోగ్యం- జీవిత బీమా తదితర అనేక వస్తు సేవలపై సున్నా లేదా ఐదు శాతం పన్ను మాత్రమే ఉంటుంది. గతంలో 12 శాతం పన్ను ఉన్న వస్తువులలో 99 శాతం.. అంటే దాదాపు 100 శాతం ఇప్పుడు 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి.

 

మిత్రులారా, 

గత 11 సంవత్సరాల్లో దేశంలోని 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు. పేదరికం నుంచి బయటపడటం ద్వారా ఈ 25 కోట్ల జన సమూహం నేడు నవ-మధ్యతరగతిగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నవ మధ్యతరగతికి సొంత ఆకాంక్షలు, కలలు ఉన్నాయి. రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేస్తూ ప్రభుత్వం వారికి బహుమతిని ఇచ్చింది. 

12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉండటం మధ్యతరగతి ప్రజల జీవితాల్లో భారీ మార్పు తీసుకొస్తుంది. వాళ్ల జీవితం సులభతరంగా మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ఇప్పుడు పేదల వంతు, నవ మధ్యతరగతి వంతు. ఇప్పుడు పేదలు, నవ మధ్యతరగతి, మధ్యతరగతి వాళ్లకు రెట్టింపు బోనాంజా లభిస్తుంది. జీఎస్టీ తగ్గింపు వలన దేశ ప్రజలు.. వారి కలలను నెరవేర్చుకోవడం అనేది ఇప్పుడు సులభతం అవుతుంది. ఇల్లు కట్టుకోవడం అయినా.. టీవీ, రిఫ్రిజిరేటర్, స్కూటర్, బైక్, కారు వంటివి కొనుగోలు చేయటం అయినా తక్కువ ఖర్చు అవుతుంది. హోటళ్లలో చాలా వాటిపై జీఎస్టీ తగ్గినందుకు ప్రయాణాలు కూడా చౌకగా మారుతాయి. 

అయితే మిత్రులారా, 

జీఎస్టీ సంస్కరణ పట్ల దుకాణ సోదరీసోదరులు కూడా చాలా ఉత్సహాన్ని చూపిస్తుండటం నాకు సంతోషంగా ఉంది. తగ్గిన జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయటంలో వాళ్లు చాలా బిజీగా ఉన్నారు. పాత, కొత్త ధరలను తెలిపే బోర్డులు చాలా చోట్ల పెడుతున్నారు. 

మిత్రులారా,

మనం పాటిస్తోన్న ‘నాగరిక దేవో భవ:’ అనే సూత్రం.. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆదాయపు పన్ను, జీఎస్టీ మినహాయింపును కలిపి చూస్తే.. ఒక సంవత్సరంలోనే తీసుకున్న నిర్ణయాల వల్ల దేశ ప్రజలకు రూ. 2.5 లక్షల కోట్లకు పైగా ఆదా కానున్నాయి. అందుకే ఇది పొదుపు పండగ అని నేను చెబుతున్నాను. 

మిత్రులారా, 

అభివృద్ధి చెందిన భారత్ అనే లక్ష్యాన్ని సాధించడానికి స్వావలంబన అనే మార్గాన్ని మనం అనుసరించాలి. దేశాన్ని స్వావలంబనగా మార్చే బృహత్తర బాధ్యత.. మన చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమలు అయిన ఎంఎస్ఎంఈలపై కూడా ఉంది. దేశ ప్రజలకు అవసరమైనవి, దేశంలోనే తయారు చేయగలిగినవన్నీ దేశంలోనే తయారు చేయాలి.

మిత్రులారా, 

జీఎస్టీ రేట్ల తగ్గింపు, నియమాలు- విధానాల సరళీకరణతో మన ఎంఎస్ఎంఈలు.. మన చిన్న తరహా, కుటీర పరిశ్రమలు చాలా ప్రయోజనం పొందుతాయి. వాటి విక్రయాలు పెరగటంతో పాటు అవి తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇవి కూడా రెట్టింపు ప్రయోజనం పొందుతాయి. ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు లేదా కుటీర పరిశ్రమలు ఇలా ఏవైనా కావొచ్చు.. ఇవాళ నాకు వీటన్నింటిపైన గొప్ప అంచనాలు ఉన్నాయి. భారత్ ‌సుసంపన్నత అనే శిఖరాగ్రంలో ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మన ఎంఎస్ఎంఈలు, మన చిన్న- కుటీర పరిశ్రమలు ఉంటాయన్న విషయం మీకు కూడా తెలుసు. భారత్‌లో తయారైన, దేశంలో ఉత్పత్తైన వస్తువుల నాణ్యత ఒకప్పుడు చాలా బాగుండేది. మనం ఆ గౌరవాన్ని తిరిగి పొందాలి. మన చిన్న పరిశ్రమలు ఉత్పత్తి చేసే ప్రతి ఒక్క వస్తువు అన్ని రకాల ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా, ఉత్తమమైన వాటిలోనే ఉత్తమమైనదిగా ఉండాలి. మనం తయారు చేసేవి.. గర్వం, ప్రతిష్ఠను ప్రదర్శిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారామితులన్నింటిని అధిగమించాలి. మన ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరిచేందుకు, ప్రపంచవ్యాప్తంగా భారత్ గుర్తింపును పెంచేందుకు, దేశ గౌరవాన్ని పెంచేందుకు మనం కృషి చేయాలి.

మిత్రులారా, 

దేశ స్వాతంత్ర్యం స్వదేశీ మంత్రం ద్వారా బలపడినట్లే.. దేశ సుసంపన్నత కూడా స్వదేశీ మంత్రం ద్వారా బలపడుతుంది. తెలిసి తెలియకుండానే అనేక విదేశీ వస్తువులు నేటి మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. మనకు దీని గురించి తెలియదు. మన జేబులో ఉన్న దువ్వెన స్వదేశీనా లేక విదేశీనా అన్న విషయం కూడా మనకు తెలియదు. మన యువత, కుమారులు- కుమార్తెలు చెమటోడ్చి తయారు చేసిన స్వదేశీ వస్తువులనే కొనాలి. మనం ప్రతి ఇంటిని స్వదేశీకి చిహ్నంగా మార్చాలి. ప్రతి దుకాణ అలంకరణ స్వదేశీతో జరగాలి. ఇది స్వదేశీ అని గర్వంగా చెప్పండి. ‘నేను స్వదేశీని కొంటాను- నేను స్వదేశీని విక్రయిస్తాను’ అని సగర్వంగా చెప్పండి. ఇదే ప్రతి భారతీయుడి వైఖరిగా మారాలి. ఇది వాస్తవ రూపం దాల్చినప్పుడు భారత్ ‌వేగంగా అభివృద్ధి చెందుతుంది. స్వావలంబన భారత్, స్వదేశీ అనే నినాదాలతో తయారీని వేగవంతం చేయాలని.. పూర్తి శక్తి, ఉత్సాహంతో ముందుకుసాగాలని నేను రాష్ట్రాలను కోరుతున్నాను. పెట్టుబడికి ఉన్న అనుకూల వాతావరణాన్ని మెరుగుపరచాలి. కేంద్రం, రాష్ట్రాలు కలిసి ముందుకు సాగినప్పుడు స్వావలంబన భారత్ అనే కల నెరవేరుతుంది.. దేశంలోని ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.. భారత్‌ అభివృద్ధి చెందుతుంది. ఈ సెంటిమెంట్‌తో ఈ పొదుపు పండగకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మరోసారి మీ అందరికీ నవరాత్రి, జీఎస్టీ పొదుపు పండగ శుభాకాంక్షలు చెబుతున్నాను. 

చాలా ధన్యవాదాలు!...

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
A big deal: The India-EU partnership will open up new opportunities

Media Coverage

A big deal: The India-EU partnership will open up new opportunities
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 జనవరి 2026
January 28, 2026

India-EU 'Mother of All Deals' Ushers in a New Era of Prosperity and Global Influence Under PM Modi