‘‘మా తొలి వంద రోజుల ప్రాధాన్యాలు సుస్పష్టం... మా వేగం/భారీతనానికి ఇది నిదర్శనం’’
‘‘యావత్ ప్రపంచానికీ వర్తించే భారతీయ పరిష్కారాలు’’
‘‘ప్రస్తుత 21వ శతాబ్దానికి అత్యుత్తమ ఎంపిక భారత్’’
‘‘హరిత భవిత... నికర-శూన్య ఉద్గారాలకు భారత్ హామీ ఇస్తోంది’’
‘‘పారిస్‌ సదస్సు నిర్దేశిత వాతావరణ లక్ష్యాలను గడువుకు తొమ్మిదేళ్లు ముందే సాధించిన జి-20 కూటమి తొలి దేశం
‘‘ప్రధానమంత్రి సూర్య గృహ ఉచిత విద్యుత్ పథకం’తో దేశంలో ప్రతి ఇల్లూ విద్యుదుత్పాదనకు సిద్ధమైంది’’
‘‘భూగోళ హిత జనజీవనం’ సూత్రావళికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’’

గుజరాత్ గవర్నర్, శ్రీ ఆచార్య దేవవ్రత్ జీ,

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ జీ,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు జీ,

రాజస్థాన్ ముఖ్యమంత్రి, శ్రీ భజన్ లాల్ శర్మ జీ; మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ జీ

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, గోవా ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నారు.

వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులూ

జర్మనీ ఆర్థిక సహకార మంత్రి , డెన్మార్క్ పరిశ్రమల వ్యాపార మంత్రితో సహా విదేశాల నుండి వ‌చ్చిన‌ విశిష్ట అతిథులూ , నా మంత్రి మండ‌లి స‌భ్యులు ప్రహ్లాద్ జోషి జీ, శ్రీపాద్ నాయక్ జీ , ప‌లు దేశాల నుండి వ‌చ్చిన ప్రతినిధులు...

 

వివిధ దేశాల నుండి ఇక్కడకు వచ్చిన అతిథులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇది రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ- రీ ఇన్వెస్ట్ కాన్ఫరెన్స్ నాలుగో ఎడిషన్‌. రాబోయే మూడు రోజుల్లో ఇంధనం, సాంకేతికరంగ‌ విధానాల భవిష్యత్తుపై విస్తృతంగా చర్చలు జరుగుతాయని భావిస్తున్నాను. ప‌లువురు సీనియర్ ముఖ్యమంత్రులు, ఈ రంగంలో విస్తృత అనుభవం ఉన్నవారు ఇక్క‌డ ఉన్నారు. ఈ చర్చల సమయంలో వారి విలువైన ఆలోచ‌న‌ల‌ నుండి మనం అందరం త‌ప్ప‌కుండా ప్రయోజనం పొందుతామని అనుకుంటున్నాను. ఇక్కడ మనం పంచుకునే జ్ఞానం మొత్తం మానవాళి అభివృద్ధికి దోహదపడుతుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు.

 

స్నేహితులారా

 

మీకో విషయం తెలుసునా? భారతదేశ ప్రజలు 60 ఏళ్లలో మొదటిసారి వరుసగా మూడోసారి మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక భారత దేశ ప్ర‌జ‌ల‌ ఉన్న‌త‌మైన‌ ఆకాంక్షలు ఉన్నాయి. 140 కోట్ల మంది భారతీయులకు ముఖ్యంగా యువత, మహిళలకు- గత పదేళ్లలో వారి ఆకాంక్షలకు త‌గినంత ప్రోత్సాహం ల‌భించింది. ఆ కార‌ణంగా వారు మా ప్ర‌భుత్వం మూడోసారి కూడా మరింత ఉన్నతంగా రాణిస్తామ‌న్న విశ్వాసంతో ఉన్నారు. మా ప్ర‌భుత్వ మూడోసారి పాలన వల్ల దేశంలోని పేదలు, అట్టడుగున ఉన్నవారు, అణగారిన వర్గాలు గౌరవప్రదమైన జీవితం ల‌భిస్తుంద‌ని న‌మ్ముతున్నారు.

 

భారతదేశం లోని 140 కోట్ల మంది పౌరులు భార‌త‌ దేశాన్ని ప్ర‌పంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒక‌టిగా చేయాల‌నే సంకల్పంలో ఐక్యంగా ఉన్నారు. కాబ‌ట్టి నేటి కార్య‌క్ర‌మాన్ని విడిగా చూడ‌కూడ‌దు. ఇది గొప్ప దార్శనిక‌త‌తో కూడిన‌, కీల‌క‌ మిషన్‌లో భాగం. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మా కార్యాచరణ ప్రణాళికలో ఇది కీలకమైన అంశం. ఈ మూడోసారి పాలనలో మొదటి 100 రోజులలో మేం తీసుకున్న నిర్ణయాల కార‌ణంగా సాధించిన‌ పురోగతి తాలూకా ముంద‌స్తు సంకేతాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

స్నేహితులారా,

 

మొదటి 100 రోజులలో, మా ప్రాధాన్యతల్లో స్పష్టత వ‌చ్చింది. మా వేగం, స్థాయి స్పష్టంగా ఉన్నాయి. ఈ సమయంలో, భారతదేశ‌ అభివృద్ధి వేగానికి అవసరమైన ప్రతి రంగంపై, ప్రతి అంశంపై మేం దృష్టి సారించాం. ఈ 100 రోజుల్లో, భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. భారత్‌లో 70 మిలియన్లు లేదా 7 కోట్ల ఇళ్లను నిర్మిస్తున్నామని తెలుసుకుని మన అంతర్జాతీయ అతిథులు ఆశ్చర్యపోవచ్చు- ఈ ఇళ్ల సంఖ్య అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ. మా ప్రభుత్వ పాల‌న‌లో మొదటి రెండు పర్యాయాలలో 40 మిలియన్లు లేదా 4 కోట్ల గృహాలను నిర్మించాం.

ఇప్పుడు, ఈ మూడోసారి పాలనలో అదనంగా 30 మిలియన్లు లేదా 3 కోట్ల గృహాల నిర్మాణాన్ని ప్రారంభించాం. గత 100 రోజుల్లో, భారత్‌లో 12 కొత్త పారిశ్రామిక నగరాల అభివృద్ధికి ఆమోదం తెలిపాం. ఈ సమయంలో, 8 హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపాం. అదనంగా, మేడ్-ఇన్-ఇండియా సెమీ-హై-స్పీడ్ వందే భారత్ రైళ్లను 15కు పైగా ప్రారంభించాం. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక ట్రిలియన్ రూపాయల పరిశోధన నిధిని ఏర్పాటు చేశాం. విద్యుత్ వాహ‌నాల వినియోగం పెంచడానికి అనేక కార్యక్రమాలను ప్ర‌క‌టించాం. అధిక-పనితీరు గల బయో టెక్నాలజీ ఆధారిత త‌యారీ రంగాన్ని అభివృద్ధి చేయ‌డం మా లక్ష్యం. ఇది భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుంది. దీని కోసం బ‌యో ఇ3 ( BioE3 ) విధానానికి ఆమోదం తెలిపాం.

 

స్నేహితులారా,

గడిచిన వంద రోజుల్లో హ‌రిత ఇంధ‌నాన్ని ప్రోత్స‌హించేందుకు మేం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రూ. 7,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే ప్రణాళికలతో, ఆఫ్‌షోర్ ప‌వ‌న విద్యుత్ ప్రాజెక్టుల కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాం. సమీప భవిష్యత్తులో 31,000 మెగావాట్ల జలవిద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు భారత్ కృషి చేస్తోంది, దీని కోసం రూ. 12,000 కోట్లకు పైగా బ‌డ్జెట్టుకు ఆమోదం తెలిపాం.

 

స్నేహితులారా,

భారత‌దేశ‌ వైవిధ్యం, స్థాయి, సామర్థ్యం, స‌మ‌ర్థ‌త‌ పనితీరు అన్నీ అసాధారణమైనవి. అందుకే ప్ర‌పంచవ్యాప్తంగా ఉప‌యోగ‌ప‌డేలా భారతీయ పరిష్కారాలుంటాయ‌ని నేను అంటుంటాను. నా ఈ ఆలోచ‌న‌ను ప్ర‌పంచం బాగా అర్థం చేసుకోవడం ప్రారంభించింది. నేడు, భారతీయులే కాకుండా ప్రపంచం మొత్తం భారత్‌ను 21వ శతాబ్దపు అత్యంత ఆశాజనకమైన అవ‌కాశాల‌నందించే దేశంగా భావిస్తోంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ను పరిగణన‌లోకి తీసుకోండి. దాని తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ప‌లు దేశాల‌కు చెందిన‌వారు మొదటి సౌర విద్యుత్ అంత‌ర్జాతీయ ఉత్స‌వానికి హాజరయ్యారు. ఆ త‌ర్వాత గ్లోబల్ సెమీకండక్టర్ సమ్మిట్ కోసం ప్రపంచం నలుమూలల నుండి ప్ర‌తినిధులు భారత్‌కు వచ్చారు. అదే స‌మ‌యంలోనే పౌర విమానయానానికి సంబంధించిన ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించే బాధ్యతను కూడా భారత్ స్వీకరించింది. ఇప్పుడు, ఈ రోజు మ‌నం గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇక్క‌డ‌ సమావేశమయ్యాం.

 

స్నేహితులారా,

గుజ‌రాత్ లో ఈ గొప్ప కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం కాక‌తాళీయం. శ్వేత విప్ల‌వం లేదా క్షీర విప్ల‌వం జ‌రిగిన నేల ఇది. తీపి లేదా తేనె విప్ల‌వం ఇక్క‌డే సంభ‌వించింది. ఈ నేల‌పైనే సౌర విప్ల‌వం ప్రారంభ‌మైంది.

భారత్‌లో తొలిసారిగా సౌర విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం గుజరాత్. ఇదంతా గుజరాత్‌లో ప్రారంభమైంది, ఆపై మేం జాతీయ స్థాయిలో విస్త‌రించాం. శ్రీ భూపేంద్ర భాయ్ పేర్కొన్నట్లుగా, ప్ర‌పంచంలోనే వాతావరణం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను రూపొందించిన ప్ర‌భుత్వాల్లో గుజరాత్ కూడా ఉంది. భారత్‌లో సౌర విద్యుత్ గురించి పెద్దగా చర్చకు రాని రోజుల్లో గుజరాత్‌లో వందల మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి.

 

స్నేహితులారా,

 

ఈ వేదికకు మహాత్మా గాంధీ-మహాత్మా మందిర్ పేరు పెట్టడం మీరు గమనించే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల సమస్య తలెత్తడానికి చాలా కాలం ముందే దానిపై మహాత్మా గాంధీ ప్రపంచాన్ని హెచ్చరించారు. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే, ప్రకృతికి అనుగుణంగా, కనీస కార్బన్ ఉద్గారాల‌తో ఆయ‌న‌ జీవించిన విష‌యం మ‌న‌కు తెలుస్తుంది. "మన అవసరాలను తీర్చడానికి తగినన్ని వనరులు భూమిపై ఉన్నాయి, కానీ మన దురాశకు స‌రిపోయేంత లేవు" అని ఆయ‌న ఒక గొప్ప విష‌యాన్ని చెప్పారు. మహాత్మా గాంధీ క‌న‌బ‌రిచిన‌ ఈ దార్శనికత భారతదేశ ఉన్న‌త‌ సంప్రదాయాల్లో ఇమిడిపోయింది.. మనకు, హ‌రిత భ‌విష్య‌త్ , నికర సున్నా క‌ర్బ‌న ఉద్గారాలు వంటి భావనలు కేవలం స‌ర‌దా పదాలు కావు. అవి భారత్‌కు చాలా ముఖ్య‌మైన భావ‌న‌లు. అవి భార‌త‌ కేంద్ర ప్ర‌భుత్వంతోపాటు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని సాకు చెప్పి, ఈ నిబ‌ద్ద‌త‌ల‌ను ప‌క్క‌న పెట్ట‌డానికి మాకు అవ‌కాశం ఉంది. ప‌ర్యావ‌ర‌ణానికి నష్టం కలిగించడంలో మా పాత్ర లేదని ప్రపంచానికి చెప్పవచ్చు, కానీ మేం అలా చేయలేదు. బదులుగా, బాధ్యతాయుతమైన చర్యలు చేప‌ట్టాం. మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం త‌పిస్తూ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచాం.

 

నేడు భారత్ కేవలం వర్తమానానికి మాత్రమే కాకుండా రాబోయే వెయ్యి సంవత్సరాలకు పునాది వేస్తోంది. మా లక్ష్యం కేవలం ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాదు, మేం అక్కడే ఉండడం కోసం ప‌ని చేస్తున్నాం. భారత్ తన ఇంధ‌న అవసరాలను పూర్తిగా అర్థం చేసుకుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఏం అవసరమో పూర్తిగా తెలుసుకుంది. మాకు సొంత చమురు, గ్యాస్ నిల్వలులేవని, ఇంధ‌నం విష‌యంలో స్వతంత్రంగాలేమ‌ని తెలుసు. అందువల్ల, మేం మా భవిష్యత్తును సౌరశక్తి, పవన శక్తి, అణుశక్తి జలశక్తి ఆధారంగా నిర్మించుకుంటున్నాం.

 

స్నేహితులారా,

పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన వాతావరణ ల‌క్ష్యాల‌ను షెడ్యూల్ కంటే తొమ్మిదేళ్ల ముందే సాధించాం. త‌ద్వారా వాటిని నెరవేర్చిన మొదటి G-20 దేశంగా భారత్ నిలిచింది. G-20 గ్రూప్‌లో అలా చేసిన ఏకైక దేశం మాది. అభివృద్ధి చెందిన దేశాలు సాధించని వాటిని భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశం సాధించి ఆ విష‌యాన్ని ప్రపంచానికి చాటింది. 2030 నాటికి 500 గిగా వాట్స్ పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి, బహుళ స్థాయుల్లో పని చేస్తున్నాం. హరిత ప‌రివ‌ర్త‌న‌ను ప్రజా ఉద్యమంగా మారుస్తున్నాం. మీరు వీడియోలో చూసినట్లుగా, మా ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను అధ్యయనం చేయమని మీకు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల కోసం ప్రారంభించిన ప్రత్యేకమైన కార్య‌క్ర‌మంద్వారా సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. ఈ పథకంతో భారత్‌లోని ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తిదారుగా మారవచ్చు. ఇప్పటివరకు, 13 మిలియన్లకు పైగా అంటే 1 కోటి 30 లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం పేర్ల‌ను నమోదు చేసుకున్నాయి. ఈ పథకం కింద 3.25 లక్షల ఇళ్లలో వీటి ఏర్పాటు పూర్తయింది.

 

స్నేహితులారా,

 

ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఫలితాలు నిజంగా విశిష్ట‌మైన‌వి. ఉదాహరణకు, నెలకు 250 యూనిట్ల విద్యుత్ వినియోగించే చిన్న కుటుంబాన్నే తీసుకోండి. 100 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి తిరిగి గ్రిడ్‌కు విక్రయిస్తే ఏడాదికి రూ.25 వేలు ఆదా అవుతుంది. అంటే వారి కరెంటు బిల్లుపై పొందే మొత్తం పొదుపు, వారు సంపాదించే ఆదాయం క‌లిపితే సంవత్సరానికి సుమారు రూ. 25,000. ఇప్పుడు ఆ కుటుంబానికి న‌వ‌జాత శిశువు ఉంద‌ని అనుకుంటే వారు ఈ డబ్బును పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టినట్లయితే, ఆ బిడ్డ‌కు 20 ఏళ్లు వచ్చే సమయానికి, వారు 10-12 లక్షల రూపాయలకు పైగా పొదుపు చేసి ఉంటారు. ఈ డబ్బు ఆమె చదువు దగ్గర నుంచి పెళ్లి వరకు ఎంత బాగా ఉపయోగపడుతుందో అనే విష‌యాన్ని ఒక్కసారి ఊహించండి.

 

స్నేహితులారా,

ఈ పథకంతో మరో రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. విద్యుత్తు ఖర్చులను ఆదా చేయడంతో పాటు, ఉపాధి కల్పన , పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ పథకం చోద‌క‌శ‌క్తిగా మారుతోంది. హ‌రిత ఉద్యోగాల (గ్రీన్ జాబ్స్) క‌ల్ప‌న చాలా వేగంగా జ‌ర‌గ‌బోతున్న‌ది. దీనికి వేల మంది విక్రేతలు, లక్షల మంది స్థాపితదారులు అవసరం. ఈ పథకం దాదాపు రెండు మిలియన్లు లేదా 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం కింద, 3 లక్షల మంది యువకులకు నైపుణ్య‌ శిక్షణ ఇవ్వడం, వారిలో 1 లక్ష మందిని సోలార్ పీవీ టెక్నీషియన్లను చేయ‌డం లక్ష్యం. అంతేకాకుండా, ఉత్పత్తి చేసిని ప్రతి 3 కిలోవాట్ల సౌర విద్యుత్తు 50-60 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధిస్తుంది. అంటే ప్ర‌ధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో పాల్గొనే ప్రతి కుటుంబం వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో గణనీయమైన కృషి చేస్తుంది.

 

స్నేహితులారా,

 

21వ శతాబ్దపు చరిత్రను లిఖిస్తే అందులో భారత్ సౌర విప్లవం సువర్ణాక్షరాలతో లిఖిస్తారు.

 

స్నేహితులారా,

 

మ‌న అంత‌ర్జాతీయ అతిథుల‌కు, ఇక్కడి నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన గ్రామం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. దాని పేరు మొధేరా. ఈ గ్రామంలో శతాబ్దాల నాటి సూర్య దేవాలయం ఉంది. ఇది భారతదేశంలోని మొదటి సౌరశక్తితో పనిచేసే గ్రామం. ఇక్కడ అన్నిర‌కాల ఇంధ‌న అవసరాలను సౌరశక్తి ద్వారా తీర్చడం జ‌రుగుతోంది. ఈరోజు, దేశవ్యాప్తంగా ఇలాంటి మరిన్ని సౌరశక్తితో పనిచేసే గ్రామాలను రూపొందించడానికి మేం కృషి చేస్తున్నాం.

 

స్నేహితులారా,

 

నేను ఇటీవల ఇక్కడ జరుగుతున్న ఎగ్జిబిషన్‌ని సందర్శించాను. దానిని చూడటానికి మీరు కూడా సమయాన్ని వెచ్చించమని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య గురించి మీ అందరికీ సుపరిచితమే. రాముడు సూర్యవంశానికి చెందినవాడు. నేను ఎగ్జిబిషన్‌ను సందర్శించినప్పుడు, ఉత్తరప్రదేశ్‌ నుంచి వ‌చ్చిన‌ ఒక స్టాల్‌ను చూశాను. కాశీ పార్లమెంటు సభ్యునిగా సహజంగానే ఉత్తరప్రదేశ్ స్టాల్‌ని సందర్శించాలని భావించి అక్క‌డ‌కు వెళ్లాను. ఆ సంద‌ర్శ‌న‌తో నా కోరిక ఒక‌టి నెర‌వేరిన విష‌యం తెలుసుకొని సంతోషించాను. రాముడికి అంకితం చేసిన ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించినప్పుడు సూర్యవంశీయుడైన శ్రీరామునితో అనుబంధంగ‌ల అయోధ్య‌ నగరాన్ని-మోడల్ సోలార్ సిటీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ విష‌యాన్ని నేను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను. పనులు దాదాపు పూర్తయ్యాయి. అయోధ్యలోని ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయం, ప్రతి సేవ, సౌరశక్తితో నడిచేలా చూడడమే మా లక్ష్యం. ఇప్పటికే అయోధ్యలోని అనేక గృహాలను, సౌకర్యాలను సౌరశక్తికి అనుసంధానించామనే విష‌యాన్ని మీ అంద‌రితో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. అయోధ్యలో పెద్ద సంఖ్యలో సౌరశక్తితో పనిచేసే వీధి దీపాలు, కూడళ్లు, పడవలు, నీటి ఏటీఎంల‌ను, భవనాలను చూడవచ్చు.

 

ఇదే పద్ధతిలో దేశ‌వ్యాప్తంగా సౌర నగరాలుగా అభివృద్ధి చేయాలనుకుంటున్న 17 నగరాలను గుర్తించాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా మన వ్యవసాయ రంగాన్ని, పొలాలను, రైతులను కూడా శక్తిమంతం చేస్తున్నాం. నీటిపారుదల కోసం సోలార్ పంపులు, చిన్న సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవ‌డానికిగాను రైతులకు సహాయం చేస్తున్నాం. పునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన ప్రతి రంగంలో భారత్ వేగంగా, భారీ స్థాయిలో ముందడుగు వేస్తోంది. గత దశాబ్దంలో, అణుశక్తి ద్వారా విద్యుదుత్పత్తిని 35% పెంచాం. దాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడితో హరిత ఉదజని మిషన్‌ను ప్రారంభించిన భారత‌దేశం గ్రీన్ హైడ్రోజన్‌లో గ్లోబల్ లీడర్‌గా ఎదగడానికి కృషి చేస్తోంది. భారత్‌లో వ్య‌ర్థాల‌ నుంచి ఇంధ‌నాన్ని త‌యారు చేయాల‌నే ప్రచారం కూడా జరుగుతోంది. క్లిష్టమైన ఖనిజాలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి వృత్తాకార విధానాన్ని (స‌ర్క్యుల‌ర్ అప్రోచ్) ప్రోత్సహిస్తున్నాం. పునర్వినియోగం, రీసైక్లింగ్ కు సంబంధించి మెరుగైన సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్న అంకుర సంస్థ‌ల‌కు మ‌ద్దతు ఇస్తున్నాం.

 

స్నేహితులారా,

 

‘భూగోళ అనుకూల ప్రజలు’ అన్నది మా నిబద్ధత. ఇందుకోసమే మిషన్ లైఫ్- పర్యావరణానికి జీవనశైలి అనే దార్శ‌నిక‌త‌ను భార‌త‌దేశం ప్రపంచానికి అందించింది. భార‌త్‌ అంతర్జాతీయ సౌరకూటమి ద్వారా వందలాది దేశాలను అనుసంధానించింది. భారత్ G-20 అధ్య‌క్ష స్థానంలో ఉన్న‌ సమయంలో, హ‌రిత ప‌రివ‌ర్త‌న‌పై గ‌ణ‌నీయ‌మైన స్థాయిలో దృష్టి సారించాం. జి-20 శిఖ‌రాగ్ర స‌మావేశం సందర్భంగా గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్‌ను ప్రారంభించాం. తన రైల్వే రంగాన్ని ఈ దశాబ్దం చివరి నాటికి నికర జీరో ఉద్గారన స్థాయికి మార్చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని కూడా భార‌త‌దేశం నిర్దేశించుకుంది. భారత్‌లో నికర- సున్నా రైల్వేలు అంటే ఏమిటి అని కొందరు ఆశ్చర్యపోవచ్చు. దీన్ని నేను వివరిస్తాను. మా రైల్వే వ్యవస్థ విస్తారంగా ఉంది. ప్రతిరోజూ దాదాపు 1-1.5 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు.. ఈ మొత్తం వ్యవస్థను నికర జీరో క‌ర్బ‌న ఉద్గ‌రాల వ్య‌వ‌స్థ‌గా మార్చ‌బోతున్నాం. అదనంగా, 2025 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలని నిర్ణయించుకున్నాం. భారతదేశం అంతటా గ్రామాల్లో నీటి సంరక్షణ కోసం వేలాది అమృత్ సరోవరాల‌ను నిర్మించాం. 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి కోసం ఒక చెట్టు) కార్య‌క్ర‌మం ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలు తమ తల్లుల గౌరవార్థం చెట్లను నాటే సంప్ర‌దాయాన్ని మీరు గమనించే ఉంటారు. మీ అందరితో పాటు ప్రతి ప్రపంచ పౌరుడిని కూడా ఈ ఉద్య‌మంలో భాగం కావాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.

 

స్నేహితులారా,

 

పునరుత్పాదక శక్తి కోసం భార‌త్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను తీర్చడానికి ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తోంది. సాధ్యమైనన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తోంది. అంటే ఇంధన ఉత్పత్తిలోనే కాకుండా తయారీ రంగంలో కూడా అవకాశాలున్నాయని అర్థం. భార‌త‌దేశంలోనే త‌యారీ ప‌రిష్కారాల‌పై దృష్టిని కేంద్రీక‌రించి భారత్ ప్రయత్నాలు కొన‌సాగుతున్నాయి. మీ అందరికీ అనేక అవకాశాలను సృష్టించ‌డం జ‌రుగుతోంది. వ్యాపార‌ విస్తరణ , మెరుగైన రాబడులకు నిజ‌మైన చోటు భార‌త్‌. ఈ ప్రయాణంలో మీరు పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఈ రంగంలో పెట్టుబడులకు భార‌త్ కంటే మంచి దేశం లేదు, ఆవిష్కరణలకు ఇంత కంటే మంచి దేశం లేదు. కొన్నిసార్లు మీడియాలో వ‌స్తున్న‌ గాసిప్ కాలమ్‌ల గురించి ఆలోచిస్తుంటాను. అవి త‌ర‌చుగా చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఆసక్తికరంగా ఉంటాయి. అయితే వారు ఒక విషయాన్ని విస్మరించారు. దాన్ని ఈ రోజు తర్వాత వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇప్పుడే ఇక్కడ ప్రసంగించిన ప్రహ్లాద్ జోషి మన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి. కానీ నా గత ప్రభుత్వంలో ఆయన బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి, నా మంత్రులు కూడా బొగ్గు నుండి పునరుత్పాదక శక్తికి మారారు!

 

భారత్ చేప‌ట్టిన హ‌రిత‌ పరివర్తన కార్య‌క్ర‌మాల్లో పెట్టుబడి పెట్టాలని అందరినీ మరోసారి ఆహ్వానిస్తున్నాను. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ భూమిలో పుట్టిన నాకు గుజరాత్ చాలా నేర్పింది. అందువల్ల, గుజరాత్ ముఖ్యమంత్రితో పాటు, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపి, స్వాగతం పలకడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఇందులో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మాతో చేరిన ముఖ్యమంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు.. ఈ శిఖరాగ్ర సమావేశం, ఇక్క‌డ జ‌రిగే చ‌ర్చ‌లు రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం మ‌న‌ల్ని ఏక‌తాటిపైకి తెస్తాయి.

 

నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ద్వైపాక్షిక చర్చల కోసం భారత్‌లో పర్యటించిన సందర్భం నాకు గుర్తుంది. ఢిల్లీలో నిర్వ‌హించిన‌ విలేకరుల సమావేశంలో ఓ విలేకరి నన్ను ఓ ప్రశ్న అడిగారు. ఆ సమయంలో, వివిధ ప్రపంచ సమస్యల ప‌రిష్కారంకోసం అనేక దేశాలు ప‌లు ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను ప్రకటించాయి. ఆ కార‌ణంగా నాపైన ఏమైనా ఒత్తిడి ఉందా అని జర్నలిస్టు అడిగాడు. ‘‘ఇక్క‌డ ఉన్నది మోదీ. బయటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవు’’ అని నేను బదులిచ్చాను. కానీ నిజం చెప్పాలంటే నేను ఒక ఒత్తిడిలో ఉన్నాను. అది భవిష్యత్ తరాల పట్ల బాధ్యత అనే ఒత్తిడి. పుట్టబోయే పిల్లలు, వారి ఉజ్వల భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందుతున్నాను. నేను మోస్తున్న ఒత్తిడి అదే. అందుకే రాబోయే తరాల సంక్షేమం కోసం నేను కట్టుబడి ఉన్నాను. ఈ శిఖరాగ్ర సమావేశం మన తర్వాత రెండు, మూడు, నాలుగు తరాల ఉజ్వల భవిష్యత్తుకు హామీగా నిలుస్తుంది. నిజం చెప్పాలంటే మీరంద‌రూ కీల‌క‌మైన విజ‌యం సాధించడానికి ఇక్కడకు వచ్చారు, మహాత్మా గాంధీ గౌరవార్థం నిర్మించిన ఈ మహాత్మా మందిరానికి వచ్చారు. మరొక్కసారి, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.

అంద‌రికీ న‌మ‌స్కారాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi extends greetings to Sashastra Seema Bal personnel on Raising Day
December 20, 2025

The Prime Minister, Narendra Modi, has extended his greetings to all personnel associated with the Sashastra Seema Bal on their Raising Day.

The Prime Minister said that the SSB’s unwavering dedication reflects the highest traditions of service and that their sense of duty remains a strong pillar of the nation’s safety. He noted that from challenging terrains to demanding operational conditions, the SSB stands ever vigilant.

The Prime Minister wrote on X;

“On the Raising Day of the Sashastra Seema Bal, I extend my greetings to all personnel associated with this force. SSB’s unwavering dedication reflects the highest traditions of service. Their sense of duty remains a strong pillar of our nation’s safety. From challenging terrains to demanding operational conditions, the SSB stands ever vigilant. Wishing them the very best in their endeavours ahead.

@SSB_INDIA”