యోగా యావత్ ప్రపంచాన్ని ఏకం చేసింది
హద్దులు.. నేపథ్యాలు.. వయస్సు.. సామర్థ్యాలకు అతీతంగా యోగా అందరిదీ
యోగా మనల్ని వసుధైక కుటుంబ భావన దిశగా నడిపిస్తుంది
మనం ఒంటరి కాదు.. ప్రకృతిలో భాగమని యోగా గుర్తు చేస్తుంది
‘నేను’ నుంచి ‘మనం’ అనే భావన దిశగా యోగా మనల్ని నడిపిస్తుంది
విశ్రాంతిగా శ్వాస తీసుకుని, జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ, తిరిగి పరిపూర్ణులయ్యేందుకు మానవాళికి అవసరమైన పాజ్ బటన్ యోగా

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు కె. రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ జాదవ్ ప్రతాపరావు గణపత్‌రావు గారు, చంద్రశేఖర్ గారు, భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీసోదరీమణులందరికీ నా నమస్కారాలు.

భారత్‌తో పాటు.. యావత్ ప్రపంచ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం యావత్ ప్రపంచం ఐక్యంగా యోగా సాధన చేయడం ఈనాటితో 11వ కార్యక్రమం. ఐక్యతే యోగా సారం, యావత్ ప్రపంచాన్ని యోగా ఇలా ఏకం చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. గత దశాబ్ద కాలంగా యోగా ప్రయాణం గురించి తలచుకుంటే నాకు ఎన్నో విషయాలు గుర్తుకు వస్తున్నాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాలని భారత్ ప్రతిపాదించినప్పుడు.. అనతి కాలంలోనే 175 దేశాలు మన ప్రతిపాదనకు మద్దతునిచ్చాయి. ఇది మానవాళికి మేలు చేసేందుకు ప్రపంచం చేసిన సమష్టి ప్రయత్నాన్ని సూచిస్తుంది. పదకొండు సంవత్సరాల తరువాత, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవనశైలిలో నేడు యోగా అంతర్భాగంగా మారింది. దివ్యాంగులైన మిత్రులు బ్రెయిలీలో యోగా గ్రంథాలను చదవడం, శాస్త్రవేత్తలు అంతరిక్షంలో యోగా సాధన చేయడం, యోగా ఒలింపియాడ్స్‌లో గ్రామీణ ప్రాంతాల యువత ఉత్సాహంగా పాల్గొనడం చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి... నావికా దళానికి చెందిన అన్ని నౌకల్లో యోగా దినోత్సవ కార్యక్రమం అద్భుతంగా సాగుతోంది. సిడ్నీ ఒపెరా హౌస్ మెట్ల మీదైనా, ఎవరెస్ట్ శిఖరం దగ్గరైనా, విశాలమైన సముద్రపు తీరంలోనైనా  - యోగా అందరిదీ.. అందరి కోసం గలది అనే సందేశంలో మార్పు ఉండదు. హద్దులు.. నేపథ్యాలు.. వయస్సు.. సామర్థ్యాలకు అతీతంగా యోగా అందరిదీ.

 

మిత్రులారా,

ఈ రోజు మనమంతా విశాఖపట్నంలో కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. ప్రకృతి, అభివృద్ధి సంగమం ఈ నగరం. ఈ కార్యక్రమాన్ని ప్రజలు చాలా బాగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు నా అభినందనలు. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యోగాంధ్ర అభియాన్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమ విజయం కోసం నారా లోకేశ్ గారి కృషిని నేను ప్రత్యేకంగా ప్రశంసించాలనుకుంటున్నాను. గత ఒకటిన్నర నెలలుగా యోగాంధ్ర అభియాన్ ప్రచారం కోసం చేసిన కృషితో యోగాను నిజమైన సామాజిక వేడుకగా.. సమాజంలోని అన్ని వర్గాలను కలిపే వేదికగా చూపిన సోదరుడు లోకేష్‌కు అభినందనలు. ఇటువంటి అవకాశాలను సమాజంలోని అన్ని వర్గాలకు ఎలా చేర్చవచ్చనే దానికి సోదరుడు లోకేశ్ కృషిని దేశ ప్రజలంతా ఉదాహరణగా తీసుకోవాలని కోరుతున్నాను.

మిత్రులారా,

యోగాంధ్ర అభియాన్‌లో రెండు కోట్లకు పైగా ప్రజలు భాగస్వాములయ్యారని నాతో చెప్పారు. ఇది ప్రజల భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ఈ స్ఫూర్తి అభివృద్ధి చెందిన భారత్ కోసం పునాదిగా నిలుస్తుంది. పౌరులు స్వయంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాని సాధన కోసం చురుగ్గా కృషి చేసినప్పుడు.. చేరుకోలేని లక్ష్యం ఏదీ ఉండదు. విశాఖపట్నంలో జరిగిన ఈనాటి కార్యక్రమం అంతటా ప్రజల సద్భావన, వారి ఉత్సాహభరితమైన ప్రయత్నాలే నాకు కనిపించాయి.

 

మిత్రులారా,

ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తం "యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్". ఈ ఇతివృత్తం భూమిపై ఉన్న ప్రతి జీవి ఆరోగ్యం పరస్పరం అనుసంధానమై ఉందనే లోతైన సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. మానవ శ్రేయస్సు.. మనకు అన్నం పెట్టే నేల ఆరోగ్యం, మనకు నీటిని అందించే నదులు, మన పర్యావరణ వ్యవస్థను పంచుకునే జంతువులు, మనల్ని పోషించే మొక్కల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. యోగా మనకు ఈ పరస్పర అనుసంధానాన్ని తెలియజేస్తుంది. ప్రపంచంతో ఏకమయ్యే దిశగా యోగా మనకు మార్గనిర్దేశం చేస్తుంది. మనం ఒంటరి కాదు, ప్రకృతిలో భాగస్వాములమని యోగా బోధిస్తుంది. మొదట్లో మన సొంత ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల మాత్రమే శ్రద్ధ వహించడం నేర్చుకుంటాం. కానీ క్రమంగా ఈ సంరక్షణ మన పర్యావరణం, సమాజం, యావత్ భూమండల ఆరోగ్యం గురించి ఆలోచించే వరకూ విస్తరిస్తుంది. యోగా ఒక లోతైన వ్యక్తిగత క్రమశిక్షణ. ఇది వ్యక్తులను ‘నేను’ నుంచి ‘మనం’ అనే భావన దిశగా నడిపించి మనలో మానవత్వాన్ని పెంపొందిస్తుంది.

మిత్రులారా,

నేను నుంచి మనం వైపు అనే భావన భారత స్ఫూర్తిని సూచిస్తుంది. ఒక వ్యక్తి స్వార్థానికి అతీతంగా ఉండి సమాజం గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడే, మొత్తం మానవాళి సంక్షేమం సాధ్యమవుతుంది. "సర్వే భవంతు సుఖినః" అంటే సర్వజనుల సంక్షేమమే నా పవిత్ర కర్తవ్యం అనే విలువను భారతీయ సంస్కృతి మనకు బోధిస్తుంది. నేను నుంచి మనం వైపు ఈ ప్రయాణం సేవ, అంకితభావం, సహజీవనానికి పునాదిని ఏర్పరుస్తుంది. ఈ ఆలోచనే సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తుంది.

మిత్రులారా,

దురదృష్టవశాత్తూ నేడు ప్రపంచమంతా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో అశాంతి, అస్థిరతలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో యోగా శాంతికి మార్గాన్ని అందిస్తుంది. మానవాళి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని, జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం ద్వారా తిరిగి పరిపూర్ణులుగా మారేందుకు అవసరమైన పాజ్ బటన్ వంటిదే యోగా.

ఈ ముఖ్యమైన సందర్భంలో ప్రపంచ సమాజానికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యోగా దినోత్సవం ప్రపంచానికి అంతఃశాంతిని ప్రసాదించే మానవత 2.0 ప్రారంభాన్ని సూచించేదిగా ఉండేలా మనమంతా కృషి చేయాలి. యోగా కేవలం వ్యక్తిగత అభ్యాసంగా ఉండకుండా, ప్రపంచంతో భాగస్వామ్యాలకు ఒక మాధ్యమంగా పరిణామం చెందాలి. ప్రతి దేశం, ప్రతి సమాజం యోగాను వారి జీవనశైలి, ప్రజా విధానాలతో అనుసంధానించాలి. శాంతి, సమతుల్యత, సుస్థిరత దిశగా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సమష్టి కృషి అవసరం. యోగా ప్రపంచాన్ని సంఘర్షణ నుంచి సహకారానికి, ఒత్తిడి నుంచి పరిష్కారాలకు నడిపించాలి.

 

మిత్రులారా,

యోగాను ప్రపంచవ్యాప్తం చేయడం కోసం ఆధునిక పరిశోధనల ద్వారా యోగ శాస్త్రాన్ని బలోపేతం చేయడానికి భారత్ కృషి చేస్తోంది. దేశంలోని ప్రముఖ వైద్య సంస్థలు యోగా పరిశోధనలో చురుగ్గా నిమగ్నమై ఉన్నాయి. సమకాలీన వైద్య పద్ధతులతో యోగ శాస్త్రీయ ఔచిత్యాన్ని అనుసంధానించే లక్ష్యంతో వారు కృషి చేస్తున్నారు. భారత్ తన వైద్య, పరిశోధనా సంస్థల ద్వారా యోగా రంగంలో సాక్ష్యాధారిత చికిత్సను ప్రోత్సహిస్తోంది. ఈ దిశలో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కృషి ప్రశంసనీయం. గుండె, నాడీ సంబంధిత రుగ్మతల చికిత్సలో, అలాగే మహిళల ఆరోగ్యం, మానసిక శ్రేయస్సును మెరుగుపరచడంలో యోగా గణనీయమైన ప్రభావాన్ని ఎయిమ్స్ పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

 

మిత్రులారా,

జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా యోగా- ఆరోగ్యం గురించిన ప్రచారం చురుగ్గా సాగుతోంది. ఈ ప్రయత్నంలో డిజిటల్ టెక్నాలజీ గణనీయమైన పాత్ర పోషించింది. యోగా పోర్టల్, యోగాంధ్ర పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగా కార్యక్రమాలు నమోదయ్యాయి. నేడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇది వేగంగా విస్తరిస్తున్న యోగా పరిధిని ప్రతిబింబిస్తుంది.

మిత్రులారా,

హీల్ ఇన్ ఇండియా మంత్రానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ మనకు తెలుసు. వైద్యం కోసం ప్రముఖ గమ్యస్థానంగా భారత్ ఆవిర్భవించింది. ఈ అభివృద్ధిలో యోగా కీలక పాత్ర పోషిస్తోంది. యోగా కోసం ఒక సాధారణ ప్రోటోకాల్ అభివృద్ధి చేయడం సంతోషం కలిగించింది. యోగా సర్టిఫికేషన్ బోర్డు ద్వారా 6.5 లక్షలకు పైగా శిక్షణ పొందిన వాలంటీర్లు, దాదాపు 130 గుర్తింపు పొందిన సంస్థలు, వైద్య కళాశాలల్లో 10 రోజుల యోగా మాడ్యూల్, ఇటువంటి అనేక ప్రయత్నాలు సమగ్ర ఆరోగ్య వ్యవస్థను రూపొందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లోనూ శిక్షణ పొందిన యోగా ఉపాధ్యాయులను నియమించాం. భారత ఆరోగ్య వ్యవస్థ నుంచి ప్రపంచ సమాజం ప్రయోజనం పొందేలా చూసేందుకు, ప్రత్యేక ఇ-ఆయుష్ వీసాలను అందించనున్నాం.

 

మిత్రులారా,

ఈరోజు యోగా దినోత్సవ సందర్భంగా మీ అందరితో స్థూలకాయం సమస్య గురించి మరోసారి ప్రస్తావించాలనుకుంటున్నాను. పెరుగుతున్న స్థూలకాయ సమస్య ప్రపంచవ్యాప్త సవాలుగా మారింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ సమస్య గురించి వివరంగా చర్చించాను. దీని కోసం రోజువారీ ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించే సవాలును కూడా నేను ప్రారంభించాను. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మన భోజనంలో కనీసం 10 శాతం నూనె వినియోగాన్ని ఎలా తగ్గించుకోవచ్చనే విషయంగా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నూనె వినియోగాన్ని తగ్గించడం, అనారోగ్యకరమైన ఆహారాన్ని నివారించడం, యోగా సాధన చేయడం ఆరోగ్యకరమైన జీవనశైలిలో ముఖ్యమైన భాగాలు.

 

మిత్రులారా,

మనమంతా యోగాను ఒక జన ఆందోళన్ అంటే ఒక ప్రజా ఉద్యమంగా మార్చుదాం. ప్రపంచాన్ని శాంతి, ఆరోగ్యం, సామరస్యం వైపు నడిపించే ఉద్యమంగా మార్చుదాం. జీవితంలో సమతుల్యతను తీసుకురావడానికి ప్రతి వ్యక్తి యోగాతో దైనందిన జీవితాన్ని ప్రారంభించాలి. ఒత్తిడి లేని జీవితం కోసం ప్రతి సమాజం యోగాను స్వీకరించాలి. యోగా మానవాళిని ఏకం చేసే మాధ్యమంగా పనిచేయాలి. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదం ప్రపంచ సంకల్పంగా మారాలి. మరోసారి, ఆంధ్ర నాయకత్వాన్ని, ఆంధ్ర ప్రజలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా సాధకులు, యోగా ప్రియులను అభినందిస్తున్నాను. మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions