మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ఆవిష్కరించడం నాకు దక్కిన గౌరవం
సమృద్ధ భారతం, ప్రతి ఒక్కరికీ సాధికారత కల్పన.. వీటి కోసం ఆయన కన్న కలలు తరాల తరబడి ప్రేరణను అందిస్తున్నాయి: ప్రధానమంత్రి
మన దేశంలో, మాటలను కేవలం వ్యక్తీకరణలుగా భావించరు... ‘శబ్ద బ్రహ్మ’ను గురించి, మాటలకున్న అనంతమైన శక్తిని గురించి వివరించే సంస్కృతిలో మనం ఓ భాగంగా ఉన్నాం: ప్రధానమంత్రి
భరతమాత సేవకు తనను అంకితం చేసుకున్న, ఓ విస్తార ఆలోచనపరుడు సుబ్రహ్మణ్య భారతి గారు

కేంద్ర మంత్రులు శ్రీయుతులు గజేంద్ర సింగ్ షెఖావత్ గారు, రావు ఇందర్జీత్ సింగ్ గారు, ఎల్ మురుగన్ గారు, ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు - సాహితీవేత్త శ్రీ శీని విశ్వనాథన్ గారు, ప్రచురణకర్త శ్రీ వీ శ్రీనివాసన్ గారు, విశిష్ఠ అతిథులు, కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు.

నేడు దేశం మహాకవి సుబ్రమణ్య భారతి జయంతిని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వారికి గౌరవ పూర్వక నివాళులర్పిస్తున్నాను. భారతీయ సంస్కృతీ సాహిత్యాలకి, దేశస్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలకు, తమిళుల గౌరవానికి ఇవి అపురూపమైన క్షణాలు! మహాకవి సుబ్రమణ్య భారతి రచనల ప్రచురణను అత్యున్నతస్థాయి సేవగా పరిగణిస్తున్నాను. పరిపూర్ణమైన గొప్ప ఆధ్యాత్మిక యత్నమిది. 21 సంపుటాల్లో తయారైన 'కాల వరిసైయిల్ భారతియార్ పడైప్పుగళ్' సంకలనం అసాధారణమైన, అపూర్వమైన విజయానికి ప్రతీక. ఎంతో స్థైర్యంతో చేపట్టిన ఆరు దశాబ్దాల అవిరామ కృషికి దక్కిన అద్భుత ఫలితం. అనితరసాధ్యమనిపించే ఈ సాఫల్యం శ్రీ శీని విశ్వనాథన్  గారి కృషికీ, అంకితభావానికీ నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తు తరాలకు ఈ సంకలనం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. "ఒకే జీవితం, ఒక లక్ష్యం" అన్న మాటని మనం తరచుగా వింటుంటాం కానీ శ్రీ శీని ఆ మాటను నిజం చేసి చూపారు. అపురూపమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచిన ఆయన శ్రమ, ధర్మశాస్త్ర చరిత్రను రాయడానికి 35 ఏళ్ల సమయాన్ని వెచ్చించిన మహామహోపాధ్యాయ పాండురంగ్ వామన్ కానే గారిని గుర్తుకు తెచ్చింది. శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషి విద్యారంగంలో నూతన ప్రమాణాలను పాదుకొల్పగలదని విశ్వసిస్తున్నాను. గొప్ప ఫలితాన్ని సాధించిన విశ్వనాథన్ గారికి, ఆయన బృందం సహా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

ఈ 23 సంపుటాల 'కాల వరిసైయిల్ భారతియార్ పడైప్పుగళ్' లో కేవలం భారతి గారి సాహిత్య సృజనలే కాకుండా రచనల నేపథ్యం, తాత్విక విశ్లేషణలు కూడా ఉన్నాయని తెలుసుకున్నాను. ప్రతి సంపుటిలో వ్యాఖ్యానాలు, వివరణలు, టీకా తాత్పర్యాలు ఉన్నాయి.  ఇవి భారతి గారి ఆలోచనలను లోతుగా అర్థం చేసుకునేందుకు, అప్పటి పరిస్థితులను ఆకళింపు చేసుకునేందుకు సహాయపడతాయి. ఈ సంకలనం పరిశోధకులకు, సాహితీ పిపాసులకూ  విలువైన వనరుగా  ఉపయోగపడగలదు.

మిత్రులారా…

ఈరోజు పవిత్రమైన గీతా జయంతిని కూడా జరుపుకుంటున్నాం. సుబ్రమణ్య భారతి గారికి గీత పట్ల అపారమైన భక్తిశ్రద్ధలు, లోతైన అవగాహనా ఉన్నాయి. వారు గీతను తమిళంలోకి అనువదించడమే కాక అందరికీ సులభంగా అర్ధమయ్యే రీతిలో సరళమైన వ్యాఖ్యానాన్ని కూడా అందించారు. యాదృచ్ఛికంగా ఈ రోజున గీతా జయంతి, సుబ్రమణ్య భారతి గారి జయంతి, వారి రచనల విడుదల వేడుక అనే మూడు గొప్ప సందర్భాలూ కలిసిన రోజు – ఇది త్రివేణి సంగమాన్ని తలపిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా దేశవాసులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా…

మన సంస్కృతిలో పదాలు కేవలం భావవ్యక్తీకరణ సాధనాలు మాత్రమే కాదు. మాటలకు గల దైవీక శక్తిని 'శబ్ద బ్రహ్మ' గా భావించే సంస్కృతి మనది.. పదాలు వెలువరించే అనంతమైన శక్తిని మనం గుర్తిస్తాం. అందువల్లే రుషులు, మహాత్ములు, మేధావుల మాటలు వారి ఆలోచనలకు మాత్రమే ప్రతిబింబాలు కావని, వారి చింతన, అనుభవాలు, భక్తి సారం మాటల ద్వారా వెలువడతాయని నమ్ముతున్నాం. అటువంటి మహనీయుల అపురూపమైన జ్ఞానాన్ని భావి తరాల కోసం భద్రపరచడం మన కర్తవ్యం. మన సంప్రదాయంలో ఉన్నట్లుగానే, నేటి ఆధునిక యుగంలోనూ ఈ సంకలనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకు వ్యాస భగవానుడి సృజనగా భావించే అనేక రచనలు నేటికీ మనకు అందుబాటులో ఉన్నాయంటే, అవి క్రమపద్ధతిలో పురాణాలలోకి సంకలనం కావడమే కారణం. అదే విధంగా, ‘స్వామి వివేకానంద సంపూర్ణ రచనలు’, ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్: రచనలు, ప్రసంగాలు’, ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ సంపూర్ణ వాంగ్మయం’ వంటి ఆధునిక సంకలనాలు సమాజానికి, విద్యారంగానికి అమూల్యమైనవి. తిరుక్కురల్‌ని వివిధ భాషల్లోకి అనువదించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం, పాపువా న్యూ గినీ దేశంలో ‘టోక్ పిసిన్’ భాషలో తిరుక్కురల్ అనువాదాన్ని విడుదల చేసే అవకాశం కలిగింది. అంతకు ముందు ఇక్కడే లోక్ కళ్యాణ్ మార్గ్‌ లో తిరుక్కురల్ గుజరాతీ అనువాదాన్ని కూడా విడుదల చేశాను.

 

మిత్రులారా…

సుబ్రమణ్య భారతి దేశ అవసరాలకు అనుగుణంగా పనిచేసిన దార్శనికుడు, విస్తృతమైన దృక్పథంతో అనేక రంగాల్లో పని చేశారు. ఆయన గొప్పదనం కేవలం తమిళనాడు వాసులు, తమిళ భాష మాట్లాడే వారికి మాత్రమే  పరిమితం కాదు. తన ప్రతి ఆలోచన, ప్రతి శ్వాస భారతమాత సేవకే అంకితం చేసిన మహనీయ దేశభక్తుడు శ్రీ భారతి. పురోభివృద్ధి సాధించిన భారతదేశపు కీర్తి దశదిశలా వ్యాపించాలని శ్రీ  భారతి కలలు కన్నారు. ఆయన రచనలను సామాన్య ప్రజలకు చేరువ చేసేందుకు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. 2020లో కోవిడ్ సవాళ్ళు ఎదురైనప్పటికీ, భారతి గారి 100వ వర్ధంతిని ఘనంగా నిర్వహించాం. అంతర్జాతీయ భారతి ఉత్సవాల్లో నేను వ్యక్తిగతంగా పాల్గొన్నాను. ఎర్రకోట నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించినా, అంతర్జాతీయ సమాజంతో చర్చిస్తున్నా, నేను శ్రీ భారతి ఆలోచనల్లోని భారత దేశాన్ని గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చాను. శ్రీ శీని పేర్కొన్నట్లుగా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా, సుబ్రహ్మణ్య భారతి గురించి అక్కడి వారితో పంచుకున్నాను. ఈ విషయాన్ని కూడా శీని గారు సంకలనంలో ప్రస్తావించారు. మీకు తెలుసా? నాకూ సుబ్రమణ్య భారతి గారికీ మధ్య సజీవమైన, ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. అదే మన కాశీ. కాశీతో భారతి బంధం, ఇక్కడ గడిపిన సమయం, కాశీ వారసత్వంలో అంతర్భాగంగా మారింది. జ్ఞానాన్వేషణలో కాశీకి వచ్చిన ఆయన నగరంతో మమేకమయ్యారు. ఆయన కుటుంబంలోని చాలా మంది సభ్యులు ఇప్పటికీ కాశీలో నివసిస్తున్నారు. వారితో అనుబంధం కలిగి ఉండటం నా అదృష్టం. కాశీలో నివసిస్తున్న సమయంలోనే భారతియార్ విలక్షణమైన మీసకట్టు గురించి  నిర్ణయించుకున్నారని చెబుతారు. కాశీ గంగానది ఒడ్డున కూర్చుని అనేక రచనలు చేశారు. కాశీ పార్లమెంటు సభ్యునిగా ఆయన రచనలను సంకలనం చేసే ఈ పవిత్ర కార్యాన్ని గౌరవంగా భావిస్తున్నాను. హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్ యూ)లో మహాకవి భారతియార్ రచనలకు అంకితమైన పీఠాన్ని ఏర్పాటు చేయడం మా ప్రభుత్వానికి దక్కిన అపురూపమైన గౌరవం.

 

మిత్రులారా…

సుబ్రమణ్య భారతి యుగానికొక్కడు అనిపించే  అరుదైన వ్యక్తి. ఆయన ఆలోచనలు, మేధ, బహుముఖ ప్రజ్ఞ నేటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. కేవలం 39 సంవత్సరాల స్వల్ప జీవితంలో భారతి చేసిన అద్భుతమైన రచనలను వివరించేందుకూ విశ్లేషించేందుకూ పండితులు తమ జీవితాన్నంతా వెచ్చిస్తున్నారు. 39 సంవత్సరాలు మాత్రమే జీవించినప్పటికీ, ఆరు దశాబ్దాల వరుకూ ఆయన చేపట్టిన కార్యాలు విస్తరించాయి. ఆటపాటల్లో గడపవలసిన బాల్యంలో తోటివాళ్ళలో జాతీయ భావాన్ని నింపేందుకు ప్రయత్నించేవారు. ఒక వైపు ఆధ్యాత్మికత అన్వేషణలో గడుపుతూనే, ఆధునికతకు పట్టం కట్టేవారాయన. భారతి రచనలు ప్రకృతి పట్ల ఆయనకు గల ప్రేమను, మంచి భవిష్యత్తు కోసం పడ్డ తపనను ప్రతిబింబిస్తాయి. స్వాతంత్ర్య పోరాట సమయంలో అతను స్వేచ్ఛ కోసం నినదించడమే కాక, స్వేచ్ఛగా ఉండే అవసరాన్ని భారతీయులకు అర్ధమయ్యేలా వారి హృదయాలను కదిలించాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం! భారతి మాటల్ని ఉటంకించే ప్రయత్నం చేస్తాను. నా తమిళంలో ఏవైనా ఉచ్చారణ దోషాలుంటే దయచేసి మన్నించండి.. “ఎన్త్రు తణియుమ్, ఇంద సుదన్తిర దాగమ్.. ఎన్త్రు మడియుమ్ ఎంగళ్ అడిమైయ్యిన్  మోగమ్” ఈ మాటల అర్ధం చెబుతాను.. “మా స్వాతంత్ర్య దాహం ఎప్పటికి తీరుతుంది?  దాస్యం నుంచీ ఎన్నడు విముక్తులమవుతాం?” ఆ కాలంలో కొందరు బానిసత్వాన్ని పట్టించుకునేవారు కాదు. భారతి వారిని తీవ్రంగా విమర్శించారు: "బానిసత్వంతో ఈ అనుబంధం ఎప్పుడు ముగుస్తుంది?" అని ప్రశ్నించారు. ఆత్మపరిశీలన చేసుకునే ధైర్యం, గెలుస్తామన్న ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి నుంచి మాత్రమే ఇటువంటి పిలుపు రాగలదు! ఇదీ భారతియార్ ప్రత్యేకత... ముక్కుసూటిగా మాట్లాడుతూనే సమాజానికి సరైన దిశానిర్దేశం చేశారు. పాత్రికేయ రంగంలోనూ ఆయన విశేష కృషి చేశారు. 1904లో 'స్వదేశమిత్రన్' అనే తమిళ వార్తాపత్రికలో చేరారు. అటు తర్వాత 1906లో (విప్లవ స్ఫూర్తికి ప్రతీకగా) ఎరుపు రంగు కాగితం పై ‘ఇండియా’ అనే వారపత్రిక ప్రచురణను ప్రారంభించారు. తమిళనాడులో రాజకీయ కార్టూన్లను ముద్రించిన తొలి వార్తాపత్రిక ఇదే. బలహీనులు, అట్టడుగు వర్గాలకు సహాయం చేయాలని భారతి ఉద్బోధించేవారు. ‘కణ్ణన్ పాట్టు’ అనే కవితా సంకలనంలో శ్రీకృష్ణుడిని 23 రూపాల్లో ఊహించాడు. ఒక కవితలో పేద కుటుంబాల కోసం బట్టలు విరాళంగా ఇవ్వాలని ధనికులను కోరతారు.  దాతృత్వ స్ఫూర్తితో నిండిన ఆయన కవితలు నేటికీ మనలో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి.

మిత్రులారా…

భారతియార్ దార్శనిక దృష్టితో భవిష్యత్తును అర్థం చేసుకునేవారు. అప్పటి సమాజం వివిధ సంఘర్షణలతో సతమతమవుతున్నా, భారతియార్ యువత, మహిళా సాధికారత కోసం గళం విప్పారు. భారతియార్‌కు విజ్ఞాన శాస్త్రం, సృజనాత్మక ఆవిష్కరణలపై అపారమైన నమ్మకం ఉండేది. దూరాలను తగ్గిస్తూ మొత్తం దేశాన్ని ఏకం చేసే కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి ఆయన ఆలోచనలు చేసేవారు. భారతియార్ ఊహాల్లోని సాంకేతికతను నేడు మనం అనుభవిస్తున్నాం. "కాశీనగర్ పులవర పేశుమ్, ఉరైదాన్.. కాంచియిల్ కేట్పదక్కోర్ కరువిచెయ్వోమ్..” అని అన్నారు శ్రీ భారతి. కంచిలో కూర్చుని, కాశీ మహాత్ముల మాటలని వినాలి, అటువంటి పరికరం కావాలి” అని అర్ధం. డిజిటల్ ఇండియా అటువంటి కలలను ఏవిధంగా నిజం చేసిందో మనకు తెలుసు. 'భాషిణి' వంటి యాప్‌లు భాషల మధ్య గల అడ్డంకుల్ని చెరిపివేశాయి. భారతదేశంలోని ప్రతి భాష పట్ల గౌరవం కలిగి, ప్రతి భాషను చూసి గర్విస్తే, ప్రతి భాషను కాపాడుకోవాలనే చిత్తశుద్ధితో కృషి చేస్తే, అప్పుడే నిజమైన భాషా సేవ జరిగినట్లవుతుంది.

మిత్రులారా…

మహాకవి భారతి సాహిత్యం పురాతన తమిళ భాషకు పెన్నిధి. మన తమిళ భాష ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన భాష అని మనం గర్విస్తున్నాం. భారతి సాహిత్యాన్ని వ్యాప్తి చేసినప్పుడు, తమిళ భాషకు కూడా సేవ చేస్తున్నట్లే కదా! అదేవిధంగా తమిళానికి సేవ చేస్తున్నప్పుడు, ఈ దేశంలోని అత్యంత ప్రాచీన వారసత్వాన్ని కాపాడుతున్నట్లే కదా!

 

సోదర సోదరీమణులారా, 

గత 10 సంవత్సరాలలో తమిళ భాష వైభవదీప్తి కోసం దేశం అంకితభావంతో కృషి  చేసింది.  ఐక్యరాజ్యసమితిలో పాల్గొన్న సందర్భంలో నేను  మొత్తం ప్రపంచం ముందు తమిళ భాషా విభవాన్ని ప్రదర్శించాను. ఇక ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. ‘సుబ్రమణ్య భారతి ఆలోచనలను ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి ప్రతిబింబిస్తుంది. దేశంలోని విభిన్న సంస్కృతులను అనుసంధానించాలని భారతియార్ భావించేవారు. నేడు ‘కాశీ తమిళ సంగమం’, ‘సౌరాష్ట్ర తమిళ సంగమం’ వంటి కార్యక్రమాలు అదే పనిని చేస్తున్నాయి. తమిళం గురించి తెలుసుకోవాలనీ, తమిళ భాష నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ కార్యక్రమాలు పెంచుతున్నాయి. అదే సమయంలో తమిళనాడు సంస్కృతికి కూడా ప్రచారం లభిస్తోంది. దేశంలోని ప్రతి పౌరుడు దేశంలోని ప్రతి భాషను తమ భాషగా స్వీకరించి, ఒక్కో భాష పై అభిమానం పెంచుకోవాలన్నది ప్రభుత్వ ఆశయం. తమిళం వంటి ఇతర భారతీయ భాషలను ప్రోత్సహించే దిశగా యువతకు వారి మాతృభాషలోనే  ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించాం.

 

మిత్రులారా…

భారతి సమగ్ర సాహిత్య సంకలనం తమిళ భాషా వ్యాప్తికి సంబంధించిన యత్నాలకు మరింత ప్రోత్సాహం అందించగలదని నేను విశ్వసిస్తున్నాను. అందరం కలిసి ‘వికసిత్ భారత్’ (పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యాన్ని చేరుకుందాం, భారతియార్ కలలను నెరవేరుద్దాం. విలువైన ఈ సంకలన ప్రచురణ సందర్భంలో మరోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. జీవితపు ఈ దశలో ఒక తమిళప్రాంత వాసి  ఢిల్లీ చలిని తట్టుకుంటూ ఎంతటి అంకితభావంతో పనిచేసి ఉంటారో ఊహించేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను భారతి గారు స్వయంగా రాసిన నోట్స్ చూస్తున్నాను.. ఎంతటి అందమైన దస్తూరి! ఈ వయసులో సంతకాలు చేసే సమయంలో కూడా చెయ్యి వణుకుతుంది,  కానీ ఆయన చేతిరాత మాత్రం ఆయన భక్తికి, తపస్సుకు ప్రతీక. మీ అందరికీ హృదయపూర్వక నమస్సులు. వణక్కం!  ధన్యవాదాలు!

 

మిత్రులారా…

భారతి సమగ్ర సాహిత్య సంకలనం తమిళ భాషా వ్యాప్తికి సంబంధించిన యత్నాలకు మరింత ప్రోత్సాహం అందించగలదని నేను విశ్వసిస్తున్నాను. అందరం కలిసి ‘వికసిత్ భారత్’ (పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యాన్ని చేరుకుందాం, భారతియార్ కలలను నెరవేరుద్దాం. విలువైన ఈ సంకలన ప్రచురణ సందర్భంలో మరోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. జీవితపు ఈ దశలో ఒక తమిళప్రాంత వాసి  ఢిల్లీ చలిని తట్టుకుంటూ ఎంతటి అంకితభావంతో పనిచేసి ఉంటారో ఊహించేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను భారతి గారు స్వయంగా రాసిన నోట్స్ చూస్తున్నాను.. ఎంతటి అందమైన దస్తూరి! ఈ వయసులో సంతకాలు చేసే సమయంలో కూడా చెయ్యి వణుకుతుంది,  కానీ ఆయన చేతిరాత మాత్రం ఆయన భక్తికి, తపస్సుకు ప్రతీక. మీ అందరికీ హృదయపూర్వక నమస్సులు. వణక్కం!  ధన్యవాదాలు!

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to a mishap in Nashik, Maharashtra
December 07, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Nashik, Maharashtra.

Shri Modi also prayed for the speedy recovery of those injured in the mishap.

The Prime Minister’s Office posted on X;

“Deeply saddened by the loss of lives due to a mishap in Nashik, Maharashtra. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi”