రాజ్యసభలో ప్రధాని ప్రసంగం

Published By : Admin | March 18, 2026 | 11:30 IST
రాజకీయాల్లో ముగింపు ఉండదు.. మీ అనుభవం, కృషి దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి: పీఎం
సమాజం ఇచ్చిన బాధ్యతలకు కట్టుబడి ఉండటాన్ని ఈ సీనియర్ నాయకుల నుంచి నేర్చుకోవాలి: పీఎం
ఈ వారసత్వం పార్లమెంటరీ వ్యవస్థను సుసంపన్నం చేసే నిరంతర ప్రక్రియ: పీఎం
రెండో అభిప్రాయం పార్లమెంటరీ వ్యవస్థకు అపారమైన బలం.. మన ప్రజాస్వామ్యానికి ఈ రెండో అభిప్రాయం అందించే విలువైన సహకారాన్ని సుమున్నతంగా గౌరవించుకోవాలి: పీఎం
దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించటానికి, వ్యక్తిగత ఎదుగుదలకు ఇక్కడ గడిపిన ఆరేళ్లు ఎంతో కీలకం: పీఎం
పదవీ విరమణ పొందుతున్న సభ్యులు అధికార వ్యవస్థలో ఉన్నా, స్వతంత్రంగా సామాజిక సేవ చేస్తున్నా దేశ నిర్మాణానికి వారు అందించిన అమూల్యమైన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: పీఎం

ఈ ప్రత్యేక సందర్భంలో నా భావాలను వ్యక్తపరిచేందుకు అవకాశాన్నిచ్చిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

గౌరవాధ్యక్షా,

ఈ సభలో ఎన్నో అంశాలపై చర్చలు జరుగుతుంటాయి. తగురీతిలో ప్రతి ఒక్కరూ తమవంతు సహకారాన్ని అందిస్తారు. తీపి, చేదు అనుభవాలు రెండూ ఇక్కడుంటాయి. అయితే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు.. సహజంగానే మనం పార్టీలకతీతంగా ఆలోచిస్తాం. మరో ప్రత్యేక బాధ్యతతో ఇప్పుడు మన సహచరులు ముందుకెళ్తున్నారన్న భావన మనందరిలోనూ కలుగుతుంది. ఈ రోజు వీడ్కోలు పొందుతున్న సహచరుల్లో.. మళ్లీ వచ్చే ఉద్దేశంతో కొందరు వెళ్తుండగా, ఇక్కడి అనుభవాన్ని సమాజంలోకి తీసుకెళ్లి విశేష సేవలందించే సంకల్పంతో మరికొందరు వెళ్తున్నారు. మళ్లీ ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేనివారికి నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే - రాజకీయాల్లో ఎప్పుడూ ముగింపు ఉండదు. ఇకముందూ సమాజానికి మీ సేవలెంతో అవసరం. మీ అనుభవమూ, సేవలూ జాతి జీవనంలో భాగంగా ఎన్నటికీ నిలిచి ఉంటాయి.

గౌరవాధ్యక్షా,

వీడ్కోలు పొందుతున్న సభ్యుల్లో సభా సమావేశాలు లేని సమయంలో కొందరు పదవీకాలాన్ని ముగించుకుని వెళ్తారు. మరికొందరు ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వెళ్తున్నారు. ఈ గౌరవ సభ్యులంతా సభకు అత్యున్నతమైన సేవలందించారు. ముఖ్యంగా గౌరవ దేవెగౌడ గారు, ఖర్గే గారు, శరద్ పవార్ గారి గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ అగ్రశ్రేణి నాయకులు తమ జీవితంలో సగానికి పైగా పార్లమెంటరీ కార్యకలాపాలకే అంకితం చేశారు. ఇంతటి సుదీర్ఘ అనుభవమున్న వీరి నుంచి కొత్త సభ్యులందరూ ఎంతో నేర్చుకోవాలి. సభ పట్ల వారికి ఉన్న అంకితభావం, శక్తివంచన లేకుండా సేవలందించాలన్న వారి తపన, సమాజం తమకు అప్పగించిన బాధ్యతల పట్ల వారికి ఉన్న నిబద్ధత ఆదర్శనీయం. ఈ సీనియర్ నాయకుల నుంచి మనమంతా దీన్ని నేర్చుకోవాలి. వారి సేవలను నేనెంతగానో అభినందిస్తున్నాను. ఇంత సుదీర్ఘ పదవీకాలం చిన్న విషయం కాదు.. ఇది చాలా విశేషమైనది. అదేవిధంగా మన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గారు కూడా వీడ్కోలు అందుకుంటున్నారు. ఈ సభకు సుదీర్ఘకాలం సేవలందించే అవకాశం హరివంశ్ గారికి లభించింది. ఆయన మృదుభాషి. సభ నిర్వహణలో అందరి విశ్వాసాన్నీ పొందేందుకు ఎప్పుడూ ప్రయత్నించేవారు. నేను గమనించినదేమిటంటే.. సభలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు, చాలావరకూ డిప్యూటీ చైర్మన్‌నే బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరుతారు. ఆ విధంగా ఆయనకు విశేషమైన అనుభవంతోపాటు అందరితోనూ సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన సేవలు అమూల్యమైనవి. సభా సమావేశాలు లేని సమయంలో ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి, యువతను కలుస్తూ, దేశ పరిస్థితులపై వారికి అవగాహన కల్పిస్తూ, దేశం పట్ల వారిలో బాధ్యతా భావాన్ని పెంపొందించడాన్ని కూడా నేను చూశాను. ఆయన కలం పట్టిన మేధావి మాత్రమే కాదు.. కార్యశీలి కూడా. దేశ నలుమూలలా అలుపెరుగని కృషి చేశారాయన.

గౌరవాధ్యక్షా,

ఒకప్పుడు సభలో ఎప్పుడూ చలోక్తులు వినిపించేవి. వ్యంగ్యాస్త్రాలనూ విసురుకునేవాళ్లు. అయితే ఈ హాస్యచతురత ఈ రోజుల్లో క్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. 24x7 మీడియా కాలంలో అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే, మన అథవాలే గారు దీనికి మినహాయింపు. ఆయనెప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. ఆయనిప్పుడు సభను వీడుతున్నప్పటికీ, ఆ లోటు ఎవరికీ తెలియనివ్వరనీ.. తనదైన శైలిలో హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ పంచుతూనే ఉంటారనీ నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.

గౌరవాధ్యక్షా,

రెండేళ్లకోసారి చాలా మంది సభ్యులు మన నుంచి వీడ్కోలు తీసుకుంటారు. అయితే వెంటనే వచ్చే కొత్త సభ్యులు.. ఇక్కడ నాలుగేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ అనుభవమున్నవారి నుంచి నేర్చుకునే అవకాశాన్ని ఈ వ్యవస్థ కల్పిస్తుంది. ఆ విధంగా ఈ సభా పరంపర ఒక నిరంతర ప్రక్రియలా కొనసాగుతుంది. ఇదొక గొప్ప సానుకూలమైన అంశం. ఈ సారి పదవీ విరమణ పొందని సభ్యులు కూడా గౌరవ కొత్త సభ్యులతో తమ అనుభవాలను పంచుకుంటారనీ, వారి సేవలతో సభ మరింత పరిపుష్టమవుతుందని నేను కచ్చితంగా చెప్పగలను.

గౌరవాధ్యక్షా,

రోజువారీగా మన జీవితంలో అయినా, ప్రజా జీవితంలో అయినా ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కుటుంబమంతా కలిసి కూర్చుని చర్చించుకుంటాం. అప్పటికీ ‘‘మరొకరిని అడుగుదామా, ఇంకొకరి సలహా తీసుకుందామా, ఎవరైనా పెద్ద మనిషిని సంప్రదిద్దామా’’ అనుకుంటూనే ఉంటాం. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే.. ‘‘మరో డాక్టరును కూడా అడిగి చూడండి’’ అంటుంటారు. రెండో అభిప్రాయానికి మన జీవితాల్లో అంతటి ప్రాధాన్యముంది. మన పార్లమెంటరీ వ్యవస్థలో కూడా ఈ రెండో అభిప్రాయమనే శక్తి అత్యంత కీలకమైనదని నేను బలంగా నమ్ముతున్నాను. ఒక సభలో తీసుకున్న నిర్ణయం రెండో అభిప్రాయం కోసం మరో సభకు వెళ్తుంది. ఇక్కడ ఏదైనా నిర్ణయం జరిగితే అక్కడికి, అక్కడ జరిగితే ఇక్కడికి వస్తుంది. మొత్తం చర్చకూ, నిర్ణయాధికార ప్రక్రియకూ కొత్త కోణాన్ని జోడిస్తూ.. ఈ రెండో అభిప్రాయం దాన్ని మరింత పరిపుష్టం చేస్తుంది. తద్వారా ఉభయ సభల్లో ఉన్న గౌరవనీయ సభ్యులు కొత్త దృక్పథాలను ఆహ్వానించేందుకు సంసిద్ధులుగా ఉంటారు. ఈ రెండో అభిప్రాయమన్నది మన ప్రజాస్వామ్యానికి గొప్ప వరం. వీడ్కోలు పలుకుతున్న సభ్యులంతా ఈ విశిష్ట సంప్రదాయంలో తమ వంతు పాత్ర పోషించారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

గౌరవాధ్యక్షా,

నేడు వీడ్కోలు పొందుతున్న గౌరవ సభ్యులకు.. పార్లమెంటు పాత, కొత్త భవనాలు రెండింటిలోనూ కొలువుదీరే అరుదైన అవకాశం లభించింది. రెండు భవనాల్లోనూ వారు దేశ క్షేమం కోసం సేవలందించారు. వారి పదవీ కాలంలో కొత్త సభ నిర్మాణాన్ని చూడడమే కాకుండా, అందులో నిర్ణయాధికార ప్రక్రియలోనూ భాగస్వాములయ్యారు. వారి జీవితాల్లో ఇదొక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

గౌరవాధ్యక్షా,

ఈ సభే ఒక గొప్ప సార్వత్రిక విశ్వవిద్యాలయమని నేను నమ్ముతాను. జాతి జీవనంలోని అనేక చిక్కుముడులను, సూక్ష్మ అంశాలను అర్థం చేసుకునే అవకాశాన్ని ఇక్కడ సభ్యులు పొందుతారు. ఓ రకంగా ఇది ఏకకాలంలో విద్య, దీక్ష వంటిది. ఇక్కడ గడిపే ఆరేళ్ల కాలం.. నిర్ణయాధికార ప్రక్రియలో భాగస్వాములై దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికే కాకుండా, సొంత జీవితాన్ని కూడా తీర్చిదిద్దుకునేందుకు లభించే అమూల్యమైన అవకాశం. గౌరవ సభ్యులు సభలోకి ప్రవేశించేటప్పుడు తమదైన అవగాహన, సామర్థ్యాలతో వస్తారు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు మాత్రం.. అపారమైన అనుభవంతో వారి సామర్థ్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది. సభను వీడిన తర్వాత కూడా.. అధికారిక వ్యవస్థల్లో ఉన్నా లేకపోయినా జాతి జీవనంలో వారి సేవలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. అమూల్యమైన వారి కృషి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దేశ నిర్మాణంలో వారి అనుభవం కలకాలం ఉపయోగపడుతుంది. గౌరవ సభ్యులందరికీ ఇవే నా శుభాకాంక్షలు. విశేష సేవలందించిన గౌరవ సభ్యులకు మరోసారి నా మనఃపూర్వక అభినందనలు.

 

ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Commendable performance of India’s marine exports amid uncertain times

Media Coverage

Commendable performance of India’s marine exports amid uncertain times
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 మే 2026
May 02, 2026

Viksit Bharat Unfolding: PM Modi Delivers Jobs, Clean Energy, Digital Justice & Economic Firepower