‘నాగరిక్ దేవోభవ’ భావనను స్పష్టం చేసిన ప్రధాని.. పాలనకు ప్రజలనే కేంద్రంగా నిలపాలన్న శ్రీ మోదీ
ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం, వివిధ విభాగాల మధ్య అడ్డంకులను తొలగించి అభివృద్ధి సవాళ్లను పరిష్కరించాలని పిలుపు
వికసిత భారత్@2047 దిశగా భారత్ ప్రస్థానంలో ముందువరుసలో నిలవాల్సిందిగా యువ సివిల్ సర్వెంట్లకు పిలుపునిచ్చిన ప్రధాని
భవిష్యత్ పాలనలో సాంకేతికత, ఏఐ, డేటా ఆధారిత పాలన కీలకంగా నిలుస్తాయన్న ప్రధాని

వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా నియమితులైన 2024 బ్యాచ్‌కు చెందిన 183 మంది ఐఏఎస్ ట్రైనీలతో న్యూఢిల్లీలో సేవాతీర్థ్ వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.

యువ ట్రైనీ అధికారులు తమ క్షేత్రస్థాయి శిక్షణ, వివిధ మంత్రిత్వ శాఖల్లో అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. అధికారులనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. రెండేళ్ల క్షేత్రస్థాయి అనుభవం, పరిపాలనాపరమైన అవగాహన అనంతరం వారిప్పుడు కీలక దశలో ఉన్నారని, ఇప్పుడు వారి నిర్ణయాలు సొంత కెరీర్లనే కాకుండా కోట్లాది ప్రజల భవిష్యత్తునూ తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. నిజాయితీ, సునిశితత్వం, అంకితభావంతో వాస్తవ పరిస్థితులను నిర్వహించడంలోనే ప్రజాసేవకు సంబంధించి అసలైన పరీక్ష ఎదురవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

బలమైన లక్ష్యస్ఫూర్తి, ఆవిష్కరణలు, ప్రజలే కేంద్రంగా పాలనతో.. దేశ నిర్మాణానికి అంకితభావంతో కృషి చేయాలని యువ సివిల్ సర్వెంట్లను ప్రధానమంత్రి కోరారు. పాలనకు సంబంధించిన ప్రతి ఫైలు వెనుకా ఉన్న మానవీయ కోణాన్ని అధికారులు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలన్నారు. ప్రతీ ఫైలుతో ఎంతో మంది ప్రజల ఆకాంక్షలు, ఆందోళనలు, జీవితాలు ముడిపడి ఉంటాయన్నారు. ‘నాగరిక్ దేవోభవ’నే మంత్రప్రదంగా భావించాలన్న ప్రధానమంత్రి.. ప్రతి నిర్ణయాన్నీ ప్రజలే కేంద్రంగా తీసుకోవాలని, సహానుభూతితో, బాధ్యతాయుతంగా, సమ్మిళితంగా పాలనను కొనసాగించాలని అధికారులకు పిలుపునిచ్చారు.

 

ఏకోన్ముఖ ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని చెబుతూ.. పెద్దపెద్ద అభివృద్ధి సవాళ్లను విడివిడిగా పరిష్కరించలేమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అర్థవంతమైన, దీర్ఘకాలిక ఫలితాలను సాధించాలంటే వివిధ విభాగాల మధ్య సమర్థమైన సమన్వయం అత్యవసరమని వ్యాఖ్యానించారు.

‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ... రాబోయే దశాబ్దాలలో చేపట్టే ప్రతి విధానమూ, పాలనపరమైన నిర్ణయమూ అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి దోహదపడేలా ఉండాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్భర భారత్, మేకిన్ ఇండియా, తయారీ రంగంలో వృద్ధి, ఇంధన భద్రత, యువతకు అవకాశాల కల్పన వంటివి నేడు భారత్‌కు ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయన్నారు.

గత దశాబ్ద కాలంగా పరిపాలనలో విశేషమైన పరివర్తన వచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. ప్రక్రియలే కేంద్రంగా ఉన్న దశ నుంచి ఫలితాలే ప్రాతిపదికగా గల విధానాల దిశగా.. పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. సేవలను మెరుగుపరచడంలో... ప్రజలు సులభంగా, పారదర్శకంగా సేవలను పొందేందుకు వీలు కల్పించడంలో... డిజిటల్ పాలన, కృత్రిమ మేధ, సాంకేతికత పాత్ర పెరుగుతుండడాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.

 

డేటా ఆధారిత పాలన ప్రాధాన్యాన్ని వివరిస్తూ... డేటాను అంకెలుగా మాత్రమే కాకుండా, లక్షలాది ప్రజల జీవితాలు, సవాళ్లు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా చూడాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. విధానాలు క్షేత్రస్థాయిలో సమర్థమైన ఫలితాలనిస్తున్నాయా, లేదా అనే విషయాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆయన కోరారు.

దేశ వికాసంలో మహిళల పాత్ర పెరుగుతుండడాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుత బ్యాచ్‌లో 40 శాతానికి పైగా మహిళా అధికారులు ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు.

దేశ నిర్మాణంలో తమ కృషిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, పదవుల వల్లే కాకుండా- తాము సాధించిన స్పష్టమైన ఫలితాలతోనే సంతృప్తిని పొందాలని యువ అధికారులను ప్రధానమంత్రి కోరారు. దేశ అభివృద్ధి ప్రస్థానాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో వారి శక్తియుక్తులు, అంకితభావం కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ జితేంద్ర సింగ్, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీ పి.కె. మిశ్రా, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి-2 శ్రీ శక్తికాంత దాస్, కేబినెట్ కార్యదర్శి శ్రీ టి.వి. సోమనాథన్, సిబ్బంది - శిక్షణ విభాగం కార్యదర్శి శ్రీమతి రచనా షా, ఎల్బీఎస్ఎన్ఏఏ డైరెక్టర్ శ్రీ శ్రీరామ్ తరణికంటి, ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region

Media Coverage

Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
నిస్వార్థ సేవ భావనను బోధించే సంస్కృత సుభాషితాన్ని తెలియజేసిన ప్రధానమంత్రి
August 07, 2026

నిస్వార్థ సేవ గుణాన్ని, ఇతరుల వద్ద నుంచి మరేదీ ఆశించకుండా వారి మేలు కోసం పని చేయాలనే గొప్ప ఆదర్శాన్ని బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

‘‘కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్

స్వభావ ఏవోన్నతచేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్’’

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్

స్వభావ ఏవోన్నతచేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్’ అని పేర్కొన్నారు.