ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘కాన్ఫరెన్స్ ఆన్ అకాడెమిక్ లీడర్‌శిప్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ రిసర్జన్స్’ ను 2018వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ప్రారంభించనున్నారు. ఈ సమావేశం లో 350 కి పైగా విశ్వవిద్యాలయాల ఉప కులపతులు/సంచాలకులు పాలుపంచుకోనున్నారు. యుజిసి, ఎఐసిటిఇ, ఐసిఎస్ఎస్ఆర్, ఐజిఎన్‌సిఎ, ఐజిఎన్ఒయు, జెఎన్‌యు లతో పాటు ఎస్‌జిటి యూనివర్సిటీ లు కలసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
భారతదేశం లోని విద్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చర్చోపచర్చలు జరిపి తుది ఫలితాలను సాధించడం మరియు విద్య ను క్రమబద్దీకరించడం అనే రెండు అంశాల లో ఒక రూపావళి సంబంధిత పరివర్తన ను తీసుకురావడం కోసం ఓ ప్రణాళిక ను రూపొందించడం ఈ సమావేశం యొక్క ముఖ్యోద్దేశం గా ఉంది.
ఈ సమావేశాన్ని మాన్య ప్రధాన మంత్రి ఉదయం 10.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఆ తరువాత ఈ దిగువన పేర్కొన్న 8 అంశాలపై సదస్సులు జరుగుతాయి:
* విద్యార్థినివిద్యార్థులు కేంద్ర బిందువుగా ఉండేటటువంటి విద్య పరమావధి గా బోధన కళ ను మెరుగుపరచడం- విశిష్ట ఆవశ్యకత లతో కూడిన విద్య ను బోధించడం కోసం ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం;
* ఉద్యోగాలను కోరుకొనే బదులు ఉద్యోగాలను సృష్టించడం పైన శ్రద్ధ వహించడం- నూతన ఆవిష్కారాలను మరియు నవ పారిశ్రామికత్వాన్ని మెరుగుపరచడం;
* పరిశోధన యొక్క నాణ్యత కు మెరుగులు దిద్దడం- భారతదేశ అవసరాల పైన దృష్టి ని కేంద్రీకరించడం;
* విద్య సంస్థల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడం- గ్రంథాలయాల వంటి వనరులను సమీకరించుకోవడం, ఇంకా జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడం;
* సమ్మిళితమైన మరియు ఏకీకృతమైన ప్రాంగణాల నిర్మాణం- ప్రాంగణాల తో విద్యార్థులకు భావోద్వేగ భరిత అనుబంధాన్ని ఏర్పరచేటటువంటి కార్యకలాపాలను అమలుపరచడం;
* ప్రాతినిధ్య పూర్వకమైన పాలన నమూనాలను ఆవిష్కరించడం- పాలన ప్రక్రియ లలో విద్యార్థుల భాగస్వామ్యానికి మార్గాన్ని సుగమం చేయడం;
* పటిష్టమైన ఆర్థిక నమూనాలను రూపొందించడం- పూర్వ విద్యార్థుల నుండి మరియు కార్పొరేట్ ల నుండి నిధులను పోగు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ వనరులకు అనుబంధంగా వనరులను సమకూర్చడం;
* విద్య రంగం లో సార్వజనిక విలువలు, ఇంకా జీవన నైపుణ్యాల ను ముడి వేయడం ద్వారా విలువ తో కూడిన విద్య ను ప్రోత్సహించడం.
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ ముగింపు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఎనిమిది బృందాలు తమ తమ కార్యాచరణ కు సంబంధించిన ఏకాభిప్రాయం కుదిరిన వివరాలను ఈ ముగింపు సమావేశం సందర్భంగా వెల్లడి చేస్తాయి. దీనిపై సర్వసభ్య సదస్సు మరింత కూలంకషం గా చర్చిస్తుంది. దేశం లో ఉన్నత విద్య రంగానికి మెరుగులు దిద్దేందుకుగాను తగినటువంటి ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక దీని ద్వారా అంది వస్తుందని భావిస్తున్నారు.


