పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న రెడ్ రోడ్ నుంచి ప్రారంభించిన ప్రధాని
యోగా అందరినీ అనుసంధానిస్తుంది... ఐకమత్యంగా ఉంచుతుంది: పీఎం
జీవన విధానంగా యోగా మారినప్పుడు అది మానవాళి ఐక్యతకు పునాది అవుతుంది: పీఎం
శారీరక సామర్థ్యాన్ని పెంచేందుకు, ఉత్సాహంగా ఉండేందుకు యోగా సహకరిస్తుంది: పీఎం
జీవన సమతౌల్య కళను యోగా నేర్పిస్తుంది: పీఎం

ఈ రోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్ వద్ద జాతీయ వేడుకలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. వేలాది యోగా సాధకులతో కలిసి కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్‌లో శ్రీ మోదీ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏడాదిలో పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు జూన్ 21 అని శ్రీ మోదీ తెలిపారు. అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే అతిపెద్ద సామూహిక వేడుకల్లో ఈ రోజు ఒకటని వివరించారు.

కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో యోగా చేస్తున్న దృశ్యాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. ‘‘హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల నుంచి పశ్చిమ ప్రాంతంలోని సౌరాష్ట్ర వరకు.. యోగా స్ఫూర్తితో దేశమంతటా నూతన శక్తి ఆవిష్కృతమవుతోంది. ఆరోగ్యం, సామరస్యం పట్ల ఉన్న ఉమ్మడి నిబద్ధతతో దేశం, ప్రపంచం ఒకదానితో ఒకటి ముడిపడినట్లుగా కనిపిస్తోంది. యోగాకున్న ఐక్యతా శక్తిని ఇది ప్రతిబింబిస్తోంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.

‘‘స్వచ్ఛత సే స్వాగత్’’ కార్యక్రమం ద్వారా కోల్‌కతా ప్రజలు చేపట్టిన ప్రయత్నాలను ప్రధానమంత్రి అభినందించారు. పరిశుభ్రతను కాపాడటంలో అక్కడి పౌరులు ప్రదర్శించిన అంకితభావం, శ్రమించే తత్వం, సామాజిక స్పృహ దేశ ప్రజలందరికీ స్ఫూర్తిని అందిస్తున్నాయని చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌కు ఉన్న విశిష్ట ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం కారణంగా ఇక్కడ నిర్వహిస్తున్న యోగా దినోత్సవం ప్రత్యేకతను సంతరించుకుందని శ్రీ మోదీ చెప్పారు. భగవాన్ రామకృష్ణ పరమహంస జీవించిన, ఆధ్యాత్మిక బోధన చేసిన పవిత్ర భూమి బెంగాల్ అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచే స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, యోగా సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేశారనీ చెప్పారు. యోగ తత్వశాస్త్రం, సాధనలో పురోగతికి మహర్షి అరబిందో, లాహిరీ మహాశయ ఇక్కడి నుంచే విశేష కృషి చేశారని తెలిపారు. గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ బోధనలను ప్రస్తావిస్తూ... చుట్టూ ఉన్న ప్రపంచంతో ఏర్పడే అర్థవంతమైన అనుబంధాలతోనే నిజమైన మానవ గుర్తింపు రూపుదిద్దుకుంటుందనీ, ఈ సూత్రమే యోగాలో ముఖ్యమైన అంశమనీ ప్రధానమంత్రి అన్నారు. సమస్త జీవనమే యోగా అన్న మహర్షి అరవిందుల నమ్మకాన్ని కూడా ఆయన ఉటంకించారు. వ్యక్తి జీవితంలో యోగా భాగమైనప్పుడు, అది మానవ ఐక్యతా పునాదిని బలోపేతం చేస్తుందని తెలియజేశారు. ‘‘యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదు. దీనిని నిర్దుష్ట వయసుల వారికే పరిమితం చేయలేం. ఇది మానవ జీవితంలోని ప్రతి దశనూ సుసంపన్నం చేసే చైతన్యానికీ, ప్రాణశక్తికీ, మానసిక ప్రకాశానికీ మూలాధారం" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తమైన ‘‘ఆరోగ్యవంతమైన ఆయుష్షు కోసం యోగా’’ గురించి ఆయన వివరించారు. వయసు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా, చురుగ్గా, ఉత్సాహంగా ఉండే ఓ మంచి మార్గాన్ని యోగా అందిస్తుందని ఆయన చెప్పారు.

ఆరోగ్యకరమైన ఆయుర్దాయం అంటే వయసు పైబడుతున్నప్పటికీ మనిషిలో ఉన్న సామర్థ్యాలు తగ్గకుండా చూసుకోవడమేనని ప్రధానమంత్రి తెలియజెప్పారు. జీవితమంతా నిరంతర వృద్ధినీ, స్వీయ మెరుగుదలనూ కొనసాగించేలా యోగా ప్రోత్సహిస్తుందనీ ఆయన తెలియజేశారు. ఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పటికంటే.. నలభై ఏళ్ల వయసులో మరింత దృఢంగా, ముప్పై ఏళ్ల వయసులో ఉన్నదాని కంటే యాభై ఏళ్ల వయసులో మరింత ఉత్సాహంగా, యాభై ఏళ్ల వయసులో ఉన్నదానికంటే డెబ్బై ఏళ్ల వయసులో జీవనశైలి వ్యాధులను తట్టుకొనేలా మరింత దృఢంగా ఉండేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడానికీ, శక్తి స్థాయులను కొనసాగించడానికీ, ఒత్తిడినీ తగ్గించడానికీ, మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడానికీ యోగా సాయపడుతుందని ప్రధాని వివరించారు. అదే సమయంలో జీవనశైలి రుగ్మతలను నివారించడంలో కూడా సహకరిస్తుందనీ తెలియజేశారు. ‘‘క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా తమ శరీరాన్నీ, మెదడునీ నిత్యం అధ్యయనం చేసే వారిగా వ్యక్తులు మారుతారు. స్వీయ అవగాహనే.. స్వీయ నిర్వహణకూ, ఆరోగ్యకరమైన జీవితానికీ మార్గాన్ని అందిస్తుందని ఆయన చెప్పారు’’ అని శ్రీమోదీ పేర్కొన్నారు.

‘‘ఆరోగ్యవంతమైన ఆయుష్షు కోసం యోగా’’ అనే ఇతివృత్తం అన్ని వయసుల వారికీ వర్తిస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు. ఇది ఆరోగ్యం, శ్రేయస్సు, వ్యక్తిగత ఎదుగుదల దిశగా సాగే ప్రయాణంలో జీవితకాలం పాటు మన వెంట ఉండే స్నేహితునిగా యోగాను మారుస్తుందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా భగవద్గీత బోధనల గురించి శ్రీ మోదీ వివరించారు. ‘‘సమతుల ఆహారపు అలవాట్లూ, సమతౌల్యమైన వినోదమూ, సమతూకంగా ఉండే పనులూ, సమతుల్యత ఉన్న నిద్ర-మెలకువ.. దుఃఖాల నుంచి విముక్తి పొందే మార్గంగా యోగాను మారుస్తాయి’’ అని చెప్పారు. ఈ సమభావమే యోగాకు అత్యంత ముఖ్యమైన పునాది అనీ, పరిపూర్ణమైన జీవితానికి కూడా అవసరమైనదనీ ప్రధాని అభిప్రాయపడ్డారు. సమతౌల్యంగా ఎలా జీవించాలో యోగా నేర్పిస్తుందన్నారు. మానవులు చేయాల్సిన వాటినీ, చేయకూడని వాటినీ తెలియజేస్తూ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవడానికి యోగా తోడ్పడుతుందని వివరించారు.

శారీరక వ్యాయామంగా మాత్రమే పరిమితం కాకుండా మానసిక ఆరోగ్యం నుంచి శారీరక ఆరోగ్యం దిశగా నడిచే మార్గాన్ని యోగా అందిస్తుందన్నారు. ‘‘యుక్తచేష్టస్య కర్మసు’’ అనే గీతా వాక్యాన్ని ఉటంకిస్తూ... ఏది సరైనదో, ఏది కాదో గుర్తించే విచక్షణను పెంపొందించుకోవడానికి యోగా సహాయపడుతుందని తెలిపారు. "ఇలాంటి అవగాహన మానసిక ప్రశాంతతకు మూలాధారంగా మారుతుంది. అలాగే ప్రపంచ సామరస్యానికి మార్గాలను సుగమం చేస్తుంది. వ్యక్తిగత జీవనశైలి సాధనగా మాత్రమే పరిమితం కాకుండా..  ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి అవసరమైనదిగా యోగా మారింది’’ అని శ్రీ మోదీ అన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏటా కోట్లాది ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని శ్రీ మోదీ అన్నారు. అలాగే, యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవడానికి ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించే అవకాశాన్ని కూడా ఈ రోజు అందిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. కేవలం ఒక రోజుకో లేదా ఒక కార్యక్రమానికో యోగాను పరిమితం చేయకుండా.. తమ జీవితంలో, తమ కుటుంబంలో, భవిష్యత్తు తరాల జీవితాల్లో యోగాను శాశ్వత భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

‘‘యోగా 365’’ కార్యక్రమంలో సాధించిన పురోగతిని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ‘‘దీనిలో భాగంగా నిర్వహించిన 100 రోజుల ఆన్‌లైన్ యోగా కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభించింది. 130 దేశాల నుంచి మూడు మిలియన్లకు పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ఆమోదాన్నీ, ప్రజాదరణనూ ప్రతిబింబిస్తోంది" అని శ్రీ మోదీ తెలియజేశారు.

మరింత బలమైన, సుసంపన్నమైన, ఆత్మవిశ్వాసం నిండిన దేశానికి ఆరోగ్యకరమైన సమాజమే పునాది వేస్తుందని శ్రీ మోదీ అన్నారు. అందరి క్షేమాన్ని ఆకాంక్షిస్తూ... ‘‘సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః’’ (అందరూ ఆనందంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి) ప్రార్థనా వాక్యాన్ని ఉటంకిస్తూ.. ప్రసంగాన్ని ముగించారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Why Abrogation Of Article 370 Was A Strategic Necessity For India

Media Coverage

Why Abrogation Of Article 370 Was A Strategic Necessity For India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 05 ఆగష్టు 2026
August 05, 2026

Viksit Bharat in Action: Inclusive, Green, and Globally Competitive Under PM Modi