థాయ్‌లాండ్‌లో జరిగిన సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో సందేశం ద్వారా ఈరోజు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... థాయ్‌లాండ్‌లో జరుగుతున్న సంవాద్‌లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. దీన్ని నిర్వహించేందుకు భారత్, జపాన్, థాయ్‌లాండ్‌కు చెందిన సంస్థలు, వ్యక్తులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి తన మిత్రుడు షింజో అబేను గుర్తు చేసుకున్నారు. 2015లో ఆయనతో సంభాషిస్తున్నప్పుడు సంవాద్ ఆలోచన ఉద్భవించిందని వెల్లడించారు. అప్పటి నుంచి సంవాద్ వివిధ దేశాలకు ప్రయాణించిందని, చర్చలు, సమావేశాలు జరిపేలా, లోతైన అవగాహన పెంచేలా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

ఘనమైన సంస్కృతి, చరిత్ర, వారసత్వం కలిగిన థాయ్‌లాండ్ దేశంలో సంవాద్ జరగడం తనకు ఆనందాన్నిస్తోందని తెలిపారు. ఆసియా ఉమ్మడి తాత్విక, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు థాయ్‌లాండ్ అందమైన ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

భారత్, థాయ్‌లాండ్ మధ్య ఉన్న దృఢమైన సాంస్కృతిక సంబంధాల గురించి ప్రస్తావిస్తూ, రెండు దేశాలను రామాయణం, రామకియాన్ అనుసంధానిస్తున్నాయని అన్నారు. అలాగే బుద్ధ భగవానుని పట్ల ఉన్న భక్తి ఇరు దేశాలను ఏకం చేస్తోందని తెలిపారు. గతేడాది బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలను థాయ్‌లాండ్ పంపించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మిలియన్ల మంది భక్తులు వాటిని సందర్శించారు. భారత్, థాయ్‌లాండ్ మధ్య వివిధ రంగాల్లో క్రియాశీలక భాగస్వామ్యం గురించి వివరిస్తూ.. భారత్ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’, థాయ్‌లాండ్ అనుసరిస్తున్న ‘యాక్ట్ వెస్ట్ పాలసీ’ రెండు దేశాల పరస్పర అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాల్లో ఈ సదస్సు మరో విజయవంతమైన అధ్యాయాన్ని జోడించిందని అన్నారు.

ఆసియా శతాబ్దం గురించి వివరిస్తున్న సంవాద్ ఇతివృత్తంపై శ్రీ మోదీ మాట్లాడుతూ.. ప్రజలు తరచూ ఆసియా ఆర్థిక వృద్ధి గురించే మాట్లాడతారని అన్నారు. ఈ సమ్మేళనం ఆర్థిక విలువల గురించి మాత్రమే కాకుండా సామాజిక విలువల గురించి తెలియజేస్తుందని అన్నారు. శాంతియుతమైన, ప్రగతిశీల యుగాన్ని నిర్మించడంలో బుద్ధుని భగవానుని బోధనలు ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తాయని, మానవ కేంద్రీకృత భవిష్యత్తుకు అవసరమైన శక్తిని ఆయన జ్ఞానం అందిస్తుందని అన్నారు.

 

సంవాద్ మూల సిద్ధాంతాల్లో ఒకటైన ఘర్షణను నివారించడం గురించి చర్చిస్తూ.. తాము అనుసరిస్తున్న మార్గమే సరైనది అని, ఇతరులది తప్పు అన్న భావన ఉన్నప్పుడే ఈ పరిస్థితులు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బుద్ధభగవానుని బోధనలను ఉటంకిస్తూ, కొంతమంది తమ సొంత ఆలోచనల నుంచి బయటకు రాకుండా తమకు తెలిసిందే నిజమని వితండవాదం చేస్తారని అన్నారు. ఒకే అంశానికి బహుళ కోణాలు ఉంటాయని ఆయన తెలిపారు. రుగ్వేదాన్ని ఉటంకిస్తూ, ఒక నిజాన్ని భిన్న కోణాల్లో చూడవచ్చని మనం గుర్తించినప్పుడు మనం ఘర్షణలను ఆపగలుగుతామని పేర్కొన్నారు.

ఇతరుల ఆలోచనలు మనకంటే భిన్నంగా ఉన్నాయని అనుకోవడం కూడా ఘర్షణలకు మరో కారణమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ విబేధాలు దూరాన్ని పెంచుతాయని, దూరం బంధాన్ని తెంచుతుందని అన్నారు. అందరూ నొప్పికి, చావుకే భయపడతారంటూ దమ్మపద శ్లోకాన్ని ఉటంకించారు. ఎదుటివారు కూడా మనలాంటి వారే అని తెలుసుకోవడం ద్వారా ఇతరులకు హాని, లేదా వారిపై హింస జరగకుండా చూసుకోవచ్చని అన్నారు. ఈ చిట్కాను పాటిస్తే గొడవలను నివారించవచ్చని అన్నారు.

‘‘సమతౌల్య విధానం పాటించకుండా తీవ్రమైన వైఖరిని పాటించడం వల్లే ప్రస్తుతం ఈ ప్రపంచంలో సమస్యలు పుట్టుకొస్తున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు. ఈ తరహా భావజాలం వల్ల గొడవలు, పర్యావరణ సంక్షోభాలు, ఒత్తిడి సంబంధిత ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారం బుద్ధ భగవానుని బోధనల్లో ఉన్నాయని, గొడవలు నివారించడానికి మధ్యేమార్గాన్ని అనుసరించాలని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సూత్రం నేటి పరిస్థితులకు సైతం వర్తిస్తుందని, అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కొనేందుకు మార్గనిర్దేశం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ప్రజలు, దేశాలను దాటి ఘర్షణలు విస్తరిస్తున్నాయని, ప్రకృతితో మానవాళికి నిరంతరం సంఘర్షణ జరుగుతోందని అన్నారు. ఇది పర్యావరణ సంక్షోభానికి దారి తీసి మన గ్రహానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని వివరించారు. ఈ సవాళ్లకు సమాధానం ఆసియా దేశాలు అనుసరిస్తున్న ఉమ్మడి సంప్రదాయాల్లో, దమ్మ సూత్రాల్లో దొరుకుతుందని అన్నారు. హైందవం, బౌద్ధం, షింటోయిజం ఇతర ఆసియా సంప్రదాయాలు ప్రకృతితో సామరస్యంగా జీవించమని సూచిస్తున్నాయని తెలిపారు. మహాత్మాగాంధీ బోధించిన ధర్మకర్తృత్వం అనే విధానం గురించి చర్చిస్తూ సహజ వనరులను అభివృద్ధి కోసం ఉపయోగిస్తూనే, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని శ్రీమోదీ తెలియజేశారు. వనరులను దురాశ కోసం కాకుండా అభివృద్ధి కోసం వినియోగించేలా ఈ విధానం హామీ ఇస్తుందని అన్నారు.

 

పశ్చిమ భారతంలోని వడ్‌నగర్ నుంచి వచ్చానని, అది ఒకప్పుడు బౌద్ధ ఆరామంగా ఉండేదని వివరించారు. భారత పార్లమెంటులో వారణాసికి తాను ప్రాతినిథ్యం వహిస్తున్నానని, ఈ నియోజకవర్గంలో బుద్ధ భగవానుడు మొదటిసారిగా తన బోధనలను ప్రవచించిన పవిత్ర ప్రదేశం సారనాథ్ ఉందని అన్నారు. బుద్ధ భగవానునితో సంబంధం ఉన్న ఈ అందమైన యాదృచ్ఛికం తన ప్రయాణాన్ని మలిచిందని అన్నారు.

‘‘బుద్ధ భగవానుని పట్ల మాకున్న భక్తి భారత ప్రభుత్వ విధానాల్లో ప్రతిఫలిస్తుంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. బుద్ధ సర్క్యూట్‌లో భాగంగా ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలను కలుపుతూ పర్యాటక మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని వివరించారు. ఈ సర్క్యూటులో క్షేత్రాలను సందర్శించడానికి ‘బుద్ధ పూర్ణిమ ఎక్స్‌ప్రెస్’ పేరుతో ప్రత్యేక రైలును ప్రారంభించామని వెల్లడించారు. ఖుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం అంతర్జాతీయ బౌద్ధ యాత్రికులకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. బోధ్ గయలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి వివిధ కార్యక్రమాలను ప్రకటించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికులు, పరిశోధకులు, బౌద్ధ భిక్షువులను బుద్ధ భూమి అయిన భారత్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.

చరిత్రలోనే గొప్ప విశ్వవిద్యాలయంగా ఖ్యాతికెక్కిన నలంద మహా విహారాన్ని శతాబ్దాల క్రితం ఈ ఘర్షణ శక్తులు నాశనం చేశాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పుడు దానిని అధ్యయన కేంద్రంగా భారత్ పునర్నిర్మించిందని, బుద్ధ భగవానుని ఆశీస్సులతో కోల్పోయిన పూర్వ వైభవాన్ని నలంద విశ్వవిద్యాలయం తిరిగి పొందుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పాళీ భాషను ప్రోత్సహించేందుకు చేపట్టిన చర్యల గురించి ప్రధానంగా వివరిస్తూ.. బుద్ధ భగవానుడు తన బోధనలను అందించిన ఈ భాషకు ప్రాచీన హోదా కల్పించి పాళీలో ఉన్న సాహిత్యాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ప్రాచీన రాత ప్రతులను గుర్తించి వాటి జాబితాను సిద్ధం చేయడానికి, వాటి వివరాలను నమోదు చేసి డిజిటలైజ్ చేయడానికి జ్ఞాన భారతం మిషన్ ప్రారంభించామని వెల్లడించారు.

బుద్ధ భగవానుని బోధనలను విశ్వవ్యాప్తం చేయడానికి వివిధ దేశాలతో కుదుర్చుకున్న సహకారాలను శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ‘ఆసియాను బలోపేతం చేయడంలో బౌద్ధ ధర్మ పాత్ర’ అనే అంశతో సాగిన మొదటి ఆసియా బౌద్ధ సమ్మేళనం భారత్‌లో జరిగిందని తెలిపారు. అలాగే మొదటి అంతర్జాతీయ బౌద్ద సమ్మేళనానికి భారత్ ఆతిథ్యమిచ్చిందని వివరించారు. నేపాల్‌లోని లుంబినీలో ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్‌కు శంకుస్థాపన చేసే భాగ్యం తనకు దక్కిందని అన్నారు. అలాగే లుంబినీ మ్యూజియం నిర్మాణానికి భారత్ సాయం అందిస్తోందని తెలిపారు. బుద్ధ భగవానుని ‘కన్‌సైజ్ ఆర్డర్స్’, 108 సంపుటాల మంగోలియన్ కాంజూర్‌ను పునర్ముద్రించి మంగోలియాలోని ఆరామాలకు పంపిణీ చేశామని తెలిపారు. అనేక దేశాల్లో బౌద్ధ స్మారక చిహ్నాల పరిరక్షణలో భారత్ చేస్తున్న ప్రయత్నాలు, బుద్ధుని వారసత్వాన్ని కొనసాగించడం పట్ల భారత్ అంకితభావాన్ని తెలియజేస్తాయని అన్నారు.

వివిధ మతాలకు చెందిన పెద్దలను ఒకచోట చేర్చి ఈ సంవాద సంచికను నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ వేదిక నుంచి గొప్ప ఆలోచనలు పుట్టుకొస్తాయని, ఇవి సామరస్యపూర్వక ప్రపంచాన్ని నిర్మిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కాన్పరెన్స్‌ను నిర్వహిస్తున్న థాయ్‌లాండ్ ప్రభుత్వం, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విశిష్ట లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, అభివృద్ధి, సంక్షేమం యుగానికి దమ్మ దీపం మనల్ని నడిపిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions