జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో అనుసంధానం ద్వారా ప్రసంగించారు. "ఆర్యభట్ట నుంచి గగన్‌యాన్ దాకా" అనే ఈ సంవత్సర ఇతివృత్తం.. భారత చరిత్ర పట్ల విశ్వాసాన్ని.. భవిష్యత్తు పట్ల సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే జాతీయ అంతరిక్ష దినోత్సవం భారత యువతకు ఉత్సాహాన్ని, ప్రేరణను కలిగించే సందర్భంగా మారిందన్నారు. ఇది దేశానికి గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. శాస్త్రవేత్తలు, యువత సహా అంతరిక్ష రంగానికి చెందిన అందరికీ ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రానమీ – ఆస్ట్రోఫిజిక్స్ ఒలంపియాడ్ నిర్వహిస్తోందన్నారు. అరవైకి పైగా దేశాల నుంచి దాదాపు 300 మంది యువకులు ఈ ఒలంపియాడ్‌లో పాల్గొంటున్నారని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భారతీయులు పతకాలు గెలవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న తీరుకు ఇది నిదర్శనమన్నారు. యువతలో అంతరిక్షం పట్ల ఆసక్తిని మరింత పెంపొందించడం కోసం ఇండియన్ స్పేస్ హ్యాకథాన్, రోబోటిక్స్ ఛాలెంజ్ వంటి కార్యక్రమాలను ఇస్రో ప్రారంభించిందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, పోటీల విజేతలనూ ఆయన అభినందించారు.
"అంతరిక్ష రంగంలో వరుస విజయాలు భారతదేశానికీ, భారతీయ శాస్త్రవేత్తలకూ సాధారణ అంశంగా మారింది" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రెండేళ్ల కిందట చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. అంతరిక్షంలో డాకింగ్-అన్‌డాకింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్న ప్రపంచంలోని నాల్గో దేశంగా భారత్ అవతరించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జాతీయ జెండాను ఎగురవేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను మూడు రోజుల కిందట తాను కలిసినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన సాధించిన ఈ ఘనత భారతీయులందరికీ గర్వకారణమన్నారు. శుక్లా తనకు అందించిన త్రివర్ణ పతాకాన్ని తాకినప్పుడు అద్భుతమైన అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. ఆయనను కలిసినపుడు…. నవ భారత యువత అపరిమిత ధైర్యం.. అనంతమైన కలల గురించి చర్చించినట్లు ప్రధానమంత్రి వివరించారు. ఈ కలలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్ "ఆస్ట్రోనాట్ పూల్" ను సిద్ధం చేస్తోందని ప్రకటించారు. అంతరిక్ష దినోత్సవ సందర్భంగా యువత ఉత్సాహంగా దీనిలో భాగస్వాములై భారత ఆకాంక్షల సాకారం కోసం తోడ్పాటునందించాలని ఆయన ఆహ్వానించారు.
"సెమీ-క్రయోజెనిక్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో భారత్ వేగంగా పురోగమిస్తోంది. భారత శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషికి ధన్యవాదాలు. త్వరలోనే భారత్ గగన్‌యాన్ మిషన్‌ను ప్రారంభించనుంది. రాబోయే సంవత్సరాల్లో సొంత అంతరిక్ష కేంద్రాన్నీ భారత్ ఏర్పాటు చేయనుంది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పటికే చంద్రుడు, అంగారక గ్రహాన్ని చేరుకున్న భారత్.. మానవాళి భవితను మరింత ఉజ్వలంగా చేసే రహస్యాలను ఛేదించడానికి మరింత లోతైన అంతరిక్ష పరిశోధనలకు సిద్ధం కావాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. మన లక్ష్యం నక్షత్ర మండలాలకు ఆవల ఉందన్నారు.
మన హద్దు ఫలానా చోట అని చెప్పడానికి వీల్లేదని, అనంతమైన విశ్వ మండలం ఇదే చెబుతోందని, అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి భారత్ కు ఎలాంటి పరిమితీ లేదని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఎర్రకోట వేదికగా తాను చెప్పినట్లుగా సంస్కరణలు.. పనితీరు.. పరివర్తన అనే మార్గంలో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. గత పదకొండేళ్లుగా అంతరిక్ష రంగంలో అనేక ప్రధాన సంస్కరణలను దేశం అమలు చేసిందన్నారు. అంతరిక్షం వంటి భవిష్యత్ రంగాలు అనేక పరిమితులకు కట్టుబడి ఉన్న కాలంలో తమ ప్రభుత్వం వాటిని తొలగించిందని.. ప్రైవేట్ రంగానికి అంతరిక్ష సాంకేతికతలో భాగస్వామ్యం కల్పించిందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారి చురుకైన భాగస్వామ్యం కారణంగా నేడు 350కి పైగా అంకురసంస్థలు అంతరిక్ష సాంకేతికతలో ఆవిష్కరణలతో పాటు పురోగతికి చోదకశక్తిగా పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. పూర్తి ప్రైవేటు భాగస్వామ్యంతో రూపొందించిన మొదటి పీఎస్ఎల్‌వీ రాకెట్టును త్వరలోనే ప్రయోగించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. భారత మొట్టమొదటి ప్రైవేటు కమ్యూనికేషన్ ఉపగ్రహం కూడా అభివృద్ధి దశలో ఉందని ఆయన తెలిపారు. భూమిని నిరంతరం పరిశీలించడం కోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందించిన కృత్రిమ ఉపగ్రహాల వ్యవస్థను ప్రయోగించేందుకూ సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. "భారత యువతకు అంతరిక్ష రంగంలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ.. బహుళ రంగాల్లో స్వయంసమృద్ధి ప్రాముఖ్యతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. సొంత లక్ష్యాలు నిర్దేశించుకునేలా ప్రతి రంగాన్నీ ప్రోత్సహించామని ఆయన పేర్కొన్నారు. భారత అంతరిక్ష అంకురసంస్థలను ప్రస్తావిస్తూ.. "రాబోయే అయిదు సంవత్సరాల్లో అంతరిక్ష రంగంలో అయిదు యునికార్న్‌లను (బిలియన్ డాలర్ల విలువైన అంకురసంస్థలను) మనం నిర్మించగలమా?" అని ప్రశ్నించారు. ప్రస్తుతం భారత్ కేంద్రంగా సంవత్సరానికి అయిదు నుంచి ఆరు ప్రధాన ప్రయోగాలు జరుగుతున్నాయన్న ఆయన.. రాబోయే అయిదేళ్లలో సంవత్సరానికి 50 రాకెట్లను ప్రయోగించేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. దీనికోసం ప్రైవేటు రంగం మరింత సహకారం అందించేందుకు ముందుకు రావాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ దార్శనికత సాకారం కోసం అత్యాధునిక సంస్కరణలు అమలు చేయడానికి ప్రభుత్వం స్పష్టమైన ఉద్దేశం.. సంకల్పంతో ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. అంతరిక్ష రంగానికి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
శాస్త్రీయ అన్వేషణ కోసం ఒక సాధనంగా మాత్రమే కాకుండా.. జీవన సౌలభ్యాన్ని పెంపొందించే మార్గంగానూ అంతరిక్ష సాంకేతికతను భారత్ ఉపయోగిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. "దేశ పరిపాలనలో అంతరిక్ష సాంకేతికత కీలక అంతర్భాగంగా మారుతోంది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పంటల బీమా పథకాల్లో ఉపగ్రహ ఆధారిత అంచనాలు.. మత్స్యకారులకు ఉపగ్రహ ఆధారిత సమాచారం అందించడం.. భద్రత, విపత్తు నిర్వహణలో ఉపగ్రహ సమాచార వినియోగం.. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌లోనూ జియోస్పేషియల్ డేటాను ఉపయోగించడం వంటి ఉదాహరణలను ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ ఉటంకించారు. అంతరిక్ష రంగంలో భారత పురోగతి.. పౌరుల జీవితాన్ని సులభతరం చేయడంలో ప్రత్యక్షంగా సహాయపడుతోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అంతరిక్ష సాంకేతికత వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం కోసం నిన్న నేషనల్ మీట్ 2.0 నిర్వహించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని.. మరింత విస్తరించాలనీ ఆయన ఆకాంక్షించారు. ప్రజా సేవ లక్ష్యంగా కొత్త పరిష్కారాలు, ఆవిష్కరణలను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి అంతరిక్షరంగ అంకురసంస్థలను కోరారు. రాబోయే కాలంలో అంతరిక్షంలో భారత ప్రయాణం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆకాంక్షిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఇస్రో అధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
नेशनल स्पेस डे हमारे युवाओं में उत्साह और आकर्षण का अवसर बन गया है। ये देश के लिए गर्व की बात है।
— PMO India (@PMOIndia) August 23, 2025
मैं स्पेस सेक्टर से जुड़े सभी लोगों को, वैज्ञानिकों को, सभी युवाओं को नेशनल स्पेस डे की बधाई देता हूँ: PM @narendramodi
स्पेस सेक्टर में एक के बाद एक नए milestone गढ़ना... ये भारत और भारत के वैज्ञानिकों का स्वभाव बन गया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 23, 2025
आज भारत semi-cryogenic engine और electric propulsion जैसी breakthrough technology में तेज़ी से आगे बढ़ रहा है।
— PMO India (@PMOIndia) August 23, 2025
जल्द ही, आप सब वैज्ञानिकों की मेहनत से, भारत गगनयान की उड़ान भी भरेगा...और आने वाले समय में, भारत अपना स्पेस स्टेशन भी बनाएगा: PM @narendramodi
आज स्पेस-टेक भारत में गवर्नेंस का भी हिस्सा बन रही है।
— PMO India (@PMOIndia) August 23, 2025
फसल बीमा योजना में satellite based आकलन हो...
मछुआरों को satellite से मिल रही जानकारी और सुरक्षा हो...
Disaster management हो या PM Gati Shakti National Master Plan में geospatial data का इस्तेमाल हो…
आज स्पेस में भारत…


