తమిళ భాషా రంగంలో మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ సుబ్రహ్మణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని నంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఈరోజు ఆవిష్కరించారు. శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఆయనకు శ్రీ మోదీ నివాళులు అర్పిస్తూ, ఈరోజు భారతదేశ సంస్కృతికి, సాహిత్యానికి, మన దేశ స్వాతంత్య్ర పోరాట స్మృతులకు, అంతేకాకుండా తమిళనాడు ఆత్మగౌరవానికి కూడా లభించిన ఒక మహదవకాశమన్నారు.

మహాకవి సుబ్రహ్మణ్య భారతి రచనలను ఈ రోజు గొప్పగా ఆవిష్కరించుకొన్నామని కూడా ప్రధాని అన్నారు.
‘కాల వరిసైయిల్ భారతియార్ పడైప్పుగళ్’ ను 21 సంపుటాలలో సంకలనపరచడానికి ఆరు దశాబ్దాల పాటు అసాధారణ, అపూర్వ, అలసటయే ఎరుగని కృషి సాగిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. శీనీ విశ్వనాథన్ గారు ఎంతో కష్టపడి, ఒక తపస్సులాగా ఈ పనిని చేశారు. దీంతో అనేక తరాలవారికి ప్రయోజనం కలుగుతుందని కూడా శ్రీ మోదీ అన్నారు. శ్రీ విశ్వనాథన్ గారి తపస్సు చూస్తే తనకు ధర్మశాస్త్ర చరిత్రను రాయడానికి జీవనంలో 35 సంవత్సరాల కాలాన్ని వెచ్చించిన మహా-మహోపాధ్యాయ పాండురంగ వామన్ కాణె గుర్తుకు వచ్చారని శ్రీ మోదీ తెలిపారు. శ్రీ శీనీ విశ్వనాథన్ శ్రమ విద్యా జగతిలో ఒక ముఖ్య ఘట్టంగా మారుతుందన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. శీనీ విశ్వనాథన్‌ను, ఆయన మహత్తర రచనలో ఆయనకు సహకరించిన సహచరులను ప్రధాని అభినందించారు.

కాల వరిసైయిల్ భారతియార్ పడైప్పుగళ్ గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ గ్రంథం భారతీ జీ రచనల కూర్పు ఒక్కటే కాదని, ఆయన సాహిత్యం లేదా సాహితీ ప్రస్థానంతోపాటు ఆయన రచనల సునిశిత తాత్విక విశ్లేషణ, ఇంకా దీనిలో లోతైన అవగాహనతో కూడిన నేపథ్యం భాగం అయిందని వివరించారు. ప్రతి ఒక్క సంపుటంలో వ్యాఖ్యానం, వివరణలు టీకాతాత్పర్యాలు కూడా ఉన్నాయని శ్రీ మోదీ అన్నారు. ‘‘భారతి ఆలోచనల సారాన్ని అర్థం చేసుకోవడానికి, అంతేకాకుండా ఆయన జీవించిన కాలంనాటి సమాజ స్థితిగతులను గురించి తెలుసుకోవడానికి ఈ సంచిక పరిశోధక విద్యార్థులకు, మేధావులకు ఎంతగానో సాయపడుతుందని’’ శ్రీ మోదీ అన్నారు.
గీతా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలను తెలియజేస్తూ, గీతలో పేర్కొన్న ప్రబోధాల పట్ల శ్రీ సుబ్రహ్మణ్య భారతి ప్రగాఢ నమ్మకాన్ని పెంచుకొన్నారని, గీత ప్రసాదించే జ్ఞానం విషయంలోనూ లోతైన అవగాహనను ఆయన ఏర్పరచుకొన్నారంటూ ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘‘ఆయన గీతను తమిళ భాషలోకి అనువదించి, అది ఇచ్చిన విస్తృత సందేశాన్ని చాలా సరళంగా, ఇట్టే అర్థమయ్యేటట్లు చేశార’’ని శ్రీ మోదీ అన్నారు. గీతా జయంతి, శ్రీ సుబ్రహ్మణ్య భారతి గారి జయంతిలతోపాటు శ్రీ భారతి రచనల ప్రచురణ.. ఇవి అపూర్వ ‘త్రివేణి’ సంగమం కన్నా తక్కువేంకాదని ప్రధాని అన్నారు.

భారతీయ తత్వ శాస్త్రంలో ఉటంకించిన ‘శబ్ద బ్రహ్మ’ అనే భావన ను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, భారతదేశం పదాలను భావవ్యక్తీకరణ మాధ్యమానికన్నా మిన్నగానే ఎప్పటికీ భావిస్తూ వచ్చింది. మాటలకు అనంతమైన శక్తి ఉందని తలచిందన్నారు. ‘‘సాధువులు, ఆలోచనపరులు పలికిన పలుకులు వారి భావాల, అనుభవాల, ఆధ్యాత్మిక అభ్యాసాల సారాన్ని తెలియజేస్తాయి. కాబట్టి వాటిని భావితరాలవారి కోసం పరిరక్షించాల్సిన బాధ్యతను మనం తీసుకోవాలి’’ అని శ్రీ మోదీ అన్నారు. ముఖ్యమైన రచనలను సంకలనపరచడం ఈనాటికీ సందర్భ శుద్ధి కలిగిన అంశమేనని శ్రీ మోదీ అన్నారు. ఉదాహరణకు తీసుకొంటే, మహర్షి వ్యాసుని రచనలు పురాణాలలో ఒక పద్ధతి ప్రకారం సంరక్షణకు నోచుకొని ఈనాటికీ ఆదరణను పొందుతున్నాయని శ్రీ మోదీ చెప్పారు. మరికొన్ని ఉదాహరణలను ఆయన చెబుతూ, స్వామి వివేకానంద సంపూర్ణ రచనలు; డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు; దీన్ దయాళ్ ఉపాధ్యాయ సంపూర్ణ రచనలు అటు విద్యార్థి లోకానికి, ఇటు సమాజానికి గొప్ప సేవలు అందించాయన్నారు. తిరుక్కురళ్‌ను అనేక భాషలలోకి అనువదించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనితో భారతదేశ సాహిత్య సంపదను కాపాడుకుంటూ వ్యాప్తి చేయడానికి భారతదేశం ఎంతటి అంకితభావంతో ముందుకు పోతోందో వెల్లడి అవుతుందన్నారు. పాపువా న్యూ గినీని తాను సందర్శించిన సందర్భంలో టోక్ పిసిన్ భాషలో సిద్ధం చేసిన తిరుక్కురళ్ ను ఆవిష్కరించే అవకాశం తనకు లభించిందని, అలాగే ఆ గ్రంథం గుజరాతీ అనువాదాన్ని తన ఆధికారిక నివాసంలో విడుదల చేసే భాగ్యం కూడా తనకు కలిగిందని ప్రధాని వెల్లడించారు.
శ్రీ సుబ్రహ్మణ్య భారతి ఒక గొప్ప దూరాలోచనలు చేసేవారని శ్రీ మోదీ ప్రశంసిస్తూ... దేశ అవసరాలు ఏమిటనేది గమనించి మరీ ఆయన పని చేసేవారు. ఆ కాలంలో దేశానికి అవసరమైన ప్రతి రంగంలో ఆయన కృషి చేశారన్నారు. భారతియార్ గారు ఒక్క తమిళనాడు సంప్రదాయానికి, తమిళ భాషకే కాకుండా భరతమాత సేవలో తన ప్రతి శ్వాసను అంకితం చేసిన మేధావి. ఆయన భారతదేశ ఉన్నతి, భారతదేశ పురోగతిలతోపాటు గర్వపడే దేశంగా భారతదేశం రూపుదిద్దుకోవాలని కలలుగన్నారన్నారు. భారతీయార్ జీ సేవలను మరింత మంది చెంతకు చేర్చాలనే కర్తవ్య భావనతో ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తూ వచ్చిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కోవిడ్ మహమ్మారి 2020లో ప్రపంచాన్నంతటినీ ప్రభావితం చేసినప్పటికీ, శ్రీ సుబ్రహ్మణ్య భారతి వందో వర్ధంతి ఉత్సవాలను చాలా గొప్పగా నిర్వహించేటట్లు ప్రభుత్వం చూసిందని ప్రధాని గుర్తు చేశారు. ‘అంతర్జాతీయ భారతీ ఉత్సవం’లో తాను కూడా పాలుపంచుకొన్నట్లు ప్రధాని చెప్పారు. మహాకవి భారతి భావాలను ఆధారంగా చేసుకొని మన దేశ దృష్టికోణాన్ని భారత్ లోపల, భారత్‌కు వెలుపల అదే పనిగా తాను వివరిస్తూ వచ్చిన విషయాన్ని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. శ్రీ సుబ్రహ్మణ్య భారతికి, తనకు మధ్య కాశీ ఒక చైతన్యభరిత, ఆధ్యాత్మిక బంధాన్ని పెనవేసిందని ప్రధాని ఉద్ఘాటిస్తూ, శ్రీ సుబ్రహ్మణ్య భారతి గారు అక్కడ వెచ్చించిన కాలం, ఆ నగరంతో ఏర్పరచుకొన్న బంధం కాశీ వారసత్వంలో ఒక భాగంగా మారిపోయాయన్నారు. శ్రీ భారతి జ్ఞానార్జన కోసం కాశీకి వచ్చి, పూర్తిగా అక్కడే ఉండిపోయారు. అంతేకాకుండా శ్రీ భారతీ కుటుంబ సభ్యుల్లో అనేక మంది కాశీలో స్థిరపడ్డారన్నారు. భారతీయార్ తన మీసకట్టును తీర్చిదిద్దుకోవడానికి కాశీవాసమే ఆయనకు ప్రేరణనిచ్చిందని, ఆయన కాశీలో ఉంటూ ఎన్నో రచనలు చేశారని శ్రీ మోదీ అన్నారు. ఆయన పవిత్ర రచనలను వారణాసీ పార్లమెంటు సభ్యునిగా ఉన్న తాను స్వాగతిస్తున్నానని ప్రధాని చెబుతూ, మహాకవి భారతీయార్ చేసిన కృషికి గుర్తుగా బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఒక పీఠాన్ని ప్రత్యేకించిన భాగ్యానికి ప్రభుత్వం నోచుకొందన్నారు.

ప్రముఖ కవి, దార్శనికుడు శ్రీ సుబ్రహ్మణ్య భారతికి ప్రధానమంత్రి నివాళులు అర్పిస్తూ, మన దేశ సాంస్కృతిక, మేథో, సామాజిక రంగాలకు ఆయన అద్వితీయ తోడ్పాట్లను అందించారన్నారు. ‘‘కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి ఈ భూ ప్రపంచానికి వచ్చే అసాధారణ వ్యక్తిత్వం శ్రీ సుబ్రహ్మణ్య భారతిలో మూర్తీభవించింది. ఆయన కేవలం 39 ఏళ్ళే జీవించినప్పటికీ మన దేశంపైన చెరగని ముద్ర వేశారు’’ అని శ్రీ మోదీ అన్నారు. ఆయన తన పదునైన పదాల ద్వారా స్వాతంత్య్రాన్ని స్వప్నించడం ఒక్కటే కాకుండా ప్రజల్లో ఉమ్మడి చైతన్యాన్ని కూడా మేల్కొల్పారని చెబుతూ, ఆయన రాసిన ఒక కవితలోని రెండు పాదాలలో ఈ విషయం ఎంతో అందంగా ఇమిడిపోయిందని, ఈ మాటలు ఇప్పటికీ ఇంకా మన మనసులో మారుమోగుతూనే ఉన్నాయన్నారు. ఆ పదాలను ప్రధానమంత్రి వల్లించారు. అవే.. ‘‘ఎండ్రు తనియం ఇంద సుదందిర థాగం? ఎండ్రు మదియుం ఎంగళ్ అడిమైయ్యిన్ మోగమ్?’’ ఈ పదాలకు.. స్వతంత్రం రావాలనే ఈ దాహం తీరేది ఎప్పటికి? బానిసత్వం పట్ల మన వ్యామోహం అంతమయ్యేది ఎప్పటికి?.. అని భావం. సాహిత్యానికి, పత్రికా ప్రపంచానికీ భారతి గారు చేసిన సేవలను శ్రీ మోదీ ప్రశంసిస్తూ, 1906లో ‘ఇండియా వీక్లీ’ని తీసుకువచ్చి భారతి గారు పత్రికా రచనలో క్రాంతికి కారకులయ్యారు. రాజకీయ కార్టూన్‌లు ప్రచురించిన మొట్టమొదటి తమిళ భాషా వార్తా పత్రిక అది. ‘కణ్ణన్ పాట్టు’ వంటి ఆయన కవిత్వం అపారమైన ఆధ్యాత్మిక సారం; సమాజంలో ఆదరణకు నోచుకోకుండా మిగిలిపోయిన వర్గాలంటే ఎక్కడలేని సహానుభూతి అందులో పొంగిపొర్లింది. బీదసాదలకు వస్త్రదానం చేయండంటూ ఆయన మనవి చేయడాన్ని బట్టి చూస్తే, ప్రజలను ఆయన రచనలు ఎంతగా కార్యోన్ముఖులను చేసి, దాతృత్వం బాట పట్టించాయో రుజువు దొరుకుతుందన్నారు.’’ శ్రీ సుబ్రహ్మణ్య భారతిని ఒక అనంత స్ఫూర్తిమంతుడుగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఒక మెరుగైన భవిష్యత్తును ఆవిష్కరించుకొనే విషయంలో ఆయనలో ఎంతో నిర్భయత్వం, స్పష్టత, కాలాతీత దృక్పథం ఉన్నాయి; స్వతంత్రం, సమానత్వం, దయాళుత్వం వంటి వాటికోసం పోరాడాలని సామాన్య ప్రజలను ఆయన సదా కోరుతూ వచ్చారని శ్రీ మోదీ అన్నారు.
శ్రీ భారతియార్ ముందుచూపున్న మనిషి అంటూ ప్రధానమంత్రి ప్రశంసించారు. సమాజం ఎన్నో ఇబ్బందుల్లో సతమతమవుతూ ఉన్న కాలంలో సైతం భారతీయార్ యువతకు బలమైన మద్దతుదారుగా ఉంటూ, మహిళలకు సాధికారత కల్పన ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారన్నారు. విజ్ఞాన శాస్త్రమన్నా, నవకల్పనలన్నా ఆయనకు ఎంతో నమ్మకమని ప్రధాని చెప్పారు. ప్రజల మధ్య దూరాన్ని తగ్గించి, పూర్తి దేశాన్ని కలిపే ఒక రహదారి వ్యవస్థను ఏర్పరచాలని భారతియార్ ఆశించారన్నారు. శ్రీ సుబ్రహ్మణ్య భారతి మాటలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ భారతియార్ గారు ‘‘కాశీ నగర్, పులవర్ పేసుం, ఉరై దాన్, కాంచియిల్, కేట్‌పదార్‌కోర్, కరువి సెయ్‌వోం’’ అని పేర్కొన్నారు. ఈ మాటలకు.. కాంచిలో కూర్చొని బనారస్ సాధువులు మాట్లాడే మాటలను వినగలిగే ఒక సాధనం ఉండాలి సుమా.. అని అర్థం. ఈ కలలను డిజిటల్ ఇండియా నెరవేరుస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. దక్షిణం మొదలు ఉత్తరం వరకు, తూర్పు నుంచి పశ్చిమం వరకు భారతదేశాన్ని డిజిటల్ ఇండియా కలుపుతోందని ప్రధాని అన్నారు. భాషిణి వంటి యాప్‌లు కూడా భాషకు సంబంధించిన సమస్యలను తీర్చివేశాయని ఆయన అన్నారు. భారతదేశంలో ప్రతిఒక్క భాష విషయంలో గౌరవం, ఆదరణ భావనలు నెలకొన్నాయని, ప్రతి ఒక్క భాషను కాపాడుకోవాలనే సదుద్దేశముందని, ఇది ప్రతి ఒక్క భాషకు సేవ చేసేందుకు ఓ అవకాశాన్ని అందిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

శ్రీ భారతి సృష్టించిన సాహిత్యాన్ని ప్రధానమంత్రి మెచ్చుకొంటూ ఆయన రచనలు ప్రాచీన తమిళ భాషకు ఒక వెల కట్టరాని సంపదను అందించాయన్నారు. ‘‘శ్రీ సుబ్రహ్మణ్య భారతి సాహిత్యం తమిళ భాషకు ఒక ఖజానా. తమిళ భాష ప్రపంచంలో అత్యంత పురాతన భాషల్లో ఒకటి. మనం ఆయన సాహిత్యాన్ని మరింత మందికి చేరేటట్లు చూస్తే మనం తమిళ భాషకు కూడా సేవ చేస్తున్నట్లు అవుతుంది. ఈ పనిని మనం చేస్తే, మన దేశ పురాతన వారసత్వాన్ని మనం పరిరక్షించడమేకాక దానిని వ్యాప్తి చేస్తున్నామనే అర్థం’’ అని ప్రధానమంత్రి అన్నారు. తమిళ భాష హోదాను మరింతగా పెంచడానికి గత పదేళ్ళలో చేసిన ప్రయత్నాలను గురించి శ్రీ మోదీ చెబుతూ, ‘‘గడచిన పదేళ్ళలో తమిళ భాష గౌరవాన్ని సమాదరించడానికి దేశం అంకిత భావంతో పని చేసింద’’న్నారు. ఐక్యరాజ్య సమితిలో తమిళ భాష కీర్తికి ప్రాతినిధ్యాన్ని వహించే విశేషాధికారం నాకు దక్కింది’’ అని కూడా ఆయన అన్నారు. ‘‘మేం ప్రపంచమంతటా తిరువళ్ళువర్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామ’’ని ఆయన తెలిపారు.
కవి శ్రీ సుబ్రహ్మణ్య భారతి రచనల సంకలనం తమిళ భాష వ్యాప్తికి ఎంతగానో తోడ్పడుతుందన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. ‘‘మనమంతా కలసి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడంతోపాటు మన దేశాన్ని గురించి భారతీగారు కన్న కలలను నెరవేర్చుదాం’’ అని ఆయన అన్నారు. శ్రీ సుబ్రహ్మణ్య భారతి గారి రచనలకు సంగ్రహ రూపాన్ని ఇవ్వడంలో, ఆ సంగ్రహాన్ని ప్రచురించడంలో పాలుపంచుకొన్న ప్రతి ఒక్కరికీ శ్రీ మోదీ అభినందనలను తెలియజేస్తూ, తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, సహాయ మంత్రులు శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్, శ్రీ ఎల్. మురుగన్, సాహితీవేత్త శ్రీ శీనీ విశ్వనాథన్, ప్రచురణకర్త శ్రీ వి. శ్రీనివాసన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
శ్రీ సుబ్రహ్మణ్య భారతి రచనలు ప్రజలలో దేశభక్తి భావనను పాదుగొల్పాయి. భారతీయ సంస్కృతితోపాటు దేశ ఆధ్యాత్మిక సంపదలోని సారాన్ని సామాన్యులు సైతం అర్థం చేసుకొనే సరళ భాషలో ఆయన అందించారు. ఆయన పూర్తి రచనల సంగ్రహ గ్రంథాన్ని 23 సంపుటాల రూపంలో శ్రీ శీనీ విశ్వనాథన్ కూర్చగా, అలయన్స్ పబ్లిషర్స్ ప్రచురించింది. ఈ సంగ్రహ గ్రంథంలో సంచికలు, వివరణలు, దస్తావేజులు, పూర్వరంగ సమాచారంతోపాటు శ్రీ సుబ్రహ్మణ్య భారతి రచనల తాత్విక విశ్లేషణ ఇతరత్ర వివరాలెన్నో ఉన్నాయి.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
हमारे देश में शब्दों को केवल अभिव्यक्ति ही नहीं माना गया है।
— PMO India (@PMOIndia) December 11, 2024
हम उस संस्कृति का हिस्सा हैं, जो ‘शब्द ब्रह्म’ की बात करती है, शब्द के असीम सामर्थ्य की बात करती है: PM @narendramodi pic.twitter.com/A8MBA5Zchn
Subramania Bharati Ji was a profound thinker dedicated to serving Maa Bharati. pic.twitter.com/T22Un1pSK1
— PMO India (@PMOIndia) December 11, 2024
Subramania Bharati Ji's thoughts and intellectual brilliance continue to inspire us even today. pic.twitter.com/uUmUufXRJu
— PMO India (@PMOIndia) December 11, 2024
The literary works of Mahakavi Bharati Ji are a treasure of the Tamil language. pic.twitter.com/CojAV8jlja
— PMO India (@PMOIndia) December 11, 2024


