గౌరవ నార్వే ప్రధానమంత్రి గారూ,

ఇరుదేశాల ప్రతినిధులూ,

మీడియా మిత్రులారా,

నమస్కారం!

నార్వే సందర్శన చాలా ఆనందాన్నిస్తోంది. ప్రకృతి, మానవ పురోగతుల నడుమ సామరస్యానికి అద్భుత ఉదాహరణ ఈ అందమైన దేశం.

ఇంతటి ఆత్మీయానురాగాలతో స్వాగతం పలికిన గౌరవ నార్వే ప్రధానమంత్రికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిన్ననే నార్వే రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం తరఫున.. బలమైన, ఉత్తేజకరమైన ప్రజాస్వామ్యదేశమైన నార్వే ప్రజలకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, పహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచింది. మన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనం. ఆ మద్దతు, సంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

అస్థిరత, అనిశ్చితులతో కూడిన కాలం నేడు ప్రపంచంలో సాగుతోంది. ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా.. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్, ఐరోపా తమ సంబంధాల్లో ఓ సరికొత్త స్వర్ణయుగంలోకి అడుగిడుతున్నాయి.

గతేడాది భారత్, ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘంతో ఒక చరిత్రాత్మక వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలైంది. భారత్, నార్వేల ఉమ్మడి పురోగతి, శ్రేయస్సులకు ఒక ఆదర్శవంతమైన నమూనాగా ఈ ఒప్పందం నిలిచింది. ఈ ఒప్పందం మేరకు, వచ్చే పదిహేను సంవత్సరాల్లో దేశంలోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తేవడంతోపాటు పది లక్షల ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యం. ఈ ఒప్పందంలోని హామీలను స్పష్టమైన ఫలితాలుగా మలిచే దిశగా ఇరుపక్షాలు నేడు పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నాయి.

మిత్రులారా,

భారత్ – నార్వే సంబంధాలను హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఈ రోజు మనం రూపుదిద్దుకుంటున్నాం. భారత్ విస్తృతి, వేగం, ప్రతిభను నార్వే సాంకేతికత, మూలధనంతో మేళవించి... శుద్ధ ఇంధనం నుంచి వాతావరణ మార్పులను తట్టుకుని నిలవడం వరకు, సముద్ర ఆర్థిక వ్యవస్థ నుంచి పర్యావరణహిత షిప్పింగ్ వరకు వివిధ రంగాల్లో అంతర్జాతీయ మార్గాలను ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా మన కంపెనీలు అభివృద్ధి చేస్తాయి.

మిత్రులారా,

పరిశోధన, విద్య, ఆవిష్కరణలు కూడా మన సంబంధాలకు బలమైన మూలాధారాలుగా నిలుస్తున్నాయి. సుస్థిరత, సముద్ర శక్తి, భూగర్భ శాస్త్రం, ఆరోగ్యం వంటి రంగాల్లో పరిశోధన సహకారాన్ని విస్తరించుకోవడానికి నేడు మేం అంగీకరించాం.

ఇంజినీరింగ్, ఏఐ, సైబర్, డిజిటల్ సాంకేతికతల వంటి రంగాల్లో భవిష్యత్ సన్నద్ధంగా మా భాగస్వామ్యాన్ని నిలపడం కోసం మా విశ్వవిద్యాలయాలను, అంకుర సంస్థలను అనుసంధానిస్తాం. నైపుణ్యాభివృద్ధి, ప్రతిభావంతుల రాకపోకల్లో మన సహకారం కూడా మరింతగా విస్తరించనుంది.

మిత్రులారా,

ఆర్కిటిక్ ప్రాంతంలో నార్వే ఒక ముఖ్యమైన దేశం. ఆర్కిటిక్, ధ్రువప్రాంత పరిశోధనల్లో మన సహకారం దీర్ఘకాలికమైనది. మన దేశ ఆర్కిటిక్ పరిశోధన కేంద్రం ‘హిమాద్రి’ కార్యకలాపాలకు సహకరిస్తున్న నార్వేకు కృతజ్ఞతలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, నార్వేజియన్ అంతరిక్ష సంస్థ మధ్య ఈ రోజు కుదురుతున్న అవగాహన ఒప్పందం మా అంతరిక్ష సహకారంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది.

ఈ అన్ని రంగాల్లో బలమైన సహకారం ద్వారా.. వాతావరణ మార్పును అర్థం చేసుకోవడానికి, సున్నితమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడానికి, మానవాళి భవిష్యత్తును సురక్షితం చేయడానికి మన శాస్త్రవేత్తలు కృషి చేస్తారు.

మిత్రులారా,

భారత్, నార్వే మధ్య పర్యావరణ హిత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రపంచం మొత్తానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇండో - పసిఫిక్ మహాసముద్ర కార్యక్రమంలో ఈ రోజు నార్వేకు రావడం సంతోషదాయకం.

సముద్ర ఆర్థిక వ్యవస్థ, సముద్ర భద్రత, సామర్థ్యాభివృద్ధిలో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు రెండు ప్రధానమైన నౌకావాణిజ్య దేశాలుగా మేం కలిసి పనిచేస్తాం. ఈ రోజు మేం త్రిముఖ అభివృద్ధి సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. భారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మానవాభివృద్ధి కోసం మేమిప్పుడు కలిసి పనిచేస్తాం.

మిత్రులారా,

నిబంధనల ప్రాతిపదికన క్రమబద్ధత, చర్చలు, దౌత్యాన్ని భారత్, నార్వే విశ్వసిస్తాయి. సైనిక ఘర్షణ ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేమని మేం ఏకీభవిస్తున్నాం. ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా.. ఘర్షణలకు త్వరితగతిన ముగింపు పలికి, శాంతిని పునరుద్ధరించే ప్రతి చర్యకూ మేం మద్దతిస్తాం. భవిష్యత్తులోనూ ఆ ప్రయత్నాలకు అండగా ఉంటాం.

పెరుగుతున్న అంతర్జాతీయ సవాళ్ల పరిష్కారం కోసం అంతర్జాతీయ సంస్థల సంస్కరణ అత్యావశ్యకమన్న విషయంలోనూ మేం ఏకీభవిస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, అది ఏ రకంగా వ్యక్తమయినా దాన్ని నిర్మూలించడం మన ఉమ్మడి బాధ్యత.

గౌరవనీయులారా,

ఆర్కిటిక్ నుంచి అంతరిక్షం దాకా, పర్యావరణ హిత షిప్పింగ్ నుంచి సాగర ఆర్థిక వ్యవస్థ దాకా, ఇంధన భద్రత నుంచి ఆహార భద్రత దాకా... మన సహకారం కొత్త శిఖరాలను చేరుతోంది. విశ్వసనీయ, భవిష్యత్ దృక్పథంతో కూడిన, దీర్ఘకాలిక భాగస్వామ్యం దిశగా మన పర్యావరణ హిత వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా కొత్త అధ్యాయాన్ని లిఖిద్దాం.

ధన్యవాదాలు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Give mothers, sisters their due rights’: PM Modi pushes for women's reservation from the ramparts of Red Fort

Media Coverage

‘Give mothers, sisters their due rights’: PM Modi pushes for women's reservation from the ramparts of Red Fort
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 ఆగష్టు 2026
August 16, 2026

Aatmanirbhar Ambitions Meet Global Alliances: The Modi Doctrine in Action