· ఆపరేషన్ సిందూర్‌లో స్వదేశీ ఆయుధాలు, మేకిన్ ఇండియా శక్తిని భారత్ ప్రపంచానికి చాటింది
· పెద్ద మెట్రో నగరాల్లో లభించే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వనరులను ఇప్పుడు కాన్పూర్‌లోనూ చూడొచ్చు
· పారిశ్రామిక అవకాశాల రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నాం: ప్రధాని

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దాదాపు రూ. 47,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. కాన్పూర్ పర్యటన ఏప్రిల్ 24న చేపట్టాలని ముందుగా నిర్ణయించగా, పహల్గామ్‌లో ఉగ్రవాద దాడుల కారణంగా దాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ ఆటవిక చర్యకు బలయిన కాన్పూర్ బిడ్డ శ్రీ శుభం ద్వివేదికి ఆయన నివాళి అర్పించారు. దేశవ్యాప్తంగా అక్కాచెల్లెళ్లు, బిడ్డల బాధ, కోపం, వాళ్లందరి మానసిక క్షోభ తనను తీవ్రంగా కలచివేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వీళ్లందరి ఆక్రోశం ఎంత తీవ్రమైనదో ఆపరేషన్ సిందూర్ చేపట్టిన వేళ ప్రపంచానికి తెలిసిందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన ఆపరేషన్ సిందూర్‌లో మనం స్పష్టమైన విజయం సాధించామని, సంఘర్షణకు ముగింపు పలకాలంటూ పాక్ సైన్యం బతిమాలుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. సాయుధ దళాల పరాక్రమాన్ని కొనియాడుతూ.. స్వాతంత్య్ర పోరాటానికి నెలవైన ఈ గడ్డపైనుంచి వారి ధైర్యసాహసాలకు సలాం చేస్తున్నానన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో దయ చూపాలంటూ శత్రువు వేడుకున్నదన్న ప్రధానమంత్రి.. ఆ ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, వారు భ్రమల్లో ఉండొద్దని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ అనుసరిస్తున్న మూడు స్పష్టమైన సూత్రాలను ప్రధానమంత్రి వివరించారు. మొదటిది- ఎలాంటి ఉగ్రవాద దాడికయినా భారత్ నిశ్చయాత్మకంగా బదులిస్తుంది. ఈ ప్రతిస్పందన సమయం, పద్ధతి, పరిస్థితులను భారత సాయుధ దళాలే నిర్ణయిస్తాయి. రెండోది- భారత్ ఇకపై అణు బెదిరింపులకు భయపడదు, లేదా అలాంటి హెచ్చరికలు ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకోదు. మూడోది- ఉగ్రవాద సూత్రధారులను, వారికి ఆశ్రయం కల్పించే ప్రభుత్వాలను భారత్ ఒకేలా చూస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల మధ్య వ్యత్యాసాన్ని ఇకపై అంగీకరించబోదు. శత్రువు ఎక్కడున్నా నిర్మూలిస్తామని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

‘‘భారత దేశీయ రక్షణ సామర్థ్యాలను, మేకిన్ ఇండియా శక్తిని ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి చాటింది’’ అని శ్రీ మోదీ ప్రశంసించారు. బ్రహ్మోస్ క్షిపణి సహా భారత స్వదేశీ ఆయుధాలు లక్ష్యాలను కచ్చితంగా ఛేదించాయని, శత్రు భూభాగంలో తీవ్రమైన విధ్వంసం సృష్టించాయని చెప్పారు. ఆత్మనిర్భర భారత్ పట్ల దేశ నిబద్ధతకు ఫలితంగానే ఈ సామర్థ్యాన్ని సాధించగలిగామని ఆయన వ్యాఖ్యానించారు. సైనిక, రక్షణ అవసరాల కోసం భారత్ గతంలో విదేశాలపై ఆధారపడాల్సి ఉండేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. అయితే దేశంలో ఆ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు మొదలయ్యాయని, రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి దిశగా ముందుకెళ్తోందని తెలిపారు. రక్షణలో స్వావలంబన ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా దేశ ప్రతిష్ఠ, సార్వభౌమత్వానికి కూడా అత్యావశ్యకమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధీనత నుంచి దేశాన్ని విముక్తం చేయడానికే ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని పునరుద్ఘాటించారు. రక్షణలో స్వయం సమృద్ధిని సాధించడంలో ఉత్తరప్రదేశ్ విశేషమైన సేవలందిస్తుండడం గర్వకారణమన్నారు. కాన్పూర్‌లోని చారిత్రక ఆయుధ కర్మాగారం మాదిరిగానే ఏడు ఆయుధ కర్మాగారాలు అధునాతన రక్షణ ఉత్పత్తి యూనిట్లుగా మారాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన రక్షణ కారిడార్ ఏర్పాటునూ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, కాన్పూర్ ప్రాంతం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌కు కీలక కేంద్రంగా నిలుస్తోందని తెలిపారు.
 

ఒకప్పుడు సాంప్రదాయక పరిశ్రమలు వేరే ప్రాంతాలకు తరలివెళ్లగా, ఇప్పుడు రక్షణ రంగానికి చెందిన ముఖ్యమైన కంపెనీలు ఇక్కడ ఉనికిని చాటుకుంటున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అమేథిలో ఇప్పటికే ఏకే-203 రైఫిళ్ల ఉత్పత్తి మొదలైందన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన బ్రహ్మోస్ క్షిపణులకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ నిలయంగా మారిందని, రక్షణ ఉత్పత్తుల్లో ఈ రాష్ట్రానికి ప్రాధాన్యం పెరుగుతుండడాన్ని ఇది సూచిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రధాన రక్షణ ఎగుమతిదారుగా నిలిచే భారత ప్రస్థానంలో కాన్పూర్, ఉత్తరప్రదేశ్ ముందుంటాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కొత్త కర్మాగారాలను నెలకొల్పుతామని, గణనీయంగా పెట్టుబడులు వస్తాయని, వేలాదిగా స్థానిక యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

ఉత్తరప్రదేశ్, కాన్పూర్‌లను అభివృద్ధిలో కొత్త శిఖరాలు అధిరోహించేలా చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. పరిశ్రమలను ప్రోత్సహించడం, కాన్పూర్ చారిత్రక వైభవాన్ని పునరుద్ధరించడం ద్వారా ఈ పురోగతిని సాధించవచ్చన్నారు. గత ప్రభుత్వాలు ఆధునిక పారిశ్రామిక అవసరాలను విస్మరించాయని, దీని వల్ల కాన్పూర్‌లో పరిశ్రమలు క్షీణించాయని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబ ఆధారిత ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్నాయని, దాంతో కాన్పూర్ మాత్రమే కాదు.. ఉత్తరప్రదేశ్ మొత్తం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని ఆయన పేర్కొన్నారు.

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేలా ఇందన రంగంలో స్వావలంబన, దృఢమైన మౌలిక సదుపాయాలు, అనుసంధానం – రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి ఈ రెండూ ముఖ్యమైన ఆధారాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. 660 మెగావాట్ల పాంకి విద్యుత్ ప్లాంటు, 660 మెగావాట్ల నైవేలి విద్యుత్ ప్లాంటు, 1320 మెగావాట్ల జవహర్‌పూర్ విద్యుత్ ప్లాంటు, 660 మెగావాట్ల ఓబ్రా-సి విద్యుత్ ప్లాంటు, 660 మెగావాట్ల ఖుర్జా విద్యుత్ ప్లాంటు సహా పలు ప్రధాన విద్యుత్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టులు ముఖ్యమైన ముందడుగుగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ విద్యుత్ ప్లాంట్లు పనిచేయడం మొదలైతే రాష్ట్రంలో విద్యుత్ లభ్యత పెరుగుతుందని, అది పారిశ్రామికాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. రూ. 47,000 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించామని, వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశామని, పురోగతి దిశగా ప్రభుత్వ బలమైన నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. వృద్ధులకు ఆయుష్మాన్ వయో వందన కార్డుల పంపిణీ ద్వారా ఉచిత వైద్య చికిత్స అందుతుందని, ఇతర లబ్ధిదారులు వివిధ సంక్షేమ పథకాల ద్వారా సహాయం పొందారని ప్రధానమంత్రి తెలిపారు. కాన్పూర్, ఉత్తరప్రదేశ్ పురోగతిపట్ల ప్రభుత్వ అచంచలమైన అంకితభావాన్ని ఈ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రతిబింబిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
 

ఉత్తరప్రదేశ్‌ను ఆధునికంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రధాన మెట్రో నగరాలకే పరిమితమైన ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వనరులు ఇప్పుడు కాన్పూర్‌లోనూ కనిపిస్తున్నాయన్నారు. కొన్నేళ్ల కిందట ప్రభుత్వం కాన్పూర్‌కు తొలి మెట్రో సర్వీసును అందించిందని, నేడు కాన్పూర్ మెట్రో ఆరెంజ్ లైన్ కాన్పూర్ మధ్య ప్రాంతం వరకు చేరుకుందని చెప్పారు. అతి ఎత్తులో చేపట్టే నిర్మాణంగా ప్రారంభమైన మెట్రో వ్యవస్థ ఇప్పుడు భూగర్భానికీ విస్తరించిందని, నగరంలోని కీలక ప్రాంతాలను అంతరాయం లేకుండా అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాన్పూర్ మెట్రో విస్తరణ సాధారణ ప్రాజెక్టు కాదన్నారు. అంకితభావం కలిగిన నాయకత్వం, దృఢ సంకల్పం, నిజాయితీ గల ప్రభుత్వం ద్వారా దేశంలో పురోగతి ఎలా పరుగులు పెడుతుందో చెప్పడానికి ఇది నిదర్శనమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. కాన్పూర్‌లో రద్దీగా ఉండే ప్రాంతాలు, ఇరుకైన రోడ్లు, ఆధునిక పట్టణ ప్రణాళిక లేకపోవడం వల్ల మెట్రో సేవల అమలు, ముఖ్యమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం సాధ్యమవుతుందా అని ప్రజలు సందేహించిన సందర్భాలనూ ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యలు కాన్పూర్, రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలు అభివృద్ధి రేసులో వెనుకబడడానికి కారణమయ్యాయనీ.. ట్రాఫిక్ రద్దీని మరింత తీవ్రతరం చేసి, నగర పురోగతి మందగించడానికి దారితీశాయని పేర్కొన్నారు. ఇప్పుడు అదే కాన్పూర్, ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని తెలిపారు. మెట్రో సేవలతో కాన్పూర్ ప్రజలకు నేరుగా కలిగే ప్రయోజనాలను శ్రీ మోదీ ప్రముఖంగా వివరించారు. ప్రధాన వాణిజ్య కేంద్రంగా నవీన్ మార్కెట్, బడా చౌరాహాకు వ్యాపారులు, వినియోగదారులకు ప్రయాణాన్ని మెట్రో సులభతరం చేస్తుందని తెలిపారు. కాన్పూర్ ఐఐటీ విద్యార్థులతోపాటు సాధారణ ప్రజలు సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంలో ప్రయాణ సమయాన్ని ఇది గణనీయంగా ఆదా చేస్తుందన్నారు. ఏదైనా నగరం పురోగతిని దాని వేగం నిర్ణయిస్తుందని, మెరుగైన అనుసంధానం, రవాణా సదుపాయాలు ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో ఆధునిక చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాయని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

మౌలిక సదుపాయాలు, రవాణాలో ఉత్తరప్రదేశ్ సాధించిన అద్భుత పురోగతిని ప్రధానమంత్రి వివరించారు. రాష్ట్రంలో రోడ్లు గతంలో గుంతలతో నిండిపోయి ఉండేవని, ఇప్పుడా పరిస్థితిలో విశేషమైన మార్పులు వచ్చాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు విస్తృతమైన ఎక్స్‌ప్రెస్ రహదారి వ్యవస్థకు పేరెన్నిక గన్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఒకప్పుడు ప్రజలు సాయంత్రం తర్వాత బయటకు రావడానికి ఇష్టపడేవారు కాదని, అలాంటి ఉత్తరప్రదేశ్‌లోని రహదారులపై ఇప్పుడు 24/7 ప్రయాణికుల రద్దీ కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విశేష మార్పులను కాన్పూర్ ప్రజలే అందరికన్నా బాగా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. త్వరలోనే కాన్పూర్ - లక్నో ఎక్స్‌ప్రెస్ రహదారి లక్నోకు ప్రయాణ సమయాన్ని కేవలం 40–45 నిమిషాలకే తగ్గిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. అంతేకాకుండా లక్నో, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ రహదారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానం ఏర్పాటు చేస్తామని, కాన్పూర్-లక్నో ఎక్స్‌ప్రెస్ రహదారిని గంగా ఎక్స్‌ప్రెస్ రహదారితో అనుసంధానిస్తామని తెలిపారు. ఇది ఇరువైపులా ప్రయాణ దూరాన్ని, సమయాన్ని తగ్గిస్తుందన్నారు. ఫరూఖాబాద్-అన్వర్‌గంజ్ సెక్షన్‌లో సింగిల్-లైన్ రైల్వే ట్రాక్ కారణంగా కాన్పూర్ వాసులు చాలా కాలంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారని చెప్పారు. 18 రైల్వే క్రాసింగ్‌లతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, తరచూ మూసివేతలతో ప్రయాణానికి అంతరాయం ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కొంత ఎత్తులో రైల్వే లైన్ నిర్మించడం కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు. ఇది ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించడంతోపాటు వేగాన్ని పెంచుతుంది, కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమం కాన్పూర్ ప్రజల విలువైన సమయాన్ని ఆదా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.  

 

కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులను గురించి వివరిస్తూ.. ఈ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఆధునిక సౌకర్యాలు, మౌలిక వసతులతో విమానాశ్రయాన్ని తలపించేలా ఈ స్టేషన్ రూపుదిద్దుకోనుందని పేర్కొన్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కార్యక్రమంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో 150 రైల్వే స్టేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, తద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచనుందని వెల్లడించారు. దేశంలో అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచిందని శ్రీ మోదీ అన్నారు. హైవేలు, రైల్వేలు, వాయు మార్గాల విస్తరణతో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పారిశ్రామిక అవకాశాలకు కేంద్రంగా ఉత్తరప్రదేశ్‌ను తీర్చిదిద్దడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ఆయన పునరుద్ఘాటించారు. స్థానిక పరిశ్రమలు, ఉత్పత్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఏడాది బడ్జెట్లో మిషన్ మ్యానుఫాక్చరింగ్‌ను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల కాన్పూర్ లాంటి నగరాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని శ్రీ మోదీ అన్నారు. ఎంఎస్ఎంఈలు, చిన్న తరహా పరిశ్రమల నుంచే కాన్పూర్‌కు పారిశ్రామిక బలం చేకూరిందని ప్రధానమంత్రి అంగీకరించారు. ఈ పరిశ్రమల అంచనాలను అందుకొనేందుకు, వాటికి వృద్ధిని, స్థిరత్వాన్ని అందించేందుకు ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు.

ఎంఎస్ఎంఈ రంగంలో వస్తున్న మార్పులను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. గతంలో చిన్న వ్యాపారాలను నిరుత్సాహపరిచే విధంగా వాటిని నిర్వచించారని విమర్శించారు. వాటి ఆదాయం, వృద్ధిని ప్రోత్సహించేలా ఈ నిర్వచనాన్ని తమ ప్రభుత్వం సవరించిందని ప్రధాని పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో ఎంఎస్ఎంఈల పరిధిని విస్తరించామని, వాటికి అదనపు  మినహాయింపులు కల్పించామని తెలియజేశారు. గతంలో రుణాలు పొందడం ఎంఎస్ఎంఈలకు పెద్ద సవాలుగా ఉండేదని ప్రధాని అన్నారు. అయితే, గత పదేళ్లలో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎన్నో నిర్ణయాత్మక చర్యలు చేపట్టిందని తెలిపారు. వ్యాపారాలు ప్రారంభించాలనుకొనే యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముద్ర రుణాల ద్వారా తక్షణ ఆర్థిక సాయాన్ని పొందగలుగుతున్నారని తెలిజేశారు. దీంతో పాటుగా, క్రెడిట్ గ్యారంటీ పథకం ద్వారా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణ హామీని రూ. 20 కోట్లకు పెంచామని, వాటి వృద్ధికి తోడ్పాటు అందించేందుకు రూ. 5 లక్షల వరకు పరిమితి ఉన్న క్రెడిట్ కార్డులను అందిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. విధివిధానాలను సరళీకరించడం ద్వారా ఎంఎస్ఎంఈలు, కొత్త పరిశ్రమలకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. కాన్పూర్‌లోని సంప్రదాయ తోలు, అల్లికల పరిశ్రమలు ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ లాంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ ప్రయత్నాలు కాన్పూర్‌కి మాత్రమే కాకుండా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధికి సహకరిస్తాయని ప్రధానమంత్రి అన్నారు.
 

పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ఉత్తరప్రదేశ్ సృష్టించిందని శ్రీ మోదీ తెలిపారు. పేదల కోసం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థంగా, పారదర్శకంగా అమలవుతున్నాయని వివరించారు. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. పరిపాలన వ్యవస్థ వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్ రూ. 12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేసిందని, ఇది మిలియన్ల సంఖ్యలో మధ్యతరగతి కుటుంబాల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆర్థిక సామర్థ్యాన్ని పునరుద్ధరించిందని ఆయన ప్రకటించారు. సేవ, అభివృద్ధి పట్ల అంకితభావంతో వ్యవహరిస్తూ తమ ప్రభుత్వం అభివృద్ధి వేగాన్ని కొనసాగిస్తుందని, ఉత్తరప్రదేశ్‌ను, దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చడంలో ఏ అవకాశాన్ని వదిలిపెట్టదని తెలియజేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రులు శ్రీ కేశవ ప్రసాద్ మౌర్య, శ్రీ బ్రజేష్ పాఠక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

నేపథ్యం

ఈ ప్రాంతంలో మౌలిక వసతులను, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చున్నీగంజ్ మెట్రో స్టేషన్ నుంచి కాన్పూర్ సెంట్రల్ మెట్రో స్టేషన్ విభాగం వరకు రూ.2,120 కోట్ల విలువతో నిర్మించిన కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. దీనిలో అయిదు భూగర్భ స్టేషన్లతో సహా 14 స్టేషన్లు ఉన్నాయి. ఇవి నగరంలోని ప్రధాన ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలను మెట్రో వ్యవస్థతో అనుసంధానిస్తున్నాయి. దీనితో పాటు విస్తరించిన జీటీ రోడ్డును సైతం ఆయన ప్రారంభించారు.

ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి వివిధ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి వీలుగా గౌతమ్ బుద్ధ నగర్‌లో సెక్టార్ 28లోని యమునా ఎక్స్‌ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ (వైఈఐడీఏ) వద్ద 220 కేవీ సబ్ స్టేషన్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్ – 8, ఎకోటెక్-10 వద్ద రూ. 320 కోట్లతో నిర్మించిన 132 కేవీ సబ్ స్టేషన్లను సైతం ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ విద్యుత్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా రూ.8,300 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 660 మెగా వాట్ల పంకీ థర్మల్ విద్యుత్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టును ప్రధానమంత్రి కాన్పూర్లో ప్రారంభించారు. అలాగే ఘటంపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన మూడు 660 మెగావాట్ల యూనిట్లను సైతం ఆయన ప్రారంభించారు. రూ. 9,330 కోట్లతో నిర్మించిన ఈ యూనిట్లు విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
 

కాన్పూర్‌లోని కల్యాణ్ పూర్ పంకీ మందిర్ వద్ద పంకీ రోడ్డులోని పంకీ పవర్ హౌస్ రైల్వే క్రాసింగ్, పంకీ ధామ్ క్రాసింగ్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జిలను ప్రధాని ప్రాంరభించారు. ఇవి పంకీ థర్మల్ పవర్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టుకు బొగ్గు, చమురు సరఫరా సజావుగా సాగేలా రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. అలాగే స్థానికులకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా చేస్తుంది.

కాన్పూర్‌లోని బింగవాన్‌లో రూ.290 కోట్లకు పైగా విలువైన 40 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్లు రోజుకి) ప్రాంతీయ నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది మురుగు నీటిని పునర్వినియోగించుకొనేలా శుద్ధి చేస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో నీటి సంరక్షణను, సుస్థిరమైన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.
 

ఈ ప్రాంతంలో రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా వివిధ కార్యక్రమాలను ప్రధాని శంకుస్థాపన చేశారు. కాన్పూర్ నగర్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికోసం గౌరియా పాలి మార్గ్‌ ను విస్తరించి, బలోపేతం చేసే పనులకు ప్రధాని భూమిపూజ చేశారు. ఈ జిల్లాలో డిఫెన్స్ కారిడార్ కింద ప్రయాగరాజ్ హైవేలో నర్వాల్ మోడ్ (ఏహెచ్ – 1) ను కాన్పూర్ డిఫెన్స్ నోడ్ (4 లేన్లు)కు అనుసంధానించే రోడ్డు విస్తరణ పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది రక్షణ కారిడార్లో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తుంది. అలాగే వస్తు రవాణా, అనుసంధానాన్ని విస్తరిస్తుంది.

పీఎం ఆయుష్మాన్ వయో వందన యోజన, జాతీయ జీవనోపాధి కార్యక్రమం, పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజన లబ్ధిదారులకు ధ్రువపత్రాలు, చెక్కులను ప్రధానమంత్రి పంపిణీ చేశారు.

 

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses gratitude to the Armed Forces on Armed Forces Flag Day
December 07, 2025

The Prime Minister today conveyed his deepest gratitude to the brave men and women of the Armed Forces on the occasion of Armed Forces Flag Day.

He said that the discipline, resolve and indomitable spirit of the Armed Forces personnel protect the nation and strengthen its people. Their commitment, he noted, stands as a shining example of duty, discipline and devotion to the nation.

The Prime Minister also urged everyone to contribute to the Armed Forces Flag Day Fund in honour of the valour and service of the Armed Forces.

The Prime Minister wrote on X;

“On Armed Forces Flag Day, we express our deepest gratitude to the brave men and women who protect our nation with unwavering courage. Their discipline, resolve and spirit shield our people and strengthen our nation. Their commitment stands as a powerful example of duty, discipline and devotion to our nation. Let us also contribute to the Armed Forces Flag Day fund.”