న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన యుగ్మ్ ఆవిష్కరణల సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ప్రసంగించారు. భవిష్యత్తు సాంతకేతికతల్లో అభివృద్ధి దిశగా భారత్‌ను నడిపించేందుకు ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు, శాస్త్ర, సాంకేతిక నిపుణులతో జరుగుతున్న ముఖ్యమైన సమావేశంగా యుగ్మ్‌ను ప్రధాని వర్ణించారు. ఈ కార్యక్రమం దేశ ఆవిష్కరణ సామర్థ్యాలను, డీప్-టెక్‌లో తన పాత్రను విస్తరించే ప్రయత్నాలను వేగవంతం చేస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐ, ఇంటిలిజెంట్ సిస్టమ్స్, బయోసైన్సెస్, బయోటెక్నాలజీ, ఆరోగ్యం, ఔషధ రంగాలపై దృష్టి సారించేలా ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బాంబేల్లో సూపర్ హబ్‌లు ప్రారంభించామని తెలిపారు. అలాగే నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ సహకారంతో పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వాధ్వానీ ఇన్నోవేషన్ నెట్వర్క్ గురించి ఆయన ప్రస్తావించారు. వాధ్వానీ ఫౌండేషన్, ఐఐటీలు, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల మధ్య సహకారం ద్వారా దేశ విద్యావ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకురావడంలో చురుకుగా పనిచేస్తున్న శ్రీ రొమేష్ వాధ్వానీ అంకితభావాన్ని ప్రశంసించారు.

సంస్కృత శ్లోకాలను ఉటంకిస్తూ.. సేవ, నిస్వార్థంలోనే నిజమైన జీవితం ఉందని శ్రీ మోదీ తెలిపారు. శాస్త్ర, సాంకేతికతలను కూడా సేవామాధ్యమాలుగా ఉపయోగించుకోవాలని సూచించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో దేశాన్ని సరైన దిశలో నడిపించేందుకు వాధ్వానీ ఫౌండేషన్ లాంటి సంస్థలు, శ్రీ రొమేష్ వాధ్వానీ బృందం చేస్తున్న ప్రయత్నాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విభజనానంతర పరిస్థితులు, సొంతూరు నుంచి వలస రావడం, బాల్యంలో పోలియోతో పోరాటం, సమస్యలను అధిగమిస్తూ.. పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడం తదితర ఒడిదొడుకులతో కూడిన శ్రీ వాధ్వానీ జీవితం గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. దేశంలో విద్య, పరిశోధన రంగాలకు శ్రీ వాధ్వానీ తన విజయాన్ని అంకితం చేయడాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు. ఆదర్శవంతమైన చర్యగా దీన్ని వర్ణించారు. పాఠశాల విద్య, అంగన్వాడీల్లో సాంకేతికతలు, అగ్రిటెక్ కార్యక్రమాల్లో ఈ ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఆయన గుర్తించారు. గతంలో తాను పాల్గొన్న వాధ్వానీ ఇనిస్టిట్యూట్ ఆప్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ ఫౌండేషన్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వాధ్వానీ ఫౌండేషన్ చేపట్టే కార్యక్రమాలకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, దానికి తగినట్టుగా వారిని సిద్ధం చేయాలని ప్రధానమంత్రి అన్నారు. ఈ విషయంలో విద్యా వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. అదేవిధంగా, 21వ శతాబ్దపు అవసరాలకు తగిన విధంగా దేశ విద్యా రంగాన్ని ఆధునికీకరించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించామని, ఇది దేశ విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. జాతీయ పాఠ్య ప్రణాళిక, బోధన-అభ్యాస సామగ్రి, ఒకటి నుంచి ఏడో తరగతి వరకు కొత్త పాఠ్యపుస్తకాల గురించి ఆయన మాట్లాడారు. పీఎం ఈ-విద్య, దీక్ష వేదికల ద్వారా రూపొందించిన ఏఐ ఆధారిత డిజిటల్ విద్యా వ్యవస్థ ‘వన్ నేషన్, వన్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ గురించి పీఎం వివరించారు. ఇది 30 భారతీయ భాషలు, ఏడు విదేశీ భాషల్లో పాఠ్యపుస్తకాలను తయారుచేయగలదని వెల్లడించారు. నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్క్ - విద్యార్థులకు వివిధ రకాల అంశాలను ఒకేసారి అధ్యయనం చేసే వీలు కల్పిస్తూ.. ఆధునిక విద్యను, కొత్త కెరీర్ మార్గాలను అందిస్తోందని పేర్కొన్నారు. జాతీయ లక్ష్యాలను సాధించడానికి భారతీయ పరిశోధనా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. పరిశోధన, అభివృద్ధికి చేసిన నికర వ్యయం 2013-14లో రూ.60,000 కోట్లు ఉంటే ఇప్పుడు అది రెట్టింపు పెరిగి రూ.1.25 లక్షల కోట్లకు పైగా చేరుకుందని తెలిపారు. అత్యాధునిక వసతులతో రీసెర్చి పార్కులు, 6,000కు పైగా ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారత్‌లో సృజనాత్మక రంగం వేగంగా సాధిస్తున్న పురోగతి గురించి ప్రధాని వివరించారు. పేటెంట్ హక్కుల కోసం చేస్తున్న దరఖాస్తులు 2014లో 40,000 నుంచి ప్రస్తుతం 80,000కు పెరిగాయని తెలిపారు. ఇది యువతకు మేధో హక్కుల వ్యవస్థ అందిస్తున్న తోడ్పాటును తెలియజేస్తుందని పేర్కొన్నారు. దేశంలో పరిశోధన సంస్కృతిని పెంపొందించడానికి రూ. 50,000 కోట్లతో ఏర్పాటు చేసిన నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ గురించి, ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారికి అంతర్జాతీయ స్థాయి పరిశోధనా పత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిన వన్ నేషన్, వన్ సబ్‌స్క్రిప్షన్ కార్యక్రమం గురించి ప్రధాని మాట్లాడారు. ప్రతిభావంతులైన వ్యక్తులు తమ కెరీర్లో ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగేలా ప్రధానమంత్రి రీసెర్చి ఫెలోషిప్ తోడ్పాటు అందిస్తోందని ప్రధాని తెలియజేశారు.

నేటి యువత పరిశోధన,అభివృద్ధిలో అద్భుతంగా రాణించడమే కాకుండా, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని శ్రీ మోదీ తెలియజేశారు. వివిధ రంగాల్లో చేపడుతున్న పరిశోధనల్లో దేశ యువత అందిస్తున్న సహకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను దీనికి ఉదాహరణగా చూపించారు. 422 మీ.ల పొడవైన ఈ హైపర్‌లూప్‌ను భారతీయ రైల్వేల సహకారంతో ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసింది. ఐఐఎస్‌సీ బెంగళూరు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నానో -స్కేల్ వద్ద కాంతిని నియంత్రించే నానోటెక్నాలజీ, మాలిక్యులర్ ఫిల్మ్‌లో 16,000 కంటే ఎక్కువ కండక్షన్ స్థితులలో డేటాను నిల్వ చేసి, ప్రాసెస్ చేయగల 'బ్రెయిన్ ఆన్ ఎ చిప్' టెక్నాలజీ వంటి విప్లవాత్మక విజయాల గురించి ఆయన చర్చించారు. కొన్ని వారాల క్రితమే స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌లో మొదటిసారిగా తయారుచేసిన ఎంఆర్ఐ యంత్రం గురించి ఆయన ప్రస్తావించారు. "భారతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ముఖ్యమైన ఆవిష్కరణల దిశగా యువతను నడిపించే శక్తిమంతమైన కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి" అని శ్రీ మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న 2,000 సంస్థల్లో 90 విశ్వవిద్యాలయాలు భారత్‌కు చెందినవే అని తెలిపారు. క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సైతం భారత్ సాధిస్తున్న వృద్ధిని తెలియజేస్తూ.. ఈ జాబితాలో 2014లో మనదేశం నుంచి తొమ్మిది సంస్థలు ఉంటే.. 2025 నాటికి ఆ సంఖ్య 46కు చేరుకుందని తెలిపారు. వీటితో పాటుగా గడచిన దశాబ్దంలో ప్రపంచంలో 500 అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో సైతం భారత ఉన్నత విద్యా సంస్థల ప్రాతినిధ్యం పెరిగిందన్నారు. భారతీయ విద్యా సంస్థలు విదేశాల్లో సైతం తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నాయన్న ప్రధాని.. అబుదాబిలో ఐఐటీ ఢిల్లీ, టాంజానియాలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌ను ఏర్పాటు చేశాయని తెలిపారు. త్వరలోనే దుబాయ్‌లో ఐఐఎం అహ్మదాబాద్ కూడా క్యాంపస్ ప్రారంభించనుందని వెల్లడించారు. అలాగే ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు సైతం భారత్‌లో తమ ప్రాంగణాలను నెలకొల్పుతున్నాయి. ఇది భారతీయ విద్యార్థులకు, విద్య, పరిశోధన సహకారం, బహుళ సాంస్కృతిక అభ్యాస అవకాశాలను అందిస్తున్నాయని ఆయన తెలిపారు.
‘‘ ప్రతిభ, వైఖరి, సాంకేతికత... ఈ మూడూ భారత్ భవితను మార్చేస్తాయని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వంటి కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఇప్పటికే 10,000 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయని, బాలలకు ప్రాథమిక శిక్షణను అందించడానికి ఈ సంవత్సరం బడ్జెటులో మరో 50,000 ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతిని గుర్తుకు తెచ్చారు. విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ‘ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని’ ప్రవేశపెట్టడంతో పాటు విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని వాస్తవిక ప్రపంచానుభవంగా మార్చడానికి 7,000కు పైగా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ విభాగాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. యువతలో కొత్త నైపుణ్యాలను రంగరించడానికి చేతనైన ప్రతి ప్రయత్నాన్ని చేస్తున్నారని, యువత సమష్టి ప్రతిభ, వ్యక్తిత్వం, సాంకేతిక పాటవం భారత్‌ను విజయ శిఖరాలకు చేరుస్తాయని ప్రధాని వ్యాఖ్యానించారు.

రాబోయే 25 సంవత్సరాల్లో ‘అభివృద్ధి చెందిన భారత్’ను సాకారం చేయాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రాధాన్యాన్ని ప్రధాని స్పష్టీకరిస్తూ, ‘‘ఆలోచన స్థాయి మొదలు ప్రోటోటైప్ (మూలరూపం) ఆవిష్కారం నుంచి ఉత్పత్తి వరకు సాగే ఈ ప్రస్థానాన్ని సాధ్యమైనంత తక్కువ కాలంలో పూర్తి చేయడం కీలకం’’ అన్నారు. ప్రయోగశాల నుంచి మార్కెట్ వరకు ఉన్న దూరాన్ని తగ్గిస్తే పరిశోధన ఫలితాలను ప్రజలకు త్వరగా చేర్చడం సాధ్యమవుతుంది, దీనివల్ల పరిశోధకులకు ప్రేరణ లభిస్తుంది, వారు తాము చేసిన కృషికి గొప్ప ఫలితాలను అందుకోగలుగుతారని ఆయన చెప్పారు. దీంతో పరిశోధన, నవకల్పన, విలువ జోడింపు వేగాన్ని పుంజుకొంటాయన్నారు. ఒక బలమైన పరిశోధన అనుబంధ విస్తారిత వ్యవస్థ ఏర్పడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ విషయంలో పరిశోధకులకు విద్యాబోధన సంస్థలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ మద్దతివ్వాలని, మార్గదర్శనాన్ని అందించాలని ఆయన కోరారు. యువతకు సలహాలను, సూచనలతోపాటు ఆర్థిక సహాయాన్ని అందించడంలో, సహకారాన్ని అందిస్తూ కొత్త పరిష్కారాలను కనుగొనడంలో పరిశ్రమ రంగ నేతలు పోషించదగ్గ పాత్రను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ రకమైన ప్రయత్నాలను ప్రోత్సహించడానికి నియంత్రణలను సరళతరం చేయడంతోపాటు ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడంలో ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు.
కృత్రిమ మేధను (ఏఐ) అభివృద్ధిపరచడం, దాని సేవలను స్వీకరించడంలో భారత్ అగ్రగామిగా ఉందని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ ఎనలిటిక్స్, అంతరిక్ష సాంకేతికత, ఆరోగ్య సాంకేతికత, సింథటిక్ బయాలజీ.. వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన, ఉన్నత నాణ్యత కలిగిన డేటాసెట్స్, పరిశోధన కేంద్రాల నిర్మాణానికి ‘ఇండియా-ఏఐ మిషన్’ను ప్రారంభించిందని ఆయన ప్రస్తావించారు. అగ్రగామి సంస్థలు, పరిశ్రమలు, అంకుర సంస్థల మద్దతుతో తీర్చిదిద్దుతున్న ‘ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ (కృత్రిమ మేధ శ్రేష్ఠత్వ కేంద్రాల) సంఖ్య నానాటికీ పెరుగుతోందని కూడా ఆయన అన్నారు. ‘‘మేక్ ఏఐ ఇన్ ఇండియా’’ (‘భారత్‌లో ఏఐని రూపొందించండి’) విజన్‌తో పాటు ‘‘మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా’’ (‘ఏఐ దన్నుగా నిలిచే కార్యక్రమాల్ని భారత్ కోసం అమలుపరచండి’) అనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఐఐటీలు, ఏఐఐఎంఎస్ సహకారంతో ఐఐటీ సీట్ల సంఖ్యను పెంచాలని, వైద్య విద్యను, సాంకేతిక విద్యను కలుపుతూ మెడిటెక్ కోర్సులను ప్రారంభించాలని బడ్జెటులో తీసున్న నిర్ణయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తు కాలపు టెక్నాలజీలలో భారత్‌ను ‘‘ప్రపంచంలో అత్యుత్తమం’’గా నిలపాలన్న ధ్యేయంతో తలపెట్టిన ఈ కార్యక్రమాలను అనుకున్న కాలానికి పూర్తి చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ప్రధాని తన ప్రసంగాన్ని ముగిస్తూ, విద్యామంత్రిత్వ శాఖ, వాధ్వానీ ఫౌండేషన్.. ఈ రెండిటి సహకారంతో సంకల్పించిన వైయూజీఎం (‘యుగ్మ్’) వంటి కార్యక్రమాలు భారత్ నవకల్పన వ్యవస్థకు నూత్న జవసత్వాలను సంతరించగలవని అభివర్ణించారు. వాధ్వానీ ఫౌండేషన్ నిరంతర ప్రయత్నాల పట్ల ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమం గొప్ర ప్రభావాన్ని ప్రసరించగలదని ప్రధాని అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీ జయంత్ చౌదరి, డాక్టర్ సుకాంత మజుమ్దార్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
వైయూజీఎం ‘యుగ్మ్’ (ఈ పదానికి ‘‘సంగమం’’ అని సంస్కృతంలో అర్థం) తన తరహాకు చెందిన మొదటి వ్యూహాత్మక సమావేశం. ఇది ప్రభుత్వం, విద్య, పరిశ్రమ, నవకల్పనల అనుబంధ విస్తారిత వ్యవస్థ .. వీటి నేతలను ఒక చోటుకు చేర్చుతుంది. ఇది భారత నవకల్పన ప్రస్థానానికి తోడ్పాటును ఇవ్వనుంది. వాధ్వానీ ఫౌండేషన్‌తో పాటు ప్రభుత్వ సంస్థలు కలిసి ఈ సహకారపూర్వక ప్రాజెక్టుకు దాదాపుగా రూ.1.400 కోట్లను సమకూర్చుతాయి.

స్వయంసమృద్ధమైన, నవకల్పనలు నేతృత్వ బాధ్యతను వహించే భారత్‌ను సాకారం చేయాలన్న ప్రధాని దార్శనికతకు అనుగుణంగా, ఈ సమావేశంలో వివిధ ముఖ్య ప్రాజెక్టులను మొదలుపెట్టనున్నారు. వాటిలో ఐఐటీ కాన్పూర్ (ఏఐ, ఇంటెలిజెంట్ సిస్టమ్స్), ఐఐటీ బాంబే (బయోసైన్స్, బయోటెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యం)ల సూపర్‌హబ్‌లు భాగంగా ఉంటాయి. పరిశోధనల వాణిజ్య సరళి అనుసరణను ప్రోత్సహించడానికి అగ్రగామి పరిశోధన సంస్థలపై వాధ్వానీ ఇన్నొవేషన్ నెట్‌వర్క్ (డబ్ల్యూఐఎన్) తన దృష్టిని కేంద్రీకరిస్తుంది. పరిశోధన, నవకల్పన.. ఈ రెండిటిని ప్రోత్సహించడానికి అనుసంధాన్ నేషనల్ రిసర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్)తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకొన్నారు.
ఈ సమావేశంలో ఉన్నత స్థాయి రౌండ్‌టేబుల్ భేటీలు, బృంద చర్చలు కూడా నిర్వహిస్తారు. వీటిలో ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక జగతికి చెందిన అగ్రగామి నేతలు, విద్యారంగ ప్రముఖులు పాల్గొంటారు. పరిశోధనను ప్రభావాన్విత స్థితికి శీఘ్రంగా బదలాయించడమెలాగ అనే అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. భారత్‌లో అన్ని ప్రాంతాలకు చెందిన అత్యాధునిక నవకల్పనలను ప్రదర్శించే ఒక ‘డీప్ టెక్ స్టార్టప్’ షోకేస్ కూడా ఉంటుంది. అంతేకాకుండా, సహకారంతోపాటు భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి వివిధ రంగాల్లో ప్రత్యేక నెట్‌వర్కింగ్ అవకాశాలనూ సమకూరుస్తారు.

భారత్‌లో నవకల్పన అనుబంధ విస్తారిత వ్యవస్థలో (ఇన్నొవేషన్ ఇకోసిస్టమ్) పెద్ద ఎత్తున ప్రయివేటు పెట్టబడికి ఉత్ప్రేరకంగా నిలవాలన్నదే ఈ సమావేశ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దీనికి అదనంగా, అత్యాధునిక టెక్నాలజీలలో పరిశోధన మొదలు వాణిజ్య సరళి అనుసరణ వరకు సంబంధిత ప్రక్రియలనన్నింటినీ వేగవంతం చేయడం, విద్య- పరిశ్రమ- ప్రభుత్వం.. వీటి భాగస్వామ్యాన్ని బలపరచడం, ఏఎన్ఆర్ఎఫ్, ఏఐసీటీఈల నవకల్పన వంటి జాతీయ కార్యక్రమాలను ముందుకు తీసుకు పోవడం, సంస్థలలో నవకల్పన దశకు చేరుకొనే ప్రక్రియను ప్రజాస్వామ్యీకరించడం, 2047 కల్లా ‘వికసిత్ భారత్’ వైపు అడుగులు వేయడంలో వాటి వంతు భూమికను నిర్వహించేటట్లుగా జాతీయ నవకల్పనలను ప్రోత్సహించడం కూడా ఈ సమావేశ నిర్వహణ లక్ష్యాల్లో మరికొన్ని.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Modernising the country's education system to meet the needs of the 21st century. pic.twitter.com/zf2ap0ZQMr
— PMO India (@PMOIndia) April 29, 2025
Bringing world-class knowledge within every student's reach. pic.twitter.com/SbG4kC12Is
— PMO India (@PMOIndia) April 29, 2025
India's university campuses are emerging as dynamic centres where Yuvashakti drives breakthrough innovations. pic.twitter.com/Gi4MxYlvep
— PMO India (@PMOIndia) April 29, 2025
The trinity of Talent, Temperament and Technology will transform India's future. pic.twitter.com/wCStA45d90
— PMO India (@PMOIndia) April 29, 2025
It is crucial that the journey from idea to prototype to product is completed in the shortest time possible. pic.twitter.com/Y6iNOkHJts
— PMO India (@PMOIndia) April 29, 2025
Make AI in India.
— PMO India (@PMOIndia) April 29, 2025
Make AI work for India. pic.twitter.com/hfYRoBXj3F