చారిత్రాత్మక భారత్, బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై (సీఈటీఏ) సంతకం చేసిన తర్వాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఈ రోజు ఇరు దేశాల వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఆరోగ్యం, ఔషధాలు, రత్నాలు - ఆభరణాలు, వాహనాలు, ఇంధనం, తయారీ, టెలికాం, టెక్నాలజీ, ఐటీ, సరకు రవాణా, వస్త్రాలు, ఆర్థిక సేవల రంగాలకు చెందిన పరిశ్రమల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రంగాలు రెండు దేశాల్లో ఉపాధి కల్పన, సమగ్ర ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి.
ఇటీవలి సంవత్సరాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు విస్తరించినట్లు ఇరు దేశాల నాయకులు గుర్తించారు. వ్యాపారవేత్తలతో మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణలకు సంబంధించిన భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు సీఈటీఏ తీసుకొచ్చిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించటం ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే విషయంలో తమ నిబద్ధతను ఇద్దరు ప్రధానులు పునరుద్ఘాటించారు. కొత్త ఒప్పందం రెండు దేశాల్లో వ్యాపార వాతావరణానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని అన్నారు. సీఈటీఐ ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేస్తూ ఇద్దరు నాయకులు రెండు దేశాలకు చెందిన ప్రతిష్ఠాత్మక ఉత్పత్తులు, ఆవిష్కరణలను ప్రదర్శించారు. రత్నాలు-ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, నాణ్యమైన వినియోగ ఉత్పత్తులు, అధునాతన సాంకేతిక పరిష్కారాలు ప్రదర్శనలో భాగంగా ఉన్నాయి.
ఈ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని భారత్, బ్రిటన్ వ్యాపారవేత్తలు ప్రశంసించారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త శకానికి ఇది నాంది పలుకుతుందన్నారు. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థకు మాత్రమే పరిమతి కాకుండా వర్థమాన సాంకేతికతలు, విద్య, ఆవిష్కరణ, పరిశోధన, ఆరోగ్య రంగాలలో కూడా సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


