ముంబయి–అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ పురోగతిని సమీక్షించిన ప్రధాని భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ బృందంతో మాట్లాడిన ప్రధాని
బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణంలో పొందిన అనుభవాలను పదిలపరచాలన్న ప్రధాని ‘దేశం కోసం పనిచేస్తున్నాం.. కొత్తదాన్ని సృష్టిస్తున్నాం’ అనే భావన కలిగినప్పుడు..
అది అపారమైన ప్రేరణకు మూలంగా ఉంటుందన్న ప్రధాని

గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న సందర్శించారు. ముంబయి–అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ పురోగతిని ఆయన సమీక్షించారు. భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ బృందంతో మాట్లాడిన ఆయన… నిర్మాణ వేగం, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునే విషయంలో పురోగతితో పాటు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్ట్ సజావుగా ముందుకు సాగుతోందని ప్రాజెక్ట్ ‌నిర్మాణ సిబ్బంది ఆయనకు తెలిపారు. 

గుజరాత్‌లోని నవ్‌సారిలో ఉన్న నాయిస్ బారియర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కేరళకు చెందిన ఒక మహిళా ఇంజనీర్ స్వీయ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ ఫ్యాక్టరీలో రీబార్ కేజ్‌ల వెల్డింగ్ కోసం రోబోటిక్ యూనిట్లను ఉపయోగిస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలును తయారు చేసే విషయంలో వ్యక్తిగత అనుభవం గురించి ప్రధాని ఆమెను అడిగారు. ఈ చరిత్రాత్మక పని పట్ల కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలనుకుంటున్నట్లు అడిగారు. దేశంలోని మొట్టమెదటి బుల్లెట్ రైలులో పాలుపంచుకుంటున్నందుకు గర్విస్తున్నట్లు ఆమె చెప్పారు. దీనిని కలల ప్రాజెక్టుగా వర్ణించిన ఆమె.. తన కుటుంబానికి ఇది గర్వకారణమని తెలిపారు. 

జాతీయ సేవాస్ఫూర్తికి ఉన్న గొప్పతనం గురించి ప్రధాని మాట్లాడారు. "దేశం కోసం కష్టపడుతున్నాం… కొత్తదాన్ని సృష్టిస్తున్నాం" అనే భావన కలిగినప్పుడు.. అది అపారమైన శక్తి, ప్రేరణకు మూలంగా ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. భారతదేశ అంతరిక్ష యాత్రను ఉదాహరణగా ఆయన చెప్పారు. దేశపు తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన శాస్త్రవేత్తలకు ఉండే గొప్ప గౌరవాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ ప్రారంభమే నేడు వందలాది ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించే స్థాయికి చేరిందని ఆయన వివరించారు.

ఈ ప్రాజెక్ట్‌లో అనుసరిస్తున్న కఠినమైన డిజైన్, ఇంజినీరింగ్ నియంత్రణ ప్రక్రియలను లీడ్ ఇంజినీరింగ్ సంస్థ మేనేజర్‌‌ గా పనిచేస్తున్న బెంగళూరు నివాసి శృతి వివరించారు. ప్రాజెక్ట‌ును చేపట్టే ప్రతి దశలోనూ తమ బృందం అనుకూలతలు, ప్రతికూలతలను అంచనా వేస్తూ సమస్యలకు పరిష్కారాలను గుర్తిస్తోందని.. లోపరహిత ప్రాజెక్టు కోసం ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోందని తెలిపారు. 

ఈ నిర్మాణంలో పొందిన అనుభవాలను ఒక 'బ్లూ బుక్' మాదిరిగా పొందుపరిస్తే.. భారతదేశం బుల్లెట్ రైళ్ల నిర్మాణం దేశంలో పెద్ద ఎత్తున చేపట్టే దిశగా నిర్ణయాత్మకంగా ముందుకు సాగగలదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. పునరావృత ప్రయోగాలను భారత్ నివారించాలన్న ఆయన.. వీటికి బదులుగా ఇప్పటికే ఉన్న నమూనాల నుంచి నేర్చుకున్న విషయాలను అనుకరించాలన్నారు. ఒక పని ఎందుకు చేశామన్న అంశంపై స్పష్టత ఉంటేనే మళ్లీ ఆ పని సమర్థవంతంగా జరుగుతుందనీ, లేదంటే ఒక లక్ష్యం, దిశా లేకుండా పనులు సాగుతాయని హితవు పలికారు. బ్లూ బుక్ వంటి రికార్డులను నిర్వహించడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని, దేశ నిర్మాణానికి ఉపకరిస్తాయని ఆయన తెలిపారు. "మనం ఇక్కడ మన జీవితాలను అంకితం చేసి దేశం కోసం విలువను అందిస్తున్నాం" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 

ఒక ఉద్యోగి తన అనుభవాన్ని ఒక హృదయపూర్వక పదజాలంతో కూడిన కవిత రూపంలో చెప్పారు. ఆయన నిబద్ధతను మెచ్చుకున్న ప్రధాని..ఆయన్ను ప్రశంసించారు. 

ప్రధానమంత్రి పర్యటనలో కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ కూడా పాలుపంచుకున్నారు. 

నేపథ్యం:

దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచే ముంబయి- అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ (ఎంఏహెచ్ఎస్ఆర్)..  హై-స్పీడ్ అనుసంధానత యుగంలోకి భారత్‌ను తీసుకెళ్లనుంది. ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు స్టేషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు.

సుమారు 508 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌లో 352 కి.మీ గుజరాత్, దాద్రా నగర్ హవేలీలో ఉండగా.. 156 కి.మీ మహారాష్ట్రలో ఉన్నాయి. ఈ కారిడార్ సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయిసర్, విరార్, థానే, ముంబయి వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. దేశంలోని రవాణా మౌలిక సదుపాయాల విషయంలో ఈ ప్రాజెక్టు భారీ మార్పులు తీసుకొస్తుంది.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక ఇంజనీరింగ్ పద్ధతులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులో 465 కి.మీ.లు.. అంటే సుమారు 85 శాతం వయాడక్ట్‌లు ఉంటాయి. ఇది భద్రతను మెరుగుపరచటంతో పాటు భూ వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇప్పటివరకు 326 కి.మీ.ల వయాడక్ట్ పని పూర్తైంది. నదుల మీద ఉన్న మొత్తం 25 వంతెనల్లో 17 నిర్మాణం ఇప్పటికే పూర్తైంది. 

ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే బుల్లెట్ రైలు ముంబయి, అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు రెండు గంటలకు తగ్గిస్తుంది. ఇది ఈ నగరాల మధ్య ప్రయాణాన్ని వేగవంతం, సులభతరం, మరింత సౌకర్యవంతంగా మార్చడం ద్వారా భారీ మార్పు తీసుకురానుంది. ఈ బుల్లెట్ రైలు నడుస్తున్న ప్రాంతాల్లో వ్యాపారం, పర్యాటకం ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించనుంది. తద్వారా ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతమౌతుందని భావిస్తున్నారు. 

సుమారు 47 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సూరత్- బిలిమోరా విభాగం దాదాపు పూర్తి అయింది. ఈ విభాగంలో సివిల్, ట్రాక్-బెడ్ వేసే పనులు 100 శాతం పూర్తయ్యాయి. వజ్రాల పరిశ్రమ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా సూరత్‌కు ఉన్న గుర్తింపు ఆధారంగా ఆ నగరంలో బుల్లెట్ రైలు స్టేషన్‌ డిజైన్ ఉంది. ఇది సొగసు, కార్యకలాపాలు.. రెండింటికి సమతూకంగా ఉంది. ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేషన్‌ను రూపొందించారు. ఇందులో విశాలమైన వెయిటింగ్ లాంజ్‌లు, విశ్రాంతి గదులు, రిటైల్ దుకాణాలు ఉన్నాయి. ఇది సూరత్ మెట్రో, సిటీ బస్సులు, భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో సహా ఆటంకం లేని బహుళ నమూనా అనుసంధానతను కూడా అందిస్తుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Led by iPhones, ‘Made in India’ smartphone exports grow 28% y-o-y in CY25: Counterpoint

Media Coverage

Led by iPhones, ‘Made in India’ smartphone exports grow 28% y-o-y in CY25: Counterpoint
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 ఏప్రిల్ 2026
April 24, 2026

Made in India, Built for 2047: PM Modi’s Reforms Turning Rural Hope into National Strength