#MannKiBaat: PM Modi extends Diwali greetings to people across the country
#MannKiBaat: Diwali gives us the message to move from darkness to light, says PM Modi
#MannKiBaat: Diwali has now become a global festival. It is being celebrated across several countries, says PM
#MannKiBaat: PM Narendra Modi lauds courage of our jawans #Sandesh2Soldiers
#MannKiBaat –Our jawans display courage not only at borders but whenever there are natural calamities or even law and order crisis: PM
Aspirations of the poor must be kept in mind while formulating policies: PM Modi during #MannKiBaat
Discrimination between sons and daughters must be ended in society: PM Modi during #MannKiBaat
#MannKiBaat: PM Modi recalls contribution of Sardar Patel towards unity of the country, pays tribute to former PM Indira Gandhi
SardarPatel gave us ‘Ek Bharat’, let us make it ‘Shreshtha Bharat’, says Prime Minister Modi during #MannKiBaat
PM Modi pays tribute to Guru Nanak Dev during #MannKiBaat

ప్రియమైన నా దేశ వాసులారా,

మీకందరికీ దీపావళి పండుగ సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు. దేశం అంతటా ఉత్సాహంగా, ఉల్లాసంగా దీపావళి పండుగను జరుపుకొంటున్నారు. భారతదేశంలో 365 రోజులు ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. దూరం నుండి చూసే వారికి భారతీయ జీవన స్రవంతిలో పండుగలు, పర్వాలు, ఉత్సవాలు అవిభాజ్య అంశాలుగా కనిపిస్తాయి. వేద కాలం నుండి నేటి దాకా భారతదేశంలో అనాదిగా అనేక ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. కొన్నింటిలో సమయానుసారంగా కొన్ని మార్పులు జరిగాయి. కాలం చెల్లిన ఉత్సవాలను ఆపివేసే ధైర్యాన్ని మనవాళ్లు ప్రదర్శించారు. ఆధునిక సమాజానికి తగినట్లుగా ఉత్సవాలలో కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది.

అయితే ఈ ఉత్సవాలలో, వాటి పరిణామంలో, పండుగల వ్యాప్తిలో, జన హృదయాల్లో చోటు సంపాదించుకున్న తీరు వెనుక- వ్యక్తి నుండి సమష్ఠిలోకి పయనించడం- అనే మూల సూత్రం దాగి ఉంది. వ్యక్తి వ్యక్తిత్వ పరిధిని విస్తరించడానికి, పరిమితమైన తన ఆలోచనా వలయాన్ని సమాజం నుండి బ్రహ్మాండం దాకా విస్తృతపరిచేందుకు ఈ పండుగలు ఉపయోగపడుతున్నాయి. ఇది ఈ ఉత్సవాల ద్వారానే సాధ్యమవుతుంది. పండుగలంటే పైకి వివిధ రకాల భోజ్య పదార్థాలను ఆరగించే కార్యక్రమం అనిపిస్తుంది. ఏ రుతువులో ఏ ఆహారం ఆరోగ్యానికి మంచిదో, అటువంటి తిండి పదార్థాలనే ఆయా రుతువులలో తయారు చేస్తారు. రైతులు ఆయా రుతువుల్లో పండించే పంటలన్నింటినీ ఉత్సవాలలో ఎలా ఉపయోగించాలి అనేదే మనకు ప్రధానం.

ఆరోగ్యం దృష్ట్యా పదార్థాలు స్వీకరించడంలో ఎటువంటి మార్పులు చేయాలి.. ఈ విషయాలన్నింటినీ మన పూర్వులు చక్కగా ఆలోచించి వైజ్ఞానికమైన దృక్పథంతో పండుగలను రూపొందించారు. ప్రపంచమంతా ఇవాళ పర్యావరణాన్ని గురించే చర్చిస్తోంది. ప్రకృతి వినాశనమే చర్చనీయాంశంగా ఉంది. మన దేశంలో ఉన్న పండుగల పరంపర విధానం ప్రకృతి పట్ల మన ప్రేమను మరింత బలోపేతం చేస్తుంది. పిల్లల నుండి మొదలుకొని ప్రతి వ్యక్తిలో సంస్కారాన్ని కలిగిస్తాయి. వృక్షాలు కానివ్వండి.. మొక్కలు కానివ్వండి, నదులు కానివ్వండి.. పశువులు, పర్వతాలు, పక్షులు కానివ్వండి.. వీటన్నింటి పట్ల బాధ్యతాయుతమైన భావాన్ని కలిగించడమే పండుగల లక్ష్యం. ఇప్పట్లో మనం ప్రతి ఆదివారం సెలవు తీసుకొంటున్నాము. అయితే – మన పెద్ద తరం వారు, కూలి నాలి చేసుకునే వారు, బెస్త వారు, పాత తరానికి చెందిన వ్యక్తులంతా పున్నమికి లేదా అమావాస్యకు సముద్ర జలాల్లో ఎటువంటి మార్పులు వస్తాయో.. ఆ సమయంలో ప్రకృతి లోని ఏయే రకాలైన వాటిపై ఆ ప్రభావం ఉంటుందో విజ్ఞానం మనకు వివరించింది. ఈ ప్రభావం మనిషి మనస్సు మీద కూడా పడుతుంది. ఈ రకంగా మనం తీసుకొనే సెలవు కూడా బ్రహ్మాండంతో, విజ్ఞానంతో ముడిపడిన పరంపర మన చరిత్రకు ఉంది.
ప్రతి పండుగ మనకు ఏదో ఒక పాఠం నేర్పే విధంగా, ఆ విధమైన సందేశాన్ని అందించేదిగా ఉంది. దీపావళి కూడా అటువంటిదే. దీపావళి పండుగ ‘తమసో మ జ్యోతిర్గమయ’.. అంటే చీకటి నుండి వెలుగులోకి వెళ్లడమనే సందేశాన్ని అందిస్తుంది. చీకటి అంటే వెలుగు లేకపోవడం మాత్రమే కాదు; మూఢ విశ్వాసాలు కూడా అంధకారం. విద్య లేకపోవడం కూడా అంధకారమే. పేదరికమూ ఒక పెద్ద అంధకారమే. సామాజిక దురాచారాలు మరొక అంధకారం. దీపావళి పర్వదినం సందర్భంగా దీపాలను వెలిగించి, సమాజంలోని పాపాల అంధకారాన్ని తొలగిద్దాము. వ్యక్తిత్వాలపై అలుముకున్న దోషాలను, చీకట్లను కూడా తరిమికొడదాం. అప్పుడే నిజమైన వెలుగులు వెలిగి దివ్యమైన దివ్వెల పండుగగా మారిపోతుంది.

ఒక విషయం మనకు బాగా తెలుసు. అదేమిటంటే, భారతదేశంలో మీకు ఏ మూలకు వెళ్ళినా.. అత్యంత సంపన్నుల వద్దకు వెళ్ళినా, నిరుపేద పూరి గుడిసెలోకి వెళ్ళినా దీపావళి పండుగ నాడు ప్రతి కుటుంబంలో స్వచ్ఛతా కార్యక్రమం చక్కగా సాగడాన్ని మనం గమనిస్తాము. ఇంట్లో అడుగడుగూ పరిశుభ్రంగా ఉంటుంది. నిరుపేద ఇంట్లో మట్టి పాత్రలు ఉండవచ్చు; వాటిని కూడా చక్కగా శుభ్రపరచుకుని ఉంటారు. అవి చూస్తేనే ఇవాళ దీపావళి పండుగ అని అనిపిస్తుంది. దీపావళి పండుగ పరిశుభ్రతకు సంబంధించిన ఒక సంకేతం కూడా. అయితే పరిశుభ్రత అంటే ఒక్క మీ ఇంట్లో పరిశుభ్రత మాత్రమే కాదు, మీ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. వీధులన్నీ పరిశుభ్రంగా ఉండాలి. గ్రామమంతా స్వచ్ఛంగా కనిపించాలి. మనం ఈ భావన మనందరిలో జీర్ణించుకొనేటట్లు మన పిల్లలలోనూ ఈ భావన వ్యాపించేలాగా చూడాలి.

దీపావళి పండుగ నేడు మన ఒక్క దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచంలో అన్ని దేశాలు దీపావళి పండుగను ఏదో రూపంలో గుర్తు చేస్తూ జరుపుకుంటున్నాయి. ప్రపంచంలోని ప్రభుత్వాలు కూడా.. పార్లమెంట్ కూడా.. అక్కడి పాలకులు కూడా.. దీపావళి పర్వదినంలో భాగస్వాములు అవుతున్నారు. తూర్పు దేశాలు కావచ్చు. పాశ్చాత్య దేశాలు కావచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కావచ్చు. ఆఫ్రికా కానివ్వండి.. ఐర్లాండ్ కానివ్వండి. దూరదూరానా దీపావళి ఘనంగా కానవస్తుంది. మీకు తెలిసే ఉంటుంది. అమెరికా లోని తపాలా శాఖ ఈసారి దీపావళి సందర్భంగా ఒక తపాలా బిళ్లను జారీ చేసింది. కెనడా ప్రధాని దీపావళి సందర్భంగా దీపం వెలిగిస్తూ ఉన్న చిత్రాన్ని ట్విటర్ లో పెట్టారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే లండన్ లో దీపావళి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలతో ఒక స్వాగత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆమె స్వయంగా పాల్గొన్నారు కూడా. బ్రిటన్ లో అన్ని చోట్లా దీపావళి వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీపావళి జరుపుకోని ప్రాంతం అనేది ఆ దేశంలో ఎక్కడా కనిపించదు. సింగపూర్ ప్రధాని ఇన్ స్టాగ్రామ్ పై ఒక చిత్రాన్ని ఎంతో గౌరవంగా షేర్ చేశారు. ఇంతకూ ఆ చిత్రంలో ఏముందనుకున్నారు ? సింగపూర్ పార్లమెంట్ లోని 16 మంది మహిళా సభ్యులు భారతీయ సంప్రదాయ చీరలను ధరించి పార్లమెంట్ బయట నిలబడి ఫొటో దిగారు. ఇదంతా దీపావళి సందర్భంగానే చేయడం జరిగింది. సింగపూర్ లో ప్రతి వీధిలో ఇప్పడు దీపావళిని జరుపుకొంటున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు పంపించారు. ఆస్ట్రేలియాలోని వివిధ నగరాలలో దీపావళి పండుగ జరుపుకోవాల్సిందిగా కోరడం జరిగింది. న్యూజీలాండ్ ప్రధాని మన దేశానికి వచ్చారు. ఆయన తాను త్వరగా తన దేశానికి వెళ్లిపోవాలని నాతో అన్నారు. దానికి కారణం ఒక్కటే.. తమ దేశంలో ఆయన దీపావళిలో పాల్గొనాల్సివుందన్నారు. మొత్తానికి నేను చెప్పిన అంశాల సారాంశం ఏమంటే – వెలుగుల పండగైన దీపావళి మొత్తం ప్రపంచాన్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళ్లే ఒక సందేశాన్ని ఇస్తున్నది.

దీపావళి పండుగ నాడు కొత్త బట్టలు కట్టుకోవడం, కమ్మని భోజనం చేయడమే కాకుండా టపాకాయలను కాలుస్తారు. ఈ పండుగ పిల్లలకు, యువకులకు మహదానందాన్ని కలిగిస్తుంది. అయితే ఒక్కొక్క సారి పిల్లలు దుస్సాహసాలకు పాల్పడుతుంటారు. ఒక్కొక్క సారి టపాసులన్నింటినీ ఒకే చోట పెట్టి పెద్ద శబ్దం వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల అనుకోని ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. కొన్ని సార్లు చుట్టుపక్కల ఏ యే వస్తువులు ఉన్నాయి ? నిప్పు అంటుకుంటే అగ్ని ప్రమాదం జరుగుతుంది అనే విషయమే గుర్తుండదు. దీపావళి రోజున ఇలాంటి ఘటనలు, అగ్ని ప్రమాద వార్తలు, మరణ వార్తలు ఎంతో బాధ కలిగిస్తాయి. దీపావళి పండుగ రోజున వైద్యులంతా కూడా వారి వారి కుటుంబ సభ్యులతో పాటు దీపావళి పండుగ జరుపుకొనేందుకు తరలివెళ్తారు. దీంతో గాయపడిన వారికి వైద్యాన్ని అందించే నాథుడే లేక మనం ఆపదలో కొట్టుమిట్టాడుతాము. తల్లితండ్రులకు, సంరక్షకులకు నా మనవి ఏమంటే – టపాకాయలు కాల్చే వేళ పిల్లల పక్కన పెద్దలు నిలబడి ఉండండి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.

భారతదేశంలో దీపావళి ఒక సుదీర్ఘమైన పండుగ. ఇది కేవలం ఒక్కరోజులో జరుపుకోవడం అనేది ఉండదు. గోవర్థన పూజ కావచ్చు.. భాయీ దూజ్ కావచ్చు.. లాభ పంచమి కావచ్చు.. కార్తీక పౌర్ణమి కావచ్చు.. ఇవన్నీ వెలుగుల వైపు మనల్ని తీసుకువెళ్లే మహోత్సవాలు. వీటితో మనమంతా దీపావళి పండుగను జరుపుకుంటాం. ఛఠ్ పూజకు ఏర్పాట్లు కూడా చేసుకొంటాము.
భారతదేశంలో తూర్పు ప్రాంతంలో ఛఠ్ పూజ ఒక పెద్ద పండుగ. ఈ మహా పర్వదినం నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగలో ఒక విశేషం కూడా ఉంది.. సమాజానికి ఈ పర్వదినం ఒక మహత్తర సందేశాన్ని అందిస్తుంది. సూర్య భగవానుడు మనకు అన్నీ అందిస్తున్నాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకు సూర్యుడే దేవుడు. సూర్యుడిని ఉపాసన చేయడమే ఛఠ్ పర్వ లక్ష్యం. అయితే మామూలుగా మనమంతా ఉదయించే సూర్యుడిని పూజిస్తాం. కానీ, ఛఠ్ పూజలో అస్తమిస్తున్న సూర్యుడిని పూజించడం జరుగుతుంది. ఇందులో ఒక మహత్తరమైన సందేశం దాగి ఉంది.

నేను దీపావళిని గురించి చెబుతున్నప్పటికీ లేక ఛఠ్ పూజను గురించి చెబుతున్నప్పటికీ ఈ పండుగల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అందించడం కోసమే కాదు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ నేను ధన్యవాదాలను సమర్పించవలసిన అవసరం కూడా ఉంది. కొన్ని నెలలుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు మనకు విషాదాన్ని మిగిల్చాయి. మన సైనికులు మన సుఖ సంతోషాల కోసం వారిని వారు అర్పణం చేస్తున్నారు. మన జవానులు, భద్రత సిబ్బంది చేస్తున్న త్యాగాలు, తపస్సు, పరిశ్రమ.. ఇవన్నీ నా మనస్సంతా నిండిపోయాయి. అందుకే ఈ దీపావళి పర్వదినాన్ని రక్షణ సిబ్బందికి అంకితం చేయాలని నా మనస్సుకు అనిపించింది. నా దేశ ప్రజలకు ‘సందేశ్ టు సోల్జర్స్’ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని విజ్ఞ‌ప్తి చేశాను. దేశంలోని ప్రజలందరి హృదయాలలో సైనికుల పట్ల అసమానమైన ప్రేమ ఉంది; గౌరవం ఉంది. ఈ భావనలు ప్రజలు పంపిన సందేశాల ద్వారా పెల్లుబికాయని ఈనాడు శిరస్సు వంచి మీకు వినయ పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ మనకందరికీ సరికొత్త బలాన్ని అందిస్తాయి. రక్షణ సిబ్బందికి, సైనికులకు మన దేశ ప్రజలు అందించిన సందేశాలు వారిలో మనోబలాన్ని బాగా పెంపొందింపజేశాయి. దీనిని మనం మాటలలో చెప్పలేము. బడి పిల్లలు, కళాశాల విద్యార్థులు, పల్లెలలో నివసించే వారు, నిరుపేదలు, వ్యాపారులు, దుకాణాలు పెట్టుకొన్న వారు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ ప్రపంచానికి చెందిన వారు.. వారు ఎవరైనా కావచ్చు; దేశ సైనికుల కోసం దీపం వెలిగించని వారు, వాళ్ల కోసం శుభ సందేశాలను పంపించని వారు.. బహుశా ఎవరూ లేరేమో అనిపిస్తుంది. ఈ దీపావళి పండుగకు ప్రసార మాధ్యమాలు కూడా జవానులకు సందేశాన్ని అందించేందుకే వాటి కర్తవ్యాన్ని నిర్వర్తించాయి. బి ఎస్ ఎఫ్ కావచ్చు, సి ఆర్ పి ఎఫ్ కావచ్చు, ఇండో- టిబెటిన్ పోలీస్ కావచ్చు, అస్సాం రైఫిల్స్, నౌకాదళం, వాయుసేన, పదాతి దళం, తీర రక్షక దళం.. వీళ్లంతా అసంఖ్యాకంగా ఉన్నారు. అందరి పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. ఈ సైనికులంతా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. మనం ఇక్కడ దీపావళి పండుగను జరుపుకొంటూ ఉంటే సైనికుడు ఎక్కడో ఎడారిలో నిలబడి ఉన్నాడు. మరొకరు హిమాలయ శిఖరాల మీద, ఇంకొకరు పారిశ్రామిక సంస్థ వద్ద కాపలాదారుగా, వేరొకరు విమానాశ్రయంలో రక్షకుడిగా.. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను నెరవేరుస్తున్నారు. పండుగ సంబరంలో ఉన్న మనం అందరమూ అదే సమయంలో వారిని గుర్తు చేసుకోవడంలో సైతం ఒక నూతన శక్తి ఉత్పన్నం అవుతుంది. ఒక్క సందేశంతో సామర్ధ్యం పెరుగుతుందన్న విషయాన్ని దేశం చేసి చూపించింది. నేను నిజంగా దేశ వాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కవులు వారి కలాలతో కవితలు అల్లి, చిత్రకారులు వారి కుంచెలతో బొమ్మలు వేసి, ముగ్గులు వేసి, వ్యంగ్య చిత్రాలను గీసి- ఈ విధంగా సరస్వతీ కటాక్షం ఉన్న వారంతా తమ తమ కళలను ప్రదర్శించారు. NarendraModiApp లో, MyGov లో ఏ విధంగానైతే ప్రజలు వారి అభిప్రాయాలను ఒక ప్రవాహంలా పంపారో, అదే విధంగా కవులు, కళాకారులు వారి కవితలు, బొమ్మలు, రంగుల రూపాలలో అసంఖ్యాకంగా వారి భావాలను వ్యక్తీకరించారు. నా దేశ సైనికుల పట్ల చూపిన ఆర్ద్రమైన భావన నాలో గర్వాన్ని నింపుతోంది. ‘సందేశ్ టు సోల్జర్స్’ హ్యాష్ ట్యాగ్ కు ఎన్ని రకాల.. ఎన్ని రకాల సందేశాలు ప్రతీకాత్మకంగా వచ్చాయో ! వాటన్నింటికీ ఒక ప్రతీకగా శ్రీ మాన్ అశ్వినీకుమార్ చౌహాన్ పంపిన ఒక కవితను మీకు చదివి వినిపించాలనుకొంటున్నాను.

అశ్విని గారు ఇలా రాశారు..

‘నేను పండుగ జరుపుకొంటున్నా, సంతోషిస్తున్నా, హాయిగా నవ్వుతున్నా

నేను పండుగ జరుపుకొంటున్నా, సంతోషిస్తున్నా, హాయిగా నవ్వుతున్నా
ఇదంతా నువ్వు అక్కడ ఉన్నందువల్లే

నీకు ఈ రోజు వివరించాలనుకొంటున్నా.. అదేమిటంటే, నా స్వేచ్ఛకు సంరక్షకుడివి నువ్వే

నా స్వాతంత్ర్యానికి కారణం నువ్వు అక్కడ ఉండడమే

నేను ప్రశాంతంగా నిద్రపోతున్నా

నేను ప్రశాంతంగా నిద్రపోతున్నా, కారణం.. నువ్వు అక్కడ సరిహద్దులను కాపలా కాస్తున్నావు కదా

పర్వతాలు, గగనతలం, ఈ దేశం నీకు ప్రణమిల్లుతున్నాయి

పర్వతాలు, గగనతలం, ఈ దేశం నీకు ప్రణమిల్లుతున్నాయి

నేను కూడా కృత‌జ్ఞ‌త‌లతో నీకు నమస్కరిస్తున్నాను ఓ సాహసవంతుడైన సైనికుడా

నేను కూడా కృత‌జ్ఞ‌త‌లతో నీకు నమస్కరిస్తున్నాను ఓ సాహసవంతుడైన సైనికుడా

ప్రియమైన నా దేశ వాసులారా,

సోదరి శివానీ.. ఆమె పుట్టినిల్లు, మెట్టినిల్లు కూడా సైనికులతో నిండిపోయింది. ఒక సందేశాన్ని ఆమె టెలిఫోన్ ద్వారా పంపించారు. ఈ సైనిక కుటుంబ ప్రతినిధి ఏమన్నారో ఆలకిద్దాము మనము.

‘హలో ప్రధాన మంత్రి గారూ. నేనండి శివానీ మోహన్ ను మాట్లాడుతున్నాను. ఈ దీపావళి సందర్భంగా “సందేశ్ టు సోల్జర్స్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఇది మన సోదరులలో ఒక నైతిక ఉత్తేజాన్ని ప్రసాదించినట్లుగా రుజువు అవుతోంది. నేను ఒక సైనిక కుటుంబం నుండి వచ్చాను. నా భర్త సైన్యంలో ఒక అధికారిగా పనిచేస్తున్నారు. నా తండ్రి, మామగారు.. వీరు ఇరువురు కూడా సైన్యంలో అధికారులుగా సేవలు అందించారు. అంటే, మా కుటుంబమంతా సైనికులేనన్న మాట. సరిహద్దులను కాపు కాస్తున్న జవానులు, సైనికాధికారులు ప్రేమపూర్వకమైన సందేశాలు అందుకుంటున్నారు. దీంతో వారు మహత్తరమైన స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. నేను కూడా ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకొంటున్నాను.. సైనికులు, సైనికాధికారులతో పాటు వారి వారి కుటుంబాలు, భార్యలు సైతం త్యాగాలు చేస్తున్నారు. అందుకని యావత్తు సైనిక సముదాయానికి అద్భుతమైన సందేశం లభిస్తోంది. మీకు కూడా నేను ఆనందదాయక దీపావళి శుభాకాంక్షలను అందజేయాలనుకొంటున్నాను. మీకు ఇవే నా ధన్యవాదాలు’.

ప్రియమైన నా దేశ వాసులారా,

సైనికోద్యోగులు కేవలం మన దేశ సరిహద్దులనే కాపలా కాస్తుంటారు నిజమే. కానీ వారు జీవితంలోని ప్రతి రంగంలోనూ వారు వారి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం కావచ్చు, లేదా శాంతి భద్రత సంబంధ సంక్షోభం కావచ్చు, లేదా శత్రువులతో తలపడడం కావచ్చు, లేదా తప్పు దారి పట్టిన యువతీయువకులను తిరిగి జీవన ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు వారిలో ప్రేరణను రగిలించడం కావచ్చు, మన జవానులు దేశానికి సేవ చేయడంలో దేశభక్తి భావనను వారి దేహంలోని అణువణువున నింపుకొంటున్నారు.

ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది. దానిని గురించి మీకు వివరిస్తాను. విజయం వెనుక కారణాలు ఏమిటి..? అనే అంశాన్ని వింటుంటే ఎంతో శక్తి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీకంతా తెలిసే ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతమంతా బహిరంగ మల మూత్ర విసర్జన లేని ప్రదేశంగా మారింది. ఇంతకు ముందు సిక్కిం ఆరుబయలు మల మూత్ర విసర్జన రహిత ప్రదేశంగా ప్రకటించబడింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఆ జాబితాలోకి చేరింది. నవంబర్ 1వ తేదీ నాటికి కేరళ కూడా ఈ జాబితాలో చేరనుంది. ఇన్ని విజయాలు ఎలా సాధించగలిగాం? ఈ ప్రశ్నకు నేను జవాబిస్తాను. ఐటిబిపి లో ఒక సైనికుడు ఉన్నాడు. ఆయన పేరు శ్రీ వికాస్ ఠాకూర్. హిమాచల్ ప్రదేశ్ లోని సిర్ మౌర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఈయన. ఈయన గ్రామం పేరు బధానా. ఈ సైనికుడు సెలవుల్లో తన ఊరికి వెళ్లాడు. ఈ సమయంలో గ్రామ సభ జరుగుతున్నది. అక్కడికి ఆయన చేరుకున్నాడు. గ్రామ సభలో మరుగుదొడ్ల నిర్మాణం గురించి చర్చ కొనసాగుతోంది. కొన్ని కుటుంబాలు డబ్బు కొరత వల్ల మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టలేకపోయాయి. నిలువెల్లా దేశభక్తిని నింపుకున్న శ్రీ వికాస్ ఠాకూర్ తన గ్రామంలో మరుగుదొడ్ల కొరతను నివారించాల్సిందేనని భావించాడు. శత్రువులపై తుపాకీ గుళ్ల వర్షాన్ని కురిపించే ఈ సైనికుడు వెంటనే తన చెక్ బుక్ తీసి 57,000 రూపాయలను గ్రామ పంచాయతీకి విరాళంగా అందించాడు. 57 ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ ధనాన్ని వినియోగించాలని కోరాడు. దీని ద్వారా బహిరంగ విసర్జన లేని గ్రామంగా తన గ్రామాన్ని తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం. శ్రీ వికాస్ ఠాకూర్ తన లక్ష్యాన్ని అందుకున్నాడు . 57 కుటుంబాలకు తలా వెయ్యి రూపాయలు ఇచ్చి స్వచ్ఛతా కార్యక్రమానికి జోరును అందించాడు. ఇటువంటి సంఘటనల వల్లనే హిమాచల్ ప్రదేశ్ బహిరంగ మల విసర్జన రహిత ప్రదేశంగా మారిపోయింది.

అలాగే.. కేరళలో కూడా జరుగుతోంది. వీటన్నింటికీ కారణమైన నవ యువకులను నేను అభినందిస్తున్నా. వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. కేరళలో సుదూర ప్రాంతంలో, కారడవుల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి. అక్కడిదాకా నడిచి వెళ్లడమే ఒక గగనం. అలాంటి ఒక ఊరి పేరే ఇడమాలాకుడి. అందుకే ప్రజలు ఇక్కడిదాకా వెళ్లరు. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న నగరంలో నివసించే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఒక ఆలోచన వచ్చింది. ఇడమాలాకుడిలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలి అని అనుకున్నారు. ఎన్ సి సి క్యాడెట్లు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులంతా కలిసి మరుగుదొడ్ల నిర్మాణానికి సంకల్పించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి కావలసిన ఇటుకలు, సిమెంట్ తదితర సామాగ్రిని వీళ్లంతా తమ భుజాలపై మోసుకొని రోజంతా కాలినడకన నడుస్తూ అడవి మార్గం గుండా మారుమూల గ్రామానికి చేరుకున్నారు. అందరూ కష్టపడి మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. మారుమూల గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దారు. దీనివల్ల కేరళ రాష్ట్రం బహిరంగ విసర్జన రహిత రాష్ట్రంగా మారిపోయింది. గుజరాత్ లో కూడా దాదాపు 150 ప్రాంతాలు బహిరంగ విసర్జనలేని ప్రదేశాలుగా ప్రకటించబడ్డాయి. పది జిల్లాలు కూడా విసర్జన లేని ప్రాంతాలుగా మారిపోయాయి. హరియాణా కూడా నవంబర్ 1వ తేదీ నాటికి బహిరంగ విసర్జన రహిత ప్రదేశంగా మారిపోతుందన్న శుభ సందేశం మనకు అందింది. కొన్ని నెలల్లో హరియాణా రాష్ట్రమంతా స్వచ్ఛ రాష్ట్రంగా మారిపోనుంది. ప్రస్తుతానికి 7 జిల్లాలు స్వచ్ఛ జిల్లాలుగా మారాయి.

మిగతా రాష్ట్రాల్లో కూడా పనులు అత్యంత వేగవంతంగా సాగుతున్నయి. కొన్ని రాష్ట్రాల పేర్లు మాత్రమే నేను వివరించాను. అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాల పౌరులందరికీ నేను అభినందనలు అందిస్తున్నాను. అపరిశుభ్రత అనే అంధకారాన్ని పటాపంచలు చేయడంలో పాలుపంచుకుంటున్న నవయువకులందరికీ నా అభినందనలు.

ప్రియమైన నా దేశ వాసులారా,

ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఒక పథకం తరువాత అటువంటిదే మరో పథకం వస్తే మొదటి దానికి తిలోదకాలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ విషయం గురించి ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. పాత పథకంతో పాటు కొత్త పథకం కూడా అమలులో ఉంటుంది. రాబోయే పథకం కోసం వేచి ఉండటం కూడా కొనసాగుతుంది. ఇవన్నీ నడుస్తుంటాయి. గ్యాస్ ఉన్న ఇళ్లలో, విద్యుత్ శక్తి ఉన్న గృహాల్లో కిరోసిన్ అవసరం లేదు. అయితే – ప్రభుత్వాన్ని ఎవరు అడుగుతున్నారు. కిరోసిన్ కూడా వినియోగిస్తున్నారు. గ్యాస్ నూ ఉపయోగిస్తున్నారు. విద్యుత్ శక్తిని వాడుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో నిబంధనలను ఉల్లంఘించే వాళ్లకు మంచి అవకాశం లభిస్తుంది. ఈ విషయంలో హరియాణా రాష్ట్రాన్ని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే కిరోసిన్ రహితమైన రాష్ట్రంగా ఇది మారిపోయింది. గ్యాస్ ఉన్నవారికి, విద్యుత్ శక్తి కనెక్షన్లు ఉన్నవారికి ఆధార్ కార్డు సంఖ్య తో అనుసంధానం చేసి అటువంటి వ్యక్తుల జాబితాను తయారుచేశారు. ఇలా దాదాపు 8 జిల్లాలు కిరోసిన్ వాడని జిల్లాలుగా మారిపోయాయి. వీళ్లు చేపట్టిన కార్యక్రమాలను గమనిస్తే త్వరలో హరియాణా రాష్ట్రం కిరోసిన్ రహిత రాష్ట్రంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దొంగతనాలు, దోపిడీలు ఆగిపోతాయి. పర్యావరణం బాగుపడుతుంది. విదేశీ మారకద్రవ్యం బాగా మిగులుతుంది. ప్రజలకు సౌకర్యం ఏర్పడుతుంది. అయితే నిబంధనలను ఉల్లంఘించే వారికి మాత్రం కొంత ఇబ్బంది కలుగుతుంది.

ప్రియమైన నా దేశ వాసులారా,

మహాత్మ గాంధీ గారు మనకందరికీ నిరంతరం మార్గదర్శకులు. ఆయన చెప్పిన మాటలు నేటికీ మన దేశానికి మూలాధారం. ఒక కొత్త పథకాన్ని రూపొందించే వేళ మొట్టమొదటి సారిగా నిరుపేద ముఖం గుర్తు తెచ్చుకోండి. బలహీనుల ముఖాన్ని ఒకసారి అవలోకనం చేసుకోండి. మీరు అమలుచేసే పథకం ఈ నిరుపేదకు ఏమాత్రం ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి. మీ పథకం వల్ల నిరుపేదకు నష్టం ఏమన్నా కలుగుతుందా అని ఆలోచించండి. దాని తరువాత మీరు నిర్ణయం తీసుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదల ఆశయాలకు అనుగుణంగా నడవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆపదలు తొలగిపోవాలి. దీని కోసం మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. మన పాత ఆలోచనలు ఎలా ఉన్నా ఫర్వాలేదు. ప్రస్తుతం ఆడ, మగా అనే తేడా లేకుండా అందరికీ సమానమైన సౌకర్యాలను కల్పించాలి. నేడు పాఠశాలల్లో బాలికలకు కూడా మరుగుదొడ్లు ఉన్నాయి. మగపిల్లలకు కూడా మరుగుదొడ్లు ఉన్నాయి. ఆడపిల్లల పట్ల ఉన్న భేదభావాన్ని తొలగించే దిశగా ప్రయత్నాలు జరగాలి.

ప్రభుత్వం తరపున టీకాలు వేసే కార్యక్రమం సాగుతోంది. అయినప్పటికీ లక్షలాది మంది శిశువులు టీకాలు లేకుండా బాధపడుతున్నారు. రకరకాల రోగాలకు గురవుతున్నారు. టీకా కార్యక్రమం అందరిన పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమమే ‘మిషన్ ఇంద్రధనుష్’. ఈ కార్యక్రమం వల్ల శిశువుల్ని భయంకరమైన రోగాల నుండి రక్షించడం జరుగుతుంది. ఈ 21వ శతాబ్దంలో గ్రామాల్లో చీకటి అలుముకుంటే ఎంత మాత్రం సహించలేం. గ్రామాల్లో చీకటిని పారద్రోలేందుకు విద్యుత్్ శక్తి కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో విజయాలు సాధిస్తూ ముందడుగు వేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఒక నిరుపేద తల్లి పొయ్యి మీద వంట చేయడం ద్వారా 400 సిగరెట్ల పొగను తన శరీరంలోకి పీలిస్తే ఏమవుతుంది ? ఆమె ఆరోగ్యం పాడయిపోతుంది. 5 కోట్ల కుటుంబాలకు పొగ నుండి విముక్తిని కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో మనం సఫలీకృతులం అవుతున్నాము.

చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమ పెట్టుకున్నవాళ్లు, కాయగూరలు అమ్ముకునే వారు, పాలు అమ్ముకొనే వారు, మంగలి దుకాణాల వారు… వీరంతా వడ్డీ వ్యాపారుల విష వలయంలో చిక్కుకొని సతమతం అయ్యే వారు. ముద్రా యోజన, అంకుర యోజన, జన్ ధన్ యోజన ల వంటి పథకాలతో వడ్డీ వ్యాపారుల విష వలయం నుండి వీళ్లందరికీ విముక్తి లభించింది. ఆధార్ కార్డు ద్వారా నేరుగా డబ్బు బ్యాంకు ఖాతాలోకి వెళ్లిపోతోంది. ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ది కలుగుతుందో వారికి కలుగుతుంది. సామాన్యుని జీవితంలో కూడా మోసగాళ్ల బెడదను తొలగించేందుకు ప్రయత్నాలు జరగాలి. పరిస్థితుల్లో మార్పులు తేవడం మాత్రమే కాదు.. సమస్య నుండి నేరుగా విముక్తి కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి.

ప్రియమైన నా దేశ వాసులారా,

రేపు అక్టోబర్ 31వ తేదీ మహాపురుషుడు, ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి జరుపుకుంటున్నాం. భారతదేశ సమైక్యతే మూల మంత్రంగా శ్రీ సర్దార్ పటేల్ జీవితాన్ని కొనసాగించారు. ఒకవైపు ఉక్కు మనిషి జయంతి పర్వదినం, మరోవైపు శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి కూడా. మహా పురుషుల పుణ్య స్మరణం మనం తప్పకుండా చేయాల్సిందే. అయితే – పంజాబ్ నుండి ఒక సజ్జనుడు నాకు అందించిన సందేశం నన్ను కలచివేసింది.

‘ప్రధాన మంత్రి గారికి నమస్కారం… పంజాబ్ నుండి నేను జస్ దీప్ ను మాట్లాడుతున్నాను. మీకు తెలిసిన విషయమే.. 31వ తేదీ సర్దార్ పటేల్ గారి జన్మదినం. దేశాన్ని సమైక్యతా సూత్రంలో బంధించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహాపురుషుడు శ్రీ సర్దార్ పటేల్. అందరినీ సమానత సూత్రంలోకి తెచ్చిన మనిషి ఆయన. అలాంటి మహా పురుషుడు జన్మించిన రోజునే శ్రీమతి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఇది ఒక దురదృష్టకరమైన విషయం. ఇందిరాగాంధీ హత్యానంతరం ఎటువంటి సంఘటనలు జరిగాయో మనకంతా తెలుసు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఎలా ఆలపాలి ?’ అని అడిగారు.

ప్రియమైన నా దేశ వాసులారా,

ఈ బాధ ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు. చాణక్యుడి తరువాత దేశాన్ని సమైక్యం చేసేందుకు భగీరథ ప్రయత్నం చేసిన వ్యక్తి శ్రీ సర్దార్ వల్లభ్ భాయి పటేల్. దీనికి చరిత్రే సాక్షి. స్వతంత్ర భారతాన్ని ఒకే గొడుగు కిందకు, ఒక జెండా కిందకు తీసుకువచ్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కే దక్కుతుంది. ఈ మహాపురుషుడికి శతకోటి నమస్కారాలు. దుఃఖకరమైన విషయం ఏమంటే సర్దార్ పటేల్ సమైక్యత కోసం జీవించారు. సమైక్యత కోసమే ప్రయత్నించారు. సమైక్యత కోసమే చివరిదాకా పోరాడారు. దీని కారణంగా ఆయన ఎంతో మందికి శత్రువుగా మారిపోయారు. అయితే – ఆయన ఏకత్వ మార్గాన్ని ఎన్నటికీ వీడిపోలేదు. అలాంటి మహనీయుడు జన్మించిన రోజు శ్రీమతి గాంధీ హత్యానంతరం ఎంతోమంది సర్దార్ జీలను హత్య చేయడం జరిగింది. ఒక మహాపురుషుడు పుట్టిన రోజున సర్దార్ జీల నరమేధం జరగడం చరిత్ర పుటల్లో ఒక రక్తపు మరకగా నిలిచిపోయింది. ఇది మనకు చాలా బాధ కలిగించే అంశం.

ఈ ఆపదలన్నింటి మధ్య సమైక్య మంత్రాన్ని ఆధారంగా తీసుకుని మనం ముందుకు నడవాలి. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశ మూల సూత్రం. భాషలు అనేకం కావచ్చు.. జాతులు అనేకం కావచ్చు.. వేష భాషలు అనేకం కావచ్చు.. తినుబండారాలు అనేకం కావచ్చు. ఈ వైవిధ్యంలోనే ఏకత్వాన్ని సాధించడం మన లక్ష్యం. అదే మనకు బలం. భారతీయుల వైశిష్ట్యమే ఈ ఏకత. దీనిని కాపాడడం అన్ని తరాల వారి బాధ్యత. ప్రభుత్వాలన్నింటి బాధ్యత. దేశంలో ప్రతి చోట సమైక్యత కోసం అన్వేషించాలి. సమైక్యతత్వాన్ని పెంపొందించాలి. కలహాలు, చీలికల ప్రవృత్తికి స్వస్తి పలకాలి. శ్రీ సర్దార్ పటేల్ మనకు సమైక్య భారతాన్ని కానుకగా ఇచ్చారు. శ్రేష్ఠమైన భారతాన్ని సృష్టించడం మనందరి బాధ్యత. ఏకత్వం అనే మూల మంత్రమే శ్రేష్ఠ భారత నిర్మాణానికి దృఢమైన పునాది.

రైతుల పోరాటంతో శ్రీ సర్దార్ పటేల్ జీవితం ప్రారంభమైంది. ఆయన ఒక రైతు బిడ్డ. స్వాతంత్య్ర సంగ్రామంలో రైతులను కూడా భాగస్వాములు చేయడంలో శ్రీ సర్దార్ పటేల్ కీలక పాత్ర వహించారు. స్వాతంత్య్ర సంగ్రామాన్ని గ్రామాల్లో ఒక మహోద్యమంగా సాగించిన ఘనత శ్రీ సర్దార్ పటేల్ దే. ఆయనలో అద్భుతమైన సమైక్య శక్తి దాగి ఉంది. ఆ నైపుణ్యంతోనే ఆయన అద్భుతాన్ని సాధించారు. కేవలం శ్రీ సర్దార్ పటేల్ సంఘర్షణలకే తన జీవితాన్ని పరిమితం చేసుకోలేదు. ఆయన నూతనమైన వస్తువుల కల్పనకు నాంది పలికారు. ఈ రోజుల్లో మనం అమూల్ పేరు వింటున్నాం. అమూల్ కు సంబంధించిన ప్రతి వస్తువు గురించి మన దేశవాసులందరికీ తెలుసు. అయితే – చాలా కొద్ది మందికే తెలిసిన విషయం ఒకటి ఉంది. శ్రీ సర్దార్ పటేల్ తన దార్శనిక దృష్టితో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని నెలకొల్పే సంకల్పం చేపట్టారు. ఆ సమయంలో ఖేడా జిల్లాకు కైరా జిల్లా అనే పేరు ఉంది. 1942లో ఆయన పాడి రైతుల సహకార సంఘానికి శ్రీకారం చుట్టారు. ఈనాడు అమూల్ సంస్థ – రైతుల సమృద్ధికి, సౌభాగ్యానికి మూల కారణంగా నిలిచిపోయింది. అలనాడు ఆయన విత్తనం నాటారు, ఇప్పడు అది మహావృక్షంగా మారింది. శ్రీ సర్దార్ పటేల్ కు మనసారా అంజలి ఘటిస్తున్నాను. అక్టోబర్ 31వ తేదీ ‘ఏకతా దివస్’ గా జరుపుకొంటున్నాము. ఈ రోజున మనం ఎక్కడ ఉన్నా శ్రీ సర్దార్ పటేల్ ను స్మరించుకోవాలి. సమైక్యతను సాధించేందుకు సంకల్పించాలి.

ప్రియమైన నా దేశ వాసులారా,

దీపావళి పర్వదినం సందర్భంలో ఇదే పరంపరలో వచ్చే మరొక ఉత్సవం కార్తీక పౌర్ణమి. ఇది కూడా వెలుగుల పండుగే. గురు నానక్ దేవ్ సందేశాలు ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితమైనవి కావు. మొత్తం మానవాళికి అనుసరణీయమైనవి. నేటికి కూడా ఆయన సందేశం మనందరికీ మార్గదర్శకం. శాంతి, సమైక్యత, సద్భావన.. ఇవే మూల సూత్రాలు. సమాజంలో బేధభావాలు, మూఢ విశ్వాసాలు, దురాచారాలు వీటిని నిర్మూలించాలని గురు నానక్ దేవ్ బోధించారు. అలనాడు అస్పృశ్యత, జాతి భేదాలు, తారతమ్యాలు పరాకాష్ఠకు చేరాయి. భాయి లాలో ను గురు నానక్ దేవ్ తన శిష్యుడిగా స్వీకరించాడు. గురు నానక్ దేవ్ బేధ భావాన్ని విడనాడాలని సందేశం ఇచ్చారు. మనం ఆయన అడుగు జాడల్లో నడుద్దాము. తారతమ్యాలను తొలగిద్దాము.

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ (అందరితో కలిసి – అందరి వికాసం) అనే గమ్యం వైపు కదిలేందుకు మనకు గురు నానక్ దేవ్ కన్నా మరింత ఉత్తమమైన మార్గదర్శకత్వం లభించదు. రానున్న ప్రకాశోత్సవ్ సందర్భంగా గురు నానక్ దేవ్ కు నేను నా గుండె లోతులలో నుండి గౌరవపూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.

ప్రియమైన నా దేశ వాసులారా,

ఈ దీపావళి ని మన జవానులకు మరొక్క సారి దేశ అంకితం చేద్దాము. దీపావళి సందర్భంగా మీకందరికీ ఇవే నా శుభాకాంక్షలు. మీ అందరి కలలు పండాలని, సంకల్పాలు అన్ని విధాలుగానూ నెరవేరాలని కోరుకొంటుస్తున్నాను. మీ జీవితంలో విజయం, ఉల్లాసం నిండు గాక. అనేకానేక ధన్యవాదాలు. 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi pitches India as stable investment destination amid global turbulence

Media Coverage

PM Modi pitches India as stable investment destination amid global turbulence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 జనవరి 2026
January 12, 2026

India's Reforms Express Accelerates: Economy Booms, Diplomacy Soars, Heritage Shines Under PM Modi