హేషమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబర్ 15, 16 తేదీల్లో ఆ దేశంలో పర్యటించారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక దౌత్య సంబంధాలు ఏర్పాటై 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో, ముఖ్యమైన సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన జరుగుతుందనే వాస్తవాన్ని నాయకులు అంగీకరించారు.
పరస్పర నమ్మకం, స్నేహం, సౌహార్ధ్రతతో కూడిన తమ దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలను నాయకులు ప్రశంసించారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, భద్రత, సంస్కృతి, విద్య, తదితర రంగాల్లో విస్తరించిన సహకారంతో భారత్-జోర్డాన్ బహుపాక్షిక సంబంధాలను సానుకూలంగా వారు సమీక్షించారు.
ద్వైపాక్షిక స్థాయిలో, బహుపాక్షిక వేదికల్లో ఉభయపక్షాల మధ్య ఉన్న గొప్ప సహకారాన్ని నాయకులిద్దరూ ప్రశంసించారు. న్యూయార్క్ (2019, సెప్టెంబర్), రియాద్ (2019, అక్టోబర్), దుబాయ్ (2023, డిసెంబర్), ఇటలీ (2024, జూన్)లో తమ మధ్య జరిగిన చర్చలను గుర్తు చేసుకున్నారు.
రాజకీయ సంబంధాలు
2025, డిసెంబర్ 15న నాయకులిద్దరూ ద్వైపాక్షిక, విస్తృత సమావేశాలు నిర్వహించి.. భారత్, జోర్డాన్ మధ్య ఉన్న సంబంధాలపై చర్చించారు. పరస్పరం ఆసక్తి ఉన్న రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవడానికి, తమ అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చుకోవడంలో ఒకరికొకరు విశ్వసనీయమైన భాగస్వామిగా ఉండటానికి వారు అంగీకరించారు.
రెండు దేశాల మధ్య క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న రాజకీయ చర్చలతో పాటు విభిన్న రంగాలకు చెందిన వివిధ సంయుక్త కార్యాచరణ బృందాల సమావేశాలపై నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగాలను పూర్తిగా ఉపయోగించుకొనేందుకు వారు అంగీకరించారు. ఈ అంశంలో 2025 ఏప్రిల్ 29న అమ్మాన్‌లో రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య జరిగిన నాలుగో దశ రాజకీయ సంప్రదింపుల ఫలితాలను ప్రశంసించారు. అయిదో రౌండ్ న్యూఢిల్లీలో జరుగుతుంది.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రెండు దేశాల మధ్య ఉన్న సానుకూల సంబంధాలను కొనసాగించడానికి, ఉన్నత స్థాయి చర్చలను ప్రోత్సహించడానికి, పరస్పర సహకారాన్ని, భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి నాయకులు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
ఆర్థిక సహకారం
భారత్, జోర్డాన్ మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలను నాయకులిద్దరూ అభినందించారు. దీని విలువ 2024 నాటికి 2.3 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. దీంతో జోర్డాన్‌కు మూడో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ మారింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరింపజేసేందుకు వాణిజ్య వస్తువులను వైవిధ్య పరచాల్సిన అవసరం ఉందని వారు గుర్తించారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో పురోగతిని పర్యవేక్షించేందుకు గాను 11వ వాణిజ్య, ఆర్థిక సంయుక్త కమిటీని నిర్దిష్ట సమయానికంటే ముందుగా 2026 ప్రథమార్ధంలోనే నిర్వహించేందుకు నాయకులు అంగీకరించారు.
ఈ పర్యటనలో భాగంగా 2025 డిసెంబర్ 16న జోర్డాన్-భారత్ బిజినెస్ ఫోరాన్ని నిర్వహించడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, విస్తరించడానికి ఉన్న మార్గాలను రెండు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి బృందం చర్చించింది.
సుంకాల రంగంలో సహకారానికున్న ప్రాధాన్యాన్ని ఇద్దరు నాయకులు గుర్తించారు. సుంకాల సంబంధిత వ్యవహారాల్లో సహకారం, పరస్పర పరిపాలన సంబంధ సహాయంపై ఒప్పందాన్ని పూర్తిగా ఉపయోగించుకొనేందుకు వారు అంగీకరించారు. పన్ను చట్టాలను సక్రమంగా అమలు చేయడానికి, కస్టమ్స్ నేరాలను అడ్డుకోవడానికి సమాచారాన్ని పంచుకొనే వీలును ఈ ఒప్పందం కల్పిస్తుంది. అలాగే రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు పన్ను విధానాలను సరళీకరిస్తారు.
వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న జోర్డాన్ భౌగోళిక స్థితిని, అధునాతన రవాణా సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించేందుకు ఉన్న సామర్థ్యాన్ని నాయకులిద్దరూ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఉమ్మడి ఆర్థిక ఆసక్తులను, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యూహాత్మక అవకాశంగా జోర్డాన్ ట్రాన్సిట్, సరకు రవాణా మౌలిక వసతులను ఏకీకృతం చేయడంతో సహా రవాణాను అనుసంధానతను బలోపేతం చేయాల్సిన ప్రాధాన్యాన్ని ఉభయపక్షాలు స్పష్టం చేశాయి.
సాంకేతికత, విద్య
డిజిటల్ సాంకేతికత, విద్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ఉభయపక్షాలు సమీక్షించాయి. డిజిటల్ పరివర్తనలో అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇతర రంగాల్లో డిజిటల్ పరివర్తన పరిష్కారాల అమల్లో సాధ్యాసాధ్యాల అధ్యయనానికి సంస్థాగత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం సహా వివిధ రంగాల్లో సహకారానికి అంగీకరించారు.
రెండు దేశాల్లోనూ డిజిటల్ పరివర్తన కార్యక్రమాలను అమలు చేయడంలో సహకారానికి కొత్త అవకాశాలను అన్వేషించేందుకు వారు అంగీకరించారు. అల్ హుస్సేన్ టెక్నికల్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇండియా అండ్ జోర్డాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను విస్తరించడానికి, మౌలిక వసతులను మెరుగుపరచడంలో ఇరు పక్షాలు ఆసక్తిని వ్యక్తం చేశాయి.
డిజిటల్ ప్రజా మౌలిక వసతులు (డీపీఐ) రంగంలో సహకార ప్రణాళికపై రెండు పక్షాలు చర్చించాయి. ఈ నేపథ్యంలో, డీపీఐలో భారత అనుభవాన్ని పంచుకొనే దిశగా ఒప్పందం కుదుర్చుకోవాలనే ఆలోచనను ఉభయపక్షాలు స్వాగతించాయి. సురక్షితమైన, భద్రమైన, నమ్మకమైన, సమగ్రమైన డిజిటల్ వ్యవస్థను అందించడంలో సహకారానికి ఇద్దరూ అంగీకరించారు.
విద్య, ఆర్థిక ప్రగతి, సామాజిక అభివృద్ధిలో సాంకేతికత పోషించే కీలకపాత్రను రెండు పక్షాలు గుర్తించాయి. డిజిటల్ పరివర్తన, పరిపాలన, సామర్థ్య నిర్మాణంలో సహకారాన్ని కొనసాగించడానికి అంగీకరించాయి.
సుస్థిరాభివృద్ధిలో సామర్థ్య పెంపునకు ఉన్న ముఖ్యమైన పాత్రను భారత్ ప్రధానంగా పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాల్లో ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ) కార్యక్రమం ద్వారా సహయ సహకారాలను కొనసాగించేందుకు నిబద్ధతతో ఉన్నట్లు తెలియజేసింది. 35గా ఉన్న ఐటీఈసీ స్లాట్‌లను ఈ సంవత్సరం నుంచి 50కి పెంచినందుకు జోర్డాన్ హర్షం వ్యక్తం చేసింది.
ఆరోగ్యం
ఆరోగ్య సంరక్షణ విషయంలో నైపుణ్యాలను పంచుకోవటం ద్వారా ముఖ్యంగా టెలి-మెడిసిన్, ఆరోగ్య సిబ్బంది శిక్షణలో సామర్థ్య పెంపును ప్రోత్సహించే విషయంలో కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నట్లు ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. ఉభయ దేశాల ప్రజల సంక్షేమాన్ని పెంపొందించడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీ) సాధించడంలో ఆరోగ్యం- ఫార్మా రంగం కీలక పాత్ర పోషిస్తుందని వారు గుర్తించారు.
వ్యవసాయం
ఆహార భద్రత, పోషణను పెంపొందించడంలో వ్యవసాయ రంగానికి ఉన్న కీలక పాత్రను ఇద్దరు నాయకులు గుర్తించారు. ఈ రంగంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు నిబద్ధతతో ఉన్నట్లు వారు తెలిపారు. ఎరువుల రంగం ముఖ్యంగా ఫాస్పేట్లలో ఇరుపక్షాల మధ్యనున్న ప్రస్తుత భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా సమీక్షించారు. వ్యవసాయం, సంబంధిత రంగాల సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతికత, నైపుణ్య మార్పిడిలో సహకారాన్ని పెంచుకునేందుకు కూడా అంగీకరించారు.
జల వనరుల భాగస్వామ్యం
జల వనరుల నిర్వహణ, అభివృద్ధి విషయంలో సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. నీటిని పొదుపు చేసే వ్యవసాయ సాంకేతికతలు, సామర్థ్య పెంపు, వాతావరణ అనుకూల విధానాలు- ప్రణాళిక, భూగర్భ జలాల నిర్వహణ వంటి రంగాల్లో ఇరుపక్షాల మధ్య భాగస్వామ్యానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు తెలిపారు.
హరిత, సుస్థిర అభివృద్ధి
వాతావరణ మార్పు, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి, నూతన- పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో సహకారాన్ని పెంచుకునే అంశానికి ఉన్న ప్రాముఖ్యతను రెండు దేశాల నాయకులు చర్చించారు. నూతన- పునరుత్పాదక ఇంధన రంగంలో సాంకేతిక సహకారం కోసం కుదిరిన ఎంఓయూను వారు స్వాగతించారు. శాస్త్ర సాంకేతిక సిబ్బంది మార్పిడి- శిక్షణ, వర్క్‌షాప్‌లు- సెమినార్ల నిర్వహణ, పరికరాలు- సాంకేతిక పరిజ్ఞానాన్ని వాణిజ్యేతర ప్రాతిపదికన బదిలీ చేయడం, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులను చేపట్టాలని ఈ ఒప్పందంలో ఉంది.
సాంస్కృతిక సహకారం
భారత్, జోర్డాన్ మధ్య పెరుగుతున్న సాంస్కృతిక మార్పిడిని ఇరుపక్షాలు అభినందించాయి. 2025–2029 కాలానికి సంబంధించిన సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంపై (సీఈపీ) సంతకం చేయడాన్ని వారు స్వాగతించారు. సంగీతం, నృత్యం, థియేటర్, కళలు, ఆర్కైవ్స్, లైబ్రరీలు, సాహిత్యం, పండుగల విషయంలో సహకారాన్ని పెంచుకునే ఆలోచనకు మద్దతునిస్తున్నట్లు వారు తెలిపారు. పురావస్తు కేంద్రాల అభివృద్ధి, సామాజిక సంబంధాలను ప్రోత్సాహించటంపై దృష్టి సారిస్తూ పెట్రా నగరం, ఎల్లోరా గుహల మధ్య కుదిరిన ట్విన్నింగ్ ఒప్పందాన్ని వారు స్వాగతించారు.
అనుసంధానత
ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో ప్రత్యక్ష విమాన లేదా రవాణా అనుసంధానతకు ఉన్న ప్రాముఖ్యతను రెండు దేశాలు గుర్తించాయి. వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు దీనినొక పునాదిగా పేర్కొన్న ఇరువురు నాయకులు తద్వారా పరస్పర అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష అనుసంధానతను పెంచే అవకాశాలను పరిశీలించేందుకు వారు అంగీకరించారు.
బహుళ పక్ష సహకారం
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ), విపత్తులను తట్టుకొనే మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమిలలో (జీబీఏ) భారత్ నాయకత్వాన్ని జోర్డాన్ రాజు అబ్దుల్లా II ప్రశంసించారు. ఈ మూడు అంతర్జాతీయ సంస్థలలో చేరేందుకు జోర్డాన్ ఆసక్తి వ్యక్తం చేయటాన్ని భారత్ స్వాగతించింది. కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యాలను సాధించేందుకు, ఆర్థిక- సామాజిక అభివృద్ధిని అందించేందుకు జీవ ఇంధనాలు ఒక సుస్థిర ప్రత్యామ్నాయమని ఇరుపక్షాలు గుర్తించాయి.
తనతో పాటు తన ప్రతినిధి బృందానికి లభించిన ఘన స్వాగతం, ఆతిథ్యానికి గాను రాజు అబ్దుల్లా IIకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జోర్డాన్ ప్రజలు నిరంతర పురోగతి, శ్రేయస్సు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపిన ఆయన ఈ విషయంలో శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ మరింత పురోగతి, శ్రేయస్సు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపిన జోర్డాన్ రాజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.


