Published By : Admin |
November 5, 2010 | 23:53 IST
Share
Friends, Deepawali celebrates every year the victory of good over evil, or the positive over the negative. Rather than make it just an annual ritual of diyas and crackers, let us make the tradition more relevant.
Let us resolve to remain positive in the face of challenges. In the midst of our own joy, let us also think of our less fortunate brothers and sisters – let each of us do something, any little thing, to bring joy to their lives. Let us always choose love, life, tolerance and compassion above anything else.
May the Diwali and New Year make you shine brighter.
సోమనాథ్ ఆత్మగౌరవ పర్వం – సహస్రాబ్ద అఖండ విశ్వాసం (1026-2026)
January 05, 2026
Share
సోమనాథ్... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలోని గుజరాత్ రాష్ట్రం ప్రభాస్ పటాన్ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని ‘ద్వాదశ జ్యోతిర్లింగ’ స్తోత్రం ప్రస్తుతిస్తుంది. “సౌరాష్ట్రే సోమనాథం చ...” అంటూ ఆరంభమయ్యే ఈ స్తోత్రం, తొలి జ్యోతిర్లింగ నెలవుగా సోమనాథ్ నాగరికత, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా… ఈ శ్లోకం జ్యోతిర్లింగ మహత్తును ఇలా చాటిచెబుతుంది.
అంటే- “సోమనాథ్ శివలింగ దర్శన మాత్రాన జీవుడు పాప విముక్తుడై సదాశయాలను నెరవేర్చి, మరణానంతరం స్వర్గ ప్రాప్తినొందుతాడు” అని అర్థం.
కానీ, లక్షలాది భక్తజనం భక్తిప్రపత్తులతో నీరాజనాలు అర్పించిన ఈ సోమనాథ్పై దురదృష్టవశాత్తూ విధ్వంసమే ఏకైక ధ్యేయంగా విదేశీ దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు.
ఈ నేపథ్యంలో సోమనాథ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ ఐతిహాసిక పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఈ ఏడాదిలో వెయ్యేళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు.
అయితే, సోమనాథ్కు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తోంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ మేరకు ఆలయ పునరుద్ధరణ అనంతరం 1951 మే 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షాన నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ భాగ్యం కల్పిస్తూ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. సోమనాథ్పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది. ప్రతి పంక్తిలోనూ బట్టబయలయ్యే హింస, క్రూరత్వం వెయ్యేళ్లు గడిచినా మరపురాని విషాద భారాన్ని మన మనోఫలకంపై మోపుతాయి.
భారత దేశంపైన, ప్రజల మనోధైర్యం మీద అది చూపిన పెను దుష్ప్రభావాన్ని ఒకసారి ఊహించండి. సముద్ర తీరంలోగల సోమనాథ్ ఆలయం అమేయ ఆర్థిక శక్తితో సమాజానికి సాధికారతనిచ్చింది. అన్నింటినీ మించి సోమనాథ్కు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. నాటి సమాజంలోని సముద్ర వ్యాపారులు, నావికులు సోమనాథ్ వైభవ గాథలను దేశదేశాలకు విస్తృతంగా మోసుకెళ్లారు.
అయినప్పటికీ, తొలి దాడికి సహస్రాబ్ది పూర్తయ్యాక కూడా సోమనాథ్ గాథ విధ్వంస నిర్వచనంగా నిలవకపోవడంపై నిస్సందేహంగా నేనెంతో గర్విస్తున్నాను. ఈ ఆలయం ఈనాడు భరతమాత కోట్లాది బిడ్డల అఖండ ధైర్యానికి నిర్వచనంగా నిలుస్తోంది.
ఎన్నడో వెయ్యేళ్ల కిందట 1026లో మొదలైన మధ్యయుగపు అనాగరిక దండయాత్ర, ఇతరులను కూడా సోమనాథ్పై పదేపదే దాడులకు ‘ప్రేరేపించింది.’ దేశ ప్రజలను, సంస్కృతిని దాస్య శృంఖలాల్లో బంధించే ప్రయత్నాలకు నాంది పలికింది. కానీ, ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్ ప్రముఖులు. సోమ్నాథ్లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది.అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం.
స్వామి వివేకానంద 1890 దశకంలో సోమనాథ్ను సందర్శించినపుడు అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యారు. నాటి తన అనుభవాన్ని 1897లో చెన్నై నగరంలో ఓ కార్యక్రమం సందర్భంగా- “దక్షిణ భారతంలోని ప్రాచీన ఆలయాలతోపాటు గుజరాత్లోని సోమనాథ్ వంటివి మనకు అపార జ్ఞానప్రదాతలు. ఎన్నో పుస్తకాలు వివరించలేని జాతి చరిత్రపై మనకు మరింత లోతైన అవగాహనను అందిస్తాయి. వంద దాడులను భరించిన గుర్తులతోనే కాకుండా వంద పునరుజ్జీవన చిహ్నాలతో ఈ ఆలయాలు ఎంత వైభవంగా నిలిచాయో గమనించండి. నిరంతర విధ్వంసం, శిథిలాల నుంచి నిరంతర పునరుజ్జీవనంతో మునుపటి ఠీవితో ఎంత శక్తిమంతంగా విలసిల్లుతున్నాయో చూడండి! అదే జాతీయ మనోభావన… జాతీయ జీవన స్రవంతి. అనుసరిస్తే అది అమేయ యశస్సు వైపు మనల్ని నడిపిస్తుంది. ఆ జీవన స్రవంతిని వీడితే ఫలితం మరణమే! ఆ మార్గం వదిలిపెడితే ప్రభావం ఆత్మనాశనం, వినాశమే!”
స్వాతంత్ర్యానంతరం సమర్థుడైన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ సోమనాథ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను స్వీకరించారు. 1947లో దీపావళి వేళ ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయిన సర్దార్ పటేల్.. అక్కడే ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి 1951 మే 11న సోమనాథ్లో భవ్యమైన ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకకు హాజరయ్యారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలని కలలుగన్న యోధుడు సర్దార్ సాహెబ్ ఆ సమయానికి భౌతికంగా ఈ లోకంలో లేరు. కానీ, ఆయన స్వప్నం సాకారమై దేశం ఎదుట సగర్వంగా నిలిచింది. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ పరిణామం పట్ల అంతగా ఉత్సాహం చూపలేదు. ఎంతో విశిష్టమైన ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి, మంత్రులు పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమం భారత్పై ప్రతికూల ముద్ర వేసిందని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. అనంతర పరిణామాలు చరిత్ర పుటల్లో నిలిచే ఉన్నాయి. సర్దార్ పటేల్కు ఎంతో అండగా నిలిచిన కె.ఎం. మున్షీని స్మరించుకోకపోతే సోమనాథ్ గాథ అసంపూర్ణమే అవుతుంది.
‘సోమనాథ: నిత్య క్షేత్రం (సోమనాథ: ది ష్రైన్ ఎటర్నల్)’ గ్రంథంతోపాటు.. సోమనాథ్పై ఎన్నో సమాచారభరిత, విజ్ఞానదాయకమైన రచనలు చేశారు.
నిజానికి, మున్షీ తన గ్రంథ శీర్షికలో చెప్పినట్టు.. ఆత్మ నిత్యత్వాన్నీ, ఉన్నత భావాల శాశ్వతత్వాన్నీ బలంగా విశ్వసించే గొప్ప నాగరికత మనది. ‘నైనం ఛిందన్తి శస్త్రాని’ అని గీతలో చెప్పినట్టు – అది ధ్వంసం చేయ శక్యంగాని అజరామరత్వమని మనం బలంగా నమ్ముతాం. మన నాగరికత అజేయ స్ఫూర్తికి సోమనాథ్ను మించిన ఉదాహరణ మరొకటి లేదు. ఎన్నో అవరోధాలనూ, ఆటుపోట్లనూ ఎదుర్కొని వైభవోపేతంగా నిలిచిన సోమనాథ్ కన్నా మిన్నగా మరేది దీన్ని వివరించగలదు?
వందల ఏళ్ల దాడులనూ, వలసవాద దోపిడీనీ తట్టుకొని నిలబడి.. నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగిన భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి తొణికిసలాడుతోంది. నేడు భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందంటే.. మన విలువలు, భారతీయుల దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్ను చూస్తోంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలను చూపుతోంది.
అనాది కాలం నుంచి వివిధ వర్గాల ప్రజలను సోమనాథ్ ఏకం చేస్తోంది. శతాబ్దాల కిందటే పూజ్య జైన సన్యాసి కలికాల సర్వజ్ఞ హేమచంద్రాచార్యులు సోమనాథ్కు వచ్చారు. అక్కడ ప్రార్థన అనంతరం.. ‘భవబీజాంకురజననా రాగాధ్యాః క్షయముపగతా యస్య’ అనే శ్లోకాన్ని ఆయన చెప్పాడంటారు. అంటే – ‘‘లౌకిక కర్మ బీజాలను నశింపజేసే వాడికీ.. రాగద్వేషాలనూ, సమస్త క్లేశాలనూ తుడిచిపెట్టే వాడికీ వందనాలు’’ అని అర్థం. నేడు మన మనస్సులోనూ, ఆత్మలోనూ ఒక బలమైన చైతన్యాన్ని రగిలించే అద్భుత శక్తి సోమనాథ్కు ఉంది.
1026లో మొదటిసారి దాడి జరిగి వెయ్యేళ్లు గడిచినా.. సోమనాథ్ వద్ద సాగరం నేటికీ అంతే గంభీరంగా గర్జిస్తోంది. సోమనాథ్ తీరాన్ని తాకే అలలు అద్భుతమైన కథను చెబుతున్నాయి. ఆటంకాలెన్నెదురైనా.. ఆ అలల మాదిరిగానే మళ్లీ సోమనాథ అభ్యుదయం తథ్యం.
నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసిన ధూళి కణాలయ్యారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయపదాలుగా మిగిలాయి. వారంతా చరిత్ర గ్రంథాల్లో పాదసూచికలు మాత్రమే. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా దేదీప్యమై వెలుగులు విరజిమ్ముతోంది. 1026 నాటి దాడితో ఏమాత్రమూ చెక్కుచెదరని ఆ అజేయమైన, చిరతరమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. సోమనాథ్ ఒక ఆశా గీతం. ద్వేషం, మతోన్మాదాలకు తాత్కాలికంగా ధ్వంసం చేసే శక్తి ఉండవచ్చు. కానీ సత్యమూ, ధర్మంపై అచంచలమైన విశ్వాసమూ అమరత్వాన్ని సృజించగలవని సోమనాథ్ చాటుతోంది.
వెయ్యేళ్ల కిందట దాడికి గురై, తర్వాత కూడా నిరంతర దాడులను ఎదుర్కొన్న సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ సగర్వంగా నిలిచినట్టే.. మనం కూడా పరాయి దండయాత్రలకు ముందున్న, వెయ్యేళ్ల కిందటి మన దేశ మహా వైభవాన్ని పునరుద్ధరించుకుని తీరుతాం. శ్రీ సోమనాథ మహాదేవుడి ఆశీస్సులతో, వికసిత భారత నవ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. విశ్వకల్యాణమే పరమావధిగా.. మన నాగరికతా స్ఫూర్తి దిశానిర్దేశం చేస్తోంది.