జపాన్ మియాగి రాష్ట్రంలోని సెండాయ్‌లో ఉన్న సెమీకండక్టర్ కేంద్రాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి

August 30th, 11:52 am

జపాన్ ప్రధానమంత్రి శ్రీ షిగేరు ఇషిబాతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జపాన్‌కు చెందిన మియాగి రాష్ట్రంలోని సెండాయ్‌లో పర్యటించారు. సెమీ‌కండరక్టర్ రంగంలో ప్రముఖ జపాన్ కంపెనీ అయిన టోక్యో ఎలక్ట్రాన్ మియాగీ లిమిటెడ్‌ను (టీఈఎల్ మియాగీ) వారు సందర్శించారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన విలువ గొలుసులో టీఈఎల్ పాత్ర, దాని అధునాతన తయారీ సామర్థ్యాలు.. భారత్‌తో ఆ కంపెనీ ప్రణాళికలో ఉన్న భాగస్వామ్యాల గురించి ప్రధాన మంత్రికి వివరించారు. సెమీకండక్టర్ రంగంలో సరఫరా వ్యవస్థ, తయారీ, పరీక్షలకు సంబంధించిన విభాగాల్లో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేందుకు రెండు దేశాల మధ్య ఉన్న అవకాశాల గురించి ఇరువురు నాయకులకు క్షేత్ర స్థాయి అవగాహనను ఈ సందర్శన కల్పించింది.