శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 28th, 03:35 pm

ఈ రోజు ఈ పవిత్ర సందర్భంలో నా మనసు శాంతితో నిండిపోయింది. సాధువులు, మహర్షుల సమక్షంలో కూర్చోవడం ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఉండటం శతాబ్దాల నాటి ఈ మఠం శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ వేడుకలో మీ మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి రాకముందు, రామాలయం... వీర్ విఠల్ ఆలయాల్లో పూజలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఇక్కడి శాంతి, ప్రశాంత వాతావరణం ఈ వేడుక ఆధ్యాత్మిక సారాన్ని మరింతగా పెంచాయి.

గోవాలో జరిగిన శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి

November 28th, 03:30 pm

“శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకుంటోంది. ఇది చాలా చారిత్రాత్మక సందర్భం. గత 550 సంవత్సరాలలో ఈ మఠం అనేక కల్లోల పరిస్థితులను ఎదుర్కొంది. తరాలు మారినా, కాలాలు మారినా.. దేశంతో పాటు సమాజంలో అనేక పరివర్తనలు వచ్చినా మఠం ఎప్పుడూ దిశను కోల్పోలేదు. దీనికి బదులు ఈ మఠం ప్రజలకు మార్గదర్శక కేంద్రంగా మారింది. మఠానికి ఉన్న గొప్ప గుర్తింపు ఏంటంటే.. చరిత్రతో గట్టిగా పాతుకుపోయి ఉన్నప్పటికీ కాలంతో పాటు మారుతూ ముందుకు కదులుతూనే ఉంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మఠం స్థాపించటంలో ఉన్న స్ఫూర్తి ఈ రోజు కూడా అదే విధంగా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ స్ఫూర్తే సాధనను సేవతో, సంప్రదాయాన్ని ప్రజా సంక్షేమంతో మిలితం చేస్తోందన్నారు. ‘జీవితానికి స్థిరత్వం, సమతుల్యత, విలువలను అందించడం’ అనే ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన భావనను తరతరాలుగా మఠం తెలియజేస్తోందని ప్రధాని అన్నారు. కష్ట సమయాల్లో కూడా సమాజాన్ని నిలబెట్టే బలానికి మఠం చేసిన 550 సంవత్సరాల ప్రయాణమే నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కమిటీలోని సభ్యులందరూ, ఈ వేడుకతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

నవంబర్ 28న కర్ణాటక, గోవా పర్యటనకు వెళ్లనున్న పీఎం

November 27th, 12:04 pm

నవంబర్ 28న కర్ణాటక, గోవాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం 11:30 గంటలకు కర్ణాటక ఉడిపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని సందర్శిస్తారు. అనంతరం గోవాకు చేరుకుని, మధ్యాహ్నం 3:15 గంటలకు శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవం 'సార్థ పంచశతమానోత్సవం' సందర్భంగా మఠాన్ని సందర్శిస్తారు.