కువైట్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ

December 22nd, 06:38 pm

రాజకీయాలు, వ్యాపారం, పెట్టుబడి, ఇంధనం, రక్షణ, భద్రత, ఆరోగ్యం, విద్య, టెక్నాలజీ, సాంస్కృతిక సంబంధాలు, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా అనేక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చుకోవడానికి ఒక మార్గసూచీని రూపొందించుకోవడంపై నేతలిద్దరూ చర్చించారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తృతపర్చుకోవాలని వారు స్పష్టంచేశారు. ఇంధనం, రక్షణ, వైద్య పరికరాలు, ఫార్మా, ఫుడ్ పార్కులు, తదితర రంగాల్లో కొత్త కొత్త అవకాశాలను పరిశీలించడానికి భారతదేశానికి రావాల్సిందిగా కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఇతర ఆసక్తిదారులతో కూడిన ఒక ప్రతినిధివర్గాన్ని ప్రధాని ఆహ్వానించారు. సాంప్రదాయక మందులు, వ్యవసాయ పరిశోధన రంగాల్లో సహకారం అంశాన్ని కూడా నేతలు చర్చించారు. ఆరోగ్యం, శ్రమశక్తి, హైడ్రోకార్బన్ల రంగాల్లో ఇప్పటికే సంయుక్త కార్యాచరణ బృందాలు (జేడబ్ల్యూజీలు) పనిచేస్తుండగా, వీటికి అదనంగా సహకారంపై ఏర్పాటైన సంయుక్త సంఘం (జేసీసీ) పై ఇటీవల సంతకాలు చేయడాన్ని వారు స్వాగతించారు. వ్యాపారం, పెట్టుబడి, విద్య, టెక్నాలజీ, వ్యవసాయం, భద్రతలతో పాటు సాంస్కృతిక రంగాల్లో కొత్తగా జేడబ్ల్యూజీలను ఈ జేసీసీ పరిధిలో ఏర్పాటు చేశారు.