ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

April 27th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈ రోజు నేను మీతో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో నా మనసులో మాట చెప్తున్నప్పుడు నా హృదయంలో చాలా బాధ కలుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి దేశంలోని ప్రతి పౌరుడిని కలచివేసింది. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడినా.. ఈ దాడిలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు. ఉగ్రవాదుల దాడి చిత్రాలను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతున్నట్లు అనిపిస్తుంది. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి తీవ్రవాదాన్ని పోషించే వారి నిస్పృహను, వారి పిరికితనాన్ని తెలియజేస్తోంది. కాశ్మీర్‌లో శాంతి నెలకొని ఉన్న తరుణంలో పాఠశాలలు , కళాశాలల్లో చైతన్యం వచ్చింది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదు. కాశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు, వారి యజమానులు కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగింది. దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధంలో మనకున్న అతిపెద్ద బలాలు. ఈ ఐక్యత ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఆధారం. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలును ఎదుర్కొనేందుకు మనం మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మనం దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలి. ఉగ్రవాద దాడి తర్వాత యావద్దేశం ఒక్క గొంతుతో మాట్లాడుతోంది.