యువత పురోగతికి ఉద్దేశించిన వేర్వేరు కార్యక్రమాలను అక్టోబరు 4న ప్రకటించనున్న ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమాల విలువ రూ.62,000 కోట్లు

October 03rd, 03:54 pm

యువజనాభివృద్ధికి అండగా నిలిచే ఒక మహత్తర కార్యక్రమానికి నాందీప్రస్తావన జరగబోతోంది.. యువత పురోగతిపై దృష్టి సారించి రూ.62,000 కోట్ల కన్నా ఎక్కువ నిధులను ఖర్చు పెట్టే వివిధ కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 4న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమాలు దేశం నలుమూలలా విద్య బోధన, నైపుణ్య సాధనకు దోహదపడడంతో పాటు, వాణిజ్య సంస్థలను ఏర్పాటు చేయాలన్న తపనకు కూడా అండగా నిలుస్తాయి. ఇదే కార్యక్రమంలో, నేషనల్ స్కిల్ కాన్వొకేషన్‌ నాలుగో సంచిక ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్’ను కూడా నిర్వహిస్తున్నారు. దీనిని ప్రధానమంత్రి దృష్టికోణానికి అనుగుణంగా రూపొందించారు. దీనిలో భాగంగా నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వ శాఖ ఆధీనంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో అఖిల భారత్ స్థాయి అగ్రగాములుగా నిలిచిన 46 మందిని సత్కరిస్తారు.