ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

April 27th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈ రోజు నేను మీతో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో నా మనసులో మాట చెప్తున్నప్పుడు నా హృదయంలో చాలా బాధ కలుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి దేశంలోని ప్రతి పౌరుడిని కలచివేసింది. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడినా.. ఈ దాడిలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు. ఉగ్రవాదుల దాడి చిత్రాలను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతున్నట్లు అనిపిస్తుంది. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి తీవ్రవాదాన్ని పోషించే వారి నిస్పృహను, వారి పిరికితనాన్ని తెలియజేస్తోంది. కాశ్మీర్‌లో శాంతి నెలకొని ఉన్న తరుణంలో పాఠశాలలు , కళాశాలల్లో చైతన్యం వచ్చింది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదు. కాశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు, వారి యజమానులు కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగింది. దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధంలో మనకున్న అతిపెద్ద బలాలు. ఈ ఐక్యత ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఆధారం. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలును ఎదుర్కొనేందుకు మనం మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మనం దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలి. ఉగ్రవాద దాడి తర్వాత యావద్దేశం ఒక్క గొంతుతో మాట్లాడుతోంది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

March 30th, 11:53 am

గుడి పడ్వా, నూతన సంవత్సరారంభం సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అత్యంత గౌరవనీయ సర్‌ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ , స్వామి గోవింద్ గిరి జీ మహారాజ్, స్వామి అవధేశానంద్ గిరి జీ మహారాజ్, ప్రజాదరణ పొందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ , డాక్టర్ అవినాష్ చంద్ర అగ్నిహోత్రి, ఇతర గౌరవ ప్రముఖులు, ఇంకా ఇక్కడ హాజరైన సీనియర్ సహచరులారా! ఈరోజు రాష్ట్ర యజ్ఞం అనే పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఈరోజు చైత్ర శుక్ల ప్రతిపాద ఎంతో ప్రత్యేకమైన రోజు. పవిత్ర నవరాత్రుల ఉత్సవాలు కూడా కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుడి పడ్వా, ఉగాది, నవరే పండుగలను కూడా ఈ రోజు జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు ఝులేలాల్ జీ, గురు అంగద్ దేవ్ జీ జయంతి కూడా. ఇవే కాకుండా, ఈ రోజు మన స్ఫూర్తి ప్రదాత, అత్యంత గౌరవనీయ డాక్టర్ సాహెబ్ జయంతి సందర్భం కూడా. అలాగే, ఈ ఏడాది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఘనమైన 100 ఏళ్ల ప్రయాణం కూడా పూర్తవుతోంది. ఈ సందర్భంలో, ఈ రోజు స్మృతి మందిరాన్ని సందర్శించి, గౌరవనీయ డాక్టర్ సాహెబ్, గౌరవనీయ గురూజీకి నివాళులర్పించే అవకాశం నాకు లభించింది.

మహారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంట‌ర్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి దేశంలోని పౌరులందరికీ మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే మా ప్రాధాన్యత: ప్రధాని

March 30th, 11:52 am

మహారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం కేంద్రానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర నవరాత్రి ఉత్సవ ప్రారంభాన్ని తెలిపే చైత్ర శుక్ల ప్రతిపాద ప్రాముఖ్యతను వివరించారు. దేశవ్యాప్తంగా నేడు గుడి పడ్వా, ఉగాది, నవరేహ్ వంటి పండుగలు జరుగుతున్నాయన్న ఆయన.. భగవాన్ ఝులేలాల్, గురు అంగద్ దేవ్ జయంతి అయిన ఈ రోజు ప్రాముఖ్యతను ప్రధానంగా తెలియజేశారు. స్ఫూర్తిదాయకమైన డాక్టర్ కేబీ హెడ్గేవార్ జయంతి ఇవాళ అని గుర్తు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మహోన్నత ప్రయాణం శతాబ్ది కాలాన్ని పూర్తి చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఈ ముఖ్యమైన రోజున డాక్టర్ హెడ్గేవార్, శ్రీ గోల్వాల్కర్ గురూజీలకు నివాళులు అర్పించటానికి స్మృతి మందిరాన్ని సందర్శించడం ఎంతో గౌరవంతో కూడుకున్న విషయమని అన్నారు.

భూకంప విషాదం నేపథ్యంలో మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి

March 29th, 01:41 pm

భూకంప విషాదం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో మయన్మార్‌కు అండగా నిలవడంలో సన్నిహిత మిత్రదేశంగా, పొరుగుదేశంగా భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ విపత్తుకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించినట్లు తెలిపిన ప్రధానమంత్రి.. బాధిత ప్రాంతాలకు తక్షణ ఉపశమనాన్ని, అవసరమైన సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.