రాయ్‌పూర్‌లో ప్రధానమంత్రి అధ్యక్షతన 60వ అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరళ్లు.. ఇన్స్పెక్టర్ జనరళ్ల సదస్సు
November 30th, 05:17 pm
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహిస్తున్న 60వ అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరళ్లు-ఇన్స్పెక్టర్ జనరళ్ల సదస్సుకు ఈ రోజు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ‘వికసిత భారత్: భద్రత ప్రమాణాలు’ ఇతివృత్తంగా సాగిన ఈ సదస్సులో చివరి (3వ) రోజున ఆయన ప్రసంగిస్తూ- పోలీసులపై ప్రజాభిప్రాయంలో... ముఖ్యంగా యువతరంలో మార్పు తేవాల్సిన అవసరాన్ని స్పష్టీకరించారు. ఈ మేరకు వృత్తిగత నైపుణ్యంతోపాటు సామాజిక సున్నితత్వం, ప్రతిస్పందనాత్మకత వంటి లక్షణాలను పెంపొందించకోవడం అవశ్యమని పేర్కొన్నారు. అలాగే, పట్టణ పోలీసింగ్ పటిష్ఠం కావాలని, పర్యాటక పోలీసింగ్‌లో పునరుజ్జీవం అవసరమని చెప్పారు. వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో తెచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలపై ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కోరారు.