హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం

November 26th, 10:10 am

నేను పార్లమెంటుకు చేరుకోవాల్సి ఉన్నందున సమయం చాలా తక్కువగా ఉంది. గౌరవ రాష్ట్రపతితో ఒక కార్యక్రమం ఉంది. అందువల్ల ఎక్కువసేపు మాట్లాడకుండా నేను కొన్ని అంశాలను త్వరగా పంచుకుని... నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ రోజు నుంచి భారత విమానయాన రంగం కొత్త ఊపును పొందబోతోంది. ఈ కొత్త శాఫ్రాన్ కేంద్రం భారత్‌ను ప్రపంచ ఎంఆర్వో కేంద్రంగా నిలపడంలో సహాయపడుతుంది. ఈ ఎంఆర్వో కేంద్రం హైటెక్ ఏరోస్పేస్ ప్రపంచంలో యువతకు కొత్త అవకాశాలనూ సృష్టిస్తుంది. నేను ఈనెల 24న సాఫ్రాన్ బోర్డు యాజమాన్యాన్ని కలిశాను. నేను వారిని ఇంతకు ముందు కూడా కలిశాను. ప్రతి చర్చలోనూ భారత్ పట్ల వారి నమ్మకం, ఆశను నేను చూశాను. భారత్‌లో శాఫ్రాన్ పెట్టుబడి అదే వేగంతో కొనసాగుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ రోజు ఈ కేంద్రం కోసం కృషి చేసిన టీం శాఫ్రాన్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

హైదరాబాద్‌లోని ‘శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా’ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి

November 26th, 10:00 am

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన జీ.ఎం.ఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్‌లో ఉన్న శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (ఎస్ఏఈఎస్ఐ) కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. శాఫ్రాన్‌ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్‌ను ఒక గ్లోబల్ ఎంఆర్ఓ (నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర మార్పు) కేంద్రంగా మార్చేందుకు సహాయపడుతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ ఎంఆర్ఓ కేంద్రం అత్యాధునిక సాంకేతిక గల విమానాయన రంగంలో యువతకు కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందని ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. నవంబర్ 24న శాఫ్రాన్ బోర్డు, అధికారుల బృందాన్ని కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనికంటే ముందు కూడా వారితో జరిగిన ప్రతి చర్చలో భారత్‌ పట్ల వారికి ఉన్న విశ్వాసం, ఆశాభావాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దేశంలో శాఫ్రాన్ పెట్టుబడులు ఇదే వేగంతో కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా శాఫ్రాన్ బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.