79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి మోదీ ప్రసంగం: 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా దార్శనికత

August 15th, 11:58 am

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి 103 నిమిషాల పాటు ప్రసంగించారు. ఎర్రకోట నుంచి శ్రీ మోదీ చేసిన ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా ఆయన కీలక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యంతో సాహసోపేతమైన ప్రణాళికను ఇచ్చారు. స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి పెట్టిన ప్రధాని.. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.

స్వయంసమృద్ధ భారత్‌: శక్తిమంతమైన, వికసిత భారత్‌కు పునాది

August 15th, 10:20 am

దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ- శక్తిమంతమైన, వికసిత భారత్‌ సాకారం కావడంలో స్వయంసమృద్ధ భారత్‌ కార్యక్రమం పునాది కాగలదని పేర్కొన్నారు. ఈ మేరకు రక్షణ, సాంకేతిక, ఇంధన, అంతరిక్ష, తయారీ రంగాల్లో మన దేశం ఇప్పటికే పురోగతి సాధించిందని ఆయన ఉటంకించారు. ఈ విధంగా వికసిత భారత్‌ కీలక పునాదులలో స్వావలంబన ఒకటని ప్రధాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను ప్రధానంగా ప్రస్తావిస్తూ- దేశానికి ఎదురయ్యే ముప్పులను నిర్ణయాత్మకంగా తిప్పికొట్టడంలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, స్వదేశీ సామర్థ్యం ప్రధానమని ఆయన చెప్పారు. దేశ పటిష్ఠత, గౌరవంతోపాటు 2047నాటికి వికసిత భారత్‌ దిశగా పయనంలో స్వావలంబన పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.