ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

October 21st, 09:30 am

ఐఎన్ఎస్ విక్రాంత్‌లో భారతీయ నౌకాసేనతో కలిసి దీపావళి వేడుకలను నిర్వహించినప్పటి చిత్రాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... అద్భుతమైన క్షణం.. అంతేకాకుండా అద్భుత సన్నివేశమని అన్నారు. ఒక వైపు విశాల మహాసముద్రం ఉంటే, మరో వైపు భరత మాత వీర సైనికుల అపార శక్తి కొలువుదీరిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఒక వైపు దిగంతం, ఆనంతాకాశం ఉంటే, మరో వైపు ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మాండ శక్తి ఉందనీ, ఇది అనంత శక్తికి ప్రతీక అనీ ఆయన చెప్పారు. సముద్రంపై ప్రసరిస్తున్న సూర్యకాంతి మెరుపులు దీపావళి వేళ వీర సైనికులు వెలిగించిన దీపాలా అన్నట్లుగా ఓ అపురూప దివ్య కాంతి మాలిక కనిపిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సారి దీపావళిని భారతీయ నావికా దళ యోధుల నడుమ నిర్వహించుకోవడం తనకు లభించిన సౌభాగ్యమని ఆయన అన్నారు