అంతరిక్ష అన్వేషణపై జరిగిన అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని చేసిన ప్రసంగం

May 07th, 12:00 pm

గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ కాన్ఫరెన్స్-2025లో మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. అంతరిక్షం కేవలం ఓ గమ్యస్థానం కాదు. అది ఆసక్తి, ధైర్యం, సమష్టి ప్రగతిని ప్రకటించే అంశం. భారతీయ అంతరిక్ష ప్రయాణం ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. 1963లో ఓ చిన్న రాకెట్ ప్రయోగం నుంచి చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి దేశంగా ఎదిగేంత వరకు మా ప్రయాణం అత్యద్భుతం. మా రాకెట్లు పేలోడ్లను మించిన బరువును మోస్తున్నాయి. 1.4 బిలియన్ల మంది భారతీయుల కలలను అవి మోస్తున్నాయి. భారత్ సాధించిన విజయాలు శాస్త్ర రంగంలో గొప్ప మైలురాళ్లు. వీటన్నింటినీ మించి, మానవ స్ఫూర్తి... గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తుందనడానికి ఇది గొప్ప రుజువు. 2014లో మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకొని భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై నీటి జాడను కనుగొనేందుకు చంద్రయాన్-1 తోడ్పడింది. చంద్రయాన్-2 అధిక స్పష్టత ఉన్న చంద్రుని ఛాయాచిత్రాలను మనకు పంపింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై మన అవగాహనను చంద్రయాన్–3 పెంచింది. మేం రికార్డు సమయంలో క్రయోజనిక్ ఇంజిన్లను తయారుచేశాం. ఒకే ప్రయోగంలో 100 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. మా వాహక నౌకల ద్వారా 34 దేశాలకు చెందిన 400 ఉపగ్రహాలను కక్ష్యంలో ప్రవేశపెట్టాం. ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను పూర్తి చేశాం. ఇది పెద్ద విజయం.

అంత‌రిక్ష శోధ‌న‌పై అంత‌ర్జాతీయ స‌ద‌స్సు-2025 (జిఎల్ఇఎక్స్‌)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

May 07th, 11:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అంత‌రిక్ష శోధ‌న‌పై అంత‌ర్జాతీయ స‌ద‌స్సు-2025 (జిఎల్ఇఎక్స్‌)ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత ప్రపంచవ్యాప్తంగాగల విశిష్ట ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వ్యోమగాములను ఆయన స్వాగతించారు. అంతరిక్ష రంగంలో భారత్‌ అద్భుత పయనం గురించి జిఎల్ఇఎక్స్‌- 2025లో పాల్గొంటున్నవారికి ప్రముఖంగా వివరించారు. ““అంతరిక్షమంటే కేవలం ఒక గమ్యం కాదు.. ఉత్సుకత-సాహ‌సం-స‌మ‌ష్టి ప్ర‌గతిని ప్ర‌స్ఫుటం చేసే సంక‌ల్పం” అని ఆయన అభివర్ణించారు. భారత్‌ 1963లో ఓ చిన్న రాకెట్‌ను ప్రయోగించిన నాటినుంచి చంద్రుని దక్షిణ ధ్రువంపై పాదం మోపిన తొలి దేశం స్థాయి ఎదగడం వరకూ సాధించిన విజయాలు ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని ఆయన స్పష్టం చేశారు. “భారతీయ రాకెట్లు త‌మ‌ కార్య‌భారాన్ని మించి... అంటే- 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష‌ల‌ను మోస్తూ తమ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తిస్తాయి” అని వ్యాఖ్యానించారు. అలాగే భారత అంతరిక్ష విజయాలు శాస్త్రవిజ్ఞానంలో కీలక ఘట్టాలని, సమస్యలను అధిగమించడంలో మానవాళి స్ఫూర్తికినిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. భారత్‌ 2014నాటి తన తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకోవడం ద్వారా చారిత్రక విజయం సాధించిందని గుర్తుచేశారు. జాబిలిపై జలం జాడను పసిగట్టడంలో చంద్రయాన్-1 ప్రయోగం తోడ్పడిందని పేర్కొన్నారు. తదుపరి చంద్రయాన్-2 ప్రయోగం చంద్ర ఉపరితల సుస్పష్ట (అత్యధిక రిజల్యూషన్) చిత్రాలను అందించిందని, ఇక తాజా చంద్రయాన్-3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువంపై మానవాళి అవగాహనను మరింత పెంచిందని విశదీకరించారు. “భారత్‌ రికార్డు సమయంలో క్రయోజెనిక్ ఇంజిన్లను రూపొందించింది. ఒకే రాకెట్‌ ద్వారా 100 ఉపగ్రహాలను ప్రయోగించింది.. భారత ప్రయోగ వాహనాల ద్వారా 34కుపైగా దేశాలకు చెందిన 400కు మించి ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో నిలిపింది” అని వివిధ విజయాలను ప్రధాని ఏకరవు పెట్టారు. ఇదే క్రమంలో ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల అనుసంధానం ద్వారా భారత్‌ సాధించిన తాజా విజయాన్ని ప్రస్తావిస్తూ- అంతరిక్ష పరిశోధనలో ఇదొక కీలక ముందడుగని పేర్కొన్నారు.