రోజ్‌గార్ మేళా కింద 51,000కు పైగా నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

July 12th, 11:30 am

కేంద్ర ప్రభుత్వంలో యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే దిశగా మా చర్యలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సిఫార్సు లేదు, అవినీతి లేదు- ఈ విధానానికి మేం కట్టుబడి ఉన్నాం. నేడు 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందించాం. ఇలాంటి రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువత ఇప్పటికే భారత ప్రభుత్వంలో శాశ్వత కొలువులను పొందారు. ఈ యువత ఇప్పుడు దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోంది. నేడు మీలో చాలా మంది భారతీయ రైల్వేలలో బాధ్యతలను మొదలుపెట్టారు. కొందరు దేశ భద్రతకు రక్షకులవుతుండగా, మరికొందరు తపాలా శాఖలో నియమితులై ప్రభుత్వ సేవలను ఊరూరా చేరవేయబోతున్నారు. ‘అందరికీ ఆరోగ్యం’ మిషన్‌లో అడుగుపెట్టబోయే సైనికులు మరికొందరు. ఆర్థిక సమ్మిళిత్వాన్ని వేగవంతం చేసేలా సేవలందించేందుకు యువ నిపుణులనేకులు సిద్ధమవుతుండగా, మరికొందరు దేశ పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించబోతున్నారు. మీ విభాగాలు వేరు కావచ్చు... కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. విభాగం, పని, హోదా, ప్రాంతం ఏవైనా సరే – దేశ సేవే ఏకైక లక్ష్యం. మళ్లీమళ్లీ మనం దీన్ని మననం చేసుకోవాలి. ప్రజలే ప్రథమం: ఇదే మన మార్గదర్శక సూత్రం. దేశ ప్రజలకు సేవ చేయడానికి మీకు గొప్ప వేదిక లభించింది. జీవితంలోని ఈ ముఖ్యమైన దశలో ఇంత గొప్ప విజయాన్ని సాధించిన మీ అందరికీ అభినందనలు. కెరీర్‌లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్న మీకు నా శుభాకాంక్షలు.

రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 12th, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికి పైగా యువతకు వీడియో అనుసంధానం ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఈ యువత కొత్త బాధ్యతలు ప్రారంభించనున్నదని తెలిపారు. వివిధ విభాగాల్లో తమ సేవలను ప్రారంభిస్తున్న యువకులను ఆయన అభినందించారు. ఉద్యోగ నిర్వహణలో ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ.. పౌరులకు ప్రథమ ప్రాధాన్యం అనే సూత్ర మార్గనిర్దేశంలో దేశానికి సేవ చేయడమే వారి సమష్టి లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.